అవసరానికి వస్తువును ఉపయోగించుకోవడం, అవసరం తీరాక దాన్ని పారేయడం పరిపాటి. జరగాల్సిందే జరుగుతున్నప్పుడు మరీ చర్చలెందుకు? పని జరగడానికీ, జరిగించడానికీ యోచన కావాలి. యోచించే అవసరాన్ని, జరుగుతున్న తప్పిదాల్ని చెప్పేదే ఈ కథ.
వెంకటస్వామి వ్యవసాయాన్ని భూమిని నమ్ముకుని బతికిన మనిషి. కష్టాలైతే పడ్డాడు గాని బతుకు సాగిపోయింది. కుటుంబాన్ని ఈడ్చుకొచ్చాడు. వయసు ముదిరింది. పనిచెయ్యడానికి శరీరం సహకరించడం లేదు. అయినా కుటుంబాన్నిసాకుతున్నాడు. రోజులు గడిచేకొద్దీ పనిచెయ్యలేక, పొలానికి పోలేక ఇంటిపట్టునే వుండిపోతున్నాడు. గత కొద్ది నెలలుగా తండ్రి పనీపాట చెయ్యకుండా, ఇంటిపట్టునే వుండిపోవడం, తండ్రివల్ల కుటుంబానికి ఏ ఉపయోగం లేకపోవడం కొడుకు వీరబాబు సహించలేకపోయాడు. ఇక లాభం లేదనుకుని మంచి శ్రేష్టమైన కర్రతో శవపేటికను తయారు చేయించాడు. ఒకరోజు తండ్రిని పిలిచి ఆ పేటికలో దిగమన్నాడు.
తండ్రి పేటికలో దిగిన తర్వాత పేటిక మూతవేసి, దానిని చాల ఎత్తయిన ప్రదేశానికి తీసుకొని పోయి, ఆ ప్రదేశపు చివర అంచున ఉంచాడు. దానిని ఆ ఎత్తయిన ప్రదేశం నుంచి లోయలోకి తోసెయ్యడానికి సిద్దపడుతున్న సమయంలో పేటిక లోపలనుంచి టక్ టక్ మని శబ్దం వినిపించింది. ఆ శబ్దం విన్న కొడుకు పేటిక పైకప్పు తెరచి చూశాడు. తండ్రి కొడుకు వైపు చూస్తూ ‘‘నాయనా! ఈ పేటికతో సహా నన్ను లోయలోకి తోసెయ్యాలని అనుకుంటున్నావు కదా.... నీకు నచ్చినట్టే చెయ్యి... అయితే నాదొక చిన్నమాట వింటావా?’’ అన్నాడు.
ఏంటో చెప్పమని విసుక్కున్నాడు కొడుకు. ‘‘నేనెలాగూ పనికిరాని వస్తువనుకుంటున్నావు. నావల్ల ఏ ఉపయోగం లేదనుకుంటున్నావు. మంచిదే. కాని నువ్వు పేటికను మంచిశ్రేష్టమైన కర్రతో చేయించావు. దాన్నెందుకు పాడుచేస్తావు? అది విలువైన వస్తువు కదా! దాన్ని దాచి వుంచితే రేపటి రోజున నీ కొడుకులు ఉపయోగించడానికి పనికొస్తుందికదా!’’ అని అన్నాడు. కొడుక్కి ఆ మాటలు అర్థమై, కళ్లవెంబడి గిర్రున నీళ్లు తిరిగాయి. వెంటనే తండ్రిని భుజాల మీద ఎక్కించుకుని ఇంటికి తీసుకుని వెళ్లి, ఆయన జీవించినంత కాలం చక్కగా చూసుకున్నాడు. – డా. విశ్వేశ్వరవర్మ భూపతిరాజు
Comments
Please login to add a commentAdd a comment