కుందేలు తెలివి | Rabbit intellect story | Sakshi
Sakshi News home page

కుందేలు తెలివి

Published Sun, Jun 7 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 3:19 AM

కుందేలు తెలివి

కుందేలు తెలివి

పిల్లల కథ
ఒక అడవిలో కుందేళ్ల గుంపు ఒకటి ఉంది. ఆ గుంపులో కుందేళ్లన్నీ అడవిలో దొరికిన ఆహారం తింటూ,  హాయిగా ఆడుతూ, గెంతుతూ జీవిస్తున్నాయి. అలాంటి కుందేళ్ల దగ్గరకు ఒక నక్క వచ్చింది.
కుందేళ్ల ఆనందాన్ని చూసి ఈర్ష్య పడింది. ఎలాగైనా వాటి ఆనందాన్ని హరించాలని మనసులో అనుకున్నది. అలా అనుకున్నదే తడవుగా సూటిపోటి మాటలతో కుందేళ్లను బాధపెట్టసాగింది.

కుందేళ్లది జీవితమే కాదని, అది ఆనందమే కాదని పలురకాలుగా ఎద్దేవా చేయసాగింది. నక్క మాటలు కుందేళ్లను బాధపెట్టసాగాయి. కానీ అవి స్వతహాగా సాధు జంతువులు కావడంతో తిరిగి ఏమీ అనలేదు. మనసుకు కలిగిన బాధను భరించి మౌనంగా ఉండేవి. నక్కకు ఇది మంచి అవకాశంగా అనిపించింది. తన గొప్పలు వినడానికి కొన్ని అమాయకపు ప్రాణులు దొరికాయనుకుని ఇక రోజూ ఎటూ వెళ్లకుండా అక్కడనే తిష్ట వేసుకొని కూర్చునేది. అంతూదరీ లేకుండా ప్రగల్భాలు పలుకుతుండేది.
 
ఒకరోజు నక్క కొత్త వ్యూహం పన్నింది. ఆ గుంపులోని పెద్ద కుందేలును పిలిచి, ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి తీసుకెళ్తానని నమ్మబలికి తన వెంట దూరంగా తీసుకొని పోయింది. అక్కడ ఒక గుంతను చూపించి, కుందేలుతో ‘‘అందరూ నిన్ను నీవు చాలా తెలివిగలదానివని అంటారు. తెలివైన దానివే కాదు, శక్తిమంతురాలివి అని కూడా అంటుంటారు. ఈ గుంతలో దూకు. నీ శక్తి సామర్థ్యాలు ప్రదర్శించు. నీవు నాకన్నా గొప్పదానివని అంగీకరిస్తాను, అదే మాట అందరికీ చెబుతాను’’ అన్నది.
 
నక్క ఏదో పన్నాగం పన్నిందని కుందేలుకు సందేహం కలిగింది. ఆ గుంతలోకి తొంగి చూసింది. గుంతలో ముళ్లకంప ఉంది. తాను అందులో దూకితే చావు తప్పదని దానికి తెలిసిపోయింది. అందుచేత నక్కతో... ‘‘నక్క బావా! నేను మా కుందేళ్ల జాతిలో మిగిలిన వాటికంటే ఏదో కొంత తెలివైన దానినే కానీ. నీ అంత తెలివైన దానిని కాదు. పైగా నాకు ఇలాంటి ప్రదేశాలు కొత్త. ముందు నువ్వు దూకితే ఎలా దూకాలో చూసి నేను కూడా దూకుతాను’’ అంది లౌక్యంగా. కుందేలు ఉపాయం నక్కకు కూడా అర్థమైంది. తన పథకం బెడిసికొట్టిందని తలచి వెంటనే మాట మార్చేసింది.
 
మరొక రోజు నక్కను పెద్ద కుందేలు ఒక ఏరు దగ్గరకు తీసుకొని పోయింది. ఆ ఏటిలో దిగి ఒక అరగంట సేపు కళ్లు మూసుకొని ధ్యానం చేయమని చెప్పింది. ఎటువంటి పరిస్థితుల్లో కళ్లు తెరవద్దని కూడా హెచ్చరించింది. ‘‘అలా చేస్తే  నా కన్నా నువ్వే తెలివిగల దానివని ఒప్పుకుంటాను నక్కబావా, అలా ఉండలేకపోయావనుకో... అప్పుడు నేనే తెలివైన దాన్నని నువ్వు అంగీకరించి తీరాలి. ఇంక మనిద్దరి మధ్యా ఎటువంటి పరీక్షలు అక్కర్లేదు. అయినా నాకు తెలుసులే నువ్వే తెలివైన దానివని. ఈ పరీక్షంతా ఇంకెవ్వరూ ఎప్పుడూ నిన్ను తక్కువ చేయకుండా ఉండడానికే సుమా’’ అని చెప్పింది.
 
కుందేలును వెర్రిబాగుల దాన్ని చేయడానికి ప్రయత్నించాను, కాబట్టి కుందేలు ప్రతీకారం తీర్చుకోవడానికే ఇదంతా చేస్తున్నదా- అని నక్కకు సందేహం కలిగింది. ఎందుకైనా మంచిదని వెంటనే నీటిలోకి దిగకుండా... ముందుగా కుందేలునే ఆ పని చేయమంది. కుందేలు సరేనని ఆ నీటిలోకి దిగి, అరగంట సేపు కళ్లు మూసుకొని ధ్యానం చేసింది. అప్పుడు నక్కకు ఇందులో ప్రమాదమేమీ లేదనిపించింది. కుందేలు తన మీద తన నక్కజిత్తులే ప్రయోగిస్తోందని అది ఏ మాత్రం ఊహించలేదు. ‘‘ఓ అదెంత పని! నేను కూడా నీవు చేసినట్లే చేస్తాను’’ అని ఏటిలోకి దిగి కళ్లు మూసుకొంది.
 
ఈ అదను కోసమే చూస్తూ ఉన్న కుందేలు... దూరాన ఉన్న తోటి పిల్ల కుందేళ్లకు సైగ చేసింది. వెంటనే అవి ఏటికి అడ్డుగా కట్టిన నీటి కట్టకు గండికొట్టాయి. ఒక్కసారిగా నీటి ప్రవాహం ఎక్కువైంది. నక్క ఆ ప్రవాహంలో కొట్టుకొని పోయింది. నక్క పీడ విరగడైనందుకు కుందేళ్లు ఎంతగానో సంతోషించాయి.
 
కుందేళ్లు ఐకమత్యంతో కలసి బండలు, ఇసుకతో ఏటికి అడ్డుగా కట్ట వేసినట్లు నీటిలో కొట్టుకు పోతున్న నక్కకు తెలియదు. నక్క పీడ వదిలించుకోవడానికి తను వేసిన పథకం పారినందుకు కుందేలు ఎంతో సంతోషించింది.
 
నీతి:
*  ఆపద నుండి గట్టెక్కడానికి తగిన ఉపాయం కావాలి.
*  ఐకమత్యం వల్ల దేనినైనా సాధించవచ్చు.
- సంగనభట్ల రామకిష్టయ్య

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement