కట్టుబట్టలే మిగిలాయి... | Nine Hoveels Smash In Fire Accident | Sakshi
Sakshi News home page

కట్టుబట్టలే మిగిలాయి...

Published Fri, Dec 8 2017 10:42 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

Nine Hoveels Smash In Fire Accident - Sakshi

తూరుమామిడిలో కాలిపోతున్న పూరిళ్లు

వారంతా పేదలు. కూలీ చేస్తేగాని పొట్ట నిండని దుస్థితి. రోజూలాగే బుధవారం పగలంతా కష్టపడి పని చేసి రాత్రి ఆదమరచి నిద్రపోయారు. ఇంతలోనే విధికి కన్నుకుట్టి...అగ్ని రూపంలో ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. అంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో గురువారం వేకువజామున మూడు గంటల సమయంలో ఓ ఇంట్లో మంటలు రేగి...వరుస ఇళ్లకు వ్యాపించాయి. కోలుకుని కేకలు వేసి పరుగులు తీసేలోగే తొమ్మిది ఇళ్లు కాలి బూడిదయ్యాయి. రూ.ఐదు లక్షల పైబడి ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని రెవెన్యూ అధికారులే ప్రాథమిక అంచనా వేశారు. బాధితులంతా సర్వం కొల్పోయి కట్టుబట్టలతో మిగిలిపోయారు. వివరాల్లోకి వెళ్తే...

శ్రీకాకుళం, మక్కువ: మండలంలోని తూరుమామిడి గ్రామంలో గురువారం తెల్లవారుజామున సంభవించిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది పూరిళ్లు దగ్ధమయ్యాయి. బాధితులంతా కట్టుబట్టలతో మిగిలారు. బాధితులైన ఎస్టీ కాలనీ వాసులు ప్రమాదంలో సర్వం కోల్పోయి కన్నీరుమున్నీరవుతున్నారు.  గ్రామంలో గురువారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో దుగ్గాడ పార్వతి ఇంటి వద్ద మంటలు ప్రారంభమై వ్యాపించాయి. మంటలను చూసిన పార్వతి కేకలు వేయగా ఇరుగుపొరుగు వారంతా నిద్రలేచారు. ఏం జరిగిందో తెలియక ఆందోళన చెందారు. తేరుకున్న వెంటనే మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. పార్వతి ఇంట్లో గ్యాస్‌బండ పేలి పెద్ద శబ్ధం రావడంతో మంటలు ఆర్పేందుకు వెనుకంజ వేశారు.

ఎస్‌ఐ వెలమల ప్రసాదు, అగ్ని మాపక కేం ద్రానికి సమాచారం అందజేశారు. ఎస్‌ఐ సంఘటనా స్థలానికి చేరుకొని సమీపంలో ఉన్న చెరువులోఆయిల్‌ ఇంజిన్‌ ఏర్పాటు చేసి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే మంటలు వ్యాపించి బూర్జి రాములమ్మ, మొరపాక సూరిశెట్టి, కెల్ల పారమ్మ, కెల్ల సూరన్నదొర, బానుసీతమ్మ, గొల్లపల్లి గంగమ్మ, గొల్లపల్లి చినశంకరి, గొల్లపల్లి ఆదిలక్ష్మికి చెందిన ఇళ్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.5లక్షల ఆస్తి నష్టం సంభవించినట్టు రెవెన్యూ అధికారులు అంచనా వేశారు.

మొండిగోడలే మిగిలాయి...
గ్రామస్తులంతా నిద్రలో ఉన్న సమయంలో  అగ్ని ప్రమాదం సంభవించడంతో బాధితులంతా కట్టుబట్టలతో మిగిలిపోయారు. రేషన్‌ కార్డులు, విద్యార్థులకు చెందిన సర్టిఫికెట్లు, బంగారు, వెండి ఆభరణాలు, నగదు, సైకిళ్లు, టీవీలు, ధాన్యం బస్తాలు, బియ్యం, దుస్తులు మొత్తం కాలి బూడిదై కట్టుబట్టలతో బాధితులు రోదిస్తున్నారు. ఐదు క్వింటాళ్ల పత్తి కాలి బూడిదైంది. విషయం తెలుసుకున్న సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర బాధితులతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాద వివరాల ను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం బాధితులను ఆ దుకోవాలని కోరారు. తహసీల్దార్‌ కేవీ రామారావు, ఎం పీడీఓ జి.రామారావు బాధితులను పరామర్శించారు.   

ఆదుకున్న  వైఎస్సార్‌ సీపీ నాయకులు
బాధితులను మక్కువ మండల వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు మావుడి రంగునాయుడు పరామర్శించారు. విషయం తెలుసుకున్న వెంటనే తూరుమామిడి గ్రామానికి చేరుకొని ఒక్కో బాధిత కుటుంబానికి 50 కేజీల బియ్యం, చీరలు, నగదును అందజేశారు. ఆయన వెంట సర్పంచ్‌ దుగ్గాడ వెంకటస్వామి, ఎంపీటీసీ సభ్యురాలు రెడ్డి గౌరశ్వరి, పెంట సంజీవునాయుడు తదితరులు ఉన్నారు.

బాధితులకు అండగా...
తూరుమామిడి గ్రామానికి గురువారం ఎమ్మెల్సీ గుమ్మిడి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్, మండల జన్మభూమి కమిటీ అధ్యక్షుడు పెంట తిరుపతిరావు చేరుకొని కాలిపోయిన ఇళ్లను పరిశీలించారు. అనంతరం బాధిత కుటంబాలకు బియ్యం, నగదు, దుప్పట్లను పంపిణీ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement