ఒకసారి ఒక నక్కకు ‘నేను కూడా పక్షుల మాదిరిగా గాలిలో ఎగిరితే ఎంత బాగుంటుంది’ అనిపించింది.
ఆ కోరిక నక్కలో బాగా పెరిగిపోయింది.
ఒకరోజు నక్కకు ‘హమ్మింగ్‌బర్డ్’ కనిపించింది.
అది ఒక చెట్టు మీది నుంచి మరో చెట్టు మీదికి ఎగురుతూ, ఒక పువ్వు మీది నుంచి మరో పువ్వు మీద వాలుతూ మకరందం తాగుతోంది.
అది చూసిన నక్క దాని దగ్గరకు వెళ్లి–
‘‘దయచేసి ఎగరడంలో వున్న రహస్యం ఏమిటో చెప్పవా? నాకు కూడా నీలా ఎగరడం నేర్పించవా?’’ అని బతిమిలాడింది.
‘‘నిజానికి ఎగరడం చాలా తేలిక. అందుకోసం నువ్వు ఏంచేయాలంటే, ఒక పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళి, దాని మీద నుంచి కిందకు దూకు. ఒకవేళ నీకు కిందికి పడిపోతున్నట్లుగా అనిపిస్తే ‘పైకి, పైకి’ అనుకో. అప్పుడు నీకు గాలిలో ఎగరడం ఎలాగో తెలిసిపోతుంది’’ అని చెప్పింది హమ్మింగ్ బర్డ్.
‘‘ఎగరడమంటే ఇంతేనా?!’’ సంభ్రమంగా అడిగింది నక్క.
‘‘ఏమో మరీ, మా అమ్మ నాకు చెప్పింది అయితే అంతే మరి’’ అంటూ తేనె తాగడంలో మునిగిపోయింది హమ్మింగ్‌బర్డ్.
నక్క ఊరుకోకుండా తన చుట్టాలు, పక్కాలు అందరి దగ్గరికి వెళ్లి...
‘‘మీకు, నాకు చాలా తేడా ఉంది. నేను చాలా గొప్పదాన్ని’’ అని ప్రగల్భాలు పలికింది.
నక్క మాటలకు అవి బోలెడు ఆశ్చర్యపోయాయి.
‘‘నువ్వు మా కంటే ఎలా గొప్ప?’’ అని మిగిలి నక్కలు అడిగాయి.
‘‘మీరు గాలిలో ఎగరగలరా?’’ అని అడిగింది తెలివి తక్కువ నక్క.
‘‘అందరూ అన్నీ చేయలేరు. పక్షులు ఎగురుతాయి, మనం ఎగరలేము. అవి మనలా అరవలేవు...’’ అని రకరకాలుగా తెలివితక్కువ నక్కకు హితబోధ చేశాయి మిగిలిన నక్కలు.
కానీ తెలివి తక్కువ నక్క ఆ మాటలను చెవికెక్కించుకోలేదు.
‘‘నేను గాలిలో ఎగిరిచూపిస్తాను. ఆ తరువాత మాత్రం నేను మీ కంటే గొప్పదాన్ని అని అంగీకరించాలి’’ అన్నది తెలివి తక్కువ నక్క.
‘‘ఎవరు గొప్పా? ఎవరు కాదు? అనేది ఇప్పుడు అనవసరంగానీ, నీలాగే మన తాతల కాలంలో ఒక నక్క పులిని చూసి వాతలు పెట్టుకొని లబోదిబో అందట. నువ్వు అలాంటి పనిచేయకు’’ అని హెచ్చరించాయి బంధుమిత్ర నక్కలు.
అయినా సరే, ఆ మాటలను పెడచెవిన పెట్టింది తెలివితక్కువ నక్క.
‘‘మీరు నాతో రావల్సిందే. నేను గాలిలో ఎగిరిచూపిస్తాను’’ అని పట్టుబట్టి వాటిని తనతో పాటు తీసుకెళ్ళింది.
అడవంతా గాలించి ఒక పెద్ద చెట్టు కనుక్కుంది.
బంధుమిత్ర సపరివారంగా ఆ చెట్టు దగ్గరికి చేరి దాని పైకి ఎక్కింది.
కింద నిలబడి చూస్తున్న తన వాళ్లతో...
‘‘ఇప్పుడు నేను ఎట్లా ఎగురుతున్నానో చూడండి’’ అంది కొంచెం గర్వంగా.
ఆ జంతువులన్నీ ‘‘వద్దు, వద్దు... కిందపడతావు’’ అని అరిచాయి.
కానీ వాటి అరుపులను ఏమాత్రం లెక్క చేయకుండా నక్క ఉత్సాహంగా చెట్టు కొమ్మ చివరి నుంచి ఒక్క ఉదుటున పైకి ఎగిరింది–మనసులో ‘పైకి, పైకి’ అనుకుంటూ.
పైకి ఎగరడం మాటేమిటోగానీ, నేల మీద కుప్పకూలిపోయి ‘కుయ్యో మొర్రో’ అని అడవంతా ప్రతిధ్వనించేలా పెడబొబ్బలు పెట్టింది పాపం తెలివి తక్కువ నక్క!
∙ మేకల మదనమోహనరావు
Comments
Please login to add a commentAdd a comment