వేణువు ఊదుకుంటున్న గోపాలుడికి ఆ సాయంత్రం పొద్దెక్కడం కొంచెం ఆలస్యంగా తెలిసింది. హడావుడి పడుతూ తన మేకలను కాలువ వైపు తోలాడు. ఊళ్లో వాళ్లెవరూ ఆ కాలువ వైపు, ఆ వంతెన వైపు చీకటి పడే సమయానికి రారు. భయం. ఎప్పుడో చెక్కతో కట్టిన వంతెన అది. ఇప్పుడో, అప్పుడో పడిపోయేటట్టుంది ఆ వంతెన. ఆ వంతెన ఇవతల గట్టుకి ఆనుకుని ఒక పెద్ద మర్రి చెట్టుంది. దాని మీద దెయ్యాలున్నాయిని ఆ ప్రాంతం ప్రజల నమ్మకం. చీకటి పడిన తరువాత ఆ వంతెన మీదుగా ఆ కాలువని దాటి ఏ ప్రాణి అయినా ఆ మర్రిచెట్టు కిందగా వెళ్తే దాని మీదున్న దయ్యాలు చంపేసి, రక్తం తాగి, శవాన్ని ఆ కాలువలో పడేస్తాయని తరతరాలుగా ఆ ఊళ్ళో వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు.
కాని గోపాలుడి మేకలని తొందరగా ఇంటికి చేర్చాలనే ఆలోచనలో ఉండి, ఆ మర్రిచెట్టు కిందుగా వెళ్ళి, ఆ కాలువ వంతెన మీదుగా దాటిస్తున్నాడు. అప్పటికే చీకటి పడిపోయింది. మర్రిచెట్టు భయంకరమైన దయ్యంలాగా కనబడుతోంది. గాలి విసురుగా తగుల్తోంది. మేకలన్ని పరిగెడుతున్నాయి. ఆఖరు మేక వంతెన దాటి గట్టు మీదకి చేరింది. దాని వెనకే గోపాలుడు కుడి కాలు మోపాడు. ఎడం కాలు ముందుకు తీసుకుని అడుగు వేస్తున్నాడు... వేసేశాడు. ఇప్పుడు కాలువకు ఇవతలి గట్టు మీదున్నాడు. పేద్ద శబ్దం చేస్తూ వంతెన ముక్కలు, ముక్కలుగా విరిగిపోయి, ఆ కాలువలోకి భళ్ళున పడిపోయింది. భయంతో మేకలన్నీ ఇంటి వైపు పరుగెట్టడం మొదలు పెట్టాయి. పరుగో పరుగు. ఒకటే పరుగు. ఆగితే దయ్యాలు తమని కూడా పట్టుకుంటాయని భయం.
సరిగ్గా అప్పుడే గోపాలుడికి భయంతో ఏడుస్తున్న మేక పిల్ల అరుపు వినిపించింది. గబుక్కున వెనక్కి తిరిగి చూశాడు గోపాలుడు. ఆ కమ్ముకుంటున్న చీకట్లో అవతలి గట్టు మీద కనపడింది మేక పిల్ల. అది ‘మే.. మే..’ అని భయంతో ఏడుస్తోంది. ఎర్రటి కళ్లతో దాని పీకని పట్టుకుని కనపడింది దయ్యం. చూడటానికే భయంకరంగా ఉంది ఆ దయ్యం.
‘‘దాన్ని వదిలేయి, దయ్యమా! నువ్వేది అడిగితే అది ఇస్తాను’’ అని గోపాలుడు ఆ దయ్యాన్ని అడిగాడు. ఇవ్వను అన్నట్టుగా తలని అడ్డంగా అటూ ఇటూ తిప్పింది దయ్యం.
గోపాలుడు మోకాళ్ల మీద మోకరిల్లి, రెండు చేతులూ కలిపి దణ్ణం పెడుతూ, ‘‘దయ్యం, దయ్యం దయచేసి నా మేకపిల్లని వదిలెయ్యవా’’ అని మళ్లీ అడిగాడు.
అప్పుడు దయ్యం, ‘‘సరే, వదిలేస్తాను. మరీ ఈ మేకపిల్ల నీ దగ్గిరకు ఎలా వస్తుంది?’’ అని అడిగింది.
గోపాలుడుకి ఏమి సమాధానం చెప్పాలో తెలియక బిక్క మొహం వేశాడు.
అప్పుడు దయ్యం ‘‘నువ్వు ఒప్పుకుంటే ఒక షరతు మీద ఈ మేక పిల్లని వదిలేస్తాను’’ అని అంది.
‘‘ఏమిటా షరతు?’’ అని అడిగాడు గోపాలుడు.
‘‘నువ్వు రేపు వచ్చేటప్పటికి ఇక్కడ ఒక సరికొత్త వంతెన ఏర్పాటు చేస్తాను. కానీ...’’
‘‘ఊ... కానీ.. నేను ఏం చెయ్యాలో చెప్పు’’ అని ఆదుర్దాగా అడిగాడు గోపాలుడు.
‘‘ఆ వంతెన మీదుగా దాటి వచ్చిన మొదటి ప్రాణిని నాకు బలి ఇవ్వాలి’’అని అంది ఆ దయ్యం.
‘‘ఆ...’’ అని ఆలోచనలో పడ్డాడు గోపాలుడు.
‘‘నువ్వు ఒప్పుకోకపోతే ఈ మేకపిల్లని ఇప్పుడే చంపేస్తాను. రేపు ఆ వంతెన కూడా ఉండదు’’ అని అంది ఆ భయంకరమైన దయ్యం.
‘‘వద్దు, ఆ మేకపిల్లని చంపకు. నువ్వు చెప్పింది నాకు అంగీకారమే. అలాగే చేస్తాను’’ అని అన్నాడు గోపాలుడు.
మరుసటి రోజు ఉదయం, తన సద్దిమూటతో మేకలని తోలుకుంటూ కాలువ దగ్గిరకి బయలుదేరాడు గోపాలుడు. ఆశ్చర్యం! కాలువ మీద కట్టెలతో కట్టిన సరికొత్త వంతెన సిద్ధంగా ఉంది అక్కడ. కాలువ అవతల గట్టున వంతెన దగ్గర దయ్యం నిలబడి ఉంది. కాలువ ఇవతల గట్టున, వంతెనకి ఇవతల గోపాలుడు, అతని వెనకే మేకలు. ఆ మేకలతో పాటు ఒక గజ్జి కుక్క. మేకలని గట్టు మీదే ఉండమని చెప్పి, తను ఆ వంతెన మీద కాలు బెట్టి గట్టిగా ఉందో లేదో చూద్దామనుకున్నాడు. కానీ ఈ లోపు దయ్యానికి తనకి ఉన్న ఒప్పందం గుర్తు వచ్చింది. అందుకని వంతెన మీద కాలుపెట్టకుండా ఇవతలే నిలబడ్డాడు.
భుజానికి ఉన్న సద్ది మూటని విప్పాడు. అందులో నుంచి తను విడిగా పెట్టుకున్న మాంసం ముక్కని బయటికి తీసాడు. తన మేకలతో పాటే వచ్చిన గజ్జి కుక్కకి దాన్ని వాసన చూపించాడు. తన బలం అంతా వినియోగిస్తూ కుడి చేత్తో ఆ మాంసం ముక్కని వంతెన మీదుగా దయ్యం నిలబడి ఉన్న గట్టు మీదకి విసిరాడు. ఆ మాంసం ముక్క అవతల గట్టు మీద పడేలోపు గజ్జి కుక్క ఆ కాలువ మీదున్న వంతెన మీదుగా అటు వైపుకి దూకింది. అటు దూకడేమేమిటి, ఆ గట్టు మీద పడ్డ మాంసం ముక్కని నోటితో పట్టుకోవడం కూడా అయిపోయింది.
ఇదంతా చూస్తున్న దయ్యం ఆశ్చర్యంతో నిర్ఘాంత పోయింది. దాని పక్కనే ఉన్న మేకపిల్ల దయ్యం పట్టు విదిలించుకుని ఆ గట్టునుంచి ఇటు గట్టు మీదకి పరిగెత్తుకుంటూ వచ్చేసింది. గోపాలుడు దాన్ని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటూ దయ్యం వైపు చూశాడు. దయ్యం బూడిదగా మారి కుప్పగా కూలిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ మర్రిచెట్టు, ఆ కాలువ గట్టునా దయ్యాలు మళ్ళీ కనపడలేదు.
- అనిల్ అట్లూరి
Comments
Please login to add a commentAdd a comment