విజయనగర రాజు విజయేంద్రవర్మ మంచి ఇంద్రజాలికుడు. ఎక్కడికి వెళ్ళినా, కళల గురించి గొప్పగా మాట్లాడేవాడు. ఒకసారి తన రాజ్యంలో కళాకారులు ఎంత గొప్పగా జీవిస్తున్నారో, గౌరవించబడుతున్నారో తెలుసుకోవాలన్న కోరిక కలిగింది. వెంటనే మారువేషంలో గుర్రం మీద దేశసంచారానికి బయలుదేరాడు.
ఒక ఊరి సంతలో కమ్మటి గానం విని గుర్రాన్ని ఆపి అటు వైపు వెళ్లాడు. అక్కడ నలుగురు సంగీత వాయిద్యాలు వాయిస్తుంటే మరో ఇద్దరు గానం చేస్తున్నారు. ఆ గానం చేస్తున్న యువతీ,యువకుడు ఇద్దరూ అంధులే! మధురంగా పాడటం ఆపాక సంతలో ఉన్నవారిని దానం చేయమని కోరారు. తన రాజ్యంలో కళాకారులు అడుక్కోవటం చూసి ఆశ్చర్యపోయాడు విజయేంద్రవర్మ.
‘రాజు గొప్ప కళాకారుడు! ఎప్పుడూ కళాకారుల గురించే మాట్లాడుతాడు! మీరు ఇలా యాచించటం వింతగా ఉంది!’ అంటూ యువతిని అడిగాడు రాజు.
‘రాజు కళాకారుడైనందుకు మా బతుకులు బాగైతాయని సంతోషించాము. అతని మాటలు కోటలు దాటుతాయి కానీ పనులు మాత్రం శూన్యం’ అన్నది ఆమె. విజయేంద్రవర్మ మౌనంగా ఉండిపోయాడు.
గుర్రం ఎక్కి మరో గ్రామం చేరుకున్నాడు. అక్కడొక యువతి నృత్యం చేస్తుంటే .. కొందరు గ్రామ పెద్దలు వెకిలిగా నవ్వుతూ డబ్బులిస్తున్నారు. నృత్యం ముగిశాక ‘చూడమ్మా! రాజు కళాప్రేమికుడు కదా! నువ్వేంటి ఇలా దిగజారి అడుక్కుంటున్నావు?’ అడిగాడు విజయేంద్రవర్మ.
‘రాజు కళాప్రేమికుడే. కాని కళాపోషకుడు మాత్రం కాదు. క్రియా శూన్యుడు. అతను చెప్పేది నిజంగా చేస్తే మాకు ఈ బతుకు ఉండక పోయేది!’ ఆవేశంగా అంది ఆమె.
ఆ జవాబు విని మౌనంగా ముందుకు కదిలాడు రాజు. మరో గ్రామంలో ఒక వయసు పైబడిన ఇంద్రజాలికుడు ఇంద్రజాలం చేస్తూ కనిపించాడు. ఇంద్రజాలికుడిని చూడగానే విజయేంద్రవర్మకు ఎక్కడలేని ఉత్సాహం కలిగింది. రాజు అతనిలో తనని చూసుకున్నాడు. ప్రేక్షకులు చప్పట్లతో అతన్ని ఉత్సాహపరుస్తున్నారు. ఇంద్రజాలికుడి ప్రదర్శన ముగిశాక నెత్తిన ఉన్న టోపి తీసి దానం చేయమని అడిగాడు. ‘తాతా ! రాజు కూడా నీ వలె గొప్ప ఇంద్రజాలికుడు కదా! నువ్వేంటి ఇలా..!’ అడిగాడు రాజు.
‘నువ్వు శంఖాన్ని ఎప్పుడైనా చెవి దగ్గర పెట్టుకొని విన్నావా? వింటే సముద్రపు హోరులా శబ్దం వస్తుంది. ఆ శబ్దం నిరంతరం వస్తూనే ఉంటుంది. అలా శబ్దం చేయడం వల్ల ప్రయోజనం అటు శంఖానికి, ఇటు మనకు ఉండదు! రాజు గారి ప్రసంగాలు కూడా అంతే!’ అన్నాడు అతను.
కళాకారులు తనని తోటి కళాకారుడిగా, కళల పట్ల విడువకుండా రోజంతా మాట్లాడగలిగే మంచి వక్తగా గుర్తించారే తప్ప మంచి పాలకుడిగా గుర్తించలేదని తెలుసుకున్నాడు విజయేంద్రవర్మ. ఆనాటి నుండి కళాకారులను గుర్తించి, వారికి తగిన ఉద్యోగాలు కల్పించి ఆర్థికంగా ఆదుకున్నాడు. వికలాంగ కళాకారులను గుర్తించి వారికి ప్రత్యేకంగా ఆరోగ్య సౌకర్యాలు, వసతులు కల్పించాడు.
పేద కళాకారులను గుర్తించి వీలున్న చోటల్లా వారి సేవలను వినియోగించుకుని ఘనంగా సత్కరించాడు. మాటల్ని డబ్బులంత పొదుపుగా వాడుకుంటూ చేతలను నీళ్ళలా పరోపకారం కోసం ప్రవహింపచేశాడు. అలా కొద్ది రోజుల్లోనే విజయేంద్రవర్మ క్రియా శూన్యుడు కాదు.. క్రియా శూరుడిగా పేరు పొందాడు. – కొట్రా సరిత
ఇవి చదవండి: ఆ ముగ్గురూ... ఓ ఉత్తరం!
Comments
Please login to add a commentAdd a comment