మంత్రాలు చేస్తున్నారని చితకబాదారు
మెదక్ (తూప్రాన్) : మంత్రాలు చేస్తున్నారంటూ ఇద్దరు వ్యక్తులను గ్రామస్తులు చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కోనాయిపల్లి (పీటీ)లో శుక్రవారం జరిగింది. కొన్నేళ్లుగా గ్రామంలో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు యువకులు అకాలంగా మృతి చెందారు. అయితే గ్రామానికి చెందిన కుమ్మరి సత్తయ్య (55), మన్నే యాదగిరి (30)లు మంత్రాలు చేయడం వల్లే వీరు చనిపోయారన్న అనుమానం గ్రామస్తుల్లో ఉంది. ఈ నేపథ్యంలో వీరు ఇరువురు శుక్రవారం ఉదయం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లడాన్ని గ్రామస్తులు గమనించి వారిని వెంబడించారు. ఆ ఇద్దరూ.. చెట్ల పొదల్లో నగ్నంగా మంత్రాలు ఉచ్ఛరించడాన్ని గమనించిన గ్రామస్తులు వారిని పట్టుకుని అక్కడే చితకబాదారు.
అక్కడి నుంచి వారిని గ్రామంలోకి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న సర ్పంచ్ ప్రభాకర్‌రెడ్డి అక్కడి చేరుకుని ఆ ఇద్దరి గ్రామస్తుల బారి నుంచి విడిపించి పంచాయతీ కార్యాలయంలో ఉంచి తాళం వేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకోవడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టి సత్తయ్య, యాదగిరిలను జీపులోకి ఎక్కించారు.పోలీసులు వైఖరిని నిరసిస్తూ గ్రామస్తులు జీపునకు అడ్డంగా పడుకున్నారు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. అయితే గ్రామ సర్పంచ్ ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌ఐ సంతోష్‌కుమార్ గ్రామస్తులకు నచ్చజెప్పి అటవీ ప్రాంతంలో మంత్రాలు చేస్తున్న ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాని అక్కడ ఎలాంటి ఆధారాలు లభించలేదు. అయితే గ్రామస్తుల ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.