వైశాలిని ఒక సంవత్సరం కరువు కాటకాలు కాటేశాయి. వర్షాభావం ఏర్పడింది. మంచినీటి తావులన్నీ తరిగిపోయి మురికి గుంటలయ్యాయి. ఆ నీటినే తాగడం వల్ల ప్రజలకు అంటువ్యాధులు సోకాయి. కలరా విజృంభించింది. వేలాది మరణాలు సంభవించాయి. వైశాలి రాజ్యవీధులు శ్మశానాలయ్యాయి. శవాలను తీసేవారే లేరు. శవాలు కుళ్లిపోయి నగరమంతా దుర్గంధం వ్యాపించింది. కొత్త కొత్త రోగాలు వచ్చిపడ్డాయి. ప్రజలు గడపదాటి రావడానికే భయపడ్డారు. వైశాలి రాజకుటుంబీకులు కూడా అంతఃపురాలకే పరిమితం అయ్యారు. ప్రజలని పట్టించుకునే వారే లేరు. దీంతో దొంగల బెడద పెరిగింది.
ఆ సమయంలో బుద్ధుడు మగధ రాజధాని రాజగృహ నగరంలో ఉన్నాడు. ఎవరో బాటసారులు బుద్ధునితో వైశాలి ప్రజల బాధలు చెప్పారు. ఆ రోజుల్లో జీవకుని లాంటి బౌద్ధులు పద్ధెనిమిది రకాల వైద్యవిధానాలతో వైద్యం అందించేవారు. బుద్ధుడు వెంటనే ఐదువందల మంది భిక్షువుల్ని వెంట తీసుకుని వైశాలికి వెళ్లాడు. ఆ రోజుల్లో ఆకాశమంతా కారుమబ్బులు కమ్మి, కుంభవృష్ఠి పడింది. ఆ నీటి ప్రవాహంలో కొన్ని కళేబరాలు కొట్టుకుని పోయాయి.
బుద్ధుడు తన భిక్షుసంఘంతో కలసి వీధులు శుభ్రం చేశాడు. మిగిలిన కళేబరాల్ని పొలిమేరలకు తరలించాడు. జీవకుడు మరికొందరు వైద్యులు అందించిన ఔషధాల్ని ప్రజలకు అందించారు. ఆ పరిసరాలలో దొరికిన మొక్కల నుండి రకరకాల ఔషధాల్ని తయారు చేస్తూ, నిరంతరం ప్రజలకి అందించారు. ‘బుద్ధుడే తన సంఘంతో వచ్చి తమకు సేవ చేస్తుంటే తామెందుకు ఇళ్లలో కూర్చోవాలి’ అని ఆలోచించి కొందరు ప్రజలు వచ్చి సహకరించారు.
బుద్ధుడు నగరంలో రాజు అంతఃపురానికి వెళ్లి–‘‘రాజా! మీరే ఇలా భయపడి దాక్కుంటే ఎలా? మీరు మీ మంత్రులు, ఉద్యోగులు వెంటనే వీధుల్లోకి వెళ్లండి. ప్రజల్ని కలవండి. ధైర్యం చెప్పండి. అంటురోగం కంటె భయం చేసే కీడే ఎక్కువ.
ఇలాంటి విపత్కర పరిస్థితులల్లో మనిషికి మనిషే తోడు. ఈ విషయంలో మీరు అడవిలో ఉన్న ఆటవికుల నుండి ఎంతో నేర్చుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో వారు ద్వేషాలన్నీ పక్కనపెట్టి శత్రుత్వాన్ని చెరిపేసుకుని, ఒక్కటిగా కలసి ఎదుర్కొంటారు. అందరూ కలసి ఉంటే అంతకుమించిన బలం ఏముంది? ప్రతి వ్యక్తి ధైర్యంగా... తనకు సంఘం అండగా ఉందనే భావనతో భయరహితుడై బతికేస్తాడు. కాబట్టి రాజా! మీరు కదలండి! ప్రజలకు కావలసిన సపర్యలు చేయండి! ఔషధాలు అందించండి’’అని చెప్పిన వెంటనే రాజు తన ఉద్యోగ పరివారంతో కదలి వచ్చాడు.
అటు తరువాత కాలంలోనే వైశాలి అంటురోగాలనుండి బయట పడింది. అప్పటివరకు బుద్ధుడు వైశాలిలోనే ఉండిపోయాడు. జీవకారుణ్యం, పర్యావరణం, సంఘ ఐక్యత, మొక్కవోని ధైర్యం... సుఖజీవనానికి సోపానాలు అని చెప్పిన ఈ బుద్ధవాణి ఈ విపత్కర పరిస్థితుల్లో మనకు హృదయ వాణి కావాలి!
– డా. బొర్రా గోవర్ధన్
Comments
Please login to add a commentAdd a comment