చేయూతలో మహా‘రాణి’ | Maharani Radhika Raje Gaikwad Leads Normal Life | Sakshi
Sakshi News home page

చేయూతలో మహా‘రాణి’

Published Sun, Jun 27 2021 12:55 AM | Last Updated on Sun, Jun 27 2021 12:55 AM

Radhika Raje Gaikwad - Sakshi

రాధికారాజే గైక్వాడ్‌

పుట్టినిల్లు, మెట్టినిల్లు రెండూ రాజవంశ కుటుంబాలే. సమాజంలో హంగూ ఆర్బాటాలతో ఎంతో వైభవంగా మహారాణిలా జీవించాల్సిన రాధికారాజే గైక్వాడ్‌ నిరాడంబరంగా జీవిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా
నిలుస్తున్నారు. తన సాధారణ జీవనశైలికి తన తండ్రే స్ఫూర్తి అని గర్వంగా చెబుతున్నారామె.


గుజరాత్‌ రాష్ట్రంలోని వాంకనేర్‌ రాయల్‌ కుటుంబంలో పుట్టిన∙రాధికా రాజే .. కొన్నాళ్లు అక్కడే పెరిగినప్పటికీ కుటుంబం ఢిల్లీకి మకాం మార్చడంతో తన సొంత ప్యాలెస్‌కు దూరమయ్యారు. ఢిల్లీలో స్కూలు విద్యనభ్యసించిన రాధిక సాధారణ విద్యార్థినిలా ఆర్టీసీ బస్సునే స్కూలుకు వెళ్లేవారు. తోటి విద్యార్థులతో కలిసి మెలిసి ఉండేవారు. వేసవికాలం సెలవుల్లో వాంకనేర్‌కు వెళ్లేవారు. అక్కడి స్థానికులంతా తనను మహారాణిని చూసినట్లు చూడడం రాధికకు కొత్తగా అనిపించేది. డిగ్రీ పూర్తయ్యాక.. ఇరవై ఏళ్ళ వయసులో ఆమె ఓ పత్రికలో జర్నలిస్టుగా చేరారు. ఒక పక్క పత్రికకు కంటెంట్‌ను అందిస్తూనే మరోక్క పోస్టుగ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసారు. వీరి కుటుంబంలో ఒక మహిళ ఉద్యోగం చేయడం ఇదే తొలిసారి. 21 ఏళ్ళకే పెళ్లిచేసే కుటుంబంలో పుట్టి కూడా ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేయడం విశేషం.  

బరోడా మహారాణి..
ఒకపక్క రాధిక తన చదువు పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగానే తల్లిదండ్రులు ఆమెకోసం వరుణ్ణి వెతకడం ప్రారంభించారు. ఎంతోమందిని చూశాక బరోడా యువరాజు సమర్‌జిత్‌ సిన్హ్‌ గైక్వాడ్‌ రాధికకు నచ్చడంతో ఆయన్ని వివాహం చేసుకున్నారు. పెళ్లి అయ్యాక కూడా తన చదువుని కొనసాగిస్తానంటే ఆయన అందుకు సమ్మతించడమేగాక చదువుకునేందుకు ప్రోత్సహించారు కూడా. వివాహం తరవాత బరోడాలోని లక్ష్మీ విలాస్‌ ప్యాలెస్‌ రాధికకు స్థిర నివాసంగా మారింది.  

రాజా రవివర్మ పెయింటింగ్స్‌ చూసి...
బరోడా ప్యాలెస్‌ గోడలపై రాజా రవివర్మ పెయింటింగ్స్‌ చూసిన రాధిక.. పాతకాలం నాటి కళాఖండాలు, నేత పద్ధతులు, చేతివృత్తులు ఎంత  అద్భుతంగా ఉన్నాయో అనుకుని వీటిని ఇప్పుడు కూడా ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. ఇలా స్థానికులకు కూడా ఆర్థికంగా తోడ్పడవచ్చన్న ఉద్దేశ్యంతో తన అత్తగారితో కలిసి నేత పద్ధతులు, చేతివృత్తులను ప్రోత్సహించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ముంబైలో వీరి తొలి ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయగా ఉత్పత్తులన్నీ అమ్ముడయ్యాయి. లాక్‌డౌన్‌ సమయంలోను రాధిక చేతివృత్తుల కార్మికులకు అండగా నిలబడ్డారు. దీనికోసం వారు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో పర్యటించి అక్కడి వారి పరిస్థితులను సోషల్‌ మీడియాలో పోస్టు చేసి దాతల ద్వారా అందిన సహాయ సహకారాలను వారికి అందించారు. అలా దాదాపు ఏడు వందల మంది కుటుంబాలను ఆదుకున్నారు.

నాన్న దగ్గరే తొలిపాఠం నేర్చుకున్నాను..
‘‘నేను సంప్రదాయ రాజరికపు హద్దులు దాటి బయటకు వచ్చాను.  రాజరిక కట్టుబాట్లు దాటి మానాన్న గారు మహారాజ్‌ కుమార్‌ డాక్టర్‌ రంజిత్‌ సింగ్‌జి నాకన్నా ముందు బయటకు వచ్చారు. 1984 లోనే ఆయన ఐఏఎస్‌ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. భోపాల్‌ గ్యాస్‌ విషాదం జరిగినప్పుడు నాన్న కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఆయన ్రçపజల ప్రాణాలు కాపాడేందుకు ఎటువంటి భయం లేకుండా పోరాడారు. అప్పుడు నాకు ఆరేళ్ళు. ఆ రోజు రాత్రి నాన్నగారి నుంచి నేను తొలిపాఠం నేర్చుకున్నాను. సమస్య వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, సేవచేయడంలో ఉన్న ఆనందం ఏంటో ఆ రోజు అర్థమయ్యింది. అప్పటినుంచి ఒక రాజకుటుంబానికి చెందిన అమ్మాయిగా కాక సాధారణ జీవితం గడిపేందుకు ప్రయత్నించాను. ఈ విషయంలో అమ్మకూడా ప్రోత్సహించేవారు. అందుకే నా ఇద్దరు కూతుర్లకు ఎటువంటి కట్టుబాట్లు పెట్టడం లేదు. వాళ్లకు నచ్చిన విధంగా చేయండని ప్రోత్సహిస్తున్నాను’’ అని రాధికరాజే చెప్పారు.
 
నాన్నతో రాధికారాజే గైక్వాడ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement