చండ్రుగొండ: ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలం అబ్బుగూడెం అడవుల్లో ఆదివారం రెండు చిరుతపులులు మృతి చెందిన ఘటనపై అటవీశాఖ అధికారులు సీరియస్‌గా స్పందించారు. అటవీశాఖలోని యాంటీ పోచింగ్ స్క్వాడ్ రాష్ట్ర అధికారి ఆర్. మల్లికార్జుననాయక్, ఫ్లయింగ్ స్క్వాడ్ జిల్లా అధికారి యు. కోటేశ్వరరావు మండలంలో సోమవారం పర్యటించారు. రెండు చిరుతలు చనిపోయి ఉన్న ప్రాంతాన్ని, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి, పలు ఆధారాలను సేకరించారు.
అబ్బుగూడెం, సీతాయిగూడెం గ్రామస్తులు, రైతులు, పశువుల కాపరులతో మాట్లాడారు. అయితే, పథకం ప్రకారమే అబ్బుగూడెం అటవీప్రాంతంలోని చిరుతలపై విష ప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. చిరుతల వేటకు ఓ మేకను బలి ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. తల్లి చిరుతతో పాటు పిల్ల చిరుత కడుపులో మేకమాంసం, దాని అవశేషాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.