మంత్రాలేనంటూ.. | huts burned with Mantras Three familys Leave village with fear | Sakshi
Sakshi News home page

కాలిపోతున్న గుడిసెలు

Published Sat, Dec 16 2017 11:06 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

huts burned with Mantras Three familys Leave village with fear - Sakshi

పుల్లెంల గ్రామంలో కాలిన పూరి గుడిసె,జరిగిన ఘటనపై ఆందోళనగా ఉన్న మూడు కుటుంబాలు

నల్లగొండ , చండూరు (మునుగోడు) : అది దళితవాడ. మూడు కుటుంబాలకు చెందిన గుడిసెలు పక్కపక్కనే ఉంటాయి. పదిహేను రోజులుగా ఒక్కరోజు తప్పించి మరోరోజు ఆ గుడిసెలకు నిప్పు అంటుకుంటోంది. అందులో ఉన్న వారు భయంతో పరుగులు తీస్తున్నారు. ఎవరో తమపై మంత్రాలు చేస్తుండడంతోనే ఇలా జరుగుతోందని ఆ కుటుంబాలు వణికిపోతున్నాయి.  చండూరు మండలం పుల్లెంల గ్రామంలోని దళితవాడ మూఢ నమ్మకాలతో వణికిపోతోంది. చివరకు వారు ఆ గ్రామాన్ని వదిలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. పోలీస్, రెవెన్యూ అధికారులకు తమ గోడు చెప్పుకున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. దళితవాడలోని సీత మల్లయ్య, సీత నర్సింహ, సీత రవిలకు చెందిన మూడు పూరిగుడిసెలు పక్కపక్కనే ఉన్నాయి.

వీరు రోజువారీ కూలీలు. పొద్దస్తమానం పనిచేయడంతో రాత్రి అలసటతో గుడిసెలో నిద్రిస్తున్నారు. 15 రోజులుగా రోజు తప్పించి రోజు ఆ గుడిసెలకు నిప్పు అంటుకొని కొంతమేరకు కాలిపోతున్నాయి. ముందుగా ఒక గుడిసె నిప్పంటుకొని కొంతకాలిన తర్వాత తిరిగి ఆ పక్కన గుడిసె..ఇదే తరహాలో మూడో గుడిసెకు నిప్పు అంటుకుంటోంది. అయితే విద్యుత్‌ వైర్ల వల్ల జరుగుతుందా అని అనుకుంటే కాదని తేటతెల్లమైంది. ఆ మూడు ఇళ్ల విద్యుత్‌ వైర్లు సైతం దూరంగా ఉన్నాయి. షార్ట్‌సర్క్యూట్‌ కూడా జరిగే అవకాశం లేదు. విచిత్రమైన çఘటనతో అటు గ్రామస్తులు, ఇటు బాధిత కుటుంబాలు కంటిమీద కునుకు లేకుండా ఉంటున్నాయి. రాత్రి అయితే చాలు గుడిసెలకు దూరంగా చలిలో వణుకుతూ నిద్రిస్తున్నారు. దీనిపై ఆదివారం గ్రామంలో చర్చించనున్నట్లు గ్రామపెద్దలు తెలిపారు. ఆ రోజు తమకు జరుగుతున్న సంఘటనకు గల కారణాలు తెలియలేకపోతే ఊరి విడిచి వెళ్లిపోతామని బాధితులు ‘సాక్షి’కి తెలిపారు.

గతంలోనూ..
ఏడాది క్రితం ఓ పూరిగుడిసె ఇదే తరహాలో దగ్ధమై పెద్దమొత్తంలో నష్టం జరిగింది. కొంతకాలం మరిచిన తర్వాత తిరిగి ఇదే సమస్య ఉత్పన్నమైంది.

మంత్రాలేనంటూ..
గుడిసె దగ్ధం కావడానికి దగ్గర్లో పొయ్యి లేదు..తోడుగా కరెంటు వైర్లు లేవు.  రెండు లేనప్పుడు నిప్పు పుట్టి ఇళ్లు దగ్ధం కావడం ఏమిటని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంత్రాలతోనే గుడిసెలు దగ్ధం అవుతున్నాయని అంటున్నారు.

భయంగా ఉంది
ఇంట్లో ఉండాలంటే ఎంతో భయంగా ఉంది. ఏ నిమిషంలో ఏం జరుగుతుందోననే టెన్షన్‌ ఎక్కువైంది. ఆరుబయట పడుకుంటున్నాం. విచిత్రంగా నిప్పు రావడం మాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
–  సీత మల్లయ్య, బాధితుడు

ఊరు విడిచి వెళ్తాం
భయంతో ఊరిలో ఉండలేకపోతున్నాం. మాపై కొంతమంది కక్ష గట్టి మంత్రాలు చేస్తున్నారు. ఆదివారం తర్వాత ఊరివిడిచి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాం. మా గుడిసెలకు ఎప్పుడు నిప్పు అంటుకుంటుందోనని భయం..భయంగా బతుకుతున్నాం. – సీత రవి, బాధితుడు

అధికారులు పట్టించుకోవడం లేదు
గ్రామంలో జరుగుతున్న సంఘటనపై పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించాం. ఎవరూ స్పందించలేదు. భయంతో దళితవాడ వణుకుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. – సీత యాదయ్య, మాజీ ఎంపీటీసీ సభ్యుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement