Goa minister
-
గోవా మంత్రి రాజీనామా.. కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతకు అవకాశం
గోవా ప్రజా పనుల శాఖ (పీడబ్ల్యూడీ) మంత్రి నీలేష్ కాబ్రాల్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అలెక్సో సిక్వేరా రాష్ట్ర మంత్రివర్గంలోకి చేరేందుకు మార్గం సుగమం చేస్తూ ఆదివారం రాష్ట్ర మంత్రివర్గం నుంచి వైదొలుగుతూ తన రాజీనామాను సమర్పించారు. అలెక్సో సిక్వేరా ఆదివారం సాయంత్రం మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గత ఏడాది సెప్టెంబర్‌లో సిక్వేరా మరో ఏడుగురితో కలిసి కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. కాగా అంతకుముందు రోజు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌ను కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అవకాశం గురించి అడిగినప్పుడు ఆయన స్పష్టత ఇవ్వలేదు. అయితే నీలేష్ కాబ్రాల్ రాజీనామా చేయడంతో అలెక్సో సిక్వేరా ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమమైంది. రాష్ట్ర గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లై, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సమక్షంలో అలెక్సో సిక్వేరా ప్రమాణ స్వీకారం చేశారు. గత ఏడాది సెప్టెంబరులో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. వీరిలో కనీసం ముగ్గురికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని ఊహాగానాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం అలెక్సో సిక్వేరాను మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్, మాజీ మంత్రి మైఖేల్ లోబో రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కోసం ఎదురుచూస్తున్న వారిలో ఉన్నారు. -
మంత్రి ప్రయాణిస్తున్న విమానంలో మంటలు : తప్పిన ప్రమాదం
సాక్షి, పనాజి : ఇండిగో విమానానికి మరోసారి తృటిలో భారీ ప్రమాదం తప్పింది. 180మంది ప్రయాణికులతో బయలుదేరిన ఇండిగో విమానంలో అకస్మాత్తుగా మంటలు వ్యాంపించాయి. దీంతో ప్రయాణీకుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అయితే వెంటనే అప్రమత్తమైన పైలట్, విమానాన్ని తిరిగి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విమానంలో గోవా పర్యావరణ మంత్రి నీలేశ్ కాబ్రాల్ కూడా ఉన్నారు. గోవా దబోలిమ్ అంతర్జాతీయ విమానాశ్రయలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. గోవా నుంచి ఢిల్లీ బయలుదేరిన పదిహేను నిమిషాల తరువాత ఇంజీన్‌లో మంటలంటుకున్నాయని మంత్రి నీలేశ్ తెలిపారు. పైలట్ వెంటనే ఎడమ ఇంజీన్ ఆపివేసి తమను తిరిగి గోవాకు ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లారని తెలిపారు. తనతో సహా మిగిలిన 180 మంది సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. అధికారిక సమావేశానికి దేశ రాజధాని ఢిల్లీకి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించినట్టు మంత్రి చెప్పారు. -
వేదాలకు పచ్చని పంటలు
సాక్షి, న్యూఢిల్లీ : ‘మంత్రాలకు చింతకాయలు రాలుతాయా’ అని అంటారు గానీ, వేదాలకు పచ్చని పంటలే పండుతాయట! ఈ మాటను అక్షరాల నమ్మిన గోవాలోని బీజేపీ ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా పనిచేస్తున్న విజయ్ సర్దేశాయ్ మంగళవారం నాడు అధికారికంగా ఓ స్కీమ్‌నే ప్రారంభించారు. దీనికి ‘శివ్ యోగ్ కాస్మిక్ ఫార్మింగ్’ అని కూడా నామకరణం చేశారు. రైతులు ప్రతిరోజు పంట పొలాల ముందు ధ్యాన ముద్రలో (మెడిటేషన్) కూర్చొని ‘ఓం రమ్ జమ్ సాహ్’ అంటూ 20 సార్లు ఉచ్ఛరిస్తే చాలట. అలా చేయడం వల్ల రైతుల నోటి నుంచి వెలువడే శబ్దాల వెంట కాస్మిక్ కిరణాలు ప్రయాణించి ఎదురుగా ఉన్న పంట పైర్లకు తాకి వాటికి కొత్త శక్తినిస్తాయట. నేల లోపల క్రిమికీటకాదులను చంపేస్తాయట. అలా జవసత్వాలను సంతరించుకున్న పైరు ఏపుగా పెరుగుతందట. ఇందులో పైసా ఖర్చులేదు, ప్రయత్నించి చూడమని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం పంటల కోసం ఉపయోగిస్తున్న నీరు, ఎరువులను ఇక ముందు వాడాల్సిన అవసరం ఉందా, లేదా? అన్న విషయాన్ని మాత్రం ఆయన వివరించలేదు. దుక్కి దున్నీ నారుపోసి నీరుపోసి కష్టపడినా పంట చేతికొస్తదా, లేదా అన్న ఆందోళన పడే రైతుకు ఇవన్నీ లేకుండా పంట చేతి కొస్తదంటే రోజుకు 20 సార్లేం ఖర్మ 200 సార్లయినా వేదోక్తులను ఉచ్ఛరిస్తారు. ఈ శివ్‌యోగ్ కాస్మిక్ ఫార్మింగ్ విధానాన్ని మాజీ రసాయనిక ఇంజనీరు, ప్రస్తుత ‘శివ్ యోగ్ ఫౌండేషన్’ యోగా గురువు అవదూత్ శివానంద్ కనిపెట్టారట! ఆయన దగ్గర శిష్యరికం చేస్తున్న మంత్రి సర్దేశాయ్ భార్య ఉష ఈ వ్యవసాయం గురించి చెప్పడంతో నమ్మిన మన మంత్రి సర్దేశాయ్ దాన్ని అమలు చేయడం కోసం ఏకంగా స్కీమ్‌నే ప్రారంభించారు. ఈ అంశంలో సరైన అధ్యయనం లేకుండా ఎలా కాస్మిక్ ఫార్మింగ్ విధానాన్ని ప్రారంభిస్తారని సదరు మంత్రిని మీడియా ప్రశ్నించగా, మధ్యప్రదేశ్‌లో ఈ విధానం మంచి ఫలితాలు ఇచ్చిందని తెలిసి ప్రారంభించానని చెప్పారు. వ్యవసాయం అభివృద్ధి కోసం తాను ఏమి చేయడానికైనా సిద్ధమని, పంట పొలాల్లో రాక్ షో లేదా అందాల పోటీలను నిర్వహించడం వల్ల రైతుల్లో వ్యవసాయం పట్ల అంకిత భావం పెరుగుతుందంటే వాటిని ఏర్పాటు చేయడానికైనా తాను సిద్ధమని ఆయన చెప్పారు. ఆయన వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం పనాజీలో మంత్రి ప్రారంభించిన ఈ స్కీమ్‌ను విధిగా అమలు చేయాల్సిందిగా తాము రైతులను కోరడం లేదని చెప్పారు. -
గోవా మంత్రిపై కాంగ్రెస్ ప్రశంసలు
పణజి: బీజేపీ నేతృత్వంలోని గోవా ప్రభుత్వంలో మంత్రి కొనసాగుతున్న విజయ్ సర్దేశాయ్ పై కాంగ్రెస్ పార్టీ ప్రశంసలు కురిపించింది. విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ)కు ఆయన వార్నింగ్ ఇవ్వడాన్ని స్వాగతించింది. తమ సామరస్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న వీహెచ్‌పీ నాయకులకు ముకుతాడు వేసేందుకు వెనుకాడబోమని సర్దేశాయ్ హెచ్చరించడం సాహసోపేతమైన చర్యగా గోవా కాంగ్రెస్ అధికార ప్రతినిధి ట్రాజానో డీమెల్లో పేర్కొన్నారు. మత సామరస్యాన్ని కోరుకునే వారంతా సర్దేశాయ్ ను అభినందించాలని, ఆయన హెచ్చరికలకు మద్దతు తెలపాలని కోరారు. అలజడులకు కారణమవుతున్న వీహెచ్‌పీ లాంటి సంస్థలపై నిషేధం విధించేందుకు ప్రభుత్వం వెనుకాడరాదని సూచించారు. గోవాలో వచ్చే రెండేళ్లలో బీఫ్ వినియోగంపై ప్రభుత్వం నిషేధం విధించకుంటే తామే బాన్ చేస్తామని వీహెచ్‌పీ నేత రాధాకృష్ణ మనోహరి ఆదివారం ప్రకటించారు. దీనిపై సర్దేశాయ్ స్పందిస్తూ... వీహెచ్‌పీ నేతలు తమ తీరు మార్చుకోకుంటే శ్రీరామ సేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. గోవాలో అడుగుపెట్టకుండా ముతాలిక్ పై గతంలో నిషేధం విధించిన సంగతి తెలిసిందే. -
రేపిస్టులు ఒట్టి అమాయకులు: గోవా మంత్రి
పణాజి: 'గ్యాంగ్ రేప్ లు ఎక్కడ జరగడంలేదు చెప్పండి. ఇదిగో.. ఇద్దరు మహిళల్ని రేప్ చేసిన నిందితులున్నారే.. పాపం ఒట్టి అమాయకులు. నా దృష్టిలో ఇలాంటివి చాలా చిన్న సంఘటనలు. ఇలాంటి ఘటనలవల్ల మా ప్రాంతానికి, ఇక్కడ జరిగే వ్యాపార కార్యకలాపాలకు ఎలాంటి నష్టం వాటిల్లదు'.. ఇవీ బాధ్యత వహించిన గోవా పర్యాటక శాఖ మంత్రి దిలీప్ పరులేకర్ తాజా వ్యాఖ్యలు. ఢిల్లీకి చెందిన ఇద్దరు మహిళలపై ఐదుగురు యువకులు గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఘటనపై గురువారం రాత్రి మీడియాతో మాట్లాడుతు ఆయన ఈ విధంగా స్పందించారు. గోవా పర్యటనకు వచ్చిన ఇద్దరు ఢిల్లీ మహిళల్ని సోమవారం రాత్రి ఐదుగురు యువకులు బెదిరించి.. అరుణ గ్రామంలోని ఓ భవంతిలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కొన్ని గంటల తర్వాత గస్తీ పోలీసు బృందం వారిని కాపాడింది. బాధితురాళ్లు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే మంత్రిగారు ఈ విధమైన కాంమెంట్లు చేయడంపై దుమారం చెలరేగింది. గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ఉర్ఫాన్ ముల్లా మంత్రి వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రభుత్వం తీరువల్లే గోవాలో నేరాలు పెట్రేగిపోతున్నాయని విమర్శించారు. రెండేళ్ల కిందట పణాజిలో ఓ మ్యూజిక్ ఫెస్టివల్ లో మాదక ద్రవ్యాలతో పట్టుబడిన యువకుడి ఉదంతంలోనూ మంత్రిగారు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. గోవా లాంటి పర్యాటక ప్రాంతంలో మద్యం, మాదక ద్రవ్యాలను వినియోగించడం మామూలేనని, అవి లేకుంటే టూర్ ను ఆస్వాదించలేమని, ఇందుకు నిర్వాహకులను తప్పుపట్టాల్సిన పనిలేదన్నారు. -
'అత్యాచార' వ్యాఖ్యలను సమర్ధించిన మంత్రి
పనాజీ: పిల్లల్ని కాన్వెంట్ స్కూల్ కు పంపుతూ పాశ్యాత్య సంస్కృతికి అలవాటు పడటం వల్లే అత్యాచారాలు పెరుగుతున్నాయన్న భార్య లలిత వ్యాఖ్యలను గోవా మంత్రి దీపక్ ధవలికర్ సమర్ధించారు. ఆయన భార్య లలిత చేసిన అత్యాచార వ్యాఖ్యలపై మంత్రి ఈ విధంగా స్పందించారు. నేటి పిల్లల డ్రెస్ లను ఒకసారి పరిక్షించండి అంటూ ఆమె చేసిన వివాదస్పద వ్యాఖ్యలకు మరింత ఆజ్యం పోశారు. మహిళలు డ్రెస్ లు విషయంలో సరిగా లేకపోవడం వల్లే అత్యాచారాలు జరగడానికి ప్రధాన కారణమన్నారు.'ఒకసారి చూడండి. ప్రజల్లో పూర్తిగా మార్పులు చూస్తున్నాం. వారి పద్ధతుల దగ్గర్నుంచి డ్రెస్ విషయంలో కూడా అనేక మార్పులు వచ్చాయి. ఆ క్రమంలోనే రేప్ లో కూడా పెరుగుతున్నాయంటూ భార్య వ్యాఖ్యలను వెనకేసుకొచ్చారు. అత్యాచారాలు పెరగడానికి కారణమవుతున్న పాశ్చాత్య సంస్కృతికి మహిళలు దూరంగా ఉండాలని మంత్రి భార్య లలిత ఉచిత సలహా ఇచ్చి వివాదానికి తెరలేపిన సంగతి తెలిసిందే. సనాతన్ సంస్థలో పనిచేస్తున్న ఆమె మార్గావ్ లో ఆదివారం జరిగిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు .అత్యాచారాలు పెరగడానికి కారణమవుతున్న పాశ్చాత్య సంస్కృతికి మహిళలు దూరంగా ఉండాలన్నారు. హిందూ పురుషులు బయటకు వెళ్లేటప్పుడు విధిగా తిలకం పెట్టుకోవాలని, మహిళలు కుంకుమ పెట్టుకోవాలని సూచించారు. జనవరి ఫస్టు కాకుండా గుడి పడ్వాను నూతన సంవత్సరంగా జరుపుకోవాలన్నారు. పిల్లలను కాన్వెంట్ స్కూల్స్ కు పంపించొద్దని, ఫోన్ లో 'హలో' కు బదులుగా నమస్కారం అనాలని లత సలహాయిచ్చారు. మన సంస్కృతిని కాపాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. -
మంత్రి భార్య వివాదాస్పద వ్యాఖ్యలు
పనాజీ: పిల్లల్ని కాన్వెంట్ స్కూల్స్ కు పంపించొద్దంటూ గోవా మంత్రి దీపక్ ధవలికర్ సతీమణి లత వివాదంలో చిక్కుకున్నారు. అత్యాచారాలు పెరగడానికి కారణమవుతున్న పాశ్చాత్య సంస్కృతికి మహిళలు దూరంగా ఉండాలని కూడా ఉచిత సలహాయిచ్చారు. వివాదస్పద సనాతన్ సంస్థలో పనిచేస్తున్న ఆమె మార్గావ్ లో ఆదివారం జరిగిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. హిందూ పురుషులు బయటకు వెళ్లేటప్పుడు విధిగా తిలకం పెట్టుకోవాలని, మహిళలు కుంకుమ్ పెట్టుకోవాలని సూచించారు. జనవరి ఫస్టు కాకుండా గుడి పడ్వాను నూతన సంవత్సరంగా జరుపుకోవాలన్నారు. పిల్లలను కాన్వెంట్ స్కూల్స్ కు పంపించొద్దని, ఫోన్ లో 'హలో' కు బదులుగా నమస్కారం అనాలని లత సలహాయిచ్చారు. మన సంస్కృతిని కాపాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అత్యాచారాలు పెరగడానికి కారణమవుతున్న పాశ్చాత్య సంస్కృతిని అనుకరిస్తూ భారత మహిళలు వింతగా తయారవుతున్నారని మండిపడ్డారు. నుదుటిన కుంకుమ పెట్టుకోవడం మానేశారని ఆవేదన వ్యక్తం చేశారు. శరీర కొలతలు కొట్టొచ్చినట్టు కనబడేలా బిగుతు బట్టలేసుకుంటున్నారని, జడలు వేసుకోవడం మానేసి జుత్తును కత్తిరించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భార్య చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు దీపక్ ధవలికర్ నిరాకరించారు. లత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. మతం ప్రాతిపదికన రాష్ట్రాన్ని విడగొట్టే కుట్రలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది. -
మోడీ భారత్‌ను హిందూ దేశంగా మారుస్తారు
పణజీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ భారతదేశాన్ని హిందూ దేశంగా మారుస్తారంటూ గోవా సహకార మంత్రి దీపక్ ధావలికర్ వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయానికి నరేంద్రమోడీని అభినందిస్తూ చేసిన తీర్మానంపై గురువారం దీపక్ గోవా అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మోడీజీ నాయకత్వంలో భారత్ హిందూ దేశంగా అభివృద్ధి చెందుతుందనే నమ్మకం నాకుంది. ఈ దిశగా ప్రధాని పనిచేస్తారని నేను భావిస్తున్నా..’’ అని దీపక్ అన్నారు. దీపక్ సోదరుడు, రవాణా మంత్రి సుదిన్ కొద్ది రోజుల క్రితం బీచ్‌ల్లో బికినీలపై నిషేధం విధించాలని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన ఘటన మరువక ముందే దీపక్ తాజా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బీజేపీ కూటమిలోని మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీకి చెందిన దీపక్, సుదిన్.. మనోహర్ పారికర్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. మరోవైపు గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యే మౌవిన్ గొడిన్హో మోడీని దివంగత ప్రధాని ఇందిరాగాంధీతో పోల్చారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోడీ పనితీరు, నాయకత్వ లక్షణాలు, ఆలోచనా విధానం ఇందిర ప్రధానిగా ఉన్నప్పుడు చూడగలిగామని కొనియాడారు. మోడీ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని, ఆయన గెలుపు చారిత్రకమని వ్యాఖ్యానించారు. -
మంత్రి బికినీ ఫొటో: నిందితుడు ఎన్నారై
గోవా ప్రజాపనుల శాఖ మంత్రి సుదీన్ దావలికర్ ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేస్ బుక్‌లో పెట్టిన ఎన్నారై సవియో అల్మిడాపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు గోవా పోలీసులు బుధవారం వెల్లడించారు. గోవాకు చెందిన సవియో అమెరికాలో నివసిస్తున్నాడని తెలిపారు. గోవా బీచ్‌లు, నైట్ క్లబ్‌లలో బికినీలు నిషేధించాలంటూ ఇటీవల మంత్రి సుదీన్ దావలికర్ ఓ కార్యక్రమంలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మూడు క్లబ్‌లు, ఆరు బీచ్‌లతో అలరారే గోవా రాష్ట్రంలో బికినీలు నిషేధిస్తే ఎలా అంటూ దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. దాంతో సదరు మంత్రిగారు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. అయితే మంత్రి వ్యాఖ్యలపై అమెరికాలో నివసిస్తున్న గోవాకు చెందిన సవియో ఆగ్రహాం కలిగించింది. దాంతో సుదీన్ పోటోలను మార్పింగ్ చేసి ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశాడు. మంత్రి సుదీన్ ఫొటోలు ఫేస్బుక్లో హల్చల్ చేశాయి. దీంతో గోవాకు చెందిన ప్రదీప్ బక్లే అనే వ్యక్తి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ క్రమంలో యూఎస్ లో నివసిస్తున్న సవియో నిందితుడని పోలీసులు గుర్తించారు. -
మ్యూజిక్ ఫెస్టివల్స్‌లో డ్రగ్స్ మామూలే: గోవా మంత్రి
పణజీ: మ్యూజిక్ ఫెస్టివల్స్ వంటి కార్యక్రమాల్లో పాల్గొనేవారు మద్యం, మాదక ద్రవ్యాలను వినియోగించడం మామూలేనని గోవా పర్యాటక మంత్రి దిలీప్ పరులేకర్ ఆదివారం అన్నారు. గోవాలో జరిగిన సన్‌బర్న్ ఫెస్టివల్లో కార్యక్రమం జరుగుతున్న చోటే శనివారం ఒక యువకుడు మాదకద్రవ్యాలతో పట్టుబడ్డాడు. మంత్రి పరులేకర్ మాట్లాడుతూ, మద్యం, మాదకద్రవ్యాలు లేకుండా మ్యూజిక్ ఫెస్టివల్స్‌ను ఆస్వాదించలేమని వాటిలో పాల్గొనేవారు భావిస్తుంటారని, ఇందుకు నిర్వాహకులను తప్పుపట్టాల్సిన పనిలేదన్నారు.