Huts burned
-
రక్తికట్టని టీడీపీ నాటకం
పిడుగురాళ్లరూరల్: లేని గుడిసెలను ఉన్నట్లు సృష్టించి, పైగా తగులబెట్టారంటూ అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు మండలంలోని కోనంకి గ్రామంలో మంగళవారం హైడ్రామా నడిపారు. పథకం ప్రకారం గుడారాలు తగులబెట్టారని, కొంతమందిని కూడా కొట్టారంటూ ధర్నాకు దిగారు. పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామంలో 141, 142 సర్వే నంబర్లలో వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు అన్నపరెడ్డి హనుమాయమ్మ, అన్నపరెడ్డి మట్టారెడ్డి, వీరభద్రుని భాస్కరరెడ్డి, వీరభద్రుని అంతి రెడ్డి, వీరభద్రుని శేషిరెడ్డిలకు 7.01 ఎకరాల భూమి ఉంది. దీనికి నష్టపరిహారం చెల్లించకుండా అధికారులు పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నామంటూ స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. దీంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. అయినప్పటికీ అధికారులు ఈనెల 20న భారీ పోలీసు బలగాలను తీసుకువచ్చి ఆ భూమి వద్దకు బాధితులను సైతం రానివ్వకుండా లేఅవుట్లు వేశారు. అప్పటికప్పుడే నాలుగైదు గుడారాలను ఏర్పాటు చేశారు. దీంతో తిరిగి బాధితులు హైకోర్టును ఆశ్రయించడంతో మంగళవారం అనుకూలంగా స్టే వచ్చింది. వీరు ప్రతిసారి కోర్టును ఆశ్రయిస్తున్నారన్న నెపంతో, వీరిపై అక్రమ కేసులు బనాయించాలన్న దురుద్దేశంతో పథకం ప్రకారం గుడారాలు తగులబడ్డాయని, కొంతమందిని కొట్టారంటూ టీడీపీ నేతలు హల్చల్ చేస్తూ ధర్నాకు దిగారు. కోనంకికి చెందిన పదిహేను మందితో పాటు పిడుగురాళ్లకు చెందిన టీడీపీ కౌన్సిలర్లు, నాయకులు కూడా పాల్గొనడంతో గ్రామస్తులు విస్తుపోయారు. వంత పాడుతున్న అధికారులు గుడారాలను రాత్రికి రాత్రి తగులబెట్టుకుని అక్కడ కొంత వంట పాత్రలను వారే పడేసి ఓ పెద్ద నేర చరిత్రను సృష్టించేందుకు టీడీపీ గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి నాయకుల వరకు ప్రయత్నం చేశారు. తీరా భూమి వద్దకు వెళ్లి చూస్తే అది చలిమంటలు వేసుకున్నట్లుగా, ఒకచోట కట్టెపుల్లలు తగులబడినట్లు ఉంది కానీ గుడారాలు తగులబడినట్లు లేదని చూసిన ప్రతి ఒక్కరికీ ఇట్టే అర్థమవుతోంది. స్థానిక ప్రజాప్రతినిధి ఆజ్ఞలకు రెవెన్యూ, పోలీసు అధికారులు సైతం తలొగ్గి కేసును ఏ విధంగా పెట్టాలో.. ఎలా దీన్ని హైలెట్ చేయాలో తెలి యక తలలు పట్టుకుంటున్నారు. సంఘటన స్థలాన్ని సత్తెనపల్లి డీఎస్పీ కాలేషావలి, పిడుగురాళ్ల సీఐ హనుమంతరావు పరిశీలించారు. -
వైఎస్సార్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, బద్వేలు: వైఎస్సార్ జిల్లాలో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. బద్వేలు గురుకుల పాఠశాల సమీపంలో అగ్నిప్రమాదం సంభవించి సుమారు వెయ్యి గుడిసెలు కాలి బూడిదయ్యాయి. కొంతకాలం క్రితం సీపీఐ నేతల ఆధ్వర్యంలో నిరుపేదలు ఈ ప్రాంతంలో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఇవాళ రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగి చూస్తుండగానే వెయ్యి గుడిసెలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో వంటగ్యాస్ సిలిండర్లు పేలుతూ గాలిలోకి ఎగిరాయి. భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోగానే గుడిసెలు నేలమట్టమయ్యాయి. సిలిండర్ల పేలుడు శబ్దాలకు భయంతో చుట్టుపక్కల జనం పరుగులు పెట్టారు. ఈ ప్రమాదంలో భారీగానే ఆస్తి నష్టం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వైఎస్సార్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
-
మంత్రాలేనంటూ..
నల్లగొండ , చండూరు (మునుగోడు) : అది దళితవాడ. మూడు కుటుంబాలకు చెందిన గుడిసెలు పక్కపక్కనే ఉంటాయి. పదిహేను రోజులుగా ఒక్కరోజు తప్పించి మరోరోజు ఆ గుడిసెలకు నిప్పు అంటుకుంటోంది. అందులో ఉన్న వారు భయంతో పరుగులు తీస్తున్నారు. ఎవరో తమపై మంత్రాలు చేస్తుండడంతోనే ఇలా జరుగుతోందని ఆ కుటుంబాలు వణికిపోతున్నాయి. చండూరు మండలం పుల్లెంల గ్రామంలోని దళితవాడ మూఢ నమ్మకాలతో వణికిపోతోంది. చివరకు వారు ఆ గ్రామాన్ని వదిలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. పోలీస్, రెవెన్యూ అధికారులకు తమ గోడు చెప్పుకున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. దళితవాడలోని సీత మల్లయ్య, సీత నర్సింహ, సీత రవిలకు చెందిన మూడు పూరిగుడిసెలు పక్కపక్కనే ఉన్నాయి. వీరు రోజువారీ కూలీలు. పొద్దస్తమానం పనిచేయడంతో రాత్రి అలసటతో గుడిసెలో నిద్రిస్తున్నారు. 15 రోజులుగా రోజు తప్పించి రోజు ఆ గుడిసెలకు నిప్పు అంటుకొని కొంతమేరకు కాలిపోతున్నాయి. ముందుగా ఒక గుడిసె నిప్పంటుకొని కొంతకాలిన తర్వాత తిరిగి ఆ పక్కన గుడిసె..ఇదే తరహాలో మూడో గుడిసెకు నిప్పు అంటుకుంటోంది. అయితే విద్యుత్ వైర్ల వల్ల జరుగుతుందా అని అనుకుంటే కాదని తేటతెల్లమైంది. ఆ మూడు ఇళ్ల విద్యుత్ వైర్లు సైతం దూరంగా ఉన్నాయి. షార్ట్‌సర్క్యూట్ కూడా జరిగే అవకాశం లేదు. విచిత్రమైన çఘటనతో అటు గ్రామస్తులు, ఇటు బాధిత కుటుంబాలు కంటిమీద కునుకు లేకుండా ఉంటున్నాయి. రాత్రి అయితే చాలు గుడిసెలకు దూరంగా చలిలో వణుకుతూ నిద్రిస్తున్నారు. దీనిపై ఆదివారం గ్రామంలో చర్చించనున్నట్లు గ్రామపెద్దలు తెలిపారు. ఆ రోజు తమకు జరుగుతున్న సంఘటనకు గల కారణాలు తెలియలేకపోతే ఊరి విడిచి వెళ్లిపోతామని బాధితులు ‘సాక్షి’కి తెలిపారు. గతంలోనూ.. ఏడాది క్రితం ఓ పూరిగుడిసె ఇదే తరహాలో దగ్ధమై పెద్దమొత్తంలో నష్టం జరిగింది. కొంతకాలం మరిచిన తర్వాత తిరిగి ఇదే సమస్య ఉత్పన్నమైంది. మంత్రాలేనంటూ.. గుడిసె దగ్ధం కావడానికి దగ్గర్లో పొయ్యి లేదు..తోడుగా కరెంటు వైర్లు లేవు. రెండు లేనప్పుడు నిప్పు పుట్టి ఇళ్లు దగ్ధం కావడం ఏమిటని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంత్రాలతోనే గుడిసెలు దగ్ధం అవుతున్నాయని అంటున్నారు. భయంగా ఉంది ఇంట్లో ఉండాలంటే ఎంతో భయంగా ఉంది. ఏ నిమిషంలో ఏం జరుగుతుందోననే టెన్షన్ ఎక్కువైంది. ఆరుబయట పడుకుంటున్నాం. విచిత్రంగా నిప్పు రావడం మాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. – సీత మల్లయ్య, బాధితుడు ఊరు విడిచి వెళ్తాం భయంతో ఊరిలో ఉండలేకపోతున్నాం. మాపై కొంతమంది కక్ష గట్టి మంత్రాలు చేస్తున్నారు. ఆదివారం తర్వాత ఊరివిడిచి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాం. మా గుడిసెలకు ఎప్పుడు నిప్పు అంటుకుంటుందోనని భయం..భయంగా బతుకుతున్నాం. – సీత రవి, బాధితుడు అధికారులు పట్టించుకోవడం లేదు గ్రామంలో జరుగుతున్న సంఘటనపై పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాం. ఎవరూ స్పందించలేదు. భయంతో దళితవాడ వణుకుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. – సీత యాదయ్య, మాజీ ఎంపీటీసీ సభ్యుడు -
కట్టుబట్టలే మిగిలాయి...
వారంతా పేదలు. కూలీ చేస్తేగాని పొట్ట నిండని దుస్థితి. రోజూలాగే బుధవారం పగలంతా కష్టపడి పని చేసి రాత్రి ఆదమరచి నిద్రపోయారు. ఇంతలోనే విధికి కన్నుకుట్టి...అగ్ని రూపంలో ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. అంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో గురువారం వేకువజామున మూడు గంటల సమయంలో ఓ ఇంట్లో మంటలు రేగి...వరుస ఇళ్లకు వ్యాపించాయి. కోలుకుని కేకలు వేసి పరుగులు తీసేలోగే తొమ్మిది ఇళ్లు కాలి బూడిదయ్యాయి. రూ.ఐదు లక్షల పైబడి ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని రెవెన్యూ అధికారులే ప్రాథమిక అంచనా వేశారు. బాధితులంతా సర్వం కొల్పోయి కట్టుబట్టలతో మిగిలిపోయారు. వివరాల్లోకి వెళ్తే... శ్రీకాకుళం, మక్కువ: మండలంలోని తూరుమామిడి గ్రామంలో గురువారం తెల్లవారుజామున సంభవించిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది పూరిళ్లు దగ్ధమయ్యాయి. బాధితులంతా కట్టుబట్టలతో మిగిలారు. బాధితులైన ఎస్టీ కాలనీ వాసులు ప్రమాదంలో సర్వం కోల్పోయి కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామంలో గురువారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో దుగ్గాడ పార్వతి ఇంటి వద్ద మంటలు ప్రారంభమై వ్యాపించాయి. మంటలను చూసిన పార్వతి కేకలు వేయగా ఇరుగుపొరుగు వారంతా నిద్రలేచారు. ఏం జరిగిందో తెలియక ఆందోళన చెందారు. తేరుకున్న వెంటనే మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. పార్వతి ఇంట్లో గ్యాస్‌బండ పేలి పెద్ద శబ్ధం రావడంతో మంటలు ఆర్పేందుకు వెనుకంజ వేశారు. ఎస్ఐ వెలమల ప్రసాదు, అగ్ని మాపక కేం ద్రానికి సమాచారం అందజేశారు. ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకొని సమీపంలో ఉన్న చెరువులోఆయిల్ ఇంజిన్ ఏర్పాటు చేసి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే మంటలు వ్యాపించి బూర్జి రాములమ్మ, మొరపాక సూరిశెట్టి, కెల్ల పారమ్మ, కెల్ల సూరన్నదొర, బానుసీతమ్మ, గొల్లపల్లి గంగమ్మ, గొల్లపల్లి చినశంకరి, గొల్లపల్లి ఆదిలక్ష్మికి చెందిన ఇళ్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.5లక్షల ఆస్తి నష్టం సంభవించినట్టు రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. మొండిగోడలే మిగిలాయి... గ్రామస్తులంతా నిద్రలో ఉన్న సమయంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో బాధితులంతా కట్టుబట్టలతో మిగిలిపోయారు. రేషన్ కార్డులు, విద్యార్థులకు చెందిన సర్టిఫికెట్లు, బంగారు, వెండి ఆభరణాలు, నగదు, సైకిళ్లు, టీవీలు, ధాన్యం బస్తాలు, బియ్యం, దుస్తులు మొత్తం కాలి బూడిదై కట్టుబట్టలతో బాధితులు రోదిస్తున్నారు. ఐదు క్వింటాళ్ల పత్తి కాలి బూడిదైంది. విషయం తెలుసుకున్న సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర బాధితులతో ఫోన్లో మాట్లాడారు. ప్రమాద వివరాల ను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం బాధితులను ఆ దుకోవాలని కోరారు. తహసీల్దార్ కేవీ రామారావు, ఎం పీడీఓ జి.రామారావు బాధితులను పరామర్శించారు. ఆదుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు బాధితులను మక్కువ మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు మావుడి రంగునాయుడు పరామర్శించారు. విషయం తెలుసుకున్న వెంటనే తూరుమామిడి గ్రామానికి చేరుకొని ఒక్కో బాధిత కుటుంబానికి 50 కేజీల బియ్యం, చీరలు, నగదును అందజేశారు. ఆయన వెంట సర్పంచ్ దుగ్గాడ వెంకటస్వామి, ఎంపీటీసీ సభ్యురాలు రెడ్డి గౌరశ్వరి, పెంట సంజీవునాయుడు తదితరులు ఉన్నారు. బాధితులకు అండగా... తూరుమామిడి గ్రామానికి గురువారం ఎమ్మెల్సీ గుమ్మిడి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్, మండల జన్మభూమి కమిటీ అధ్యక్షుడు పెంట తిరుపతిరావు చేరుకొని కాలిపోయిన ఇళ్లను పరిశీలించారు. అనంతరం బాధిత కుటంబాలకు బియ్యం, నగదు, దుప్పట్లను పంపిణీ చేశారు. -
అగ్ని ప్రమాదం - మూడిళ్లు దగ్ధం
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం పండ్రవాడ గ్రామంలో మంగళవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో మూడిళ్లు దగ్ధం అయ్యాయి. వెంకటరమణ అనే వ్యక్తికి చెందిన పూరింట్లో వంట చేస్తున్న సమయంలో నిప్పు అంటుకుని మంటలు లేచాయి. అవి పక్కనే ఉన్న పార్వతి, వెంకన్న నివాసాలకు వ్యాపించడంతో మొత్తం మూడిళ్లూ దగ్ధం అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు మరింత వ్యాపించకుండా ఆర్పివేశారు. కాగా, ఈ ప్రమాదంలో రూ.4 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని సమాచారం.