సూరత్ ఏకగ్రీవంతో సర్వత్రా చర్చ
బీజేపీ కుట్రేనంటున్న ప్రతిపక్షాలు
లోక్‌సభ చరిత్రలో 29 ఏకగ్రీవాలు
గుజరాత్‌లో అన్ని లోక్‌సభ స్థానాలకూ మే 7న మూడో విడతలో భాగంగా పోలింగ్ జరిగింది. అయితే అంతకుముందే ఒక సీటు అధికార బీజేపీ ఖాతాలో పడింది!
సూరత్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ‘తిరస్కరణ’కు గురవడం, ఆ వెంటనే పోటీలో ఉన్న మిగతా 8 మంది అభ్యర్థులూ నామినేషన్లు ఉపసంహరించుకోవడమే అందుకు కారణం.
దాంతో పోలింగ్‌తో పని లేకుండా బీజేపీ అభ్యర్థి ముఖేశ్ దలాల్ ఏకగ్రీవ ఎంపీగా ఎన్నికైపోయారు! అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి నీలేశ్ కుంభానీ మీడియాకు ముఖం చాటేయడంతో ఇదంతా బీజేపీ స్క్రిప్టేనంటూ ఆరోపణలొచ్చాయి. లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఏకగ్రీవాలను ఓసారి చూస్తే...
లోక్‌సభ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవడం అసాధారణమైన విషయం. తొలి లోక్‌సభ ఎన్నికలు జరిగిన 1952 నుంచి ఇప్పటిదాకా ఇలా పోటీ లేకుండా గెలిచిన 29వ ఎంపీ దలాల్. బీజేపీ నుంచైతే ఏకగ్రీవంగా ఎన్నికైన తొలి ఎంపీ ఆయనే. 1952, 1957, 1967 ఎన్నికల్లో ఐదేసి మంది చొప్పున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1952లో ఏకగ్రీవమైన ఐదుగురు ఎంపీల్లో ఒక్క జమ్మూ కశీ్మర్ నుంచే నలుగురుండటం విశేషం!
ఆంధ్రప్రదేశ్, అసోం, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ సహా ఎనిమిది రాష్ట్రాలు ఒకరికంటే ఎక్కువ మంది ఎంపీలను పోటీ లేకుండా లోక్‌సభకు పంపాయి. పారీ్టలపరంగా చూస్తే ఏకంగా 20 మంది ఏకగ్రీవ ఎంపీలతో ఈ జాబితాలో కాంగ్రెస్ అగ్ర స్థానంలో ఉంది. నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ), సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)ల నుంచి ఇద్దరేసి ఏకగ్రీవమయ్యారు. లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఇప్పటిదాకా ఒకే ఒక్క స్వతంత్ర అభ్యర్థి ఏకగ్రీవంగా నెగ్గారు. సిక్కిం, శ్రీనగర్ లోక్‌సభ స్థానాలకు ఒకటి కంటే ఎక్కువసార్లు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఏకగ్రీవ ప్రముఖులు..
ఏకగ్రీవంగా గెలుపొందిన ఎంపీల్లో పలువురు ప్రముఖులున్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైబీ చవాన్, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా, నాగాలాండ్ మాజీ సీఎం, మాజీ గవర్నర్ ఎస్సీ జమీర్, ఒడిశా తొలి సీఎం హరేకృష్ణ మహతాబ్, రాజ్యాంగ పరిషత్ సభ్యుడు, కాంగ్రెస్ నాయకుడు టీటీ కృష్ణమాచారి, కేంద్ర మాజీ మంత్రులు పీఎం సయీద్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే విజయవాడ నుంచి కేఎల్ రావు పోటీ లేకుండా గెలిచారు.
రాజ కుటుంబీకుల నుంచి మొదలు...
లోక్‌సభకు ఏకగ్రీవాలు రాజ కుటుంబీకుల నుంచి మొదలయ్యాయి. 1952 తొలి ఎన్నికల్లో లోక్‌సభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మొదటి నాయకునిగా ఆనంద్ చంద్ రికార్డులకెక్కారు. అంతేగాక ఏకగ్రీవమైన ఏకైక స్వతంత్ర అభ్యర్థి కూడా ఆయనే! బిలాస్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన గెలుపొందారు. నిధుల కొరతను కారణంగా చూపుతూ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్‌ను ఉపసంహరించుకోవడమే అందుకు కారణం.
ఆయనకు చంద్ లంచం ఇచి్చనట్టు కాంగ్రెస్ ఆరోపించింది. చంద్ ఎన్నికను కోర్టులో సవాలు కూడా చేసింది. అయితే తీర్పు చాంద్‌కే అనుకూలంగా వచ్చింది. ఇక ఒడిశా తొలి సీఎం హరేకృష్ణ మహతాబ్ 1962లో అంగుల్ నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనపై బరిలో ఉన్న గణతంత్ర పరిషత్ పార్టీ అభ్యర్థి నామినేషన్‌ను ఉపసంహరించుకోవడమే అందుకు కారణం. అదే ఏడాది తెహ్రీ గడ్వాల్ నుంచి మానవేంద్ర షా కాంగ్రెస్ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
1967లో లద్దాఖ్ కాంగ్రెస్ అభ్యర్థి, బౌద్ధ ఆధ్యాతి్మక నాయకుడు చోగ్నోర్ పోటీ లేకుండా గెలుపొందారు. 1971లోనూ ఆయన విజయం సాధించారు. 1977లో సిక్కిం స్థానంలో ఏకంగా ఏడుగురు అభ్యర్థుల నామినేషన్ పత్రాలు చెల్లకపోవడంతో ఛత్ర బహదూర్ ఛెత్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అరుణాచల్ వెస్ట్ స్థానంలో రించిన్ ఖండూ ఖ్రీమే ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయనా పోటీ లేకుండా నెగ్గారు. 1989లో కశీ్మర్లో మూడు లోక్‌సభ స్థానాలకు జరిగిన పోలింగ్‌లో కేవలం 5 శాతం ఓటింగ్ నమోదైంది. కాశీ్మర్ లోయలో తిరుగుబాట్లు, ఉగ్రవాదం పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన మహమ్మద్ షఫీ భట్ శ్రీనగర్ నుంచి పోటీ లేకుండా గెలిచారు!
కన్నౌజ్ నుంచి డింపుల్
దలాల్‌కు ముందు చివరిసారిగా ఏకగ్రీవంగా గెలిచిన ఎంపీ సమాజ్‌వాదీ పార్టీ నాయకురాలు డింపుల్ యాదవ్. కన్నౌజ్ ఎంపీగా ఉన్న ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ 2012లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యారు. దాంతో ఖాళీ అయిన కన్నౌజ్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన భార్య డింపుల్ బరిలో దిగారు. కాంగ్రెస్, బీఎస్పీ, రా్రïÙ్టయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్డీ)తో సహా ప్రధాన పార్టీలు ఉప ఎన్నికకు దూరంగా ఉన్నాయి. కొందరు స్వతంత్రులతో పాటు బీజేపీ, పలు చిన్న పారీ్టలు బరిలో దిగాయి. కానీ అంతా నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో డింపుల్ ఏకగ్రీవంగా నెగ్గారు. తమ అభ్యర్థులు నామినేషన్ వేయకుండా ఎస్పీ అడ్డుకుందని బీజేపీ, పీస్ పార్టీ వంటివి ఆరోపించడం విశేషం!
చివరి నిమిషం ఉపసంహరణలు...
1985 సిక్కిం లోక్‌సభ స్థానం సిట్టింగ్ ఎంపీ నార్ బహదూర్ భండారీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో లోక్‌సభకు రాజీనామా చేశారు. ఉప ఎన్నికలో ఆయన భార్య దిల్ కుమారి భండారీ సిక్కిం సంగ్రామ్ పరిషత్ నుంచి ఏకగ్రీవంగా నెగ్గారు. కాంగ్రెస్‌తో సహా ఎనిమిది మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడమే అందుకు కారణం. అధికార పార్టీ వారిపై బెదిరింపులకు పాల్పడిందంటూ ఆరోపణలొచ్చాయి!
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment