న్యూయార్క్ : ఇచ్చి పుచ్చుకోవడంలో ఎంతో ఆనందం ఉంటుందని ఎంతో మందికి అనుభవ పూర్వకంగా తెల్సిందే. అయితే ఈ ఇచ్చి పుచ్చుకోవడంలో మగవారికి, ఆడవారికి మధ్య ఏమైనా తేడా ఉంటుందా? ఈసందర్భంగా వారి మెదళ్లలో ఎలాంటి మార్పులు కలుగుతాయి? అన్న ప్రశ్నలక ఓ తాజా అధ్యయనం సమాధానాలు చెబుతోంది. డబ్బు రూపంలో ఒకరికి సహాయం చేయడంలో ఆడవాళ్లకు ఎక్కువ ఆనందం ఉంటుందట. ఆ సమయంలో వారి మెదళ్లలోని ఒక ప్రాంతం మరీ క్రియాశీలకంగా పనిచేస్తుందట. మగవాళ్లలో పరులకు డబ్బు ఇవ్వకుండా తమ వద్దనే దాచుకున్నప్పుడే ఎక్కువ ఆనందం కలుగుతుందట. అప్పుడు వారి మెదల్లో కూడా మహిళల్లాగానే ఒకో చోట క్రియాశీలక మార్పులు కలుగుతాయట. అంటే ఆడవాళ్లు ఇతరులకు సాయం చేసినప్పుడు వచ్చే ఆనందం ద్వారా వారి మెదడులో ఎక్కడైతే మార్పులు సంభవిస్తాయే మగవారు డబ్బును తమ వద్దనే ఉంచుకోవడం ద్వారా కలిగే ఆనందానికి కూడా వారి మెదళ్లలోకూడా అదే ప్రాంతంలో మార్పులు కలుగుతాయట.
ఈ విషయాన్ని ఎంపిక చేసిన 56 మంది స్త్రీ, పురుషులపై ప్రయోగాత్మకంగా అధ్యయనం జరిపి తేల్చారు. వారిలో కొందరి మగవారిని, కొందరి ఆడవారిని మాత్రమే ఇతరులకు డబ్బులు ఇవ్వాల్సిందిగా సూచించి, మిగతా వారికి డబ్బులు తమ వద్దనే ఉంచుకోవాల్సిందిగా సూచించడం ద్వారా ఈ ప్రయోగం జరిపారు. ఈ సందర్భంగా వారి మెదళ్లలో కలిగే మార్పులను స్కానింగ్ ద్వారా నమోదు చేశారు. మగవాళ్లకన్నా, ఆడవాళ్లే ఇతరులకు సహాయం చేయడంలో ఆనందం పొందుతారని, వారిలోనే సామాజిక స్పహ ఎక్కువగా ఉంటుందన్న విసయం పదేళ్ల క్రితమే తెల్సిందని, అయితే ఈ సందర్భంగా పరస్పర విరుద్ధ ప్రవర్తనకు ఆడ, మగ ఇరువురిలోనూ మెదడులోని ఒకే ప్రాంతం స్పందిస్తుందన్న విషయం తాజా అధ్యయనంలో తేలిందని జూరిచ్ యూనివర్శిటీలో న్యూరోఎకనామిక్స్, సోషల్ న్యూరోసైన్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఫిలిప్పే టాబ్లర్, జార్జియా స్టేట్ యూనివర్శిటీలో న్యూరోసైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అన్నే జీ మర్ఫీలు తెలిపారు.
ఇచ్చిపుచ్చుకోవడంలో ఆడ,మగ ఆనందాన్ని ప్రభావితం చేస్తున్న మెదడు ప్రాంతానికి స్కిజోఫ్రేనియా లాంటి మానసిక జబ్బులను నయం చేసేందుకు ఇచ్చే మందులను ఇచ్చి కూడా అధ్యయనం జరిపామని, ఆశ్చర్యంగా ఆడవాళ్లలో ఇతరులకు ఇవ్వాలనే స్పృహ, మగవాళ్లలో తన వద్దనే ఉంచుకోవాలనే స్వార్ధ చింతన తగ్గిందని వారు చెప్పారు. ఎలుకల్లో కూడా సహజంగానే ఈ సేవా గుణం ఆడ ఎలుకల్లోనే ఎక్కువగా ఉంటుందని వారు తెలిపారు. ఆడ, మగ మెదళ్ల నిర్మాణాల్లో ఉన్న భేదాల కారణంగా వారిలో సహాయ, స్వార్థ చింతనలు కలగడం లేదని, ప్రవర్తనా రీత్యనే వారిలోగానీ, వారి మెదళ్లలోగానీ ఇలాంటి మార్పులు సంభవిస్తున్నాయని వారు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా చారిత్రకంగా, సామాజిక వచ్చిన పరివర్తనే వారి ప్రవర్తనలో మార్పునకు కారణౖమై ఉంటుందని వారు అన్నారు. పిల్లలను కనడం, పోషించం లాంటి బాధ్యతల వల్ల ఆడవాళ్లలో సామాజిక సేవా గుణం వచ్చి ఉంటుందని వారు వివరించారు. వారు తమ అధ్యయన పూర్తి వివరాలను ‘నేచర్ హ్యూమన్ బిహేవియర్’ తాజా సంచికలో ప్రచురించారు.
Comments
Please login to add a commentAdd a comment