గడసరి బుజ్జిమేక | The Clever Goat Short Story For Kids | Sakshi
Sakshi News home page

గడసరి బుజ్జిమేక

Published Sun, Jul 21 2019 10:21 AM | Last Updated on Sun, Jul 21 2019 10:21 AM

The Clever Goat Short Story For Kids - Sakshi

బుల్లి బుల్లి మేక బుజ్జి మేక గంతులేసి తిరుగుతోంది. తల్లిమేక ఆ నిర్వాకం చూసి మురిసిపోయింది. మర్రి చెట్టు దగ్గర గొలుతో కట్టేసిన పొట్టేలును చూసింది. మెడలో రంగు రంగుల తాడుకు కట్టిన మువ్వలు, గలగల గజ్జెలు చూసింది.
‘‘ఆహా! ఎంత బాగున్నాయి అందంగా కనిపిస్తున్నావు. అదృష్టమంటే నీదే కదా!’’ బుజ్జిమేక సన్న సన్నగా అంది. 
‘‘ఏం అదృష్టంలే!’’ బాధగా అంది పొట్టేలు.
‘‘అలా అంటావేం? అలంకరణలతో ముచ్చటగా కనిపిస్తున్నావు’’బుజ్జిమేక మురిసిపోతూ అంది. 
పొట్టేలు కాస్తా విచారపడుతూ
‘‘వెర్రిదానా, అందం సంగతలా ఉంచు. నీ లాగ నాకుస్వేచ్ఛ లేదు, కదా! ఎక్కడికీ తిరగలేను. ఎందుకీ వేషం!’’ మేకపిల్లతో అంది.
‘‘అయ్యో! సరే సరే’’ అనునయిస్తూ బుజ్జిమేక కదిలింది.

‘‘చూడు! స్వేచ్ఛ ఉందని పక్కనున్న అడవిలోకి వెళ్లకు. క్రూర జంతువులు నిన్ను నమలి పారేస్తాయి, జాగ్రత్త!’’ అంటూ పొట్టేలు హెచ్చరించింది.
‘‘అలాగే!’’ అని నిర్లక్ష్యంగా పరుగు తీసింది. తల్లి దగ్గరకు చేరి గంతులేసింది. ఆ గంతులు చూసి తల్లి–
‘‘ఏయ్‌! ఎటూ తిరగకు సుమా! మంద విడచి వెళ్లకు జాగ్రత్త సుమా!’’ తల్లిమేక కోపంగా అంది.
‘‘సరేలే’’ అంటూనే అటూ ఇటూ తిరగడం ప్రారంభించింది.
‘‘ఏయ్‌ బుల్లీ! బుజ్జీ! పక్కనున్న అడవికి వెళ్లకు. క్రూరమృగాలు తిరుగుతుంటాయి. ఒకవేళ ఎదురైనా గడుసుగా తప్పించు కోవాలి’’ బుజ్జిమేక అమ్మమ్మ చెప్పింది.
ఇంతమంది చెబుతున్నారు మరి అడవి చూసి రావాలని కదిలింది. అసలే చిన్న వయస్సు, తుంటరి బుద్ధి.

బుజ్జిమేక మనసు ఆపుకోలేక పోయింది. అటూ ఇటూ చూసింది. తనపై ఎవరి దృష్టీ లేకపోవడం చూసి గబ గబా అడవిలోకి వెళ్లింది. పెద్ద పెద్ద చెట్లు, దట్టమైన పొదలు, చెట్లకు వాటేసుకున్న తీగలు... చల్లని గాలితో చూడ ముచ్చటగా, ఎంతో హాయిగా ఉంది అడవి.
ఇంతలో నక్క ఎదురైంది. దానిని చూడగానే చిన్న భయం కలిగింది. అమ్మమ్మ మాటలు గుర్తుకు వచ్చాయి. ధైర్యం తెచ్చుకుంది.
‘‘ఏయ్‌ తుంటరీ! నిన్నిప్పుడు నంజుకు తింటాను’’ అంది నక్క.
‘‘మామా! నేనెవరు అనుకుంటున్నావు. రాజుగారి ముద్దుబిడ్డను. జాగ్రత్త!’’ అని గద్దించింది బుజ్జిమేక. రాజుగారి మాట చెప్పగానే నక్క జడిసిపోయింది. ఏమిటా అన్నట్లు చూసింది.
‘‘రాజు గారు నన్ను రమ్మని ఆహ్వానించారు. పొట్టేలు బాబాయి సాయం వస్తానంటే వద్దన్నాను’’అంది. నాకెందుకు ఈ అనవసరమైన గోలని జారుకుంది నక్క.

ఇంతలో తోడేలు ఎదురైంది. రాజు బిడ్డనని చెప్పినా వినుకోలేదు. ముందుకు రాబోయింది తోడేలు. ఇంతలో ఏనుగు రావడం చూసి తోడేలు ప్రక్కకు తప్పుకుంది. ఏనుగు బుజ్జిమేకను చూసి ఎవరు నువ్వని అడిగింది.
‘‘నేను వనరాజు ముద్దు బిడ్డను’’ అని చెప్పింది. ఏనుగు కోపంతో ముందుకు వచ్చింది.
‘‘ఏయ్‌ రాజుగారంటే భయం లేదా? నీకు!’’
బుజ్జిమేక హెచ్చరించినా భయం లేకుండా ఏనుగు తొండంతో విసిరింది. అదృష్టం కొద్దీ ఎదురు వస్తున్న సింహం వీపు మీద కూచున్నట్లు పడింది. 
ఏమిటా అన్నట్లు చూసింది సింహం.
‘‘అడవికి మీరే రాజని నేనంటే కాదని వాదిస్తోంది ఆ ఏనుగు. ఆ కోపంతోనే నన్ను విసిరేసింది..’’
బుజ్జిమేక చెప్పేసరికి ఏనుగు వెనక్కు పరుగు తీసింది.
సింహం బుజ్జి మేకను చూసి ముచ్చట పడింది. ఎలుగుబంటిని సాయంగా ఇచ్చి మంద వద్దకు పంపింది. మేకలు అన్నీ దానిని చూసి ఆనందించాయి. 
- బెహరా ఉమామహేశ్వరరావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement