కరుణ్‌ నాయర్‌ 430 నాటౌట్‌ | Karun Nair Played 4 Innings In Vijay Hazare Trophy And Scored 430 Runs, Hasnt Been Out Single Time | Sakshi
Sakshi News home page

కరుణ్‌ నాయర్‌ 430 నాటౌట్‌

Published Tue, Dec 31 2024 7:05 PM | Last Updated on Tue, Dec 31 2024 7:45 PM

Karun Nair Played 4 Innings In Vijay Hazare Trophy And Scored 430 Runs,  Hasnt Been Out Single Time

విజయ్‌ హజారే ట్రోఫీ 2024-25లో విదర్భ కెప్టెన్‌, టీమిండియా ట్రిపుల్‌ సెంచూరియన్‌ (టెస్ట్‌ల్లో) కరుణ్‌ నాయర్‌ (Karun Nair) అరివీర భయంకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో కరుణ్‌ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి మూడు సెంచరీల సాయంతో 430 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో కరుణ్‌ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా ఔట్‌ కాకపోవడం విశేషం. 

ప్రస్తుతం కరుణ్‌ విజయ్‌ హజారే ట్రోఫీలో లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అలాగే ఈ టోర్నీలో అత్యధిక బౌండరీలు (56) బాదిన ఘనత కూడా కరుణ్‌కే దక్కుతుంది. కరుణ్‌ ఈ సీజన్‌లో విదర్భను ప్రతి మ్యాచ్‌లో (4) గెలిపించాడు. విదర్భ ఈ సీజన్‌లో ఆడిన ప్రతి మ్యాచ్‌ గెలిచి గ్రూప్‌-డి టాపర్‌గా కొనసాగుతుంది.

ఈ సీజన్‌లో కరుణ్‌ నాయర్‌ స్కోర్లు.. 
జమ్మూ కశ్మీర్‌తో జరిగిన సీజన్‌ తొలి మ్యాచ్‌లో కరుణ్‌ 108 బంతుల్లో 17 బౌండరీల సాయంతో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో విదర్భను విజయతీరాలకు చేర్చిన కరుణ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు కూడా లభించింది.

చత్తీస్‌ఘడ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో కరుణ్‌ 52 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో విదర్భ 8 వికెట్ల తేడాతో చత్తీస్‌ఘడ్‌ను చిత్తు చేసింది.

చండీఘడ్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో కరుణ్‌ 107 బంతుల్లో 20 బౌండరీలు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 163 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో విదర్భను విజయతీరలకు చేర్చిన కరుణ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు కూడా లభించింది.

ఇవాళ (డిసెంబర్‌ 31) తమిళనాడుతో జరిగిన నాలుగో మ్యాచ్‌లో కరుణ్‌ మరోసారి శతక్కొట్టాడు. ఈ మ్యాచ్‌లో కరుణ్‌ 103 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో అజేయమైన 111 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.

ఈ సీజన్‌లో కరుణ్‌ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు కూడా గెలుచుకున్నాడు.

తమిళనాడు-విదర్భ మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన తమిళనాడు.. దర్శన్‌ నల్కండే (6/55) విజృంభించడంతో 48.4 ఓవర్లలో 256 పరుగులకు ఆలౌటైంది. విదర్భ బౌలర్లలో హర్ష్‌ దూబే 2, యశ్‌ ఠాకూర్‌, భూటే తలో వికెట్‌ పడగొట్టారు. తమిళనాడు ఇన్నింగ్స్‌లో తుషార్‌ రహేజా (75) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. మొహమ్మద్‌ అలీ (48), ఆండ్రే సిద్దార్థ్‌ (40) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.

అనంతరం బరిలోకి దిగిన విదర్భ.. కరుణ్‌ శతక్కొట్టడంతో 43.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. విదర్భ ఇన్నింగ్స్‌లో దృవ్‌ షోరే 31, యశ్‌ రాథోడ్‌ 14, యశ్‌ కడెం 31, జితేశ్‌ శర్మ 23, శుభమ్‌ దూబే 39 (నాటౌట్‌) పరుగులు చేశారు. తమిళనాడు బౌలర్లలో సాయికిషోర్‌ 2, వరుణ్‌ చక్రవర్తి, సందీప్‌ వారియర్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement