ఫేస్‌బుక్ నుంచి నిజం వరకూ...
మెన్‌టోన్
ఈ మధ్య ఫేస్‌బుక్‌లో ఎక్కువగా బుక్కయిపోతున్నది మగాళ్లేనని ఓ సర్వే. జుకర్‌బర్గ్ ఏ ముహూర్తాన ఫేస్‌బుక్ కనిపెట్టాడోగానీ... దానికీ మనదేశానికీ గట్టి బంధమే ఏర్పడింది. మనదేశ జనాభాలో దాదాపు పదిశాతం మంది ఫేస్‌బుక్ అని పేరున్నా మనవాళ్లు... ముఖ్యంగా అమ్మాయిలు నిజమైన ముఖాలు చూపించడం లేదు. అందుకే, అబ్బాయిలు బుక్కయిపోతున్నామని తెగ బాధపడిపోతున్నారు.
అలా ఎలా చేస్తారండీ అంటే... తప్పేముందీ అంటారు. పోనీ మీకు భయమన్నా లేదా అంటే మరో ఫిలాసఫీ. ‘భయానికి అంత విలువ ఎలా వచ్చిందో తెలుసా..?
ఈరోజుల్లో ఎదుటివాళ్లకు మనం ఎంత సాయం చేసినా గుర్తుంచుకోరు. అదే, వాళ్లను కోలుకోలేని దెబ్బతీసి భయపెట్టామనుకోండి. జీవితంలో ఎప్పటికీ మరిచిపోరు’ అని బల్లగుద్దిమరీ చెబుతారు. నిజమేనేమో. సాయం అల్పాయుష్కురాలు. కానీ, భయం... దీర్ఘాయుష్మంతుడు. ఏం చేస్తాం... మగాళ్లు భయపెడతారు కదా. భార్యాబాధితులు మాత్రం ఇందుకు కచ్చితంగా మినహాయింపే. సారీ, లేడీస్. ఒక్క అమ్మవారిలో... అదీ ఉగ్రరూపంలో ఉంటే తప్ప ఎవ్వరిలోనూ భయం చూడలేమనేది ఆధ్యాత్మికవేత్తల ఉవాచ.
భయం గురించి ఇంత ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే... నిజం నిప్పులాంటిది మరి. అవునవును, నిజం నిప్పు కాబట్టే... అందరూ దాన్ని పట్టుకోలేరు. కాలుతుందని తెలిసి కూడా దాన్నే పట్టుకుని వేలాడ్డానికి మూర్ఖులా మరి. అందుకే, ఎక్కువమంది మంచుముక్కలాంటి అబద్ధాన్ని ఆశ్రయిస్తుంటారు. సో, ఫ్రెండ్స్... ఫేస్‌బుక్‌లో అమ్మాయిలు ఒరిజినల్ ముఖాలతో కనిపించడం లేదని బాధపడకండి. ఎవరి పాపాన వాళ్లే పోతారు. మీరు మాత్రం పోకండి. ధైర్యంగా ఉండండి. నిజం తెలుసుకోండి.