Courtesy: IPL Twitter
రామయ్య అడవిలో ఎండిన చెట్ల కొమ్మలు గొడ్డలితో కొట్టి, వాటిని మోపుగా కట్టి, సాయంత్రం సంతలో అమ్మి.. ఆ వచ్చిన సొమ్ముతో కుటుంబ పోషణ చేస్తాడు. రామయ్యతో పాటు కొమ్మలు నరికే వారు తొమ్మిది మంది ఉన్నారు. ఒకసారి బాగా పొద్దు పోయాక రామయ్య వద్ద కట్టెల మోపును, రైతు చంద్రయ్య కొన్నాడు. వాటితో అతని భార్య వంట చేసింది. వంట పూర్తి అయ్యాక పొయ్యిలోని బూడిదను ఎత్తి పోస్తుంటే ఒక వజ్రం ధగధగా మెరిసింది. భర్తతో విషయం చెప్పి ‘అబ్బ ఇన్నాళ్లకు మన కష్టాలు తీరాయి’ అంది.
‘తప్పు.. మన మహారాజు ప్రజలను కన్న బిడ్డలుగా చూస్తున్నాడు. ఈ వజ్రం బహుశా కట్టెల మోపులో వచ్చి ఉంటుంది. పరాయి సొమ్ము పాముతో సమానం. ఇది మనకు వద్దు’ అని భార్యకు నచ్చజెప్పి ఆ వజ్రాన్ని తీసుకుని కోటకు వెళ్లి జరిగింది చెప్పి రాజుకు ఇచ్చాడు.
‘నీవు ఎవరి వద్ద కట్టెల మోపును కొన్నావో గుర్తు తెచ్చుకో!’ అని అడిగాడు రాజు.
‘ఆ రోజు బాగా పొద్దుపోయాక కొన్నాను.. ఎవరి వద్ద కొన్నానో తెలియదు మహారాజా!’ అన్నాడు చంద్రయ్య.
‘ఈ వజ్రం ఎవరిది? కట్టెల మోపులోకి ఎలా వచ్చింది?’ అని మంత్రితోనూ, న్యాయాధికారితోనూ చర్చించాడు రాజు.
‘మాంసం ముక్క అనుకుని ఏదైనా పక్షి ఈ వజ్రాన్ని ముక్కుతో కరుచుకుని.. కొమ్మ మీద ఉన్నప్పుడు అది జారి చెట్టు కొమ్మ సందులో ఇరుక్కుని ఉంటుంది. కొమ్మలు నరికినప్పుడు అది ఏ కొమ్మలోనైనా ఉండిపోయి ఉంటుంది. దానిని కట్టెలు కొట్టే అతను గమనించి ఉండడు. సంతలో ఎవరెవరు కట్టెల మోపును అమ్ముతారో వారందరినీ పిలిపించండి’ అని సలహా ఇచ్చాడు న్యాయాధికారి.
రాజు అలాగే ఉత్తరువులు ఇచ్చాడు.
తొమ్మిది మంది సభకు వచ్చారు. ‘కట్టెల మోపులను మేమే అమ్మాము. ఆ వజ్రం మాకే చెందుతుంది. మేము దానిని అమ్మి ఆ సొమ్మును సమానంగా పంచుకుంటాం’ అన్నారు ఆ తొమ్మండుగురు. గ్రామాధికారిని పిలిపించి ‘వీరేనా.. కట్టెలు కొట్టి అమ్మేవారు ఇంకా ఎవరైనా ఉన్నారా?’ అని అడిగాడు రాజు. ‘వీరితో పాటు రామయ్య అనే అతను కూడా ఉన్నాడు మహారాజా!’ చెప్పాడు గ్రామాధికారి.
రామయ్యను కూడా పిలిపించాడు రాజు. ‘ఏం రామయ్యా! ఉత్తరువులు ఇచ్చినా నువ్వు సభకు ఎందుకు రాలేదు?’ అని కోపగించుకున్నాడు రాజు.
‘మహారాజా! కష్టపడి కొట్టిన కట్టెలను సంతలో అమ్ముతాను. దానికి గిట్టుబాటు ధర వస్తుంది. నాకు ఎలాంటి నష్టమూ జరగలేదు’ అన్నాడు రామయ్య.
రామయ్య మాటలు విన్నాక ‘సందేహం లేదు మహారాజా! నేను ఆ రోజు ఇతని వద్దనే కట్టెల మోపును కొన్నాను. అతని మాటల వల్ల అతని కంఠాన్ని గుర్తు పట్టాను’ అని చెప్పాడు చంద్రయ్య.
‘నిజాయతీపరుడు ఎప్పుడూ ధైర్యంగానే మాట్లాడతాడు మహారాజా!’ అన్నాడు మంత్రి.
‘ఆ తొమ్మిది మందినీ చెరసాలలో పెట్టండి’ అని ఆజ్ఞాపించాడు రాజు. ‘ఆ వజ్రం రామయ్యకు చెందుతుంది అతనికే ఇవ్వండి’ అని ఉత్తర్వులూ జారీ చేశాడు రాజు.
‘మహారాజా! నాది కాని దానిని నేను ఎలా తీసుకోను?’ అన్నాడు రామయ్య.
‘మరి ఎలాగా?’ అన్నాడు రాజు. ‘దీనిని మన రాజ్యం కోసం మీ వద్దనే ఉంచండి అదే ధర్మం’ అన్నాడు రామయ్య.
‘చంద్రం, రామయ్య లాంటి నిజాయతీ పరులు మా రాజ్యంలో ఉన్నందుకు నేనెంతో గర్వపడుతున్నాను’ అని వారిద్దరికీ చిరు సత్కారం చేసి ‘నీ కోరిక ఏంటో చెప్పు రామయ్య’ అన్నాడు రాజు.
‘మహారాజా! నా మిత్రులైన ఆ తోమ్మండుగురిని చెర నుండి విడుదల చేయండి’ అన్నాడు రామయ్య. ‘విడుదల చేస్తాను. నీవు ఏదైనా కోరుకో’ అన్నాడు రాజు. ‘ప్రస్తుతం ఎండిన చెట్ల కొమ్మలను నరుకుతున్నాం. వాటి స్థానంలో కొత్తగా మొక్కలను నాటితే రాబోయే రోజులలో అవి మహావృక్షాలు అవుతాయి మహారాజా!’ అన్నాడు రామయ్య.
రాజు మొక్కలను నాటాడానికి అనుమతి ఇచ్చాడు. చంద్రం, రామయ్యలను ప్రతి ఒక్కరూ మెచ్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment