కేసరివనానికి రాజు సింహం. మంత్రి నక్క. మృగరాజు సింహానికి మారుతి అనే కోతి ఆంతరంగికుడిగా ఉండేది. మారుతి ఎప్పుడూ మృగరాజు వెన్నంటే ఉండేది. అడవిలో విహారానికి వెళ్లినా, వేటకు పోయినా, తోటి జంతువులు చేసుకునే శుభకార్యాలకు కదిలినా మారుతి.. మృగరాజు పక్కన ఉండాల్సిందే. మారుతి లేకుండా సింహం గుహదాటి బయటకు వచ్చేది కాదు.
పక్క అడవుల రాజులు ఏనుగు, పులితో పాటు, ముఖ్యమైన విషయాలు చర్చించటానికి ఇతర జంతువులూ గుహకు వచ్చి సింహాన్ని కలిసేవి. ఒక్కోసారి సింహం కూడా పక్క అడవులకు వెళ్లేది. అక్కడ అవి మాట్లాడుకునే మాటలన్నీ మారుతి వినేది. అంతేకాదు గుహలో కూడా మృగరాజు కుటుంబం మాట్లాడుకునే కబుర్లు, రహస్యాలు కూడా మారుతి చెవిన పడేవి.
దాంతో మారుతికి మృగరాజు బలాలు, బలహీనతలు అన్నీ తెలవటానికి ఎక్కువ సమయం పట్టలేదు. అడవిలో బాట వెంట సింహం నడుస్తుంటే మారుతి చెట్ల మీంచి గెంతుతూ, దూకుతూ చుట్టూ పరిసరాలను జాగ్రత్తగా గమనించేది. ఏదైన ప్రమాదం పొంచి ఉందనే అనుమానం వస్తే పైనుంచే సింహాన్ని హెచ్చరించేది.
ఒకరోజు ఉదయాన్నే సింహంతో రహస్య సమావేశానికి పక్క అడవి రాజు ఏనుగు.. కేసరి వనానికి బయలుదేరింది. వనానికి చేరుకోగానే ఆ ఏనుగుపై గుర్తుతెలియని కొన్ని జంతువులు ఆకస్మికంగా దాడి చేశాయి. ఆ సమాచారం అందిన వెంటనే మృగరాజు సింహం, నక్క పరుగున వెళ్లి ఏనుగు ప్రాణాలను కాపాడాయి. తన రాజ్యంలో పక్క అడవి రాజు ఏనుగుపై దాడి జరగటం మృగరాజుకు అవమానంగా తోచింది. ‘మిత్రమా! నాకోసం నువ్వు వస్తున్నట్లు ఎవరికీ తెలీదు.
ఈ దాడి ఎలా జరిగిందో అర్థం కావట్లేదు. ఇది పూర్తిగా నా వైఫల్యమే.. నన్ను క్షమించు’ అని ఏనుగును వేడుకొని తన గుహకు తోడ్కొని పోయింది సింహం. ‘ప్రభూ! మీరు మారుతిని గుడ్డిగా నమ్మి అన్ని విషయాలు పంచుకుంటున్నారు. పక్క అడవి రాజు.. పులి స్వభావం మీకు తెలియంది కాదు. మాటుగా దాడిచేసి రెండు రాజ్యాలను ఆక్రమించుకోవాలని చూస్తోంది. ఈ సమాచారాన్ని అందించింది మారుతీయేమోనని నా అనుమానం’ అంది నక్క. ఆ మాట విని మౌనంగా ఉండిపోయింది సింహం.
ఇంకోరోజు పక్క అడవి నుంచి కాకి వచ్చి ‘మృగరాజా! రేపు మా పులిరాజు పుట్టినరోజు. వేడుకకు రమ్మని ఆహ్వానం పంపారు!’ అంది. అది విన్న మారుతి చేతివేళ్లతో లెక్కలు వేసి అక్కడి నుంచి బయటకు వెళ్లింది. మరునాడు సింహం, నక్క, కోతి పక్క అడవి పులిరాజు పుట్టినరోజు వేడుకకు బయలుదేరాయి. మరో దిక్కు నుంచి ఏనుగు తన పరివారంతో వేడుకకు బయలు దేరింది. అవి రెండూ పులి ఉండే అడవి శివార్లలో కలుసుకున్నాయి.
‘గజరాజా.. ఎక్కడికి ప్రయాణం?’ అడిగింది నక్క. ‘పులిరాజు పుట్టినరోజు వేడుకకు’ జవాబిచ్చింది ఏనుగు. ఆశ్చర్యపోయింది నక్క. నలుదిక్కులూ చూడసాగింది. ‘ఎవరికోసం మంత్రివర్యా వెతుకుతున్నారూ?’ అడిగింది మారుతి.
‘ఏం లేదు! ఏం లేదు’ తడబడుతూ చెప్పింది నక్క. అంతలో బంధించిన పులిని లాక్కొచ్చింది ఎలుగుబంటి. ‘మహామంత్రీ! మీ ధైర్యసాహసాలు చాలా గొప్పవి’ అని అభినందించింది ఏనుగు.
‘మిత్రులారా! నన్ను మన్నించండి. నక్క చెప్పుడు మాటలు విని మీపై దాడిచేసి రెండు రాజ్యాలను ఆక్రమించాలనుకున్నాను. కానీ మృగరాజు ఆంతరంగికుడు మారుతి ముందు మా ఎత్తులు చిత్తయినవి. గతంలో గజరాజు పై దాడి కూడా నక్క సహకారంతో నేనే చేయించాను. ఇప్పుడు ఈ పుట్టినరోజు ఎత్తు కూడా నక్క సలహానే. మీ రెండు రాజ్యాలు ఆక్రమించేలా నక్క సహకరించినందుకు ఒక రాజ్యాన్ని తనకు అప్పగించి దానికి రాజును చెయ్యమని కోరింది’ అని చెప్పింది పులి.
‘మారుతి అఆనుమానంతో లెక్కలు వేసి నీ పుట్టినరోజు ఈరోజు కాదని, దీని వెనుక ఏదో కుట్ర ఉందని ముందుగానే పసిగట్టి గజరాజు సహకారం కోరింది. గజరాజు ముందుగానే మీ అడవికి ఎలుగుబంటిని పంపాడు. ఇదంతా నాపై దాడికి వేసిన ఎత్తని తేలింది!’ అంది సింహం.
నక్క సిగ్గుతో తలవంచుకుంది. క్షమించమని వేడుకుంది. మంచిదానిలాæ నటించి మారుతిపై చాడీలు చెప్పిన నక్కను, కుట్రలో భాగమైన పులినీ బంధించి చెరసాలలో వేసింది సింహం. ఏనుగు, సింహం, ఎలుగుబంటి.. ఆంతరంగికుడు మారుతిని అభినందించాయి. పులి రాజ్యానికి ఎలుగుబంటిని రాజును చేశాయి మృగరాజు, గజరాజులు. – ముద్దు హేమలత
Comments
Please login to add a commentAdd a comment