అచ్చంగా అమ్మాయిల ఊరు!
ఔనా!
అడవి తల్లి ఒడిలో పక్షుల కిలకిలారావాలు, కొండ కోనల నడుమ చిన్న ఆదివాసీ గ్రామం అది. పేరు గీగావారి గుంపు. ఖమ్మం జిల్లా వేలేరుపాడు మండలంలో మారుమూల అటవీ ప్రాంతంలో మేదరగుట్టకు ఆనుకొని ఉంది ఈ పల్లె. కాలిబాట తప్ప ఎలాంటి రహదారి, విద్యుత్ సౌకర్యం లేదు. ఈ పల్లె యాభై ఏళ్ళకు పూర్వం ఏర్పడింది.
అన్నేళ్లుగా ఆ ఊళ్లో మగపిల్లాడు పుట్టలేదు!
ఆ పల్లెలో నలభయ్యేళ్లుగా ఒక్కమగపిల్లాడు కూడా పుట్టలేదు. అంతా ఆడపిల్లలే. అయినా తమకు అబ్బాయిలు లేరన్న వెలితి వారిలో ఇసుమంతైనా కనిపించకపోవటం విశేషం. చదువు, ఆస్తులు, బ్యాంకు బ్యాలెన్సులు ఉన్న ‘నాగరికులు’ కూడా ఆడపిల్ల విషయంలో రాక్షసులుగా మారిపోతున్న ఈ రోజుల్లో ఈ పల్లె నాగరిక సమాజంకంటే ఉన్నతంగా ఉంది.
ఆరు దశాబ్దాల క్రితం (1947 తర్వాత) కూనవరం మండలం నర్శింగపేట నుండి గీగా పసయ్య అనే గిరిజనుడు ఇక్కడికి వలస వచ్చాడు. పసయ్యకు ముగ్గురు మగపిల్లలు, ఒక ఆడపిల్ల (కన్నయ్య, పెద వెంకయ్య, తమ్మయ్య, రత్తమ్మ). వీరిలో తమ్మయ్యకు ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. పెద వెంకయ్యకు కూడా నలుగురు అమ్మాయిలు. కన్నయ్యకు నలుగురు ఆడపిల్లలు, ముగ్గురు మగపిల్లలు. కన్నయ్య, పెదవెంకయ్య, తమ్మయ్యలు 40 ఏళ్ళ క్రితమే మృతిచెందారు. గీగా పసయ్య కుటుంబంలో కూతురు, మనవరాళ్ళు, మునిమనవరాళ్ళు మొత్తం 19 మందీ ఆడప్లిలలే. వీరిలో కూడా ఏ ఒక్కరికీ మగ సంతానం లేదు.
ఒక్కమాటలో చెప్పాలంటే ఇక్కడ స్థిరనివాసం ఏర్పరచుకున్న ఎవరికీ మగసంతానం కలగడం లేదు. బయటి గ్రామాలకు వెళ్లిన వాళ్లకు పుడుతున్నారు. ఇల్లరికపు అల్లుళ్లతో ప్రతితరానికీ వంశనామం మారుతోంది. వ్యవసాయ పనుల్లో మగవాళ్ళకు దీటుగా అరక దున్నడం మొదలు, కుప్పనూర్పిడి, ఇతరత్రా అన్ని పొలం పనులు మహిళలు కూడా చేస్తారు. పశువులు కాస్తారు.
కారణమేంటో కనుక్కోవాలి!
ఈ గిరిజనుల పల్లెలో మగ సంతానం లేకపోవడానికి వాళ్లు తినే ఔషధ మొక్కలు కారణమా? జన్యులోపం కారణమా? ఇంకోటా... ఇంకోటా..?? శాస్త్ర పరిశోధన సంస్థలు శోధించి, నిగ్గుతేల్చాల్సిందే. వారి జీవనంలో సహజత్వం చెదిరిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే!
- ఎం.ఏ. సమీర్, సాక్షి, వేలేరుపాడు, ఖమ్మం జిల్లా