Kuchimanchi Nagendra
-
పిల్లల కథ.. కోయిలమ్మ కొత్తగూడు!
గోదావరికి ఈవల ఉన్న వసంత విహారం అనే అడవికి కొత్తగా వచ్చింది కోయిలమ్మ. దాని దరికి చేరాయి మిగిలిన పక్షులన్నీ! అందులో నెమలి, పావురాలు, గోరువంకలు, గువ్వలు, వడ్రంగి పిట్టలు, పాలపిట్టలు, కాకులూ న్నాయి. వాటిని చూడగానే వినయంగా నమస్కరించింది కోయిల. ‘నేను ఇంతకు ముందు కృష్ణ తీరాన వున్న అడవిలో ఉండే దాన్ని. నా జోడీ ఒక ప్రమాదంలో మరణించడంతో ఇక అక్కడ ఉండలేక ఇలా వచ్చాను.మీరు ఆదరిస్తే ఇక్కడే ఉండి పోతాను. ఇప్పుడు నాకు గుడ్లు పెట్టే సమయం నన్ను ఆదరించండి’ అంటుంది కోయిల. ‘నీవు ఇక్కడ ఉండడానికి మాకే అభ్యంతరమూ లేదు’ అన్నాయి ఆ పక్షులు. ‘చాలా సంతోషం. అలాగే నాకు గుడ్లు పెట్టుకోవడానికి ఓ గూడు చూపించండి’ అని కోరింది కోయిల. ‘వేరే గూడు ఎందుకు? మా కాకమ్మ గూడు ఉందిగా’ అన్నది గోరువంక. ‘అయ్యో.. నా గూడు చాలా చిన్నది. ఇప్పటికే నేను నాలుగు గుడ్లు పెట్టున్నాను. ఖాళీ లేదు’ నొచ్చుకుంది కాకి. ‘అయితే.. వేరే పెద్ద గూడు కట్టుకుంటే సరి’ సలహా ఇచ్చింది గువ్వ. ‘ఇప్పటికిప్పుడు వేరే గూడు అంటే మాటలా?’ ఆందోళన చెందింది కాకి. ‘పని కోయిలమ్మది కనుక తాను సహాయ పడుతుంది’ తీర్మానించాయి మిగిలిన పక్షులు. ‘తనకి కొత్త కనుక మేం కూడా సహాయ పడతాం’ చెప్పాయి గువ్వ, గోరింకలు.గూడు కట్టడం మొదలయింది. ఎండిన పుల్లలు, నార, ఈనులను కోయిలమ్మ తీసుకురాగా.. కొత్త గూడు కట్టసాగింది కాకి. నాలుగు రోజుల్లోనే కోయిల గుడ్లు కోసం కొత్త గూడు తయారయింది. ‘నువ్వు వేరే చోట ఉండడం ఎందుకు ఈ కొత్త గూటిలోనే నీ గుడ్లనూ పొదుగు’ అంది కోయిల. దాంతో కాకమ్మ తన గుడ్లను కొత్త గూటికి చేర్చింది. కోకిల గుడ్లు, తన గుడ్లని తేడా లేకుండా రెండిటినీ పొదిగింది కాకి. నాలుగు కాకి పిల్లలు, మూడు కోయిల పిల్లలతో గూడు కళకళలాడింది.తన పిల్లలను చూసుకుంటూ మురిసిపోయింది కోయిల. పిల్లలన్నీ కాస్త పెరిగాక.. కాకి పిల్లలకి.. కోయిల పిల్లలు తమ జాతివి కావని తెలిసింది. ఒకరోజు అమ్మ లేని సమయంలో తెలిసీతెలియని వయసున్న కాకి పిల్లలన్నీ కోయిల పిల్లల్ని బయటకి నెట్టేశాయి. పాపం కోయిల పిల్లలు గూడు నుంచి కిందపడ్డాయి. చెట్టు కింద మెత్తని మట్టి ఉండటం వలన వాటికేమీ కాలేదు. తిరిగి వచ్చిన కాకి జరిగింది తెలుసుకుని తన పిల్లలని మందలించింది.కాకి పిల్లలు తల్లికి ఎదురు తిరిగాయి.. ‘ఎవరి పిల్లలనో మనమెందుకు ఆదరించాలి?’ అని! పిల్లల అమాయకత్వాన్ని చూసి ఏమీ మాట్లాడలేకపోయింది కాకి. కిందపడిన తన పిల్లలను చూసి కన్నీరు పెట్టుకుంది కోయిల. పక్కనే ఉన్న మర్రి చెట్టు తొర్రలోకి వాటిని చేర్చింది. ఎదుగుతున్న కోయిల పిల్లలు కొత్త రాగాలు ఆలపించసాగాయి. కోయిలా వాటితో జత కలిపింది. వాటి పాటలు వినడానికి పక్షులన్నీ అక్కడికి వచ్చేవి. కొన్ని తమ పిల్లలకి పాటలు నేర్పమని కోయిలని బతిమాలాయి. అలా కోయిల పక్షులకి పాటలు నేర్పడం మొదలుపెట్టింది.కాకి పిల్లలూ పాటలు నేర్చుకోవాలని అనుకున్నాయి. కోయిలమ్మతో మాట్లాడి తమకు పాటలు నేర్పించమని తల్లిని పోరాయి. ‘ఏ మొహం పెట్టుకుని అడగాలి మీరు చేసిన పనికి?’ అని పిల్లల్ని కోప్పడింది కాకి. ‘తెలియక చేసిన తప్పు అది. నువ్వా రోజు మా తప్పును సరిదిద్ది ఉండాల్సింది’ అన్నాయి తల్లితో. ‘నిజమే.. అప్పుడు మీ మీద మమకారంతో నా కళ్లుమూసుకుపోయాయి. అందుకే నాకిప్పుడు మొహం చెల్లడం లేదు కోయిల దగ్గరకు వెళ్లడానికి!’ అని బాధపడింది కాకి.‘సరే అయితే.. మేమే అడుగుతాం.. మమ్మల్ని క్షమించమని’ అన్నాయి ఆ పిల్లలు ముక్త కంఠంతో! ‘శభాష్.. ఇప్పుడు నా పిల్లలు అనిపించుకున్నారు మీరు. చేసిన తప్పుని గ్రహించి.. క్షమాపణ అడగాడానికి సిద్ధమయ్యారు’ అంటూ పిల్లల పరిణతికి సంతోషపడింది కాకి. ఆ కొమ్మకు కాస్త దూరంలో ఉన్న కోయిల ఆ సంభాషణనంతా విన్నది. వెంటనే తన పిల్లల్ని పిలిచి కాకి పిల్లలను వెంటబెట్టుకుని రమ్మనమని వాటిని కాకి గూటికి పంపింది. అవి కాకి గూటికి వెళ్లి.. ‘మా అమ్మ మిమ్మల్ని మా గూటికి రమ్మంటోంది.మా గూడు కోసం మీ అమ్మ మాకు చాలా సాయం చేసిందట కదా.. అసలు మమ్మల్ని మీ అమ్మే పొదిగిందట కదా మా అమ్మ చెప్పింది. మనం అన్నదమ్ములమనీ.. పోట్లాడుకోకూడదనీ చెప్పింది’ అంటూ కాకి పిల్లలను తమ వెంట తీసుకెళ్లాయి. వాటి మాటలకు అబ్బురపడింది కాకి. ‘ఎంత మంచిదానవు కోయిలా.. పిల్లల్ని ఎంత బాగా పెంచావు!’ అంటూ కోయిలను ప్రశంసించింది. ‘ఊరుకో కాకమ్మా.. నువ్వు చేసిన సాయం గురించి చెప్పానంతే! మీ సహవాసం వల్ల నాకూ కాసింత మంచితనం అబ్బినట్టుందిలే. ఈ పొగడ్తలకేం కానీ.. పిల్లలకు పాటలు నేర్పనివ్వూ..’ అంటూ కాకిపిల్లలతో సాధన మొదలుపెట్టించింది కోయిల. – కూచిమంచి నాగేంద్ర -
వ్యాపార దక్షత
పిల్లల కథ రఘునాథపురంలో శీనయ్య అనే యువకుడు ఉండేవాడు. చిన్నతనంలోనే తల్లి తండ్రి చనిపోతే వాడి నానమ్మ వాడిని పెంచి పెద్ద చేసింది. నానమ్మ గారాబం వలన శీనయ్య ఏ పనీ చేయకుండా పెరిగాడు. స్వతహాగా తెలివితేటలు ఉన్నా పనిచేయవలసిన అవసరం లేక సోమరిలా తయారయ్యాడు. ‘‘ఒరే శీనూ! నేను పెద్దదాన్ని అయిపోయాను. ఇక పనిచేసే ఓపిక నాకు లేదు. కనుక నువ్వే ఏదన్నా పనిచేసి డబ్బు సంపాదించి తీసుకురాకపోతే ఇల్లు గడవడం కష్టం’’ అంది ముసలావిడ. ఎప్పుడూ అంత గట్టిగా మాటాడని నానమ్మ అలా అనేసరికి ఆలోచనలో పడ్డాడు శీనయ్య. నిజమే నానమ్మ పెద్దదైపోయింది. పాపం ఇంత కాలం అక్కడ ఇక్కడ పనిచేసి నెట్టుకొచ్చింది. ఇక లాభం లేదు, తనే ఏదో పనిచేసి డబ్బు సంపాదించాలి. కాని ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఊరి మధ్యనున్న శివాలయం దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న సాధువుతో శీనయ్య తన కుటుంబ పరిస్థితి వివరించి, ‘ఏం చేయాలో తెలియడం లేదు’ అన్నాడు. సాధువు చిరునవ్వు నవ్వి, జోలినించి ఓ పచ్చి మామిడికాయ తీసి శీనయ్య చేతిలో పెట్టాడు. ‘‘నాయనా! ఇది పెట్టుబడిగా వ్యాపారం ప్రారంభించు. అనతికాలంలోనే మంచి జరుగుతుంది’’ అని దీవించాడు. సాధువు ఇచ్చిన మామిడికాయతో ఇంటికి చేరి, జరిగినదంతా నానమ్మకు చెప్పి, కారం, ఉప్పు, రెండు డబ్బాలలో పోసుకుని, మామిడికాయతో ఊరి మధ్యనున్న కూడలి వద్దకు చేరుకున్నాడు. మామిడికాయను సన్నగా తరిగి, ఉప్పు, కారం చల్లి, ‘‘ముక్క పావలా’’ అంటూ గట్టిగా అరుస్తూ, అందరినీ ఆకర్షించాడు. ఒక అరగంటలోనే శీనయ్య దగ్గర మామిడికాయ ముక్కలన్నీ అయిపోయాయి. శీనయ్యకు అయిదు రూపాయలు వచ్చాయి. దానిలో మూడు రూపాయలకు పచ్చిసెనగలు తీసుకున్నాడు శీనయ్య, మిగతా రెండు రూపాయలతో ఇంటికి చేరుకున్నాడు. సెనగలు నానబెట్టి, ఊరు చివరనున్న మామిడి తోటకు పోయాడు శీనయ్య. తోటమాలితో బేరమాడి, తన దగ్గర ఉన్న రెండు రూపాయలకి, నాలుగు పెద్ద మామిడికాయలు కొన్నాడు. మరుసటిరోజు ఊరిలో గౌరమ్మ సంబరం. సెనగలను ఉడకబెట్టి, ఉప్పు, కారం చల్లి గుడి దగ్గర అమ్మాడు. ఈ సారి శీనయ్య చేతికి యాభై రూపాయలు వచ్చాయి. మొదటినించి ఓ మామిడి పండ్ల వ్యాపారి శీనయ్యను గమనిస్తున్నాడు. శీనయ్య దగ్గరకు వచ్చి ‘‘బాబూ! నా పేరు పరంధామయ్య. నేను ప్రతి వేసవిలో మామిడిపళ్ల వ్యాపారం చేస్తుంటాను. ఎప్పుడూ లాభాలు రాలేదు. నువ్వు వ్యాపారం బాగా చేస్తున్నావ్. నా వ్యాపారం ఇద్దరం చూసుకుందాం. పెట్టుబడి నాది, లాభాలు ఇద్దరివి’’ అన్నాడు పరంధామయ్య. ‘‘సరే నే చెప్పినట్టుగా చేస్తానంటే ఒప్పుకుంటాను’’ అన్నాడు శీనయ్య. ఒకేసారి లాభాలు ఆర్జించాలి అనే ఆశతో పరంధామయ్య మామిడిపళ్లను రేటు ఎక్కువ చెప్పడంతో పెద్దగా వ్యాపారం జరిగేది కాదు. ఇదంతా తెలుసుకున్న శీనయ్య ఒక ఉపాయం ఆలోచించాడు. ఉదయం తోట నుండి పరంధామయ్య తెచ్చిన మామిడిపళ్లను చెరి సగం చేశాడు. రోజులానే పరంధామయ్యను తన వ్యాపారం తనను చేసుకోమన్నాడు. అతని దగ్గరగా మరో బండిమీద పరంధామయ్య కంటే తక్కువ ధరకే అని గట్టిగా అరుస్తూ, అన్నింటినీ అమ్మేశాడు. ఎవరూ చూడకుండా పరంధామయ్య బండి మీదున్న పళ్లను కూడా తన బండి మీదకు చేర్చి అమ్మేశాడు. నలిగిన మామిడిపళ్లను ఇంటికి తీసుకెళ్లి రసం తీసి ఒక చాపమీద పూసి తాండ్ర తయారీ మొదలుపెట్టాడు. ‘‘ఏ వ్యాపారానికైనా పోటీ ఉండాలి. అమ్మేవాడికి పట్టు విడుపు ఉండాలి. మనం చెప్పిన ధరకే అంటే అందరికీ ఆసక్తి ఉండదు. కొంత ధర పెంచి మరల తగ్గించి కొనేవారిని ఆకట్టుకోవాలి. అందులోనూ పండ్ల వ్యాపారం ఏ రోజుకారోజు ముగించకపోతే చాలా నష్టం వస్తుంది’’ అన్న శీనయ్య మాటలకు చాలా సంతోషించాడు పరంధామయ్య. శీనయ్య నానమ్మతో మాట్లాడి, తన కుమార్తె నాగమణిని ఇచ్చి పెండ్లి చేయడమే కాకుండా, తన వ్యాపారాన్ని కూడా శీనయ్యకు అప్పగించాడు. ఆ రోజునుంచి శీనయ్య మంచి మెళకువలతో పండ్ల వ్యాపారం అభివృద్ధి చేసి, మంచి దక్షత గల వ్యాపారవేత్తగా ఎదిగాడు. - కూచిమంచి నాగేంద్ర