mantras
-
ఓం శాంతిః శాంతిః శాంతిః
మీరు ఎన్నిక్రతువులు చేయండి, ఎన్ని పూజలు చేయండి, యజ్ఞాలు చేయండి... చివరకు మీరు కోరుకునేది ఏది... కేవలం ప్రశాంతత. నేను రాజభవనంలో ఉన్నా, నేనెంత అందగాడినయినా, ఎంత విద్వాంసుడినయినా, ఎంత ఐశ్వర్యం ఉన్నా... మనసు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు, తీవ్ర అశాంతితో ఉన్నప్పుడు ఇవేవీ మీకు శాంతినివ్వలేవు. ఒక పచ్చటి చెట్టు, రంగురంగుల పూలతో, కాయలతో, పళ్ళతో ఉన్నప్పటికీ తొర్రలో అగ్నిహోత్రం ఉన్నప్పుడు అది లోపల.. లోపల ఎంత దహించుకు పోతుంటుందో... మనసులో అశాంతి ఉన్న వ్యక్తికూడా అలాగే బాధపడుతూ ఉంటాడు. అందుకే శాంతి కావాలి. మన సంప్రదాయం మనకు ఒక శాంతి మంత్రాన్నే ఇచ్చింది...ఓం శాంతిః శాంతిః శాంతిః ఇది కేవలం ప్రాణులు మాత్రమే కాదు, అంతరిక్షం శాంతి పొందాలి, పృథివి శాంతి పొందాలి, వాయువు శాంతిపొందాలి. జలం శాంతి పొందాలి. ఏదీ కూడా వ్యగ్రతను పొందకూడదు. భూమికి అచల అని పేరు. అంటే కదలనిది..అని. భూమికి కోపం వచ్చి తన కట్టుతప్పి కదిలిందనుకోండి.. ఎంత ప్రాణ నష్టం? ఎంత ఆస్తి నష్టం ? అందుకే భూమి ప్రశాంతంగా ఉండాలి. వాయుః శాంతిః వాయువు తన కట్టుతప్పి తీవ్రతను చూపిందనుకోండి.. ప్రభంజనం అంటాం. అన్నీ నేలకొరుగుతాయి. అదే వాయువు తాను ఉండాల్సిన కట్టుబాటులో ఉంటే... వాయుః ప్రాణః, సుఖం వాయుః. అప్పుడు ప్రాణమూ వాయువే, సుఖమూ వాయువే. చల్లగాలి చక్కగా వీస్తుందనుకోండి. సుఖంగా అనిపిస్తుంది. ఏ ఇబ్బందీ లేకుండా ఊపిరిని ఒకే వేగంతో తీసి, ఒకే వేగంతో విడిచిపెడుతూ ఉన్నప్పుడు.. అంతకన్నా ఆయుర్దాయం మరేముంది! వాయువు ఎంతకాలం శరీరంలో తిరుగుతూ ఉంటుందో అంతకాలమే సంధిబంధాలు.. కాళ్ళు, చేతులు, మణికట్టు అన్నీ వంగుతాయి. అది ప్రసరించనప్పుడు శరీరం ఒక కర్రయిపోతుంది. అందుచేత వాయువు అత్యంత ప్రధానమైనది. దాని చేత ప్రాణులన్నీ చలనశీలంగా ఉంటాయి. వడిబాయక తిరితే ప్రాణబంధుడా !.. అంటారు అన్నమాచార్యులవారు. ఒకే వేగంతో ఊపిరిని శరీరం లోపలికి, బయటికి పంపుతున్నాడే..ఆయనే వేంకటేశ్వరుడు. ఇక అంతకన్నా నాకు దగ్గరగా ఎవరున్నార్రా!!! అని అడిగాడు. వడిబాయక తిరిగే ప్రాణబంధుడా.. అని పిలిచాడు ఆయన వేంకటేశ్వరుడిని. అదే.. వాయుఃప్రాణః సుఖం వాయుః. ఊపిరిని తీసి విడిచి పెడుతున్న శరీరం ఆచంద్రార్కం.. శాశ్వతంగా ఉండదు. పడిపోతుంది. ఇప్పుడు వాయువుకున్న గొప్పదనం ఏమిటంటే.. అదే వాక్కుగా మారుతుంది. ఆ వాయువు చేత ప్రాణాలను నిలబెట్టుకున్నవాడు వాటిని సార్ధక్యం చేసుకున్నప్పుడు శరీరం పడిపోయినా ఆ వ్యక్తి.. కాలంలో శతాబ్దాలు నిలబడిపోతాడు.. ఎలా! అది వాక్కుగా మారినందువల్ల...! బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
మంత్రాల నెపంతో సజీవదహనం
సాక్షి, జగిత్యాల : మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిని సజీవదహనం చేశారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతపూర్‌లో సోమవారం సాయంత్రం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ అల్వాల్‌కు చెందిన పవన్‌కుమార్ (38) బెంగళూర్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతడి బావమరిది జగన్ వారం క్రితం గుండెపోటుతో చనిపోయాడు. అయితే.. జగన్ మృతికి పవన్‌కుమార్ కారణమని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం జగన్ పెద్దకర్మకు హాజరై చిత్రపటం వద్ద పవన్‌కుమార్ మొక్కుతుండగా పెద్ద బావమరిది విజయ్‌స్వామి, జగన్ భార్య సుమలత ఇద్దరూ కలసి అతడిని గదిలో బంధించారు. పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో పవన్‌కుమార్ సజీవ దహనమయ్యాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఒక్క మంత్రంతో కరోనా వైరస్ మాయం..!
ధర్మశాల: ప్రపంచాన్ని వణికిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మంత్రాలు పఠించాలని చైనాలోని తన అనుచరులకు టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా సూచించారు. వుహాన్ నగరంలో కరోనా వైరస్ వల్ల ఆ దేశంలో ఇప్పటివరకూ 130 మంది చనిపోగా వేలాది మంది ఆ వైరస్ బారిన పడ్డారు. దీంతో చైనాలోని కొందరు ఆయన భక్తులు.. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సలహా ఇవ్వాలని ఫేస్బుక్ వేదికగా దలైలామాను కోరారు. (ఆ పిశాచి ఎక్కడ దాక్కున్నా వదలం : చైనా అధ్యక్షుడు) దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘తారా మంత్రం’ పఠించాలని సూచించారు. వైరస్ వ్యాప్తి నిరోధానికి ఈ మంత్రం సాయపడుతుందని చెప్పారు. ‘ఓం తారే తుత్తారే తురే సోహా’ అంటూ మంత్రం పఠిస్తున్న ఆడియో క్లిప్‌ను కూడా తన పోస్టుకు దలైలామా జతచేశారు. తార మంత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుందని ఆయన అన్నారు. మంత్రం జపించి మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఎలాంటి బాధలు ఉండవు అని దలైలామా పేర్కొన్నారు. టిబెటన్ ఆధ్యాత్మిక గురువు స్వయంగా తన గొంతును ఫేస్బుక్లో పోస్టు చేశారు. దలైలామా పేర్కొన్న ఆ మంత్రం ప్రస్తుతం చైనాలో వైరల్ అవుతోంది. గత ఇరవై నాలుగు గంటల్లో 1300 కొత్త కేసులు నమోదయ్యాయి. దగ్గు, జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలు వైరస్ లక్షణాలని వైద్య నిపుణలు చెబుతున్నారు. (ఈ బీరు తాగితే కరోనా వైరస్ సోకుతుందా..!) -
వేదాలు చదవండి.. దిగుబడి పెంచుకోండి
పణజీ: పంట పొలాల్లో 20 రోజుల పాటు.. రోజుకు కనీసం 20 నిమిషాల చొప్పున వేదాలను వల్లె వస్తే పంటల దిగుబడి, నాణ్యత పెరుగుతుందని, ఈ ‘కాస్మిక్ ఫార్మింగ్’ను పాటించాలని రైతులకు గోవా సర్కారు సూచించింది. తద్వారా రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా పంటలను పండించవచ్చంది. ఇందుకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం శివ యోగా ఫౌండేషన్, బ్రహ్మకుమారీస్ తదితర సంస్థలను సంప్రదిస్తోందని వ్యవసాయ శాఖ అధికారి ఒకరు తెలిపారు. వ్యవసాయ మంత్రి విజయ్ సర్దేశాయి, వ్యవసాయ శాఖ డైరెక్టర్ నెల్సన్ ఫిజీరెడొలు ఇటీవలే గురుగ్రామ్‌లోని శివ యోగా ఫౌండేషన్‌కు చెందిన గురు శివానంద్‌తో ప్రత్యేకంగా భేటీ అయి కాస్మిక్ ఫార్మింగ్ ఉపయోగాలపై చర్చించారని ఆయన వెల్లడించారు. పంట పొలాల్లో వేద పఠనం వల్ల విశ్వంలోని శక్తి ఆ భూమిలోకి వచ్చి పంటల దిగుబడి, నాణ్యత పెరుగుతుందని నెల్సన్ ఫిజీరెడొ తెలిపారు. -
వేదాలకు పచ్చని పంటలు
సాక్షి, న్యూఢిల్లీ : ‘మంత్రాలకు చింతకాయలు రాలుతాయా’ అని అంటారు గానీ, వేదాలకు పచ్చని పంటలే పండుతాయట! ఈ మాటను అక్షరాల నమ్మిన గోవాలోని బీజేపీ ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా పనిచేస్తున్న విజయ్ సర్దేశాయ్ మంగళవారం నాడు అధికారికంగా ఓ స్కీమ్‌నే ప్రారంభించారు. దీనికి ‘శివ్ యోగ్ కాస్మిక్ ఫార్మింగ్’ అని కూడా నామకరణం చేశారు. రైతులు ప్రతిరోజు పంట పొలాల ముందు ధ్యాన ముద్రలో (మెడిటేషన్) కూర్చొని ‘ఓం రమ్ జమ్ సాహ్’ అంటూ 20 సార్లు ఉచ్ఛరిస్తే చాలట. అలా చేయడం వల్ల రైతుల నోటి నుంచి వెలువడే శబ్దాల వెంట కాస్మిక్ కిరణాలు ప్రయాణించి ఎదురుగా ఉన్న పంట పైర్లకు తాకి వాటికి కొత్త శక్తినిస్తాయట. నేల లోపల క్రిమికీటకాదులను చంపేస్తాయట. అలా జవసత్వాలను సంతరించుకున్న పైరు ఏపుగా పెరుగుతందట. ఇందులో పైసా ఖర్చులేదు, ప్రయత్నించి చూడమని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం పంటల కోసం ఉపయోగిస్తున్న నీరు, ఎరువులను ఇక ముందు వాడాల్సిన అవసరం ఉందా, లేదా? అన్న విషయాన్ని మాత్రం ఆయన వివరించలేదు. దుక్కి దున్నీ నారుపోసి నీరుపోసి కష్టపడినా పంట చేతికొస్తదా, లేదా అన్న ఆందోళన పడే రైతుకు ఇవన్నీ లేకుండా పంట చేతి కొస్తదంటే రోజుకు 20 సార్లేం ఖర్మ 200 సార్లయినా వేదోక్తులను ఉచ్ఛరిస్తారు. ఈ శివ్‌యోగ్ కాస్మిక్ ఫార్మింగ్ విధానాన్ని మాజీ రసాయనిక ఇంజనీరు, ప్రస్తుత ‘శివ్ యోగ్ ఫౌండేషన్’ యోగా గురువు అవదూత్ శివానంద్ కనిపెట్టారట! ఆయన దగ్గర శిష్యరికం చేస్తున్న మంత్రి సర్దేశాయ్ భార్య ఉష ఈ వ్యవసాయం గురించి చెప్పడంతో నమ్మిన మన మంత్రి సర్దేశాయ్ దాన్ని అమలు చేయడం కోసం ఏకంగా స్కీమ్‌నే ప్రారంభించారు. ఈ అంశంలో సరైన అధ్యయనం లేకుండా ఎలా కాస్మిక్ ఫార్మింగ్ విధానాన్ని ప్రారంభిస్తారని సదరు మంత్రిని మీడియా ప్రశ్నించగా, మధ్యప్రదేశ్‌లో ఈ విధానం మంచి ఫలితాలు ఇచ్చిందని తెలిసి ప్రారంభించానని చెప్పారు. వ్యవసాయం అభివృద్ధి కోసం తాను ఏమి చేయడానికైనా సిద్ధమని, పంట పొలాల్లో రాక్ షో లేదా అందాల పోటీలను నిర్వహించడం వల్ల రైతుల్లో వ్యవసాయం పట్ల అంకిత భావం పెరుగుతుందంటే వాటిని ఏర్పాటు చేయడానికైనా తాను సిద్ధమని ఆయన చెప్పారు. ఆయన వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం పనాజీలో మంత్రి ప్రారంభించిన ఈ స్కీమ్‌ను విధిగా అమలు చేయాల్సిందిగా తాము రైతులను కోరడం లేదని చెప్పారు. -
మంత్రాల నెపంతో వృద్ధుడి హత్య
గుర్రంపోడు (నాగార్జునసాగర్): మంత్రాల నెపంతో ఓ వృద్ధుడిని పట్టపగలే దారుణ హత్య చేశారు. ఘటన నల్లగొండ జిల్లా గుర్రం పోడు మండలం తెరాటిగూడెంలో మంగళవారం చోటు చేసుకుంది. చేపూరు గ్రామ పంచాయతీ పరిధి తెరాటిగూడేనికి చెందిన కన్నెబోయిన రాములు(65) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఏడాది క్రితం గ్రామానికి చెందిన పిల్లి సాయన్న భార్య అనారోగ్యంతో మృతిచెందగా, కుమారుడు ఇటీవల ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాములు చేతబడి కారణంగానే వారు చనిపోయారని మృతుల కుటుంబసభ్యులు అనుమానించారు. రాములు కుమారుడు రామలింగయ్యపై గ్రామానికి చెందిన పిల్లి సాయన్న, కన్నెబోయిన శ్రీను, కన్నెబోయిన వెంకటయ్య కత్తితో దాడి చేశారు. విషయం తల్లిదండ్రులకు చెప్పాడు. రాములు, అతడి భార్య పెద్దమ్మ, రామలింగయ్య ఘటన స్థలికి రాగా సాయ న్న, శ్రీను, వెంకటయ్యతో పాటు పలువురు వారిపై దాడికి తెగబ డ్డారు. రాములును కర్రలతో కొట్టి, గొడ్డలితో నరికి, తలపై బండరాళ్లతో మోది దారుణంగా అంతమొందించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. -
మంత్రాలకు చింతకాయలు రాలుతాయా..?
మంత్రాలు.. తంత్రాలు.. మాయలు.. మోసాలు.. మన దేశానికే పరిమితం కాదు. ప్రపంచంలోని చాలా దేశాల్లో చాలా మంది వీటిని నమ్ముతారు. ఇలాగే ఆఫ్రికా ఖండంలోని గినీ దేశంలో కూడా ఓ వింత మోసం బయటపడింది. ఫాంటా కమరా అనే ఆవిడ అక్కడ చాలా ఫేమస్. పిల్లలు కలగని దంపతులు ఆమె దగ్గరికి వెళ్లి ఆశీస్సులు తీసుకుంటారు. ఇందుకోసం కొంత మొత్తాన్ని కూడా ఆమెకు ముట్టజెపుతారట. అయితే ఆమె దగ్గరికి వచ్చిన మహిళా భక్తులకు ప్రసాదమంటూ చెట్ల పసరుతో తయారు చేసిన ద్రవాన్ని ఇస్తుందట. దీంతో మహిళలకు గర్భం వచ్చినట్లు భావిస్తారట. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 700 మందిని ఇలా మోసం చేసిందట. పైగా ఈ ద్రవం తీసుకున్నాక ఏ వైద్యుడు ఇచ్చిన మందులు తీసుకోవద్దని హెచ్చరించేదట. దీంతో భండారం బయటపడకుండా ఇన్ని రోజులు ఆమె మోసం చేస్తూనే ఉందట. అయితే ఓ ల్యాబ్ టెక్నీషియన్ ఈ భండారాన్ని బయటపెట్టిందట. బాధితుల్లో కొందరు గర్భం కోసం 12 నుంచి 16 నెలల పాటు ఎదురుచూశారని వాపోయారు. అంతేకాదు ఆమెను ఒక్కసారి దర్శించుకోవాలంటే దాదాపు రూ.2,200 చెల్లించాలట. ఇంతకీ అక్కడ సగటు నెల జీతం ఎంతో తెలుసా.. కేవలం రూ.3,100. -
మంత్రాలేనంటూ..
నల్లగొండ , చండూరు (మునుగోడు) : అది దళితవాడ. మూడు కుటుంబాలకు చెందిన గుడిసెలు పక్కపక్కనే ఉంటాయి. పదిహేను రోజులుగా ఒక్కరోజు తప్పించి మరోరోజు ఆ గుడిసెలకు నిప్పు అంటుకుంటోంది. అందులో ఉన్న వారు భయంతో పరుగులు తీస్తున్నారు. ఎవరో తమపై మంత్రాలు చేస్తుండడంతోనే ఇలా జరుగుతోందని ఆ కుటుంబాలు వణికిపోతున్నాయి. చండూరు మండలం పుల్లెంల గ్రామంలోని దళితవాడ మూఢ నమ్మకాలతో వణికిపోతోంది. చివరకు వారు ఆ గ్రామాన్ని వదిలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. పోలీస్, రెవెన్యూ అధికారులకు తమ గోడు చెప్పుకున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. దళితవాడలోని సీత మల్లయ్య, సీత నర్సింహ, సీత రవిలకు చెందిన మూడు పూరిగుడిసెలు పక్కపక్కనే ఉన్నాయి. వీరు రోజువారీ కూలీలు. పొద్దస్తమానం పనిచేయడంతో రాత్రి అలసటతో గుడిసెలో నిద్రిస్తున్నారు. 15 రోజులుగా రోజు తప్పించి రోజు ఆ గుడిసెలకు నిప్పు అంటుకొని కొంతమేరకు కాలిపోతున్నాయి. ముందుగా ఒక గుడిసె నిప్పంటుకొని కొంతకాలిన తర్వాత తిరిగి ఆ పక్కన గుడిసె..ఇదే తరహాలో మూడో గుడిసెకు నిప్పు అంటుకుంటోంది. అయితే విద్యుత్ వైర్ల వల్ల జరుగుతుందా అని అనుకుంటే కాదని తేటతెల్లమైంది. ఆ మూడు ఇళ్ల విద్యుత్ వైర్లు సైతం దూరంగా ఉన్నాయి. షార్ట్‌సర్క్యూట్ కూడా జరిగే అవకాశం లేదు. విచిత్రమైన çఘటనతో అటు గ్రామస్తులు, ఇటు బాధిత కుటుంబాలు కంటిమీద కునుకు లేకుండా ఉంటున్నాయి. రాత్రి అయితే చాలు గుడిసెలకు దూరంగా చలిలో వణుకుతూ నిద్రిస్తున్నారు. దీనిపై ఆదివారం గ్రామంలో చర్చించనున్నట్లు గ్రామపెద్దలు తెలిపారు. ఆ రోజు తమకు జరుగుతున్న సంఘటనకు గల కారణాలు తెలియలేకపోతే ఊరి విడిచి వెళ్లిపోతామని బాధితులు ‘సాక్షి’కి తెలిపారు. గతంలోనూ.. ఏడాది క్రితం ఓ పూరిగుడిసె ఇదే తరహాలో దగ్ధమై పెద్దమొత్తంలో నష్టం జరిగింది. కొంతకాలం మరిచిన తర్వాత తిరిగి ఇదే సమస్య ఉత్పన్నమైంది. మంత్రాలేనంటూ.. గుడిసె దగ్ధం కావడానికి దగ్గర్లో పొయ్యి లేదు..తోడుగా కరెంటు వైర్లు లేవు. రెండు లేనప్పుడు నిప్పు పుట్టి ఇళ్లు దగ్ధం కావడం ఏమిటని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంత్రాలతోనే గుడిసెలు దగ్ధం అవుతున్నాయని అంటున్నారు. భయంగా ఉంది ఇంట్లో ఉండాలంటే ఎంతో భయంగా ఉంది. ఏ నిమిషంలో ఏం జరుగుతుందోననే టెన్షన్ ఎక్కువైంది. ఆరుబయట పడుకుంటున్నాం. విచిత్రంగా నిప్పు రావడం మాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. – సీత మల్లయ్య, బాధితుడు ఊరు విడిచి వెళ్తాం భయంతో ఊరిలో ఉండలేకపోతున్నాం. మాపై కొంతమంది కక్ష గట్టి మంత్రాలు చేస్తున్నారు. ఆదివారం తర్వాత ఊరివిడిచి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాం. మా గుడిసెలకు ఎప్పుడు నిప్పు అంటుకుంటుందోనని భయం..భయంగా బతుకుతున్నాం. – సీత రవి, బాధితుడు అధికారులు పట్టించుకోవడం లేదు గ్రామంలో జరుగుతున్న సంఘటనపై పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాం. ఎవరూ స్పందించలేదు. భయంతో దళితవాడ వణుకుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. – సీత యాదయ్య, మాజీ ఎంపీటీసీ సభ్యుడు -
బ్రహ్మగుండం ..క్షుద్ర నిలయం
–నాడు రవ్వల కొండ.. నేడు పులికుంట –మహిళలు, పిల్లలే టార్గెట్ –కోట్లకు పడగలెత్తిన మంత్రగాళ్లు ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారు కొందరు మంత్రగాళ్లు. మంత్రాలు, అంత్రాలు, క్షుద్రపూజలతో ఏ సమస్యనైనా తీరుస్తామని చెప్పి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల రవ్వలకొండ ప్రాంతంలో గూడూరు చిన్నమద్దమ్మ, ఎర్రకత్వ ప్రాంతంలో ఆమె కూతురు లక్ష్మిల హత్యోదంతం క్షుద్రపూజలతో ముడిపడి ఉన్న నేపథ్యంలో క్షుద్రపూజలపై కథనం.. వెల్దుర్తి రూరల్ : క్షుద్రపూజలు, చేతబడులకు పట్టణ సమీపంలోని బ్రహ్మగుండం ఆలయ పరిసరాలు అడ్డాగా మారాయి. జనసంచారం తక్కువగా ఉండడంతో మంత్రగాళ్లకు పని సులవవుతోంది. బ్రహ్మగుండం పరిసరాలైన రవ్వలకొండలో కొనసాగుతున్న క్షుద్రపూజలు ఆ ప్రాంత రైతులు అభ్యంతరం తెలపడంతో పక్కనే ఉన్న పులికుంట సమీపంలోకి మార్చారు. ఇక్కడ చెట్లు, పాతకోనేరు ఎదురుగా పార్వతీదేవి ఆలయం, పక్కనే నీటి వసతి ఉండడంతో మంత్రగాళ్లకు కలసివస్తోంది. బలహీనతే పెట్టుబడి.. మండలానికి చెందిన ఇద్దరు క్షుద్రపూజలు చేసేవారిలో మొదటి వరుసలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే వీరు కోట్లకు పడగలెత్తినట్లు తెలుస్తోంది. వీరు మొదట తమ గ్రామాల్లోని ఆలయాల వద్ద స్థావరం ఏర్పాటు చేసుకుని తమ పని మొదలెడతారని. వీరి అనుంగు శిష్యలైన ఒక మహిళ, మరొకతను ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. వీరే బాధితులకు ఫలానా పూజలు నిర్వహించాలని, ఇంత మొత్తం ఖర్చువుతుందని నిర్ణయిస్తారని తెలుస్తోంది. గాలి సోకిందని, దయ్యం పూనిందని, చేతబడి జరిగిందని, కుటుంబ కలహాలతో ఇతరులను వశం చేసుకోవడానికని వచ్చిన మహిళలకు మంగళ, ఆదివారం, అమావాస్య రోజుల్లో క్షుద్ర పూజలు చేస్తున్నట్లు సమాచారం. క్షుద్రపూజలు ఇలా.. బాధిత మహిళలు, చిన్నారులను పులికుంటలో(నీరుంటే) లేకపోతే వాటర్ హౌస్ పక్కనున్న గచ్చులో అభ్యంగ స్నానాలు చేయించి తడి బట్టలతో తాము పూజలకు సిద్ధం చేసుకున్న రతి(కుంకుమ, పసుపు, నిమ్మకాయలు వగైరాలతో వేసిన పిండి ముగ్గులు)లో దీపాలు వెలిగించి మధ్యలో కూర్చోబెడతారు. విపరీతమైన శబ్దాలతో దెయ్యం పారదోలుతున్నామంటూ వారిని స్పహ కోల్పేయే వరకు చెర్నకోలాలతో కొడతారు. అనంతరం వారి ఒంటిపై ఉన్న నగానట్రా తీసేసుకుని, వస్త్రాలు, చెప్పులతో సహా వాటిని మంటల్లో కాల్చి కొత్త వస్త్రాలను ధరింపజేస్తారు. జుట్టు, ఒంటిపై ఉన్న వస్త్రాన్ని కత్తిరించి వాటిని చెట్టుకు కడతారు. బలి అంటూ నల్లకోడిని కోసి రక్తం ఒక గిన్నెలో పోసి పూజ ముగిస్తారు. వారితో వచ్చిన వారికి ఇక బాగవుతుందని చెబుతూ కోడి రక్తాన్ని వారి ఇళ్లప్రాంతాలలో చల్లుకోవాలని, కోడి మాంసాన్ని పచ్చిగా ఆరగించమంటారు. క్షుద్ర పూజల తర్వాత కూడా మళ్లీ వస్తే పెద్ద పూజలు చేయాలని ఇందుకు రూ.లక్షల్లో ఖర్చవుతుందని వారిని వెళ్లగొడతారు. వీరి వద్దకు కర్నూలు జిల్లా నుండే కాక అనంతపురం, కడప, హైదరాబాద్‌లతో పాటు కర్ణాటక నుంచి కూడా మానసిక రోగస్తులు వస్తూండడం కొసమెరుపు. మచ్చుకు కొన్ని.. ––Ðð ల్దుర్తికి చెందిన ఓ వ్యక్తి కోడలికి గాలిసోకిందని మంత్రగాళ్ల దగ్గరకు వెళ్లగా ఆమె వారి చేతుల్లో నరకయాతన పొంది మరణించినట్లు తెలిసింది. –– క్షుద్ర పూజల సందర్భంగా మంత్రగాళ్లు సష్టించిన భయానక వాతావరణంతో హైదరాబాద్ వాసి గుండెపగిలి ఒకరు మరణించగా అమ్మవారు నరబలి తీసుకుందని, కుటుంబ సభ్యులకు సైతం మరణం ఉందని భయపెట్టి బంగారు, లక్షల్లో పైకం వసూలు చేసినట్లు సమాచారం. –– రామళ్లకోట వాసులైన తల్లీకూతుళ్లు పాతకోనేరులో పడి మతి చెందిన ఘటన క్షుద్రపూజల కోణంలోనే జరిగినట్లు తెలిసింది. ––రామళ్లకోటలో ఐరన్ అక్రమ తవ్వకాలతో కోట్లకు పడగలెత్తిన ఓ వ్యక్తి గ్రామంలో తిరుగుతున్న మానసిక వ్యాధిగ్రస్తుడైన యువకుడిని బలిచ్చి విషయం పొక్కకుండా వారి కుటుంబానికి డబ్బులిచ్చినట్లు సమాచార ం. -
ముండకోపనిషత్తు ప్రాణస్వరూపం పరమాత్మే!
భారతీయ వేదాంతానికి మణిదీపాల వంటి మంత్రాలు తృతీయ ముండకంలో ఉన్నాయి. ఒక చెట్టు మీద స్నేహంతో కలసి వుండే రెండు పక్షులు ఉన్నాయి. వాటిలో ఒకటి ఆ పిప్పలి చెట్టు పళ్లు తింటోంది. మరొక పక్షి ఏమీ తిన కుండా చూస్తూ కూర్చుంది. మొత్తం వేదాంతం రెండు పక్షుల రూపంలో సూక్ష్మంగా చెప్పబడింది. ఒక పక్షి జీవాత్మ. అది ఐహిక దృష్టితో దైవచింతన లేని మోహంతో దుఃఖిస్తోంది. దాని పక్కనే అదే చెట్టు మీద ఉన్న రెండోపక్షి పరమాత్మ. మహిమాన్వితమైన పరమాత్మను చూస్తూ జీవాత్మ దుః ఖాన్ని పోగొట్టుకుంటోంది. పరమాత్మను దర్శించిన విద్వాంసుడు పాపపుణ్యాలకు అతీతుడై అతణ్ణి చేరుకుంటున్నాడు. అన్ని ప్రాణులలోని ప్రాణస్వరూపం పరమాత్మే. దీనిని తెలుసుకున్నవాడు పండితుడై మౌనంగా ఉంటున్నాడు. నిరంతరం ఆత్మతత్త్వంలో క్రీడిస్తూ, ఆనందిస్తూ క్రియాశీలియై బ్రహ్మవేత్తలతో శ్రేష్ఠుడు అవుతున్నాడు. శౌనకా! సత్యం, తపస్సు, సమ్యక్ జ్ఞానం, బ్రహ్మచర్యంతో ఆత్మను తెలుసుకోవచ్చు. దోషరహితులైన యోగులు శుభ్రమూ, జ్యోతిర్మయమూ అయిన పరమాత్మను శరీరంలోనే చూడగలుగుతారు. సత్యమే జయిస్తుంది. అసత్యం గెలవదు. సత్యంతోనే దేవయానమార్గం ఏర్పడుతోంది. ఋషులు, కోరికలను జయించిన సత్పురుషులు ఈ మార్గం ద్వారానే పరమపథానికి చేరుకుంటున్నారు. ఆ పరబ్రహ్మం దివ్యకాంతితో ఊహకు అందని రూపంతో సూక్ష్మాతి సూక్ష్మంగా, దూరాతిదూరంగా ఉంటుంది. హృదయగుహలో దాగిన ఆ పరబ్రహ్మాన్ని యోగులు తమలోనే చూడగలరు. దానిని కళ్లతో చూడలేరు. వాక్కుతో వర్ణించలేరు. ఇంద్రియాలతో, తపస్సుతో, యజ్ఞయాగాది కర్మలతో గ్రహించలేరు. జ్ఞానంతో పరిశుద్ధుడై ధ్యానించేవాడు నిరాకారమైన పరబ్రహ్మను చూడగలుగుతాడు. అదే ఆత్మ సాక్షాత్కారం. పంచప్రాణాలతో ఉన్న శరీరంలో అణురూపంలో ఉన్న ఆత్మను మనసుతో తెలుసుకోవచ్చు. మానవుల మనస్సును ఇంద్రియాలు గట్టిగా చుట్టుకొని ఉన్నాయి. నిగ్రహంలో ఇంద్రియాలనుండి మనస్సును వేరు చేస్తే స్వచ్ఛమైన మనస్సులోని ఆత్మ సాక్షాత్కరిస్తుంది. పరిశుద్ధ మనస్కుడైన ఆత్మజ్ఞాని ఏ లోకాలను కోరుకుంటే ఆ లోకాలను పొందుతాడు. కోరికలన్నీ నెరవేరతాయి. కనుక ఆధ్యాత్మిక సంపద కోరుకునేవారు ఆత్మజ్ఞానం కలిగిన మహాత్ములను ఆశ్రయించి, అర్చించాలి. ద్వితీయ ఖండం శౌనకా! ఆత్మజ్ఞాని మాత్రమే దివ్యమూ, కాంతిమంతమూ, విశ్వద్యాప్తమూ అయిన పరంధామాన్ని తెలుసుకుంటాడు. అటువంటి బ్రహ్మజ్ఞుడైన గురువును ఏ కోరికా లేకుండా ఉపాసించినవారు జనన మరణ చక్రం నుండి బయటపడతారు. ఇంద్రాయసుఖాలకోసం ఆరాటపడేవారు ఆ కోరికలు తీరేవారికి మళ్లీమళ్లీ పుడతారు. ఆత్మజ్ఞానంతో కోరికలను ఆత్మలో లీనం చేసినవారి కోరికలు నశించిపోతాయి. నాయమాత్మా ప్రవచనేన లభ్యో న మేధయా న బహుదా శ్రుతేన ఊకదంపుడు ఉపన్యాసాలతో, మేధాశక్తితో, శాస్త్రాధ్యయనంతో ఆత్మజ్ఞానం కలగదు. ఎవరు ఆత్మసాక్షాత్కారాన్ని సంపూర్ణంగా కోరుకుంటారో వారికి ఆత్మదర్శనం అవుతుంది. తన స్వరూపాన్ని ఆత్మ స్వయంగా వివరిస్తుంది. దృఢసంకల్పం లేకుండా అజాగ్రత్తగా, మిడిమిడి జ్ఞానంతో తపస్సు చేసే వారికి ఆత్మజ్ఞానం కలగదు. మనోబలం, శ్రద్ధ, ఆత్మజిజ్ఞాస సంపూర్ణంగా సాధన చేసే వాని ఆత్మ మాత్రమే పరబ్రహ్మలో లీన మౌతుంది. ఆత్మదర్శనాన్ని పొందిన ఋషులు జ్ఞానతప్తులై రాగద్వేషాలు లేనివారు, ప్రశాంత చిత్తులు, పరమాత్మ స్వరూపులు అవుతారు. అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మను అన్ని చోట్లా దర్శించగల ధీరులు, ప్రాజ్ఞులై అన్నిటిలో ప్రవేశించగలుగుతారు. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్న్యాసయోగార్యతయః శుద్ధ సత్త్వాః తే బ్రహ్మ లోకేషు పరాంతకాలే పరామృతాఃపరిముచ్చంతి ధీరాః సన్న్యాసులు ఎక్కడ కనపడినా నమస్కరించాలి. వెంటనే ఈ మంత్రాన్ని చదవటం సంప్రదాయం. భారతీయ వేదాంతానికి, ముండకోపనిషత్తుకు ఇది ప్రాణం లాంటిది. వేదాంత విజ్ఞానాన్ని స్పష్టంగా తెలుసుకున్నవారు యతులై, శుద్ధసత్త్వులై సన్న్యాసయోగాన్ని పొందుతారు. బ్రహ్మలోకానికి చేరి మోక్షాన్ని పొందుతారు. అప్పుడు వారి పదిహేను కళలు వాటి స్థానాలకు చేరుకుంటాయి. ఇంద్రియాలు పంచభూతాలలో కలిసిపోతాయి. కర్మలు, జీవాత్మ పరబ్రహ్మలో లీనమైపోతాయి. బ్రహ్మజ్ఞానం వల్ల శోకం, పాపాలు నశిస్తాయి. హృదయంలోని ముడులు విడిపోతాయి. విముక్తుడైనవాడు అమృతత్త్వాన్ని పొందుతాడు. శౌనకా! శ్రద్ధగా కర్మలు చేసేవారు, వేదాధ్యయనం చేసేవారు, శ్రోత్రియులు, బ్రహ్మనిష్ఠులు, ‘ఏకర్షి’ అయిన అగ్నికి ఆహుతులు ఇచ్చేవారు, యధావిధిగా ‘శిరోవ్రతాన్ని’ ఆచరించేవారు మాత్రమే ఈ బ్రహ్మవిద్య వినడానికి అర్హులు. అటువంటివారికే ఉపదేశించాలి. ఇది సత్యం. దీనిని పూర్వం అంగిరసుడు తన శిష్యులకు నియమబద్ధంగా చెప్పాడు. వ్రతాచరణ లేనివాడు ఈ ముండకోపనిషత్తును వినకూడదు. నమః పరమ ఋషిభ్యోన్నమః పరమ ఋషిభ్యః - డా.పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ వేరువేరు పేర్లు గల నగరాలు సముద్రంలో కలిసి పేర్లను, ఆకారాలను కోల్పోతున్నట్లు విద్వాంసుడు తాను నామరూపాలనుండి విముక్తుడై పరాత్పరుడైన పరబ్రహ్మాన్ని చేరుకుంటున్నాడు. పరబ్రహ్మ తత్వం తెలిసినవాడు పరబ్రహ్మ అవుతాడు. అతని వంశంలో బ్రహ్మజ్ఞానం కలిగిన వారే పుడతారు. -
అబ్రకదబ్ర
హిప్నో క్వీన్ ఓం హ్రీం... హ్రీం ఓం... అంటే చాలు... మంత్రాలకు వశమైన స్థితిలో మనిషి కొండల్ని పిండి చేసేస్తాడు. కోతిని చూసీ వణికిపోతాడు. మంత్రగాడు కోరితే మహా బలుడైపోతాడు, మంత్రగాడు ఆదేశిస్తే మహా భయస్థుడూ అయిపోతాడు. ఏమిటీ వింత అంటే... అంతా మన మైండ్ చేసే మాయాజాలమే అంటున్నారు తొలి టీనేజ్ హిప్నాటిస్ట్ సరోజారాయ్. ‘‘మంత్ర తంత్రాలేమీ ఉండవు. మనలో ఉన్న అంతర్గత శక్తుల్ని మేల్కొలిపితే ఏమైనా చేయగలం. ‘నేనింతే చేయగలను. ఇంతే ఆలోచించగలను’ అని మనల్ని మనం ట్యూన్ చేసుకోవడం వల్ల మైండ్ ఆ విధంగా సెట్ అయిపోయి, సాధారణ పనులతోనే సరిపెట్టుకుంటున్నాం. అంత మాత్రాన మనలోని అసాధారణ శక్తియుక్తులు నిర్వీర్యమైపోవు. నిద్రాణంగా ఉంటాయంతే. వాటిని మేల్కొలపడంలో హిప్నాటిజం గొప్ప సాధనం’’ అంటున్న సరోజారాయ్... దీనితో మూఢనమ్మకాలను తొలగించడంతో పాటు వ్యాధుల్ని నయం చేయవచ్చునంటోంది. హిప్నో షోస్ నిర్వహించే తొలి టీనేజి మహిళా హిప్నాటిస్ట్ ఘనత దక్కించుకున్న సరోజారాయ్... ప్రస్తుతం హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో నివసిస్తోంది. చిన్న వయసులోనే హిప్నాటిస్ట్‌గా ఎన్నో అవార్డులు రివార్డులు గెలుచుకుంది. హిప్నోని ఇంటిపేరుగా మార్చుకున్న తండ్రి కమలాకర్, తల్లి పద్మా కమలాకర్ల బాటలో మహిళలు అరుదుగా మాత్రమే ఎంచుకునే వృత్తిని ఎంచుకున్న సరోజారాయ్ (18) సాక్షి ఫ్యామిలితో పంచుకున్న విషయాలు ఆమె మాటల్లోనే.... సామాజిక అవసరం గుర్తించి... మూడేళ్ల పిన్న వయసులోనే మ్యాజిక్ షోస్ చేసిన అనుభవం ఉంది. పెద్దయ్యాక ఆటోమొబైల్ ఇంజనీర్ని అవుదామనుకున్నాను. అయితే చిన్నప్పటి నుంచి అమ్మానాన్నల ప్రొఫెషన్‌ను గమనించడం, ఆ ప్రొఫెషన్ అవసరం సమాజానికి అంతకంతకూ పెరుగుతోందని గుర్తించడం నన్ను కూడా ఇదే రంగాన్ని ఎంచుకునేందుకు ప్రేరేపించాయి. జనానికి చేరువ చేయాలని... సినిమాల కారణంగా హిప్నాటిస్ట్‌లు అంటే జనంలో ముఖ్యంగా మహిళల్లో ఒక రకమైన వ్యతిరేక అభిప్రాయం ఏర్పడిపోయింది. కేవలం నాలుగ్గోడల మధ్య ప్రాక్టీస్‌కే పరిమితం కాకుండా ప్రజల్లో ఉన్న దురభిప్రాయాన్ని తొలగించి, వారికి దీని వల్ల కలిగే ప్రయోజనాలు వివరించాలని ప్రదర్శనలకు శ్రీకారం చుట్టాను. అంతేకాకుండా దొంగ బాబాలు, నకిలీ స్వామిజీలు చేసే చిన్న చిన్న మాయల వలలో పడకుండా జనాన్ని చైతన్యవంతుల్ని చేయడం కూడా ప్రదర్శనలకు మరో కారణం. నాకు మేజిక్‌లో సైతం ప్రవేశం ఉంది కాబట్టి... ఈరెండిటినీ మేళవించి మరింత ప్రభావవంతంగా ప్రదర్శనలు ఇవ్వగలుగుతున్నా. ప్రజల్లో శాస్త్రీయ పరమైన అవగాహన పెరిగితే ఎన్నో రకాల సమస్యలు దూరమవుతాయని నా నమ్మకం’’ అంటూ ముగించింది సరోజారాయ్. వందల, వేల మంది ఎదురుగా అపరిచితుడైన ఒక వ్యక్తి మైండ్‌ని మన అధీనంలోకి వచ్చేలా చేసే స్టేజ్ హిప్నాటిజం అతి క్లిష్టమైన ప్రక్రియ. ‘‘ఛాలెంజ్ కాబట్టే ఇది ఎంచుకున్నాను’’అంటూ ఆత్మవిశ్వాసంతో చెప్పే సరోజారాయ్ స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తూ సామాజిక సేవా కార్యక్రమాలకు నిధుల సేకరణ నిమిత్తం ప్రదర్శనలు ఇవ్వడంలో ముందుంటోంది. హిప్నోధెరపిస్ట్గా మరెన్నో ఘనవిజయాలు సాధించే లక్ష్యంతో ముందడుగేస్తోంది. - ఎస్.సత్యబాబు -
మంత్రంతో ముప్పులు
పలమనేరు మండలంలోని ఓ మహిళకు కాళ్లు చేతులు చచ్చుపడ్డాయి. గాలి సోకిందని ఆమె కుటుంబ సభ్యులు ఆమెకు పొరుగునే ఉన్న తమిళనాడు నుంచి మంత్రగత్తెను తీసుకువచ్చి, మంత్రం వేయించారు. అయినా ఆమెకు రోగం బాగు కాలే దు. దీంతో ఆమెకు ఆ వ్యాధి మరింత ముదిరిపోయి ఇబ్బందులు పడుతోంది.బెరైడ్డిపల్లె మండలంలోని ఓ గ్రామానికి చెందిన మరో మహిళ అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెకు దెయ్యం పట్టిందని మంత్రగాడిని పిలుచుకుని వచ్చి, మంత్రం వేయించారు. అయినా ఆమె ఆరోగ్యం కుదుట పడకపోగా మరింత ఎక్కువైంది. - రోగాలను మరింత ముదిరించుకుంటున్నారు! - మూఢ నమ్మకాలతో ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్న గ్రామీణులు - పలమనేరు నియోజకవర్గంలో అటవీ శివారు గ్రామాల తీరిదీ! పలమనేరు: నేటి స్మార్ట్ సమాజంలోనూ అటవీ శివారు గ్రామాల ప్రజలు మంత్రాలు, తంత్రాలను నమ్ముతూనే ఉన్నారు. ఇప్పటికీ భూతవైద్యులు, మంత్రగాళ్ల హవా కొనసాగుతూనే ఉంది. చదువుకున్న వారు సైతం ఈ అపోహలబారిన పడడం మరీ విడ్డూరంగా ఉంది. ఎవరికైనా జబ్బు చేస్తే రోగాన్ని గుర్తించడానికి వైద్యులు పరీక్షలు చేస్తారు. ఆపై అవసరమైన చికిత్సనందిస్తారు. కాని ఇవేవీ లేకుండా పలమనేరు ప్రాంతంలోని పలు అటవీ ప్రాంత గ్రామస్తులు గురి అనే మూఢనమ్మకాన్నే నమ్ముతూ రోగుల ప్రాణాలను చేజేతులారా తీసుకుంటున్నారు. రోగాలకు మందులు మంత్రాలు, తాయత్తులే.... ఎటువంటి రోగానికైనా మంత్రాలు, తాయత్తులనే నమ్మి ఉన్న రోగం కాస్త ముదిరి ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. పలమనేరు మండలంలోని ఓ యువతికి ఫిట్స్ వచ్చాయి. దీంతో ఆమె కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లకుండా ఆ బాలికకు గాలి(దెయ్యం) సోకిందని భావించారు. అంతే తమ బంధువుల సాయంతో తమిళనాడు రాష్ట్రంలోని గుడియాత్తం సమీపంలోని సేంగడ్రం గ్రామానికి చెందిన తిరుమణి(55) అనే మంత్రగత్తెను తీసుకువచ్చారు. మంత్రగత్తెకు పూవాడికాడ అనే దేవత ఆవహించి ఆ యువతికి కాళ్లు, చేతులు రాకపోవడానికి చెడుపు జరిగిందని తేల్చేసింది. దీన్ని నయం చేయాలంటే ప్రత్యేక పూజలు చేసి తాయత్తు కట్టాలని, వారికి తెలిపింది. ఇందుకు దాదాపు రూ.5 వేలు వరకు ఖర్చు అవుతుందని 51 వస్తువులు జాబితాను వారికి ఇచ్చింది. దీంతో వారు అవి తీసుకువచ్చి గురి పెట్టించి, మంత్రగత్తెకు రూ.1116 దక్షిణగా చెల్లించారు. అయితే ఆమెకు రోగం మరింత ముదిరింది. బయ్యప్పగారిపల్లెలోనూ ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది. కొంపముంచుతున్న నిరక్షరాస్యత నియోజకవర్గంలోని పలు అటవీ ప్రాంత గ్రామాల్లో అధికశాతం మంది నిరక్షరాస్యులు. గిరిజనులు ఎక్కువగా ఉన్న ఈ గ్రామాల్లో అమాయకత్వం రాజ్యమేలుతోంది. ఇదే మంత్రగాళ్ల పాలిట వరంగా మారింది. అక్షరాస్యత పెరిగితే అమాకత్వం పోయి, చైతన్యం వచ్చే అవకాశం ఉంది. మంత్రాల మాయలో పడొద్దు.. మంత్రాలు, తాయత్తులతో రోగాలు అసలు నయం కావు. ఇదంతా కేవలం మనోజనిత శారీరక రుగ్మతలే. ముఖ్యంగా ఆత్మనూన్యతాపరులు, హిస్టీరియాతో బాధపడేవారు, మ్యానియా, సైకో సెక్సువల్స్ ఇలాంటి వాటిని ఎక్కువగా నమ్ముతుంటారు. మంత్ర, తంత్రాలతో ఏదో జరుగుతందనే భ్రమ పడి వాటిని నమ్మి, ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. -సుధాకర్‌రెడ్డి. సైకాలజిస్టు -
మంత్రాలు చేస్తున్నారని చితకబాదారు
మెదక్ (తూప్రాన్) : మంత్రాలు చేస్తున్నారంటూ ఇద్దరు వ్యక్తులను గ్రామస్తులు చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కోనాయిపల్లి (పీటీ)లో శుక్రవారం జరిగింది. కొన్నేళ్లుగా గ్రామంలో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు యువకులు అకాలంగా మృతి చెందారు. అయితే గ్రామానికి చెందిన కుమ్మరి సత్తయ్య (55), మన్నే యాదగిరి (30)లు మంత్రాలు చేయడం వల్లే వీరు చనిపోయారన్న అనుమానం గ్రామస్తుల్లో ఉంది. ఈ నేపథ్యంలో వీరు ఇరువురు శుక్రవారం ఉదయం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లడాన్ని గ్రామస్తులు గమనించి వారిని వెంబడించారు. ఆ ఇద్దరూ.. చెట్ల పొదల్లో నగ్నంగా మంత్రాలు ఉచ్ఛరించడాన్ని గమనించిన గ్రామస్తులు వారిని పట్టుకుని అక్కడే చితకబాదారు. అక్కడి నుంచి వారిని గ్రామంలోకి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న సర ్పంచ్ ప్రభాకర్‌రెడ్డి అక్కడి చేరుకుని ఆ ఇద్దరి గ్రామస్తుల బారి నుంచి విడిపించి పంచాయతీ కార్యాలయంలో ఉంచి తాళం వేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకోవడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టి సత్తయ్య, యాదగిరిలను జీపులోకి ఎక్కించారు.పోలీసులు వైఖరిని నిరసిస్తూ గ్రామస్తులు జీపునకు అడ్డంగా పడుకున్నారు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. అయితే గ్రామ సర్పంచ్ ప్రభాకర్‌రెడ్డి, ఎస్ఐ సంతోష్‌కుమార్ గ్రామస్తులకు నచ్చజెప్పి అటవీ ప్రాంతంలో మంత్రాలు చేస్తున్న ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాని అక్కడ ఎలాంటి ఆధారాలు లభించలేదు. అయితే గ్రామస్తుల ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. -
మంత్రాల నెపంతో ఇద్దరు అరెస్ట్
మెదక్: మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని కోనేయిపల్లి(పీటీ) గ్రామంలో మంత్రాలతో పిల్లల ప్రాణాలను తీస్తున్నారనే అనుమానంతో ఇద్దరిని గ్రామస్తులు గ్రామపంచాయతీ ఆఫీసులో బంధించారు. వివరాలు...కుమ్మరి సత్తయ్య, మల్లె యాదగిరి అనే ఇద్దరు గ్రామానికి దగ్గరలోని అడవిలో నగ్నంగా నిలబడి మంత్రాలు ఉచ్ఛరిస్తుండగా అదే గ్రామానికి చెందిన కొంతమంది వారిని గుర్తించారు. దీంతో వారిని పట్టుకుని చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు కోనేయిపల్లి గ్రామానికి చేరుకుని ఆ ఇద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకొని, కోనేయపల్లిలోనే వారిని చంపేయాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలతో మరికొంత మంది పోలీసు బలగాలు అక్కడికి చేరుకుని వారిద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. (తూప్రాన్) -
సన్మార్గం: జీవిత యజ్ఞంతో... జన్మ సార్థకం
మనం యజ్ఞం అనే పదాన్ని తరచు వింటుంటాం. అయితే అసలు యజ్ఞం అంటే ఏమిటి? ఎన్ని రకాలు, ఏ యజ్ఞాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. కేవలం మంత్రాలు చదువుతూ అగ్నికి ఆహుతులు సమర్పించడమే యజ్ఞం అనుకుంటే పొరపాటే. ఒక నిర్ణీతమైన, నిర్దుష్టమైన, ఉన్నతమైన ఆశయాన్ని సాధించడం కోసం ఒక దృఢమైన, దివ్యమైన సంకల్పంతో శరీరాన్ని, మనస్సును, ఆత్మను పవిత్రంగా ఉంచుకుని దీక్షగా, ఏకోన్ముఖంగా జరిపించే కార్యక్రమమే యజ్ఞమని విజ్ఞులు చెబుతారు. అదేవిధంగా వేదవిహితమైన సంప్రదాయబద్ధమైన శుభకార్యాలన్నీ యజ్ఞాలేనని భగవద్గీత చెబుతోంది. వీటితోబాటు ఈ చరాచర సృష్టిపట్ల, భగవదత్తమైన జీవితాన్ని ప్రసాదించిన వారిపట్ల కృతజ్ఞతను ప్రకటించడమే యజ్ఞమని మరో నిర్వచనమూ ఉంది. కృతజ్ఞతాప్రకటన, నిస్వార్థ త్యాగం, నిస్వార్థ భావప్రకటనలు కూడా యజ్ఞమనే పదానికి అర్థాలుగా చెప్పబడుతున్నాయి. పండితులు యజ్ఞాలను ఐదువిధాలుగా విభజించారు. అవి దేవయజ్ఞం, పితృయజ్ఞం, రుషియజ్ఞం, మనుష్యయజ్ఞం, భూతయజ్ఞం అంటూ నామకరణం చేశారు. ఈ ఐదు యజ్ఞాలనూ ప్రతి ఒక్కరూ చేసి తీరాలని భారతీయ సంస్కృతి నొక్కి చెబుతోంది. యజ్ఞం చేయగా, పదిమందికి పంచి పెట్టగా మిగిలిన యజ్ఞశేషాన్ని మాత్రమే భుజించాలని పంచయజ్ఞ సిద్ధాంతం చెబుతోంది. యజ్ఞం చేయగా మిగిలిన ప్రసాదాన్ని అమృతం అంటారు. అలా కానిది విషతుల్యమే అవుతుంది. మొట్టమొదటిది దైవయజ్ఞం: ప్రకృతి శక్తుల్ని నిర్వహించే అద్భుతమైన చైతన్యాన్ని దైవం అనుకుంటే... ఆ విశ్వ నిర్వహణా శక్తినే దైవశక్తి అని, వాటికి కృతజ్ఞత ప్రకటించే విధానమే దైవయజ్ఞమనీ అంటారు. ప్రకృతిలోని పంచభూతాలను పంచదైవాలుగా గుర్తించి అటువంటి శక్తులన్నీ దేహంలో కూడా ఉన్నాయని పెద్దలు విశ్లేషించారు. వాటిని ఆరాధించే తత్వమే దైవయజ్ఞమనీ, మనకు లభించిన పాంచభౌతికమైన ఈ జన్మ దైవదత్తమైనది కనుక, ప్రాణశక్తిని మూలశక్తిగా ఆరాధించి, దైవశక్తిగా పూజించి, అహంకారాన్ని త్యజించమని దైవయజ్ఞ సిద్ధాంతం చెబుతుంది. రెండవది పితృయజ్ఞం: మాతృదేవోభవ, పితృదేవోభవ అంటూ ఇలపై వెలసిన ఇద్దరుదైవాలుగా జన్మనిచ్చిన కన్నతల్లిదండ్రులను గుర్తించమని ఈ యజ్ఞభావన చెబుతుంది. తల్లిదండ్రులపై ఆదరం ప్రకటించమని, ప్రేమాభిమానాలను ప్రదర్శించమని, వారిపట్ల కృతజ్ఞతాభావాన్ని ప్రకటించడమే విధ్యుక్తధర్మంగా భావించమని పితృయజ్ఞం ఆదేశిస్తుంది. ఈ యజ్ఞ నిర్వహణ వలన కుటుంబ వ్యవస్థ, తద్వారా చక్కటి సమాజ వ్యవస్థ సాధ్యపడుతుంది. మూడవది రుషియజ్ఞం: మనిషిని మనిషిగా తీర్దిదిద్ది, సంస్కార జ్ఞానాలను ప్రసాదించి, విజ్ఞానభిక్ష పెట్టిన మేధావులు మన రుషులు. మానవులు పశువులుగా జీవించకుండా తమ బోధనల ద్వారా ప్రవర్తనా నియమావళిని, వివాహ వ్యవస్థను, కుటుంబ వ్యవస్థను, సంస్కారవంతమైన నాగరిక జీవన శైలిని, సమాజాన్ని ఏర్పరచింది రుషులే. సనాతన సంప్రదాయాలకు రూపకల్పన చేసి, పథనిర్దేశం చూపి, దిశానిర్దేశం చేసిన మహానుభావులు మన రుషులు. వారిపట్ల కృతజ్ఞతను ప్రకటించడమే రుషి యజ్ఞం. మంచి గ్రంథపఠన చేయడం, మంచి అలవాట్లను అభ్యాసం చేసుకోవడం, జ్ఞానసముపార్జన చేయడం, అలా సముపార్జించిన జ్ఞానాన్ని పదిమందికీ పంచిపెట్టమని రుషి యజ్ఞం చెబుతుంది. నాలుగవది మనుష్య యజ్ఞం: సమాజంలో ఎందరి సహాయసహకారాలతోనో, సామరస్య భావనలతోనో మాత్రమే మన మనుగడ సాధ్యమవుతుంది. అందుకే మనుష్య యజ్ఞంలో భాగంగా మానవసేవ మాధవసేవ అయింది. అతిథి దేవుడయ్యాడు. అతిథిదేవోభవ అయింది. పక్కనున్న వారికి సాయమందించి, దానధర్మాలు చేయడం ద్వారా దరిద్ర నారాయణుల సేవద్వారా మాత్రమే ఈ మనుష్య యజ్ఞం సాధ్యమవుతుంది. ఐదవది...భూతయజ్ఞం: మనతోబాటు మన చుట్టూ బతుకుతున్న ఎన్నో ప్రాణులు మన జీవన విధానానికి ఆధారం కల్పిస్తున్నాయని, వాటి ఉనికిని గుర్తించి, వాటితోబాటు మనకున్న బంధాన్ని, అనుబంధాన్ని వ్యక్తీకరించడమే భూతయజ్ఞం అవుతుంది. వృక్షాలను పెంచి పోషిస్తూ, పచ్చని ప్రకృతిని, పర్యావరణాన్ని స్థాపించడంలోనూ, జంతువులకు కూడా ఆహారాన్ని సమకూర్చి, వాటికి రక్షణ కల్పిస్తూ ఆదుకునేందుకు, జీవన సమతుల్యాన్ని సాధించడంలో ఈ భూతయజ్ఞం సాయపడుతుంది. జీవితాన్నే ఒక పవిత్రమైన యజ్ఞమనుకుంటే... మన జీవిత కాలమంతా యజ్ఞసమయమే! అన్నయజ్ఞంతో ఆరంభించిన దైనందిన జీవితం ప్రకృతిలోనే పరమాత్మను దర్శించే దైవయజ్ఞాన్ని, మాతాపితరుల సేవ చేసే పితృయజ్ఞాన్ని, సనాతన సంస్కృతీ సంప్రదాయాలకు అనుగుణంగా జీవితాన్ని మలుచుకునే రుషి యజ్ఞాన్ని, తోటి మనుషులకు సహాయ సహకారాలనందిస్తూ, సానుభూతిని ప్రదర్శించే మనుష్య యజ్ఞాన్ని, ప్రకృతి సమతుల్యాన్ని సాధిస్తూ అహింసా సిద్ధాంతాన్ని పాటిస్తూ, మరెన్నో జీవులకు ఆశ్రయం, ఆధారం కల్పిస్తూ భూతయజ్ఞాన్ని నిర్వహించగలిగితే.... జన్మ సార్థకమైనట్లే! - సూర్యప్రసాదరావు పండితులు యజ్ఞాలను ఐదువిధాలుగా విభజించారు. అవి దేవయజ్ఞం, పితృయజ్ఞం, రుషియజ్ఞం, మనుష్యయజ్ఞం, భూతయజ్ఞం అంటూ నామకరణం చేశారు. ఈ ఐదు యజ్ఞాలనూ ప్రతి ఒక్కరూ చేసి తీరాలని భారతీయ సంస్కృతి నొక్కి చెబుతోంది. యజ్ఞం చేయగా, పదిమందికి పంచి పెట్టగా మిగిలిన యజ్ఞశేషాన్ని మాత్రమే భుజించాలని పంచయజ్ఞ సిద్ధాంతం చెబుతోంది.