కౌశంబీ ఆశ్రమంలో విద్య అభ్యసించిన తరువాత విద్యార్థులు కౌకర్ణిక ఆశ్రమానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడే ఉత్తమ శిష్యుల ఎంపిక జరుగుతుంది. తంత్ర విద్యలు, శక్తి విద్యలు అక్కడే సుకేతు మహర్షి నుంచి నేర్చుకోవాలి. కౌశంబీ నుంచి కేవలం ఆరుగురు మాత్రమే ఈ దఫా ఎన్నికయ్యారు. వారందరినీ కౌకర్ణికకు పయనవమని చెప్పాడు మహర్షి సంకేత. ఆరుగురు విద్యార్థులను పంపుతున్నానని వాళ్ళల్లో ఉత్తమ శిష్యుడిని ఎంపిక చేయమని కబురు పెట్టాడు సంకేత.
ఆరుగురు కౌకర్ణిక ఆశ్రమానికి బయలుదేరారు. సుకేతు మహర్షి దివ్యదృష్టితో చూసి తన శక్తితో ఓ ఉద్ధృతమైన వాగును, ఆ వాగు దగ్గర అపూర్వ సౌందర్యవతిని సృష్టించాడు. శిష్యులు వాగు దగ్గరకు వచ్చారు. ఆ యువతిని చూడగానే ఆరుగురు శిష్యుల్లో ఐదుగురికి మతి చలించింది. అయినా దూరం నుంచే ‘అమ్మాయీ.. దారి తప్పుకో.. మేము వాగు దాటి వెళ్ళాలి’ అన్నాడు ఒకడు. దానికి ఆ యువతి ‘చీకటి పడుతోంది.. నేనూ వెళ్ళాలి. నన్ను వాగు దాటించండి’ అని అడిగింది. ‘మేము సర్వసంగ పరిత్యాగులం.
పర స్త్రీని తాకము’ అంటూ ముందుకు కదిలారు ఆ ఐదుగురు. ‘బాబ్బాబులూ.. దయచేసి నన్ను వాగు దాటించండి’ అంటూ ఆ యువతి వేడుకుంది. ‘వాగు చాలా వేగంగా ప్రవహిస్తోంది. నువ్వు ఇంకెవరి సాయమైనా అడుగు’ అని చెప్పనైతే చెప్పారు కానీ.. ఆ యువతిని క్రీగంట గమనించడం మానలేదు వాళ్లు. ఆరవ శిష్యుడు విక్రముడు మాత్రం ‘నేను వాగు దాటిస్తాను రండమ్మా..’ అంటూ ముందుకు వచ్చాడు. మిగిలిన ఐదుగురు ‘ఆ పాపం మాకొద్దు’ అంటూ వాగులోకి దిగారు. విక్రముడు ఆ యువతి చేయి పట్టుకుని వాగులోకి దిగాడు. ‘అమ్మా.. వాగు ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. మీరు నా భుజాల మీదకు ఎక్కండి’ అన్నాడు.
మారు మాటాడకుండా ఆ యువతి విక్రముడి భుజాల మీదకు ఎక్కింది. అది చూసిన ఐదుగురు శిష్యులు తమకు దక్కని అదృష్టం వాడికి దక్కిందని అసూయపడ్డారు. వాగు దాటిన తరువాత ఆ యువతి విక్రముడికి కృతజ్ఞతలు చెప్పి.. తన దారిన తాను వెళ్ళిపోయింది. ఆ ఐదుగురు మాత్రం కౌకర్ణిక దారెంట విక్రముడిని కుళ్లబొడవసాగారు. ‘స్త్రీని తాకావు.. భుజాల మీద కూర్చోబెట్టుకున్నావు’ అంటూ! విక్రముడు ఆ మాటలను పట్టించుకోకుండా మౌనంగా నడవసాగాడు. సుకేతు తన దివ్య దృష్టితో ఇదంతా చూడసాగాడు. ఎట్టకేలకు ఆరుగురు శిష్యులు కౌకర్ణిక ఆశ్రమానికి చేరుకున్నారు. సుకేతు మహర్షికి పాదాభివందనం చేశారు.
ఆ ఆరుగురినీ చూసి మహర్షి మందహాసం చేశాడు. విక్రముడిని తన పక్కకు వచ్చి నిల్చోమన్నాడు. మహర్షి చేప్పినట్టే చేశాడు విక్రముడు. అప్పుడు మహర్షి మిగిలిన ఐదుగురిని ఉద్దేశిస్తూ ‘ఆపదలో ఉన్న స్త్రీని విక్రముడు ఓ తల్లిగా, సోదరిగా భావించి వాగు దాటించాడు. కానీ మీరు ఆ స్త్రీని మోహించారు. పైకి సర్వసంగ పరిత్యాగుల్లా నటించారు. వాగు దాటిన తక్షణమే ఆ యువతిని, ఆమెకు చేసిన సాయాన్నీ మరచిపోయాడు విక్రముడు. కానీ మీరు మనసులో ఆ స్త్రీనే మోస్తూ విక్రముడిని కుళ్లబొడుస్తూ మీ మాలిన్యాన్ని ప్రదర్శించారు. మీ నిగ్రహాన్ని పరీక్షించడానికి ఆ యువతిని నేనే సృష్టించాను. ఆ పరీక్షలో విక్రముడు నెగ్గాడు. అతనే ఉత్తమ శిష్యుడు’ అని చెప్పాడు మహర్షి. ఆ విషయాన్ని కౌశంబీకీ కబురుపెట్టాడు. – కనుమ ఎల్లారెడ్డి
ఇవి చదవండి: వసు మహారాజు వృత్తాంతం! ఒకనాడు తన సోదరుల్లో..
Comments
Please login to add a commentAdd a comment