![Parrikar Threatening People From Hospital Says Congress - Sakshi](/styles/webp/s3/article_images/2018/09/21/MANOHAR.jpg.webp?itok=nnOGHwyX)
మనోహర్ పారికర్ (ఫైల్ ఫోటో)
పనాజి : గోవా సీఎం మనోహర్ పారికర్ ఆసుపత్రి నుంచే ప్రజలను బెదిరిస్తున్నారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకుడు చెల్లకుమార్ ఆరోపించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉండిఉంటారని.. నేరుగా పాలన చేయలేకపోయినా ఆసుపత్రి గది నుంచే పోన్లు చేసి ప్రజలను భయపెడుతున్నారని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పారికర్ అమెరికా, ముంబై, ఢిల్లీలో చికిత్స తీసుకున్నారని ఆయన ఆరోగ్య పరిస్థితి బులిటెన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పారికర్ ఆసుపత్రిలో చేరిన దగ్గరనుంచి ఆయనను కాంగ్రెస్ తొలిసారిగా విమర్శించింది. గోవా ఫార్వార్డ్ బ్లాక్ అధ్యక్షుడు విజయ్ సర్దేశాయ్ సీఎంతో ఫోన్‌లో మాట్లాడిన మరుసటి రోజే కాంగ్రెస్ ఆరోపణలు చేయడం గమనార్హం.
రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌లో పారికర్‌కు కూడా వాటా ఉందని, దీనిపై లోకయుక్తాతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న పారికర్ త్వరలో కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కాగా పారికర్ ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆయన వైద్యం కోసం వెళ్లిన దగ్గర నుంచి గోవాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రభుత్వం సుప్తచేతనావస్థలో ఉందని.. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు తగిన బలం ఉన్నందును తమకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు ఇటీవల గవర్నర్‌ను కోరిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment