ఓం శాంతిః శాంతిః శాంతిః | Powerful Mantras To Calm Your Mind | Sakshi
Sakshi News home page

ఓం శాంతిః శాంతిః శాంతిః

Published Mon, Aug 21 2023 12:28 AM | Last Updated on Mon, Aug 21 2023 12:28 AM

Powerful Mantras To Calm Your Mind - Sakshi

మీరు ఎన్నిక్రతువులు చేయండి, ఎన్ని పూజలు చేయండి, యజ్ఞాలు చేయండి... చివరకు మీరు కోరుకునేది ఏది... కేవలం ప్రశాంతత. నేను రాజభవనంలో ఉన్నా, నేనెంత అందగాడినయినా, ఎంత విద్వాంసుడినయినా, ఎంత ఐశ్వర్యం ఉన్నా... మనసు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు, తీవ్ర అశాంతితో ఉన్నప్పుడు ఇవేవీ మీకు శాంతినివ్వలేవు. 

ఒక పచ్చటి చెట్టు, రంగురంగుల పూలతో, కాయలతో, పళ్ళతో ఉన్నప్పటికీ తొర్రలో అగ్నిహోత్రం ఉన్నప్పుడు అది లోపల.. లోపల ఎంత దహించుకు పోతుంటుందో... మనసులో అశాంతి ఉన్న వ్యక్తికూడా అలాగే బాధపడుతూ ఉంటాడు. అందుకే శాంతి కావాలి. మన  సంప్రదాయం మనకు ఒక శాంతి మంత్రాన్నే ఇచ్చింది...ఓం శాంతిః శాంతిః శాంతిః


ఇది కేవలం ప్రాణులు మాత్రమే కాదు, అంతరిక్షం శాంతి పొందాలి, పృథివి శాంతి పొందాలి, వాయువు శాంతిపొందాలి. జలం శాంతి పొందాలి. ఏదీ కూడా వ్యగ్రతను పొందకూడదు. భూమికి అచల అని పేరు. అంటే కదలనిది..అని. భూమికి కోపం వచ్చి తన కట్టుతప్పి కదిలిందనుకోండి.. ఎంత ప్రాణ నష్టం? ఎంత ఆస్తి నష్టం ? అందుకే భూమి ప్రశాంతంగా ఉండాలి. వాయుః శాంతిః వాయువు తన కట్టుతప్పి తీవ్రతను చూపిందనుకోండి.. ప్రభంజనం అంటాం. అన్నీ నేలకొరుగుతాయి.

అదే వాయువు తాను ఉండాల్సిన కట్టుబాటులో ఉంటే... వాయుః ప్రాణః, సుఖం వాయుః. అప్పుడు ప్రాణమూ వాయువే, సుఖమూ వాయువే. చల్లగాలి చక్కగా వీస్తుందనుకోండి. సుఖంగా అనిపిస్తుంది. ఏ ఇబ్బందీ లేకుండా ఊపిరిని ఒకే వేగంతో తీసి, ఒకే వేగంతో విడిచిపెడుతూ ఉన్నప్పుడు.. అంతకన్నా ఆయుర్దాయం మరేముంది! వాయువు ఎంతకాలం శరీరంలో తిరుగుతూ ఉంటుందో అంతకాలమే సంధిబంధాలు.. కాళ్ళు, చేతులు, మణికట్టు అన్నీ వంగుతాయి. అది ప్రసరించనప్పుడు శరీరం ఒక కర్రయిపోతుంది. అందుచేత వాయువు అత్యంత ప్రధానమైనది. దాని చేత ప్రాణులన్నీ చలనశీలంగా ఉంటాయి.

వడిబాయక తిరితే ప్రాణబంధుడా !.. అంటారు అన్నమాచార్యులవారు. ఒకే వేగంతో ఊపిరిని శరీరం లోపలికి, బయటికి పంపుతున్నాడే..ఆయనే వేంకటేశ్వరుడు. ఇక అంతకన్నా నాకు దగ్గరగా ఎవరున్నార్రా!!! అని అడిగాడు. వడిబాయక తిరిగే ప్రాణబంధుడా.. అని పిలిచాడు ఆయన వేంకటేశ్వరుడిని. అదే.. వాయుఃప్రాణః సుఖం వాయుః. ఊపిరిని తీసి విడిచి పెడుతున్న శరీరం ఆచంద్రార్కం.. శాశ్వతంగా ఉండదు. పడిపోతుంది. ఇప్పుడు వాయువుకున్న గొప్పదనం ఏమిటంటే.. అదే వాక్కుగా మారుతుంది. ఆ వాయువు చేత ప్రాణాలను నిలబెట్టుకున్నవాడు వాటిని సార్ధక్యం చేసుకున్నప్పుడు  శరీరం పడిపోయినా ఆ వ్యక్తి.. కాలంలో శతాబ్దాలు నిలబడిపోతాడు.. ఎలా! అది వాక్కుగా మారినందువల్ల...!
 
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement