నీతూ బుద్ధి | Children's story | Sakshi
Sakshi News home page

నీతూ బుద్ధి

Published Sun, Feb 22 2015 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 9:41 PM

నీతూ బుద్ధి

నీతూ బుద్ధి

పిల్లల కథ
ఈ పోటీ మార్కుల చదువుల్లో పిల్లలకు మంచి నడత గురించి చెప్పే టీచర్లు తక్కువ. ముఖ్యంగా తిండి గురించిన పద్ధతులు ఇంట్లో అమ్మానాన్నలు, పెద్దలు చెప్పాలి. నవనీత్‌ని అందరూ ‘నీతూ’ అని పిలుస్తారు. వాడికున్నంత తిండి ‘యావ’, తిండిపోతులా కనిపించే వాడి చేష్టలూ ఆ తరగతిలో ఎవరికీ లేవు. వాడు తెచ్చుకున్న టిఫిన్ ఒకరికి పెట్టడు. ఎప్పుడూ ఎవరిదో తిన చూస్తాడు. ఎవ్వరేం తెచ్చుకున్నారో వాడికి చూపాలి. లేదంటే యుద్ధం ప్రకటిస్తాడు.

తనకు నచ్చినది ఏదైనా ఉంటే.... అది పదింతలు తినేస్తానంటాడు. ఇంకొకరి గురించి చూడకుండా ఏది కనబడ్డా ముందు తనే తినడం వాడి అలవాటు. పదిమంది కోసం తెచ్చిన స్వీటు చాటుగా ఒక్కడే మెక్కేయ చూస్తాడు. ‘‘లడ్డూలు యాభై తింటాను, మాజా ఇరవై తాగుతాను, చాక్లెట్లు ముప్పై తింటాను’’ అంటూ ఉంటాడు. వీడి వింత ప్రవర్తన క్లాసు టీచర్‌కి సమస్యగా ఉంది. ఒకసారి ఆదివారం క్లాసు పిల్లలందరినీ జూపార్క్‌కి పిక్‌నిక్ తీసికెళ్లింది టీచర్. అంతా తిరిగి చూశాక.... పెద్ద చెట్టు నీడన అందరూ కూర్చున్నారు. టీచర్ వాళ్ళతో ‘‘ఈ ఫిక్‌నిక్ ఇవ్వాళ నీతూ ఆనందం కోసం... నీతూ ఈ దినం తన తిండి గొప్పతనం మనకు చూపిస్తాడు. అందరూ చప్పట్లు కొట్టండి’’ అంది. అందరూ చప్పట్లు కొట్టారు.
 
అక్కడ దిమ్మెలాంటి సిమెంట్ బెంచీ ఉంది. దాని మీద నీతూని కూర్చోబెట్టారు. నీతూ గొప్పలుపోతున్నాడు. వాడి ముందు క్లాసు పిల్లలంతా ఉన్నారు. టీచర్ అందరికీ రెండేసి ‘‘కేక్ పేస్ట్రీ’’లు పంచింది. తను చెప్పేవరకు ఎవ్వరూ తినకూడదని చెప్పింది. తర్వాత నీతూ దగ్గర నిలబడి ‘‘మీ అందరికన్నా నీతూకి తినడం అంటే ఇష్టం కదా, అందుకే మీరందరూ నీతూ కోసం మీ దగ్గరున్న రెండు ‘పేస్ట్రీ’ల నుండి ఒకటి ఇచ్చేయాలి! వరుసగా రండి, అందరూ ఒక్కొక్కటి ఇచ్చేయండి’’ అని చెప్పింది.
 
నీతూకు భలే అనిపించింది. వాడి ముందు ఒక పేపర్ పరిచారు. అందరూ ఒక్కోపేస్ట్రీ వాడి ముందుపెట్టారు. తిరిగి వెళ్లి కూర్చున్నారు.
 ‘‘ఇప్పుడు మన అందరికన్నా ఎక్కువగా తింటాడు నీతూ... ఇవాళ ముప్పై ఆరుమంది మీరు, మీకిచ్చిన కేక్‌లలో ఒకటి వీడికి ప్రేమతో ఇచ్చారు. మీ ముందు ఇక అన్నీ తినేస్తాడు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. తినకపోతే సారీ చెప్పి లెంపలేసుకుంటాడు. ఇవి అన్నీ తినేస్తే నేను వీడు అడిగిన బహుమతి ఇస్తాను’’ అని చెప్పింది టీచర్.
 
పిల్లలందరూ మళ్లీ చప్పట్లు కొట్టారు. కేక్ తినడం మొదలుపెట్టాడు నీతూ.
ఒకటి... రెండు... మూడు... నాలుగు... అంతే, ఐదో కేక్ నోటిదగ్గరే ఆగిపోయింది. భయంగా టీచర్ దిక్కు చూస్తున్నాడు. పిల్లలందరూ చప్పట్లు కొడుతూ... ‘‘తినూ.... తినూ.... నీతూ.... తినూ.....’’ అంటున్నారు ‘రిథమిక్’గా.
 టీచర్ చేయి ఊపగానే అందరూ మౌనంగా కూర్చున్నారు. నీతూ ముందు ‘కేక్’ల కుప్ప.... ‘రాశి’ పోసినట్టుగావుంది. ఒకరు లేచి నిలబడి ‘‘నా టిఫిన్ రోజూ లాక్కొని తింటావ్‌గా తినూ!’’ అన్నాడు. మరొకరు ‘‘నేను ఏదన్నా ఇవ్వకుంటే తంతావుగా మరి తిను’’ అన్నాడు.
 
‘‘అన్నీ నీకే కావాలిగా తినవేంరా’’ అని ఇంకొకరు.
 ఐదో కేక్ బలవంతంగా తిన్నాడు.
 టీచర్ ‘‘ఊ! కానీ’’ అంది గట్టిగానే.
 ఇక తట్టుకోలేక ఏడుపు ముంచుకొచ్చింది నీతూకి. ఏడ్చాడు.
 ఆ తరువాత నీతూ ఎప్పుడూ ‘‘అతిగా వెళ్లక’’ అందరిలాగే ఉండడం నేర్చుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement