మారిన దొంగలు
పిల్లల కథ
పూర్వపు కోసల దేశాధిపతి విజయదేవవర్మ జనరంజక పరిపాలకుడు. రాజుకు ఒక సమస్య ఉంది. ఆ రాజ్యంలో రత్తయ్య అనే బందిపోటు దొంగ ఉండేవాడు. అతడు పెద్ద దొంగల ముఠాకి నాయకుడు. రత్తయ్య తన అనుచరులతో ఎవరికీ అంతు చిక్కని రహస్య స్థావరంలో దాగివుండి మెరుపులా అకస్మాత్తుగా వచ్చి దారి దోపిడీలకు పాల్పడేవాడు. ఎదురుతిరిగిన వారిని దారుణంగా కొట్టి హింసించేవాడు. దేశ ప్రజలు అనేక సార్లు ఫిర్యాదు చేశారు. విజయదేవవర్మ దొంగల ముఠాను పట్టుకోవాలని ఎన్నో విధాల ప్రయత్నించి విఫలుడయ్యాడు.
రాజు ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలనుకున్నాడు. ఒక మనిషి దొంగగా మారడానికి పేదరికమే కారణం కావచ్చునని భావించాడు. అందుకే ఓ ప్రకటన జారీ చేశాడు. దానిని దేశమంతటా ప్రచారం చేయించాడు.
‘రత్తయ్య అతడి అనుచరులు మూడు నెలలలోపు ప్రభుత్వానికి స్వచ్ఛందంగా లొంగిపోతే వారిపైన ఉన్న అభియోగాలన్నీ రద్దు అవుతాయి. ఎటువంటి శిక్షలు లేకుండా వారు స్వేచ్ఛగా జన జీవన స్రవంతిలో కలసిపోవచ్చు.
లొంగిపోయిన ప్రతి ఒక్కరికీ నివసించడానికి ఓ ఇల్లు, వ్యవసాయం చేసుకోవడానికి ఐదెకరాల పొలం, వెయ్యి వరహాల డబ్బు ఇవ్వబడుతుంది. మూడు నెలల్లోపల లొంగకపోతే ఇక వారిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఏవిధంగానైనా పట్టుకొని తీరుతాం. అలా చిక్కిన ప్రతి ఒక్కరికీ మరణ దండన ఖాయం’ ఇదీ ప్రకటన సారాంశం. రాజుగారి ప్రకటన రత్తయ్య భార్య సూర్యమతిని ఆకర్షించింది. సూర్యమతి రహస్య స్థావరంలో తన భర్త, ఇతర దొంగలకు నచ్చచెప్పే ప్రయత్నం చేసింది.
‘‘పిడికెడు మెతుకు కోరుకునే జానెడు పొట్టకోసం మనం ఎన్నో దారుణాలకి పాల్పడుతున్నాం. మనం చేష్టల ద్వారా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అలాగని మనమూ స్వేచ్ఛగా జీవించడం లేదు. ఎలుకలు కలుగుల్లో దాక్కున్నట్టు రహస్య స్థావరంలో దాక్కొని బతుకీడుస్తున్నాం. రాజుగారు ఈ అవకాశం కల్పించడం మన అదృష్టం. ఇలాంటి అవకాశం మరోటి రాదు. మనమంతా లొంగిపోదాం’’ అని చెప్పింది సూర్యమతి.
ఆమె మాటలకు రత్తయ్యతో సహా దొంగలంతా పకపక నవ్వారు. ‘‘వెర్రివాళ్లయితేనే ఇటువంటి ప్రలోభాలకి భ్రమించేది. ఇది రాజుగారి కుట్ర తప్ప మరేమీ కాదు. పొరపాటు పడితే మన పరిస్థితి ఎర్ర కోసం గాలానికి చిక్కిన చేపలా అవుతుంది’’ అన్నారు కొందరు.
మరికొందరు, ‘‘రాజుగారు మనల్ని పట్టుకోవడం చేతకాక, పిరికితనంతో బేరసారాలకి దిగజారాడంటే మనం విజయం సాధించినట్లే. ఇటువంటి రాజుగారు మనల్ని ఎప్పటికీ ఏమీ చేయలేడు’’ అన్నారు.
‘‘నిజమే’’ అన్నాడు రత్తయ్య. సూర్యమతి తన మాట చెల్లుబాటు కాకపోయినందుకు లోలోన బాధపడుతూ మౌనంగా ఉండిపోయింది. తను ఇచ్చిన అవకాశాన్ని లెక్కచేయకపోవడంతో రాజు విజయదేవ వర్మలో పట్టుదల ఎక్కువైంది. మంత్రితో సహా మారువేషాల్లో సంచరిస్తూ మారుమూల గ్రామాల్లో సంచరిస్తూ దొంగల ఆచూకీ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఎట్టకేలకు విజయదేవ వర్మ దొంగల రహస్య స్థావరం తెలుసుకున్నాడు. అదేరోజు రాత్రి రాజుగారి బలగాలు దొంగల స్థావరంపై దాడి చేశాయి. గాఢ నిద్రలో ఉన్న దొంగలంతా బందీలుగా చిక్కి చెరసాల పాలయ్యారు.
రత్తయ్యతో సహా దొంగలంతా ఇక చావు తప్పదని భయపడుతూ రోజులు లెక్కపెట్టుకోసాగారు. కానీ ఆశ్చర్యకరంగా రాజువారిని బంధ విముక్తుల్ని చేసి స్వేచ్ఛ ఇవ్వడమే కాక, ముందే ప్రకటించినట్లు ఇల్లు, పొలం, డబ్బు ముట్టజెప్పాడు. రత్తయ్యతో సహా అందరూ వ్యవసాయం మొదలుపెట్టడంతో వారికి శ్రమ విలువ తెలిసింది.
కొద్దిరోజుల తరువాత దొంగలకు స్వేచ్ఛనివ్వాలనే ఒప్పందం మీద రహస్య స్థావరం గురించి రాజుకు సమాచారం ఇచ్చింది తన భార్య సూర్యమతేనని రత్తయ్యకు తెలిసింది. అయితే ఆమె మంచి పనే చేసిందని, తమకు గౌరవంగా జీవించే అవకాశం కల్పించిందని ఆమెకు కృతజ్ఞతలు చెప్పాడు రత్తయ్య.
- గుండ్రాతి సుబ్రహ్మణ్యం గౌడు