విజయ్ సర్దేశాయ్
సాక్షి, న్యూఢిల్లీ : ‘మంత్రాలకు చింతకాయలు రాలుతాయా’ అని అంటారు గానీ, వేదాలకు పచ్చని పంటలే పండుతాయట! ఈ మాటను అక్షరాల నమ్మిన గోవాలోని బీజేపీ ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా పనిచేస్తున్న విజయ్ సర్దేశాయ్ మంగళవారం నాడు అధికారికంగా ఓ స్కీమ్‌నే ప్రారంభించారు. దీనికి ‘శివ్ యోగ్ కాస్మిక్ ఫార్మింగ్’ అని కూడా నామకరణం చేశారు. రైతులు ప్రతిరోజు పంట పొలాల ముందు ధ్యాన ముద్రలో (మెడిటేషన్) కూర్చొని ‘ఓం రమ్ జమ్ సాహ్’ అంటూ 20 సార్లు ఉచ్ఛరిస్తే చాలట.
అలా చేయడం వల్ల రైతుల నోటి నుంచి వెలువడే శబ్దాల వెంట కాస్మిక్ కిరణాలు ప్రయాణించి ఎదురుగా ఉన్న పంట పైర్లకు తాకి వాటికి కొత్త శక్తినిస్తాయట. నేల లోపల క్రిమికీటకాదులను చంపేస్తాయట. అలా జవసత్వాలను సంతరించుకున్న పైరు ఏపుగా పెరుగుతందట. ఇందులో పైసా ఖర్చులేదు, ప్రయత్నించి చూడమని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం పంటల కోసం ఉపయోగిస్తున్న నీరు, ఎరువులను ఇక ముందు వాడాల్సిన అవసరం ఉందా, లేదా? అన్న విషయాన్ని మాత్రం ఆయన వివరించలేదు. దుక్కి దున్నీ నారుపోసి నీరుపోసి కష్టపడినా పంట చేతికొస్తదా, లేదా అన్న ఆందోళన పడే రైతుకు ఇవన్నీ లేకుండా పంట చేతి కొస్తదంటే రోజుకు 20 సార్లేం ఖర్మ 200 సార్లయినా వేదోక్తులను ఉచ్ఛరిస్తారు.
ఈ శివ్‌యోగ్ కాస్మిక్ ఫార్మింగ్ విధానాన్ని మాజీ రసాయనిక ఇంజనీరు, ప్రస్తుత ‘శివ్ యోగ్ ఫౌండేషన్’ యోగా గురువు అవదూత్ శివానంద్ కనిపెట్టారట! ఆయన దగ్గర శిష్యరికం చేస్తున్న మంత్రి సర్దేశాయ్ భార్య ఉష ఈ వ్యవసాయం గురించి చెప్పడంతో నమ్మిన మన మంత్రి సర్దేశాయ్ దాన్ని అమలు చేయడం కోసం ఏకంగా స్కీమ్‌నే ప్రారంభించారు. ఈ అంశంలో సరైన అధ్యయనం లేకుండా ఎలా కాస్మిక్ ఫార్మింగ్ విధానాన్ని ప్రారంభిస్తారని సదరు మంత్రిని మీడియా ప్రశ్నించగా, మధ్యప్రదేశ్‌లో ఈ విధానం మంచి ఫలితాలు ఇచ్చిందని తెలిసి ప్రారంభించానని చెప్పారు. వ్యవసాయం అభివృద్ధి కోసం తాను ఏమి చేయడానికైనా సిద్ధమని, పంట పొలాల్లో రాక్ షో లేదా అందాల పోటీలను నిర్వహించడం వల్ల రైతుల్లో వ్యవసాయం పట్ల అంకిత భావం పెరుగుతుందంటే వాటిని ఏర్పాటు చేయడానికైనా తాను సిద్ధమని ఆయన చెప్పారు. ఆయన వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం పనాజీలో మంత్రి ప్రారంభించిన ఈ స్కీమ్‌ను విధిగా అమలు చేయాల్సిందిగా తాము రైతులను కోరడం లేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment