పనజి : గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్‌ను జీసస్‌తో పోల్చి.. క్రిస్టియన్ల మనోభావాలు దెబ్బతీసారంటూ తనపై కాంగ్రెస్ పార్టీ తనపై చేస్తున్న విమర్శలపై గోవా మంత్రి విజయ్ సర్దేశాయి స్పందించారు. ‘ ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే నన్ను క్షమించండి. అయితే నాదొక విన్నపం. దయచేసి కాంగ్రెస్ పార్టీ పన్నిన వలలో చిక్కుకోకండి. మనుషుల మధ్య సఖ్యతకు బంధాలే వారధులని.. పరీకర్ ఆ విషయంలో విజయవంతమయ్యారని తాను అంటే.. కొందరేమో కాంక్రీటు బ్రిడ్జిల గురించి మాట్లాడి రాజకీయం చేస్తున్నారు’ అని శనివారం ఆయన వివరణ ఇచ్చారు.
కాగా బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో విజయ్ సర్దేశాయి మాట్లాడుతూ.. ‘ మనుషులు నిర్మించాల్సింది బ్రిడ్జీలు. గోడలు కాదు అని బైబిల్‌లో ఉంటుంది. ఆ జీసస్ వారధులు నిర్మించారు. పరీకర్ కూడా అలాగే చేస్తున్నారు. అంతకు ముందు మేము బ్రిడ్జికి ఆవలివైపు(యాంటీ బీజేపీ క్యాంపులో) ఉన్నాము. అయితే పరీకర్ నిర్మించిన బ్రిడ్జీల కారణంగా ప్రస్తుతం బీజేపీతో కలిసి నడుస్తున్నాం’ అంటూ గోవా సీఎంపై ప్రశంసలు కురిపించారు.
ఈ నేపథ్యంలో విజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి రోహిత్ బ్రాస్ డేసా మాట్లాడుతూ.. పరీకర్‌ను దేవుడితో పోల్చి విజయ్ క్రిస్టియన్లను అవమానించారంటూ విమర్శించారు. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొందినప్పటికీ.. గోవా ఫార్వర్డ్ పార్టీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో బీజేపీని తీవ్రంగా విమర్శించిన విజయ్ సర్దేశాయి(గోవా ఫార్వర్డ్ పార్టీ)ఆ పార్టీతో చేతులు కలపడంతో.. సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత ఎదుర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment