కుందేలు కూన కష్టం!
పిల్లల కథ
కుందేలు కూనకుట్టి పొదలగుట్టు కింది బొరియలో నుండి బిరబిర బయటికొచ్చి చిన్న క్యారట్ దుంపను కసకస కొరికి పసపస నమలసాగింది. తల్లి కుందేలు, ‘‘కుట్టీ! నీవు తల్లి చాటు పిల్లవి. పసికందువి. ఏ పులి కంటనో, తోడేలు కంటనో పడ్డావంటే అది నిన్ను లటుక్కున పట్టి చటుక్కున పొట్టన పెట్టుకుంటుంది. లోపలికొచ్చేయ్’’ అంది. కుట్టి, ‘‘అమ్మా! ఏ వైపు నుండీ ఏ మృగమూ వస్తున్న జాడ లేదు. ఇంతసేపూ మన బొరియలో ఉక్కతో ఉక్కిరిబిక్కిరయ్యాను. ఇక్కడ నలువైపుల నుండీ మెల్లమెల్లగా వీస్తున్న చల్లటి పిల్లగాలుల వల్ల నా మనసు ఉల్లాసంతో ఉప్పొంగిపోతోంది.
కాసేపు అటూ ఇటూ పచార్లు చేసి వస్తానే’’ అంది. ‘‘సరే, నీ ఇష్టం. జాగ్రత్త’’ అంది తల్లి కుందేలు.
కుట్టి ఏరు పారుతున్న వైపు గంతులేయసాగింది. ఉన్నట్టుండి ఏనుగు ఘీంకారం వినిపించింది. కుట్టి తటాలున ఓ చెట్టు చాటుకెళ్లింది. ఏనుగు తొండాన్ని పెకైత్తి, కిందికి విడుస్తూ, చెవులు ఆడిస్తూ, పెద్ద పెద్ద అడుగులేస్తూ పోయింది. ‘‘ఏనుగు రూపం కుట్టికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ దేవుడు ఏనుగును పొడుగాటి తొండంతో, చాటలంత చెవులతో ఎందుకు సృష్టించాడో! కొండ లాంటి ఆ వేదండానికి తిండి దండగ’’ అని నవ్వుకుంది.
హఠాత్తుగా ఒక ఉరుము ఉరిమి, ఒక మెరుపు మెరిసింది. కుట్టి వేరపుతో వెనుదిరిగి పొదల గట్టువైపు కదిలింది. కొన్ని క్షణాలకు పిడుగు పడటంతో ఒక పాదపం పెళపెళమని విరిగి పొదల గుట్టమీద కూలింది. అది చూసిన కుట్టి ‘‘అయ్యో! అమ్మ, అమ్మకేమైందో’’ అని ఏడుస్తూ గుట్టను సమీపించింది. ‘అమ్మా’ అని పిలిచింది. గుట్ట కింది బొరియలో ‘ఉ, ఉ, ఉ’’ అంటూ మూలుగులు వినిపించాయి. గుట్ట మీద నుండి ఆ చెట్టును తొలగిస్తేనే, అమ్మ బతుకుతుంది. లేకపోతే ప్రాణానికే ప్రమాదం, అమ్మను ఎలాగైనా బతికించుకోవాలి’’ అని కుట్టి దగ్గర్లోనే ఉన్న వరాహాన్ని సాయం కోరింది.
పంది చెట్టును తొలగించటానికి ప్రయత్నించింది కానీ చెట్టు ఇసుమంతైనా కదల్లేదు. కుట్టి గబగబ వెళ్లి ఎలుగుబంటిని పిల్చుకొచ్చింది. చెట్టును కదిలించబోయి భల్లూకం బోర్లాపడింది. అనుకోకుండా అగుపించిన అడవిదున్నను ఆపదలో ఆదుకొమ్మని అడిగింది కుట్టి. దున్న కొమ్ములతో తోసినా తరువు, ఎక్కడున్నావే గొంగళీ అంటే వేసిన చోటనే అన్న చందాన, ఉన్న తావు నుండి ఒకింతైనా మెదల్లేదు. మూడు జంతువులూ జారుకోవటంతో కుట్టి కలత చెందింది.
ఎదురుగా ఉన్న వేపచెట్టు మీది నుండి అంతా గమనించిన కోతి కిందికి దిగివచ్చి, ‘‘కుట్టీ! ఇందాక వెళ్లిన ఏనుగు తిరిగి ఇటే వస్తోంది. వెళ్లి విషయం విన్నవించి, కన్నీటితో కరికాళ్ల మీద పడు. నీకు మేలు జరుగుతుంది’’ అంది. గజం రానే వచ్చింది. కుట్టి, ‘‘ఏనుగు పెద్దాయనా! పిడుగుపాటుతో ఈ చెట్టు పొదలగుట్ట మీద పడింది. గుట్ట కింద బొరియలో మా అమ్మ బందీ అయింది. ఊపిరాడక మూలుగుతోంది. ఈ చెట్టును పక్కకు తొలగించి, మా అమ్మను కాపాడు’’ అని వేడుకుంది.
‘‘ఆ మాత్రం దానికి అంతగా అడగాలా?’’ అని ఏనుగు వెంటనే తన తొండాన్ని చెట్టు చుట్టూ గట్టిగా చుట్టి, పట్టి అవలీలగా ఎత్తి ఆవల పడేసి వెళ్లిపోయింది. తల్లి కుందేలు రొప్పుతూ రోజుతూ బయటికొచ్చింది. కుట్టి అపారమైన ఆనందంతో అమ్మ అక్కున చేరింది. ఇంతకుముందు ఏనుగును గూర్చిన తన ఆలోచనలను గుర్తు తెచ్చుకొని సిగ్గుపడింది. అపురూపమైన ఏనుగు జన్మను తాను అపార్థం చేసుకుంది.
భగవంతుడు ఏనుగు లాంటి బలమైన జంతువు వల్ల చిన్నా చితకా ప్రాణులకు ప్రాప్తించే ప్రయోజనమేమిటో కుట్టికి అవగతమైంది. తన తల్లికి తటస్థపడ్డ విపత్తు నుండి విముక్తి కలిగించిన మాతంగానికి మోదంతో మనసులోనే కృతజ్ఞత తెలిపింది కుట్టి.
- నరిశేపల్లి లక్ష్మీనారాయణ