సన్మార్గం: జీవిత యజ్ఞంతో... జన్మ సార్థకం | life is for achieving while doing yagnam | Sakshi
Sakshi News home page

సన్మార్గం: జీవిత యజ్ఞంతో... జన్మ సార్థకం

Published Wed, Dec 11 2013 12:17 AM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM

సన్మార్గం:   జీవిత యజ్ఞంతో... జన్మ సార్థకం

సన్మార్గం: జీవిత యజ్ఞంతో... జన్మ సార్థకం

 మనం యజ్ఞం అనే పదాన్ని తరచు వింటుంటాం. అయితే అసలు యజ్ఞం అంటే ఏమిటి? ఎన్ని రకాలు, ఏ యజ్ఞాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం.
 కేవలం మంత్రాలు చదువుతూ అగ్నికి ఆహుతులు సమర్పించడమే యజ్ఞం అనుకుంటే పొరపాటే. ఒక నిర్ణీతమైన, నిర్దుష్టమైన, ఉన్నతమైన ఆశయాన్ని సాధించడం కోసం ఒక దృఢమైన, దివ్యమైన సంకల్పంతో శరీరాన్ని, మనస్సును, ఆత్మను పవిత్రంగా ఉంచుకుని దీక్షగా, ఏకోన్ముఖంగా జరిపించే కార్యక్రమమే యజ్ఞమని విజ్ఞులు చెబుతారు. అదేవిధంగా వేదవిహితమైన సంప్రదాయబద్ధమైన శుభకార్యాలన్నీ యజ్ఞాలేనని భగవద్గీత చెబుతోంది. వీటితోబాటు ఈ చరాచర సృష్టిపట్ల, భగవదత్తమైన జీవితాన్ని ప్రసాదించిన వారిపట్ల కృతజ్ఞతను ప్రకటించడమే యజ్ఞమని మరో నిర్వచనమూ ఉంది. కృతజ్ఞతాప్రకటన, నిస్వార్థ త్యాగం, నిస్వార్థ భావప్రకటనలు కూడా యజ్ఞమనే పదానికి అర్థాలుగా చెప్పబడుతున్నాయి.
 పండితులు యజ్ఞాలను ఐదువిధాలుగా విభజించారు. అవి దేవయజ్ఞం, పితృయజ్ఞం, రుషియజ్ఞం, మనుష్యయజ్ఞం, భూతయజ్ఞం అంటూ నామకరణం చేశారు. ఈ ఐదు యజ్ఞాలనూ ప్రతి ఒక్కరూ చేసి తీరాలని భారతీయ సంస్కృతి నొక్కి చెబుతోంది. యజ్ఞం చేయగా, పదిమందికి పంచి పెట్టగా మిగిలిన యజ్ఞశేషాన్ని మాత్రమే భుజించాలని పంచయజ్ఞ సిద్ధాంతం చెబుతోంది. యజ్ఞం చేయగా మిగిలిన ప్రసాదాన్ని అమృతం అంటారు. అలా కానిది విషతుల్యమే అవుతుంది.
 
 మొట్టమొదటిది దైవయజ్ఞం: ప్రకృతి శక్తుల్ని నిర్వహించే అద్భుతమైన చైతన్యాన్ని దైవం అనుకుంటే... ఆ విశ్వ నిర్వహణా శక్తినే దైవశక్తి అని, వాటికి కృతజ్ఞత ప్రకటించే విధానమే దైవయజ్ఞమనీ అంటారు. ప్రకృతిలోని పంచభూతాలను పంచదైవాలుగా గుర్తించి అటువంటి శక్తులన్నీ దేహంలో కూడా ఉన్నాయని పెద్దలు విశ్లేషించారు. వాటిని ఆరాధించే తత్వమే దైవయజ్ఞమనీ, మనకు లభించిన పాంచభౌతికమైన ఈ జన్మ దైవదత్తమైనది కనుక, ప్రాణశక్తిని మూలశక్తిగా ఆరాధించి, దైవశక్తిగా పూజించి, అహంకారాన్ని త్యజించమని దైవయజ్ఞ సిద్ధాంతం చెబుతుంది.
 
 రెండవది పితృయజ్ఞం: మాతృదేవోభవ, పితృదేవోభవ అంటూ ఇలపై వెలసిన ఇద్దరుదైవాలుగా జన్మనిచ్చిన కన్నతల్లిదండ్రులను గుర్తించమని ఈ యజ్ఞభావన చెబుతుంది. తల్లిదండ్రులపై ఆదరం ప్రకటించమని, ప్రేమాభిమానాలను ప్రదర్శించమని, వారిపట్ల కృతజ్ఞతాభావాన్ని ప్రకటించడమే విధ్యుక్తధర్మంగా భావించమని పితృయజ్ఞం ఆదేశిస్తుంది. ఈ యజ్ఞ నిర్వహణ వలన కుటుంబ వ్యవస్థ, తద్వారా చక్కటి సమాజ వ్యవస్థ సాధ్యపడుతుంది.
 
 మూడవది రుషియజ్ఞం: మనిషిని మనిషిగా తీర్దిదిద్ది, సంస్కార జ్ఞానాలను ప్రసాదించి, విజ్ఞానభిక్ష పెట్టిన మేధావులు మన రుషులు. మానవులు పశువులుగా జీవించకుండా తమ బోధనల ద్వారా ప్రవర్తనా నియమావళిని, వివాహ వ్యవస్థను, కుటుంబ వ్యవస్థను, సంస్కారవంతమైన నాగరిక జీవన శైలిని, సమాజాన్ని ఏర్పరచింది రుషులే. సనాతన సంప్రదాయాలకు రూపకల్పన చేసి, పథనిర్దేశం చూపి, దిశానిర్దేశం చేసిన మహానుభావులు మన రుషులు. వారిపట్ల కృతజ్ఞతను ప్రకటించడమే రుషి యజ్ఞం. మంచి గ్రంథపఠన చేయడం, మంచి అలవాట్లను అభ్యాసం చేసుకోవడం, జ్ఞానసముపార్జన చేయడం, అలా సముపార్జించిన జ్ఞానాన్ని పదిమందికీ పంచిపెట్టమని రుషి యజ్ఞం చెబుతుంది.
 
 నాలుగవది మనుష్య యజ్ఞం: సమాజంలో ఎందరి సహాయసహకారాలతోనో, సామరస్య భావనలతోనో మాత్రమే మన మనుగడ సాధ్యమవుతుంది. అందుకే మనుష్య యజ్ఞంలో భాగంగా మానవసేవ మాధవసేవ అయింది. అతిథి దేవుడయ్యాడు. అతిథిదేవోభవ అయింది. పక్కనున్న వారికి సాయమందించి, దానధర్మాలు చేయడం ద్వారా దరిద్ర నారాయణుల సేవద్వారా మాత్రమే ఈ మనుష్య యజ్ఞం సాధ్యమవుతుంది.
 
 ఐదవది...భూతయజ్ఞం: మనతోబాటు మన చుట్టూ బతుకుతున్న ఎన్నో ప్రాణులు మన జీవన విధానానికి ఆధారం కల్పిస్తున్నాయని, వాటి ఉనికిని గుర్తించి, వాటితోబాటు మనకున్న బంధాన్ని, అనుబంధాన్ని వ్యక్తీకరించడమే భూతయజ్ఞం అవుతుంది. వృక్షాలను పెంచి పోషిస్తూ, పచ్చని ప్రకృతిని, పర్యావరణాన్ని స్థాపించడంలోనూ, జంతువులకు కూడా ఆహారాన్ని సమకూర్చి, వాటికి రక్షణ కల్పిస్తూ ఆదుకునేందుకు, జీవన సమతుల్యాన్ని సాధించడంలో ఈ భూతయజ్ఞం సాయపడుతుంది.
 
 జీవితాన్నే ఒక పవిత్రమైన యజ్ఞమనుకుంటే... మన జీవిత కాలమంతా యజ్ఞసమయమే! అన్నయజ్ఞంతో ఆరంభించిన దైనందిన జీవితం ప్రకృతిలోనే పరమాత్మను దర్శించే దైవయజ్ఞాన్ని, మాతాపితరుల సేవ చేసే పితృయజ్ఞాన్ని, సనాతన సంస్కృతీ సంప్రదాయాలకు అనుగుణంగా జీవితాన్ని మలుచుకునే రుషి యజ్ఞాన్ని, తోటి మనుషులకు సహాయ సహకారాలనందిస్తూ, సానుభూతిని ప్రదర్శించే మనుష్య యజ్ఞాన్ని, ప్రకృతి సమతుల్యాన్ని సాధిస్తూ అహింసా సిద్ధాంతాన్ని పాటిస్తూ, మరెన్నో జీవులకు ఆశ్రయం, ఆధారం కల్పిస్తూ భూతయజ్ఞాన్ని నిర్వహించగలిగితే.... జన్మ సార్థకమైనట్లే!
 - సూర్యప్రసాదరావు
 
 పండితులు యజ్ఞాలను ఐదువిధాలుగా విభజించారు. అవి దేవయజ్ఞం, పితృయజ్ఞం, రుషియజ్ఞం, మనుష్యయజ్ఞం, భూతయజ్ఞం అంటూ నామకరణం చేశారు. ఈ ఐదు యజ్ఞాలనూ ప్రతి ఒక్కరూ చేసి తీరాలని భారతీయ సంస్కృతి నొక్కి చెబుతోంది. యజ్ఞం చేయగా, పదిమందికి పంచి పెట్టగా మిగిలిన యజ్ఞశేషాన్ని మాత్రమే భుజించాలని పంచయజ్ఞ సిద్ధాంతం చెబుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement