
గోవా గవర్నర్ మృదుల్ సిన్హాను కలిసేందుకు రాజ్‌భవన్‌కు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదుపుతున్న కాంగ్రెస్
పనాజీ : గోవా సీఎం మనోహర్ పారికర్ తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరడంతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాల్లో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సీఎల్పీ నేత బాబు కవేల్కార్ నేతృత్వంలో 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ మృదుల్ సిన్హాను కలిసి అసెంబ్లీలో బలనిరూపణకు అవకాశం ఇవ్వాలని కోరేందుకు సంసిద్ధమయ్యారు. అయితే అమె అందుబాటులో లేకపోవడంతో మంగళవారం ఆమెతో భేటీ అవుతామని కవేల్కార్ తెలిపారు.
ప్రభుత్వ ఏర్పాటుకు తగిన సంఖ్యాబలం తమకు ఉన్నందున అసెంబ్లీని రద్దు చేయవద్దని తాము గవర్నర్‌ను కోరతామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పనిచేయలేని పరిస్థితి నెలకొంటే తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో 16 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అతిపెద్ద ఏకైక పార్టీగా అవతరించింది. అసెంబ్లీలో బలం నిరూపించుకునేందుకు కాంగ్రెస్‌కు మరో ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం.
మరోవైపు సీఎం పారికర్ అస్వస్థతతో పాలనను గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్యేలు, భాగస్వామ్య పక్షాలతో చర్చించేందుకు బీజేపీ కేంద్ర నాయకత్వం గోవాకు ముగ్గురు పార్టీ సీనియర్ నేతలతో కూడిన బృందాన్ని పంపింది. పారికర్ కోలుకునే వరకూ సీనియర్ మంత్రిని సీఎంగా నియమించాలనే డిమాండ్ ఊపందుకుంది.