
న్యూఢిల్లీ: వర్ధమాన క్రీడాకారులకు సహాయం చేయడంలోనూ భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ప్రత్యేక పద్ధతి ఉందని యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ అన్నాడు. సమస్య పరిష్కారానికి పలు విధానాలను సూచించే ధోని... చివరకు ఆ సమస్యను మనమే పరిష్కరించుకునేలా చేస్తాడని ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పాల్గొ న్న పంత్ చెప్పుకొచ్చాడు. మైదానంలోనూ, బయట ధోనినే తన మెంటార్ అని తెలిపాడు.
‘ధోని నా గురువు. ఆటలో లేదా వ్యక్తిగతంగా ఏ సమస్య వచ్చినా నేను మహీ భాయ్‌ని సంప్రదిస్తా. అప్పుడు ధోని నా సమస్యకు పూర్తి పరిష్కారం చెప్పకుండా దాన్నుంచి బయటపడే అన్ని మార్గాలను సూచిస్తాడు. ఎందుకంటే నేను పూర్తిగా ఎవరిపై ఆధారపడకూడదనేది అతని అభిమతం. క్రీజులో కూడా మహీ భాయ్ ఉంటే అంతా సవ్యంగా జరిగిపోతుంది. అతని భాగస్వామ్యం చాలా ఇష్టం. కానీ మేమిద్దరం కలిసి బ్యాటింగ్ చేయడం చాలా అరుదుగా జరుగుతుంది’ అని రిషభ్ చెప్పాడు.