పంచ్ ఫిలాసఫర్! | bruce lee biography | Sakshi
Sakshi News home page

పంచ్ ఫిలాసఫర్!

Published Sat, Jul 19 2014 10:52 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

bruce lee biography

బ్రూస్‌లీ కి బాగా పేరొచ్చాక...
 ‘రా, చూస్కుందాం’ అని కాల్తో నేలని తన్నేవారు ఎక్కువయ్యారు.
 నేలని కాలితో తన్నడం అంటే సవాల్ విసరడం.
 బ్రూస్‌లీ ని ఓడించడం గొప్ప కదా.. అందుకు!
 బ్రూస్ లీ నవ్వేవాడు.
 సవాల్ చేసింది పిల్లలైతే కాసేపు వారిని ఆడించేవాడు.
 సవాల్ చేసింది పెద్దలైతే కాసేపు వారిని రఫ్ఫాడించేవాడు.
 బ్రూస్ లీ బలమంతా అతడి చేతుల్లో, కాళ్లలో ఉందనుకుంటాం కదా...
 కానీ నిజంగా బలమైనవి అతడి చిరునవ్వు, చిరుత కళ్లు.
 ఇంకా బలమైనది అతడి ఫిలాసఫీ!
 ఓటమి అనేది పడిపోయానని అనుకోవడంలో ఉంది తప్ప...
 పడిపోవడంలో లేదని అంటాడు బ్రూస్ లీ.
 చిన్న జీవితంలో పెద్ద ఫిలాసఫీని చూసిన ఈ యుద్ధవిద్యా ప్రవీణుడి వర్ధంతి ఇవాళ.
 ఆ సందర్భంగా... సాక్షి ఫ్యామిలీ... నివాళి.

 
సినిమా ఆగిపోయింది!
 రేమాండ్ చో హతాశుడయ్యాడు. ‘గేమ్ ఆఫ్ డెత్’ నిర్మాత అతడు.
 అయితే అతడు హతాశుడయ్యింది ‘గేమ్ ఆఫ్ డెత్’ ఆగిపోయినందుకు కాదు.
 మరి?!
 స్క్రిప్టులో చేయవలసిన మార్పుల గురించి ఆ మధ్యాహ్నమే బ్రూస్ లీ, రేమాండ్ చో దాదాపు రెండు గంటల సేపు మాట్లాడుకున్నారు. అసలు అందుకోసమే అమెరికా టూర్ నుంచి హాంగ్‌కాంగ్ చేరుకున్నాడు బ్రూస్ లీ.
 బ్రూస్ లీ రాసిన కథకు, బ్రూస్ లీ చేస్తున్న డెరైక్షన్‌లో, బ్రూస్ లీ నటిస్తున్న చిత్రం ‘గేమ్ ఆఫ్ డెత్’. తీసినంత వరకు సంతృప్తికరంగా వచ్చింది. మరికొన్ని సీన్లు ఉన్నాయి. వాటిల్లో మార్పులు చేర్పుల గురించి నోట్స్ రాసుకున్నాక ఇద్దరూ కలిసి కారులో బెట్టీ టింగ్ పే ఉంటున్న అపార్ట్‌మెంట్‌కి బయల్దేరారు. బెట్టీ ఆ సినిమాలో బ్రూస్ లీ భార్యగా నటిస్తున్న తైవాన్ నటి. ముగ్గురూ కలిసి మళ్లీ ఒకసారి స్క్రిప్ట్టును సరిచూసుకున్నారు. ఆ తర్వాత, అక్కడికి దగ్గర్లోనే డిన్నర్ మీటింగ్ ఉంటే అక్కడి వెళ్లాడు రేమాండ్. అక్కడికి లీ కూడా వెళ్లాల్సి ఉంది. కానీ వెళ్లలేదు.
 
బ్రూస్ లీ ఎంతసేపటికీ రాకపోవడంతో రేమాండ్ అపార్ట్‌మెంట్‌కి తిరిగొచ్చాడు. అప్పటికే బ్రూస్ లీ నిద్రపోతూ కనిపించాడు! వేళ కాని వేళ ఇదేమిటి? రేమాండ్ తట్టి లేపాడు. బెట్టీ తట్టి లేపింది. ఎంత లేపినా బ్రూస్ లీ లేవలేదు. అనుమానం వచ్చి అంబులెన్స్‌ని పిలిపించారు. క్వీన్ ఎలిజబెత్ ఆసుపత్రికి చేరుకుంటుండగా... అప్పటికే బ్రూస్ లీ మరణించి ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు!
 రేమాండ్ చో హతాశుడయ్యాడు.
 గేమ్ ఆఫ్ డెత్ ఆగిపోయినందుకు కాదు. డెత్ బ్రూస్ లీ తో గేమ్ ఆడినందుకు!
 మళ్లీ స్క్రిప్టు మారింది. కాదు కాదు, విధి మార్పించింది. మాఫీయా నుంచి తప్పించుకోడానికి బ్రూస్ లీ తను చనిపోయినట్లుగా నాటకం ఆడినట్లు మార్పు చేశారు. బ్రూస్ లీ అంత్యక్రియలు జరుగుతున్నపుడు క్లోజప్‌లో తీసిన నిజమైన దృశ్యాలను సినిమాలో వాడుకున్నారు. అయితే ఆ సినిమా ఇప్పటికీ పూర్తి కాలేదు.
 రేమాండ్ చో వయసు ప్రస్తుతం 85 ఏళ్లు. బతికుంటే బ్రూస్ లీ వయసు 74 ఏళ్లు. ఇద్దరూ కలిసి ఇప్పటికి ఎన్ని సినిమాలో తీసేవారు, మనం ఎన్ని సినిమాలు చూసేవాళ్లమో. అదృష్టం ఎవరికీ లేకపోయింది. రేమాండ్‌కీ, మనకు.

 *************   

బ్రూస్ లీ చనిపోయి నలభై ఏళ్లు దాటిపోయాయి. అసలు ఆయన ఎలా చనిపోయాడన్న విషయమై నేటికీ హాంకాంగ్‌లో, అమెరికాలో ఆయన అభిమానులు గతాన్ని తవ్వుతూనే ఉన్నారు. విషప్రయోగం జరిగి ఉంటుందని ఒక అనుమానం.  తలనొప్పి మాత్రలు వేసుకోవడం వల్ల అవి వికటించి చనిపోయాయాడని ఒక వాదన. ఈ వాదనకు బలం చేకూర్చే సంఘటన ఒకటి, బ్రూస్ లీ చనిపోడానికి రెండు నెలల ముందు జరిగింది.
 
ఆరోజు మే 10. హాంగ్‌కాంగ్‌లోని గోల్డెన్ హార్వెస్ట్ స్టూడియోస్‌లో ‘ఎంటర్ ది డ్రాగన్’ చిత్రానికి డబ్బింగ్ చెబుతూ, ఫిట్స్ వచ్చి బ్రూస్ లీ కుప్పకూలి పోయాడు. వెంటనే అక్కడికి దగ్గర్లోని బాప్టిస్ట్ హాస్పిటల్‌కు అతడిని తరలించారు. డాక్టర్లు ‘సెరెబ్రెల్ ఎడెమా’ అన్నారు. మెదడు వాయడం వల్ల బ్రూస్ లీ కుప్పకూలిపోయాడని నిర్థరించారు. సరిగ్గా ఇవే లక్షణాలు బ్రూస్ లీ మరణించిన రోజు జూలై 20న ఆయనలో కనిపించాయి. అయితే ఆ లక్షణాలు పైకి కనిపించలేదు. లోపల్లోపలే అంతా జరిగిపోయింది.

 బ్రూస్ లీ మరణాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన సినీ అభిమానులు జీర్ణించుకోలేక పోయారు. మార్షల్ ఆర్ట్స్‌లో ఆయన శిష్యులు, గురువులు ‘బ్రూస్లీ ఇకలేడు’ అనే వార్త విని తట్టుకోలేకపోయారు. ఇప్పటికీ టీవీలలో పదే పదే ప్రసారమవుతుండే బ్రూస్ లీ చిట్టచివరి సినిమా  ‘ఎంటర్ ది డ్రాగన్’ ను మనం ఎన్నోసార్లు చేసి ఉంటాం. కానీ బ్రూస్ లీ చూసుకోలేకపోయారు. ఆ సినిమా రిలీజ్ అవడానికి ముందే ఆయన మృత్యువాత పడ్డారు.
 
ది బిగ్ బాస్ , ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ (ది చైనీస్ కనెక్షన్), వే ఆఫ్ డ్రాగన్ (రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్), ఎంటర్ ది డ్రాగన్ చిత్రాలు బ్రూస్ లీని చిరస్మరణీయుడి చేశాయి. అప్పటివరకు ప్రపంచానికి ఆసియా సినిమాల మీద ఉన్న చిన్నచూపును దూరం చేశాయి. అంతే కాదు, కేవలం బ్రూస్ లీ కారణంగా హాలీవుడ్... ఆసియా చిత్రాలను గౌరవించడం నేర్చుకుంది. అలాగే అనుకరించడం కూడా! బ్రూస్ లీ తన సినిమాల్లో చైనా సంప్రదాయాలను ఎక్కువగా చూపించేవాడు. అందుకనే చైనీయులు కూడా బ్రూస్ లీ సినిమాలను బాగా ఇష్టపడేవారు. బ్రూస్ లీని ఆరాధించేవారు. కుంగ్‌ఫూతో శత్రువును బ్రూస్ లీ మట్టికరిపిస్తుంటే చూడాలి... చైనా ప్రేక్షకులను పట్టలేం. కుంగ్‌ఫూ వారి సంప్రదాయ క్రీడ మరి.  
 
‘ది బిగ్ బాస్’ కంటే ముందు బ్రూస్ లీ తన తొలిచిత్రం ‘మార్లోవ్’లో నటించాడు. అంతకంటే ముందు చిన్నారి బ్రూస్ లీగా అనేక చిత్రాలలో నటించాడు. అసలైతే బ్రూస్ లీ వెండి తెరమీద కనిపించిన మొట్టమొదటి సినిమా ‘గోల్డెన్ గేట్ గర్ల్’. అప్పటికి బ్రూస్ లీ వయసు మూడు నెలలు! ఆ సినిమాలో నటిస్తున్న ఒక అమెరిన్ బేబీకి ఒంట్లో బాగోలేకపోతే ఆ స్థానంలో బ్రూస్లీని కూర్చోబెట్టారు.

************    

బ్రూస్ లీ సినిమాలు ఎంతగా ప్రజాదరణ పొందాయో, చేతులే ఆయుధమైన యుద్ధవిద్యల్లో (ముఖ్యంగా కరాటే విద్యలో) బ్రూస్ లీ అంతగా పేరు తెచ్చుకున్నారు. అతడిలో డ్రాగన్ అంశ ఏదో ఉండేది. డ్రాగన్‌లా చురుగ్గా కదిలేవాడు. డ్రాగన్‌లా చురుగ్గా చూసేవాడు. దేహం క రడుగట్టి ఉండేది. దృఢంగా ఉండడం కోసం అతడు గంటల తరబడి కసరత్తు చేసేవాడు. ఇక బ్రూస్ లీ కనిపెట్టిన ‘వన్ ఇంచ్ పంచ్’ టెక్నిక్ గురించి అయితే ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రత్యర్థికి అంగుళం దూరంలో మాత్రమే చేతిని ఉంచి బలంగా కొట్టడం ప్రపంచంలో ఇంతవరకు ఏ యోధుడు కూడా చెయ్యలేని పని. బ్రూస్ లీ వల్ల మాత్రమే అయిన పని! సాధారణంగా గట్టి దెబ్బ తగలాలంటే చేతిని దూరం నుంచి లాగి కొట్టాలి. అలాంటిది బ్రూస్ లీ అంగుళం దూరం నుంచే అంత దెబ్బను కొట్టేవాడు. మందంగా ఉండే చెక్క సైతం వన్ ఇంచ్ పంచ్‌తో రెండు ముక్కలయ్యేది. అంత ఫోర్సు బ్రూస్ లీలో ఎక్కడిది?  బహుశా డ్రాగన్ అంశ ఏదో ఉండివుండాలి.
 
***********
 

1940 నవంబర్ 27న చైనీస్ క్యాలెండర్ ప్రకారం డ్రాగన్ సంవత్సరంలో, డ్రాగన్ ఘడియల్లో జన్మించాడు బ్రూస్ లీ. జన్మస్థలం మాత్రం చైనా కాదు. కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్కో. అక్కడి జాక్సన్ స్ట్రీట్ హాస్పిటల్లో ‘కేర్’మన్నాడు. తండ్రి లీ హోయ్ ఛెన్ ఆ సమయంలో అక్కడ లేడు. (పాటలంటూ అమెరికాలో టూర్లు తిరుగుతున్నాడు). తల్లి గ్రేస్ హో ఉన్నా,  మెలకువలో లేదు. దాంతో రికార్డులో రాయడం కోసం నర్సే ఆ పసికందుకు ‘బ్రూస్ లీ ’ అనే అమెరికన్ పేరు పెట్టింది. అలా పుట్టుకతోనే బ్రూస్ లీ అమెరికన్ అయ్యాడు. అయితే బ్రూస్ లీని కుటుంబ సభ్యులెవ్వరూ ఎప్పుడూ బ్రూస్ లీ అని పిలవలేదు! ఆ చిన్నారికి వారు పెట్టుకున్న పేరు ‘లిటిల్ ఫీనిక్స్’. అదే పేరుతో పిలిచేవారు. అప్పుడప్పుడూ ఇంకో ముద్దు పేరు ‘సాయ్ ఫోన్’ అంటూ దగ్గరకు తీసుకునేవారు. నిజానికి లిటిల్ ఫీనిక్స్ అనేది ఆడపిల్ల పేరు. కావాలనే అలా పెట్టారు. దుష్టశక్తులకు మగపిల్లలంటే ఇష్టం ఉండదని, అందుచేత వారిని త్వరగా తీసుకుపోతాయని బ్రూస్ లీ తల్లిదండ్రులకు ఓ నమ్మకం. అందుకే ఆ దృష్ట శక్తులను తప్పుదారి పట్టించడం కోసం బ్రూస్ లీకి ఆడపిల్ల పేరు పెట్టారు.

 బ్రూస్ లీ తండ్రి లీ హోయ్ గాయకుడు. బ్రూస్ లీ పుట్టకముందు హాంగ్‌కాంగ్‌లోని ఒక అపేరాలో పనిచేసేవారు. ఉపాధికోసం అమెరికా వచ్చినప్పుడు బ్రూస్ లీ పుట్టాడు. (ఐదుగురు పిల్లల్లో అతడు నాల్గవవాడు). తిరిగి అదే ఏడాది లీ హోయ్ తన కుటుంబంతో సహా హాంగ్‌కాంగ్ చేరుకున్నాడు. అప్పటికి హాంగ్‌కాంగ్ జపాన్ అధీనంలో ఉంది.

 లీ హోయ్‌కి పెద్ద పెద్ద వాళ్లతో, సినిమా ప్రముఖులతో పరిచయాలు ఉండేవి. అలా బ్రూస్ లీకి ఆరేళ్ల వయసుకే 20 సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అదొక్కటే కాదు బ్రూస్ లీ చక్కగా డాన్స్ చేసేవాడు. టీనేజ్‌కి వచ్చే సరికి కవితలూ రాయడం మొదలుపెట్టాడు. అప్పుడే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం కూడా.
 
 బ్రూస్ లీ హైస్కూల్ చదువుకి వచ్చేనాటికి ఆ కుటుంబం మళ్లీ అమెరికా చేరుకుంది. అక్కడే వాషింగ్టన్‌లోని ఎడిసన్‌లో తన స్కూలు చదువు పూర్తి చేశాడు బ్రూస్ లీ. తర్వాత వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో తత్త్వశాస్త్రం చదివాడు. ఆ తర్వాత హాంగ్‌కాంగ్‌లో తను మార్షల్స్ ఆర్ట్ నేర్చుకున్న అనుభవంతో ఇక్కడ కొంతమంది విద్యార్థులను తయారు చేశాడు. ఆ సమయంలో పరిచయమైన లిండా ఎమెరినీ 1954లో వివాహమాడారు. అప్పటికే సియాటిల్‌లో ఒక మార్షల్ ఆర్ట్స్ స్కూల్ ఉంది. అక్కడి నుంచి బ్రూస్ లీ, లిండా కాలిఫోర్నియా వెళ్లారు. అక్కడ బ్రూస్ లీ ఓక్లాండ్‌లో, లాస్ ఏంజెలిస్‌లో రెండు స్కూళ్లను ప్రారంభించారు. అవీ మార్షల్ ఆర్ట్స్‌కి సంబంధించినవే. లాభాపేక్షతో కాకుండా కేవలం నేర్పించడానికే స్కూళ్లు నడుపుతున్న బ్రూస్ లీ... మెల్లమెల్లగా మళ్లీ సినిమాల వైపు మళ్లారు. అంతకన్నా ముందు అతడికి టీవీలో నటించే అవకాశాలు వచ్చాయి. 1966 నుండి 1967 వరకు 26 ఎపిసోడ్లుగా టీవీలో ప్రసారమైన ‘ది గ్రీన్ హార్నెట్’ సిరీస్‌తో బ్రూస్ లీ యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అలా1969లో తొలిసారిగా అతడికి ‘మార్లోవ్’ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. తర్వాత మిగతా సినిమాలు. తర్వాత అర్ధంతర మరణం.

 ముప్పై మూడేళ్ల వయసులో తను చనిపోయే నాటికి బ్రూస్లీ నూరేళ్ల జీవితానికి సరిపడా తన ముద్రను అన్ని రంగాలపై వదిలి వెళ్లారు. సినిమాలు, యుద్ధకళలు, సాహిత్యం... ఇలా. అందుకే అతడిని ప్రపంచంలోని చాలాదేశాలు, ముఖ్యంగా ఆసియా దేశాలు 20వ శతాబ్దంలోనే ప్రఖ్యాతిగాంచిన యుద్ధ ప్రవీణుడిగా, సాంస్కృతిక చిహ్నంగా భావిస్తాయి. బ్రూస్ లీ కుమారుడు బ్రాండన్‌లీ, కుమార్తె షానన్ లీ కొంతవరకు మాత్రమే ఆయన వారసత్వాన్ని కొనసాగించగలిగారు. అది కూడా సినిమాల్లో.

 బ్రూస్ లీ ప్రధానంగా కరాటే యోధుడు అయినప్పటికీ ఆయన జీవితం చాలావరకు పోరాటాలతో కాకుండా ఫిలసాఫికల్‌గా గడిచింది. పోరాటాలలో సైతం బ్రూస్ లీ తాత్వికతను ప్రద ర్శించడం విశేషం.

 ‘‘జీవితం మనకొక ‘పంచ్’ ఇచ్చినప్పుడు దాంతో మనం తాత్వికంగా దెబ్బలాడాలి తప్ప మనకొచ్చిన మార్షల్ ఆర్ట్స్ అన్నీ దాని ముందు ప్రదర్శించకూడదు. ఫైటింగ్ ఒక ఫిలాసఫీ! వేళ్లకు, పిడికిళ్లకు ఆలోచనాశక్తిని ఇచ్చే ఫిలాసఫీ!! మన దగ్గర ఉన్నదంతా బయట పెట్టుకోవడం వల్ల మన దగ్గర లేనిదేమిటో బయటికి తెలిసిపోతుంది. అది ప్రమాదం’’ అంటాడు బ్రూస్లీ.  తన చిన్న జీవితంలో బ్రూస్ లీ కనిపెట్టిన అతి గొప్ప సంగతి ఇది.
 
 లీ ఫిలాసఫీ

 జీవితం
జీవితం నిన్ను అనేక తెలివితక్కువ ప్రశ్నలతో విసిగించాలని చూస్తుంది. నువ్వు తెలివైన వాడివైతే ఆ ప్రశ్నలనుంచి ఎంతోకొంత నేర్చుకుంటావ్. తెలివైన సమాధానం నుంచి తెలివితక్కువవాడు నేర్చుకునే దానికన్నా, తెలివైనవాడు తెలివితక్కువ ప్రశ్నల నుంచి నేర్చుకునేదే ఎక్కువ.
 
 పోరాటం

శత్రువుతో పోరాడవలసిందే. వాడు మన మొహం పగలగొడతాడు. మనం వాడిని చితగ్గొడతాం. వాడు మన ఎముకల్ని సున్నం చేస్తాడు. మనం వాడి వెన్నుపూసల్ని ధ్వంసం చేస్తాం. చివరికి ఎవరో ఒకరే మిగులుతారు. వాడో, మనమో. అయితే ఇదంతా తేలిగ్గా జరగాలి. ఒళ్లు అలవకుండా జరగాలి. కష్టపడకుండా చేసిన పనే... కచ్చితంగా జరిగిన పని!
     
 పదివేల కిక్కుల్ని ప్రాక్టీస్ చేసి వచ్చినవాడికి నేను భయపడను. ఒకే ఒక కిక్కును పదివేల సార్లు ప్రాక్టీస్ చేసి వచ్చినవాడితో మాత్రం జాగ్రత్తగా ఉండాలి.
      
 జీవితాంతం ఎవరో ఒకరితో, ఏదో ఒక సమస్యతో పోరాడుతూనే ఉండాలా? నేర్చుకోవలసిందీ, మనలోకి మనం చూసుకోవలసిందీ చాలా ఉంది. టైమ్ సరిపోతుందా? జీవితాన్ని ప్రేమించేవాడు టైమ్ వేస్ట్ చేసుకోడు. అసలు టైమ్ చూసుకోడు. అదొక టైమ్ వేస్ట్ పని. పోరాడవలసిందే. కానీ గెలుపు ఓటముల కోసం పోరాడకూడదంటాను. కాలం ఉన్నంత కాలం మనమూ ఉండిపోడానికి పోరాడాలి!
 
 తావోయిజం

  ‘‘మన ఆలోచనే మనం’ అంటుంది తావోయిజం. ఎప్పుడూ ఇంకొకరి ఆలోచల ప్రకారం నడుస్తుంటే మనకు బదులుగా వారు మిగిలిపోతారు లోకంలో. అప్పుడు మనం పుట్టి, పెరిగి, పోయి... ఏం లాభం? అందుకే మన పంచ్ డిఫరెంట్‌గా ఉండాలి. నా ఇష్ట ప్రకారం జీవించడానికి నువ్వీ లోకంలోకి రాలేదు. నీ ఇష్ట ప్రకారం నడుచుకోడానికి నేనీ లోకంలోకి రాలేదు. ఎవరి జీవితం వారిది. అయితే ఈ రెండు జీవితాలను సమన్వయం చేయడానికి - మనం పుట్టక ముందే - సమాజం స్థిర ఆదర్శాలను ఏర్పాటు చేసి ఉంచింది. ఫిక్స్‌డ్ పాటర్న్! కానీ జీవిత సత్యాలన్నీ ఆ ఆదర్శాల బయటే ఉన్నాయే! ఎలా బయట పడడం? పడాలి. నియమాలకు విధేయులమై ఉంటూనే, వాటికి లోబడకుండా ఉండాలి.
 
 గై-క్వాం-డూ!

 నాకు అనిపిస్తుంటుంది... ఈ మూస విద్యల్లో, ప్రాచీన పద్ధతుల్లో ఏదో ప్రాణాంతక లోపం ఉందని! కొత్తదేదైనా కనిపెట్టాలి. అది అసాధారణంగా ఉండాలి. ‘అతి సాధారణత’ దాని ప్రత్యేకత అయివుండాలి. తక్కువ ఎనర్జీతో, తక్కువ సమయంలో మన లోపలి వ్యక్తీకరణలన్నిటినీ బయటపెట్టగలిగేదై ఉండాలి. మార్చుకోడానికీ, వదిలేయడానికీ అనువైనదిగా ఉండాలి. అలా నాకోసం నేను డెవలప్ చేసుకున్నదే ‘గైక్వాండూ’!
      
 నీటిలా... షేప్‌లెస్‌గా ఉండాలి మనిషి. నీటికి సొంత ఆకృతి ఉండదు. గ్లాసులో పోస్తే గ్లాసులా ఉంటుంది. సీసాలో పోస్తే సీసాలా ఉంటుంది. టీపాట్‌లో టీపాట్‌లా ఉంటుంది. కానీ నీరు ప్రవహిస్తుంది. ముంచెత్తుతుంది. మనిషి కూడా అలానే ఉండాలి. ఇదే గై క్వాం డూ ఫిలాసఫీ. పోరాడే క్షణాలేవీ మనవి కావని గుర్తుంచుకోండి. తేల్చిపారేయాలి తొలి క్షణంలో. రెండో క్షణంలో మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు.
 
 బ్రూస్ లీ బయోగ్రఫీ

 (27 నవంబర్ 1940 - 20 జూలై 1973)
 
 పూర్తి పేరు:   బ్రూస్ జున్ ఫాన్ లీ
 
 ఎత్తు:   5 అడుగుల ఏడున్నర అంగుళాలు
 
 జన్మస్థలం:  శాన్‌ఫ్రాన్సిస్కో (అమెరికా)
 
 పెరిగింది:   హాంకాంగ్
 
 తండ్రి:     లీ హోయ్ చుయన్
 
 తల్లి:
    హో
 
 చదువు: యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్‌లో తత్వశాస్త్రం
 
 ప్రభావితం చేసిన తత్వాలు: తావోయిజం, బౌద్ధం, జిడ్డు కృష్ణమూర్తి తత్వం.
 
 భార్య: లిండా లీ కాడ్వెల్
 
 సంతానం: బ్రాండన్ లీ (నటుడు), షానన్ లీ (నటి)
 
 ప్రత్యేకతలు:  మార్షల్ ఆర్టిస్ట్, ఫిలాసఫర్, ఇన్‌స్ట్రక్టర్, యాక్టర్, ఫిల్మ్ డెరైక్టర్, స్క్రీన్ రైటర్, గైక్వాండో (మార్షల్ ఆర్ట్) సృష్టికర్త.
 
 హిట్ మూవీస్: ది బిగ్ బాస్, ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ, ఎంటర్ ది డ్రాగన్, వే ఆఫ్ ది డ్రాగన్ (రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్), ది గేమ్ ఆఫ్ డెత్.
 
 రాసిన పుస్తకాలు:
చైనీస్ కుంగ్-ఫూ: ది ఫిలసాఫికల్ ఆర్ట్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్, తావో ఆఫ్ గైక్వాండో, వింగ్ చున్ కుంగ్-ఫూ
 
 ఫిలాసఫీ: ఏ జ్ఞానమైనా చివరికి ఆత్మజ్ఞానానికి దారితీస్తుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement