వైద్యుల సేవలను ప్రస్తుతిస్తూ డెట్రాయిట్‌లోని సెయింట్ జాన్ హాస్పిటల్ వద్ద ‘హీరోలు పనిచేస్తున్నారిక్కడ’ అంటూ సైన్‌బోర్డు ఏర్పాటు చేశారు
వాషింగ్టన్/మాడ్రిడ్/రోమ్/బ్రిటన్/జెనీవా: ప్రపంచ జనాభాలో సగం మందికి పైగా ఇల్లు కదలడం లేదు. స్పెయిన్, అమెరికా, బ్రిటన్‌లో మృతుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. 188 దేశాల్లో కరోనా విస్తరించడంతో ప్రపంచమే చిగురుటాకులా వణికిపోతోంది. కేసుల సంఖ్య 10 లక్షల 50 వేలకి చేరువలో ఉంటే, మృతుల సంఖ్య 55 వేలు దాటేసింది. ఇలాంటి సంక్షోభ సమయంలో ప్రపంచదేశాలన్నీ ఏకతాటిపైకి వచ్చి కరోనాను తరిమికొట్టాలని ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ ఒక తీర్మానాన్ని రూపొందించింది. తీవ్రంగా ప్రాణనష్టం, ఆర్థిక నష్టం కలిగిస్తున్న కోవిడ్–19పై యూఎన్ తీర్మానాన్ని ఆమోదించడం ఇదే తొలిసారి.
‘‘కోవిడ్–19 వ్యాధిపై పోరాటానికి ప్రపంచ దేశాల సంఘీభావం’’అన్న పేరుతో రూపొందించిన ఈ తీర్మానంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇంకా చర్చించాల్సి ఉంది. ప్రపంచ ప్రజల ఆరోగ్యం, భద్రతపై ఐక్యరాజ్య సమితిలో 193 సభ్య దేశాలు తీవ్ర ఆందోళనతో ఉన్నాయని తీర్మానం పేర్కొంది. ఎక్కడివారక్కడే ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలపై అసాధారణంగా చూపిస్తున్న ప్రభావం, చాలా మంది జీవనోపాధిని కోల్పోవడంతో వీటిపై అందరూ సమష్టిగా పోరాటం చేయాలని ఆ తీర్మానం పేర్కొంది. ఈ సంక్షోభ పరిస్థితుల్లో మానవ హక్కులు, ప్రజలు ఎదుర్కొనే ఒత్తిళ్లను గౌరవించాలని, ఎలాంటి వివక్ష తావులేకుండా అన్ని దేశాలు పని చేయాలని పేర్కొంది.
ట్రంప్‌కు కరోనా నెగెటివ్.. 15 నిమిషాల్లోనే ఫలితం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రెండోసారి నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ రావడంతో వైట్ హౌస్ ఊపిరిపీల్చుకుంది. అత్యంత ఆధునిక కరోనా ర్యాపిడ్ పాయింట్ కిట్‌తో నిర్వహించిన ఈ వైద్య పరీక్షలో ఫలితం కేవలం 15 నిమిషాల్లోనే వచ్చిందని అధ్యక్షుడి వ్యక్తిగత వైద్యుడు సీన్ కోన్లీ చెప్పారు. శాంపిల్ కలెక్షన్‌కి ఒక్క నిమిషం పడితే మరో పావుగంటలోనే ఫలితం తేలిందన్నారు.
నెలరోజులు ఇల్లు కదలొద్దు
అమెరికాలో కరోనా కేసులు పెరిగిపోతూ ఉండడంతో అధ్యక్షుడు ట్రంప్ అమెరికన్లందరూ మరో నాలుగు వారాలు ఇళ్లలోనే ఉండాలని పిలుపునిచ్చారు. భౌతిక దూరానికి మించిన పరిష్కార మార్గం లేదని అన్నారు. ‘‘దేశ పౌరుల ప్రాణాలు కాపాడాలి. స్వీయ నియంత్రణ మీదే మన భవిష్యత్ ఆధారపడి ఉంది. భౌతిక దూరాన్ని పాటిస్తూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ, వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఇల్లు కదలకుండా ఉండండి. మరో నెల రోజులు ఇలా చేస్తే మనం కరోనాపై యుద్ధంలో గెలుస్తాం. ప్రభుత్వ మార్గదర్శకాలన్నీ పాటించండి’’అని ప్రజలకు ఆయన హితవు పలికారు అమెరికాలో కేసుల సంఖ్య 2 లక్షల 35వేలు దాటిపోగా, ఇప్పటివరకు 5,800 మంది ప్రాణాలు కోల్పోయారు.
గాలి ద్వారా వ్యాపించదు
కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపించే అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. కరోనా వ్యాధిగ్రస్తుడు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు బయటకు వచ్చే తుంపర్ల ద్వారా మాత్రమే ఈ వైరస్ సోకుతుందని తన తాజా మ్యాగజైన్లలో స్పష్టం చేసింది. ఈ తుంపర్లు ఏదైనా వస్తువులపై పడితే వాటినుంచి కూడా మనుషులకు సోకుతుందని తెలిపింది. ఇటీవల కాలంలో కరోనా వైరస్ గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని కొన్ని పరిశోధనలు తేటతెల్లం చేసిన నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ ఈ విషయంపై వివరణ ఇచ్చింది. చైనాలో 75 వేల మంది కరోనా వ్యాధిగ్రస్తుల్ని పరిశీలించిన తర్వాత ఈ విషయంపై ఒక నిర్ధారణకు వచ్చినట్టు డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టం చేసింది.
► బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కరోనాతో ఇంకా బాధపడుతున్నారు. తనకు ఇంకా జ్వరం తగ్గలేదని అందుకే నిర్బంధంలోనే ఉన్నానని సోషల్ మీడియా వేదికగా జాన్సన్ వెల్లడించారు.
► కరోనా కోరల్లో చిక్కుకొని జర్మనీ విలవిల్లాడుతోంది. చైనాను మించిపోయేలా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజుల్లో 6 వేలకు పైగా కేసులు నమోదు కావడంతో మొత్తంగా కేసుల సంఖ్య 84 వేలు దాటేసింది. ఇక గురువారం ఒక్క రోజే 140 మంది మరణించారు.
► స్పెయిన్‌లో కరోనా మరణమృదంగం మోగిస్తోంది. గత 24 గంటల్లో 900 మందికిపైగా మరణించారు. అయితే కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టడం ఊరట కలిగించే అంశం
► కరోనా మృతుల్లో మొదటి స్థానంలో ఉన్న ఇటలీలో వైద్య రంగంపై తీవ్రమైన పని ఒత్తిడి పడింది. దీంతో 10 వేల మందికి పైగా వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దేశవ్యాప్తంగా 69 మంది డాక్టర్లు మరణించారు.
► కరోనా మృతులకు నివాళులర్పించడానికి దేశవ్యాప్తంగా శనివారం సంతాపదినంగా చైనా పాటించనుంది. వైరస్‌ను తొలిసారిగా గుర్తించి ప్రాణ త్యాగం చేసిన డాక్టర్ లీ సహా 3,300 మందికి పైగా మరణించారు. వీరి మృతికి నివాళులర్పించడానికి జాతీయ సంతాపం దినంగా పాటించనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment