vijay sardesai
-
గోవా కొత్త సీఎంగా ప్రమోద్ సావంత్
-
గోవా కొత్త సీఎంగా ప్రమోద్ సావంత్!
పనజి : బీజేపీ సీనియర్ నేత, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్(63) అంత్యక్రియలు ముగిశాయి. గోవాలోని మిరామిర్ బీచ్‌లో అధికారిక లాంఛనాలతో వేలాది మంది ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు నేతలు పరీకర్ అంత్యక్రియలకు హాజరయ్యారు. కొత్త సీఎంగా ప్రమోద్ సావంత్ దేశ రాజకీయాల్లో అజాతశత్రువుగా పేరొందిన పరీకర్ మరణంతో గోవాలో రాజకీయ సంక్షోభం ఏర్పడిన సంగతి తెలిసిందే. అతిపెద్ద పార్టీగా ఉన్న తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిగా కాంగ్రెస్ నేతలు గవర్నర్ మృదులా సిన్హాకు విఙ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన అమిత్ షా, నితిన్ గడ్కరీ బీజేపీ సహా మిత్ర పక్షాల ఎమ్మెల్యేలతో సమావేశమైనట్లు సమాచారం. ఈ క్రమంలో గోవా కొత్త సీఎంగా శాసన సభాపతి ప్రమోద్ సావంత్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ) ఎమ్మెల్యే సుదిన్ దివాలికర్, గోవా ఫార్వర్డ్ పార్టీ ఎమ్మెల్యే విజయ్ సర్దేశాయ్‌లకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం ఇచ్చినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సోమవారం రాత్రి గవర్నర్ మృదులా సిన్హా వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు సమాచారం. -
‘మనోభావాలు దెబ్బతింటే క్షమించండి’
పనజి : గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్‌ను జీసస్‌తో పోల్చి.. క్రిస్టియన్ల మనోభావాలు దెబ్బతీసారంటూ తనపై కాంగ్రెస్ పార్టీ తనపై చేస్తున్న విమర్శలపై గోవా మంత్రి విజయ్ సర్దేశాయి స్పందించారు. ‘ ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే నన్ను క్షమించండి. అయితే నాదొక విన్నపం. దయచేసి కాంగ్రెస్ పార్టీ పన్నిన వలలో చిక్కుకోకండి. మనుషుల మధ్య సఖ్యతకు బంధాలే వారధులని.. పరీకర్ ఆ విషయంలో విజయవంతమయ్యారని తాను అంటే.. కొందరేమో కాంక్రీటు బ్రిడ్జిల గురించి మాట్లాడి రాజకీయం చేస్తున్నారు’ అని శనివారం ఆయన వివరణ ఇచ్చారు. కాగా బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో విజయ్ సర్దేశాయి మాట్లాడుతూ.. ‘ మనుషులు నిర్మించాల్సింది బ్రిడ్జీలు. గోడలు కాదు అని బైబిల్లో ఉంటుంది. ఆ జీసస్ వారధులు నిర్మించారు. పరీకర్ కూడా అలాగే చేస్తున్నారు. అంతకు ముందు మేము బ్రిడ్జికి ఆవలివైపు(యాంటీ బీజేపీ క్యాంపులో) ఉన్నాము. అయితే పరీకర్ నిర్మించిన బ్రిడ్జీల కారణంగా ప్రస్తుతం బీజేపీతో కలిసి నడుస్తున్నాం’ అంటూ గోవా సీఎంపై ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో విజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి రోహిత్ బ్రాస్ డేసా మాట్లాడుతూ.. పరీకర్‌ను దేవుడితో పోల్చి విజయ్ క్రిస్టియన్లను అవమానించారంటూ విమర్శించారు. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొందినప్పటికీ.. గోవా ఫార్వర్డ్ పార్టీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో బీజేపీని తీవ్రంగా విమర్శించిన విజయ్ సర్దేశాయి(గోవా ఫార్వర్డ్ పార్టీ)ఆ పార్టీతో చేతులు కలపడంతో.. సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత ఎదుర్కొన్నారు. -
వేదాలకు పచ్చని పంటలు
సాక్షి, న్యూఢిల్లీ : ‘మంత్రాలకు చింతకాయలు రాలుతాయా’ అని అంటారు గానీ, వేదాలకు పచ్చని పంటలే పండుతాయట! ఈ మాటను అక్షరాల నమ్మిన గోవాలోని బీజేపీ ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా పనిచేస్తున్న విజయ్ సర్దేశాయ్ మంగళవారం నాడు అధికారికంగా ఓ స్కీమ్‌నే ప్రారంభించారు. దీనికి ‘శివ్ యోగ్ కాస్మిక్ ఫార్మింగ్’ అని కూడా నామకరణం చేశారు. రైతులు ప్రతిరోజు పంట పొలాల ముందు ధ్యాన ముద్రలో (మెడిటేషన్) కూర్చొని ‘ఓం రమ్ జమ్ సాహ్’ అంటూ 20 సార్లు ఉచ్ఛరిస్తే చాలట. అలా చేయడం వల్ల రైతుల నోటి నుంచి వెలువడే శబ్దాల వెంట కాస్మిక్ కిరణాలు ప్రయాణించి ఎదురుగా ఉన్న పంట పైర్లకు తాకి వాటికి కొత్త శక్తినిస్తాయట. నేల లోపల క్రిమికీటకాదులను చంపేస్తాయట. అలా జవసత్వాలను సంతరించుకున్న పైరు ఏపుగా పెరుగుతందట. ఇందులో పైసా ఖర్చులేదు, ప్రయత్నించి చూడమని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం పంటల కోసం ఉపయోగిస్తున్న నీరు, ఎరువులను ఇక ముందు వాడాల్సిన అవసరం ఉందా, లేదా? అన్న విషయాన్ని మాత్రం ఆయన వివరించలేదు. దుక్కి దున్నీ నారుపోసి నీరుపోసి కష్టపడినా పంట చేతికొస్తదా, లేదా అన్న ఆందోళన పడే రైతుకు ఇవన్నీ లేకుండా పంట చేతి కొస్తదంటే రోజుకు 20 సార్లేం ఖర్మ 200 సార్లయినా వేదోక్తులను ఉచ్ఛరిస్తారు. ఈ శివ్‌యోగ్ కాస్మిక్ ఫార్మింగ్ విధానాన్ని మాజీ రసాయనిక ఇంజనీరు, ప్రస్తుత ‘శివ్ యోగ్ ఫౌండేషన్’ యోగా గురువు అవదూత్ శివానంద్ కనిపెట్టారట! ఆయన దగ్గర శిష్యరికం చేస్తున్న మంత్రి సర్దేశాయ్ భార్య ఉష ఈ వ్యవసాయం గురించి చెప్పడంతో నమ్మిన మన మంత్రి సర్దేశాయ్ దాన్ని అమలు చేయడం కోసం ఏకంగా స్కీమ్‌నే ప్రారంభించారు. ఈ అంశంలో సరైన అధ్యయనం లేకుండా ఎలా కాస్మిక్ ఫార్మింగ్ విధానాన్ని ప్రారంభిస్తారని సదరు మంత్రిని మీడియా ప్రశ్నించగా, మధ్యప్రదేశ్‌లో ఈ విధానం మంచి ఫలితాలు ఇచ్చిందని తెలిసి ప్రారంభించానని చెప్పారు. వ్యవసాయం అభివృద్ధి కోసం తాను ఏమి చేయడానికైనా సిద్ధమని, పంట పొలాల్లో రాక్ షో లేదా అందాల పోటీలను నిర్వహించడం వల్ల రైతుల్లో వ్యవసాయం పట్ల అంకిత భావం పెరుగుతుందంటే వాటిని ఏర్పాటు చేయడానికైనా తాను సిద్ధమని ఆయన చెప్పారు. ఆయన వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం పనాజీలో మంత్రి ప్రారంభించిన ఈ స్కీమ్‌ను విధిగా అమలు చేయాల్సిందిగా తాము రైతులను కోరడం లేదని చెప్పారు. -
గోవాలో ఏం జరిగిందో తెలుసా?
రాజకీయాల్లో శషభిషలు పనికిరావన్న విషయం గోవాలో మరోసారి రుజువైంది. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం బీజేపీ కంటే కాంగ్రెస్‌కే ఎక్కువున్నా, వాళ్లు అవకాశాలను ఉపయోగించుకోలేకపోయారు. గోవా అసెంబ్లీలో మొత్తం 40 స్థానాలున్నాయి. అంటే మేజిక్ మార్కు 21. కాంగ్రెస్ పార్టీకి 17 స్థానాలు వచ్చాయి. బీజేపీ 14 చోట్ల గెలిచింది. అయితే.. రెండు చిన్న ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టుకోవడంలో బీజేపీ జెట్ స్పీడుతో వ్యవహరించింది. అవి.. గోవా ఫార్వర్డ్ పార్టీ, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ. ఈ రెండింటికీ మూడేసి చొప్పున స్థానాలు వచ్చాయి. దాంతో ఇద్దరు స్వతంత్రులతో కలిసి వీళ్ల మద్దతు కూడా తీసుకుని బీజేపీ తనకు కావల్సిన మెజారిటీని సంపాదించేసుకుంది. ఎన్నికలకు ముందున్న బీజేపీ ప్రభుత్వంలో తొలుత మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ ఉండేది. కానీ విజయ్ సర్దేశాయ్ నేతృత్వంలోని గోవా ఫార్వర్డ్ పార్టీ మాత్రం.. బహిరంగంగా బీజేపీని విమర్శించేది. మనోహర్ పరీకర్‌ను కూడా పొలిటికల్ ఫిక్సర్ అని వ్యాఖ్యానించేది. అయితే.. అదే సర్దేశాయ్ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ప్రధాన పాత్ర పోషించారు. ఎవరేం చేశారంటే... శనివారం మధ్యాహ్నానికి ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆదివారం సాయంత్రం మనోహర్ పరీకర్, నితిన్ గడ్కరీ ఇద్దరూ గోవాలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో కూర్చుని తీవ్రంగా మధనపడుతున్నారు. ఎంజీపీ మద్దతిచ్చేందుకు ముందుకొచ్చినా, జీఎఫ్‌పీ మాత్రం ఇంకా సరేనని చెప్పలేదు. సరిగ్గా అలాంటి సమయంలోనే విజయ్ సర్దేశాయ్ అక్కడకు వచ్చారు. అంతే ఒక్కసారిగా బీజేపీ బలం 19 నుంచి 22కు పెరిగిపోయింది. సరిగ్గా అదే సమయానికి అదే గోవాలోని మరో ఫైవ్ స్టార్ హోటల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు సమావేశమై.. ముఖ్యమంత్రిగా ఎవరిని చేస్తే బాగుంటుందని చర్చించుకుంటున్నారు. అప్పటికే ఒకసారి జీఎఫ్‌పీ వాళ్లకు మద్దతిస్తామని ఆఫర్ చేసినా, నెమ్మదిగా చూసుకోవచ్చులేనని ఆగిపోయారు తప్ప సరిగా స్పందించలేదు. సరిగ్గా ఇదే వాళ్ల కొంప ముంచింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఐదుగురి పేర్లను అనుకున్నా, ప్రతి ఒక్కరికీ అవతలి వర్గం నుంచి తీవ్రంగా వ్యతిరేకత వచ్చింది. సాయంత్రానికి కాంగ్రెస్ నేతలు హోటల్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశాన్ని ఢిల్లీ నేతలు సర్వనాశనం చేస్తున్నారని ఎమ్మెల్యే జెన్నిఫర్ మాన్సెరాటె మండిపడ్డారు. ఈ విషయం తెలియగానే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా బీజేపీ నేతలు గవర్నర్ మృదులా సిన్హా వద్దకు వెళ్లిపోయి.. తమకు 22 మంది మద్దతు ఉందని, అందువల్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. దాంతో అప్పుడు ఆలస్యంగా స్పందించిన కాంగ్రెస్ పార్టీ.. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రకాంత్ కవ్లేకర్‌కు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పింది. కానీ అప్పటికే జరగాల్సింది అంతా జరిగిపోయింది. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం పోయేందుకు తనదే బాధ్యత అని దిగ్విజయ్ సింగ్ భారంగా చెప్పారు. స్వతంత్ర సభ్యులిద్దరూ తమ పార్టీని మోసం చేశారని ఆయన ఆరోపించారు. ముందు రోజు ఏమైంది? శనివారం రాత్రి ఫలితాలు వెలువడిన తర్వాత జీఎఫ్‌పీ నాయకుడు విజయ్ సర్దేశాయ్ స్వయంగా వెళ్లి దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని తెలిపారు. అయితే కామత్‌ను ముఖ్యమంత్రి చేయాలని షరతు పెట్టారు. దానికి దిగ్విజయ్ ఏమీ చెప్పలేదు. అలాగే సర్దేశాయ్ వచ్చిన విషయాన్ని తమ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా చెప్పలేదు. ఈలోపు శనివారం రాత్రి గడ్కరీ గోవా వచ్చారు. వెంటనే ఎంజీపీ నేతలతో గంటలకొద్దీ మంతనాలు జరిపారు. వాళ్లు బీజేపీకి మద్దతిచ్చేందుకు సరేనన్నారు. తెల్లవారుజామున 4 గంటల వరకు ఈ చర్చలు జరిగాయి. ఆ తర్వాత గడ్కరీ.. విజయ్ సర్దేశాయ్‌ని కలిశారు. కానీ అప్పటికి ఏమీ ఫలితం రాలేదు. ఆదివారం మధ్యాహ్నం సర్దేశాయ్ వద్దకు గడ్కరీ తన దూతను పంపి, ఆయన్ను మళ్లీ హోటల్‌కు తీసుకొచ్చారు. అక్కడ డీల్ కుదిరింది. కేబినెట్లో మూడు పదవులు ఇస్తామని ఆయనకు హామీ లభించడంతో విజయ్ సర్దేశాయ్ సరేనన్నారు. పరీకర్‌కు అద్భుతమైన పాలనా నైపుణ్యాలు ఉన్నాయని ప్రశంసించారు. అంతే, గోవాలో బీజేపీ ప్రభుత్వానికి బాటలు పడ్డాయి.