
గోవా ప్రజా పనుల శాఖ (పీడబ్ల్యూడీ) మంత్రి నీలేష్ కాబ్రాల్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అలెక్సో సిక్వేరా రాష్ట్ర మంత్రివర్గంలోకి చేరేందుకు మార్గం సుగమం చేస్తూ ఆదివారం రాష్ట్ర మంత్రివర్గం నుంచి వైదొలుగుతూ తన రాజీనామాను సమర్పించారు. అలెక్సో సిక్వేరా ఆదివారం సాయంత్రం మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
గత ఏడాది సెప్టెంబర్‌లో సిక్వేరా మరో ఏడుగురితో కలిసి కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. కాగా అంతకుముందు రోజు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌ను కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అవకాశం గురించి అడిగినప్పుడు ఆయన స్పష్టత ఇవ్వలేదు. అయితే నీలేష్ కాబ్రాల్ రాజీనామా చేయడంతో అలెక్సో సిక్వేరా ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమమైంది. రాష్ట్ర గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లై, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సమక్షంలో అలెక్సో సిక్వేరా ప్రమాణ స్వీకారం చేశారు.
గత ఏడాది సెప్టెంబరులో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. వీరిలో కనీసం ముగ్గురికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని ఊహాగానాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం అలెక్సో సిక్వేరాను మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్, మాజీ మంత్రి మైఖేల్ లోబో రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కోసం ఎదురుచూస్తున్న వారిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment