మంత్రంతో ముప్పులు
పలమనేరు మండలంలోని ఓ మహిళకు కాళ్లు చేతులు చచ్చుపడ్డాయి. గాలి సోకిందని ఆమె కుటుంబ సభ్యులు ఆమెకు పొరుగునే ఉన్న తమిళనాడు నుంచి మంత్రగత్తెను తీసుకువచ్చి, మంత్రం వేయించారు. అయినా ఆమెకు రోగం బాగు కాలే దు. దీంతో ఆమెకు ఆ వ్యాధి మరింత ముదిరిపోయి ఇబ్బందులు పడుతోంది.బెరైడ్డిపల్లె మండలంలోని ఓ గ్రామానికి చెందిన మరో మహిళ అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెకు దెయ్యం పట్టిందని మంత్రగాడిని పిలుచుకుని వచ్చి, మంత్రం వేయించారు. అయినా ఆమె ఆరోగ్యం కుదుట పడకపోగా మరింత ఎక్కువైంది.
- రోగాలను మరింత ముదిరించుకుంటున్నారు!
- మూఢ నమ్మకాలతో ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్న గ్రామీణులు
- పలమనేరు నియోజకవర్గంలో అటవీ శివారు గ్రామాల తీరిదీ!
పలమనేరు: నేటి స్మార్ట్ సమాజంలోనూ అటవీ శివారు గ్రామాల ప్రజలు మంత్రాలు, తంత్రాలను నమ్ముతూనే ఉన్నారు. ఇప్పటికీ భూతవైద్యులు, మంత్రగాళ్ల హవా కొనసాగుతూనే ఉంది. చదువుకున్న వారు సైతం ఈ అపోహలబారిన పడడం మరీ విడ్డూరంగా ఉంది. ఎవరికైనా జబ్బు చేస్తే రోగాన్ని గుర్తించడానికి వైద్యులు పరీక్షలు చేస్తారు. ఆపై అవసరమైన చికిత్సనందిస్తారు. కాని ఇవేవీ లేకుండా పలమనేరు ప్రాంతంలోని పలు అటవీ ప్రాంత గ్రామస్తులు గురి అనే మూఢనమ్మకాన్నే నమ్ముతూ రోగుల ప్రాణాలను చేజేతులారా తీసుకుంటున్నారు.
రోగాలకు మందులు మంత్రాలు, తాయత్తులే....
ఎటువంటి రోగానికైనా మంత్రాలు, తాయత్తులనే నమ్మి ఉన్న రోగం కాస్త ముదిరి ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. పలమనేరు మండలంలోని ఓ యువతికి ఫిట్స్ వచ్చాయి. దీంతో ఆమె కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లకుండా ఆ బాలికకు గాలి(దెయ్యం) సోకిందని భావించారు. అంతే తమ బంధువుల సాయంతో తమిళనాడు రాష్ట్రంలోని గుడియాత్తం సమీపంలోని సేంగడ్రం గ్రామానికి చెందిన తిరుమణి(55) అనే మంత్రగత్తెను తీసుకువచ్చారు. మంత్రగత్తెకు పూవాడికాడ అనే దేవత ఆవహించి ఆ యువతికి కాళ్లు, చేతులు రాకపోవడానికి చెడుపు జరిగిందని తేల్చేసింది. దీన్ని నయం చేయాలంటే ప్రత్యేక పూజలు చేసి తాయత్తు కట్టాలని, వారికి తెలిపింది. ఇందుకు దాదాపు రూ.5 వేలు వరకు ఖర్చు అవుతుందని 51 వస్తువులు జాబితాను వారికి ఇచ్చింది. దీంతో వారు అవి తీసుకువచ్చి గురి పెట్టించి, మంత్రగత్తెకు రూ.1116 దక్షిణగా చెల్లించారు. అయితే ఆమెకు రోగం మరింత ముదిరింది. బయ్యప్పగారిపల్లెలోనూ ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది.
కొంపముంచుతున్న నిరక్షరాస్యత
నియోజకవర్గంలోని పలు అటవీ ప్రాంత గ్రామాల్లో అధికశాతం మంది నిరక్షరాస్యులు. గిరిజనులు ఎక్కువగా ఉన్న ఈ గ్రామాల్లో అమాయకత్వం రాజ్యమేలుతోంది. ఇదే మంత్రగాళ్ల పాలిట వరంగా మారింది. అక్షరాస్యత పెరిగితే అమాకత్వం పోయి, చైతన్యం వచ్చే అవకాశం ఉంది.
మంత్రాల మాయలో పడొద్దు..
మంత్రాలు, తాయత్తులతో రోగాలు అసలు నయం కావు. ఇదంతా కేవలం మనోజనిత శారీరక రుగ్మతలే. ముఖ్యంగా ఆత్మనూన్యతాపరులు, హిస్టీరియాతో బాధపడేవారు, మ్యానియా, సైకో సెక్సువల్స్ ఇలాంటి వాటిని ఎక్కువగా నమ్ముతుంటారు. మంత్ర, తంత్రాలతో ఏదో జరుగుతందనే భ్రమ పడి వాటిని నమ్మి, ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు.
-సుధాకర్‌రెడ్డి. సైకాలజిస్టు