మూడు కోరికలు
పిల్లల కథ: చిన్మయానందస్వామి తన ఆశ్రమంలోని శిష్యుడైన సారంగను పిలిచి అడవికెళ్ళి సాయంత్రం కాళీమాత పూజకు కావలసిన పువ్వులు, ఫలాలు, పత్రాలు తీసుకురమ్మన్నాడు. సారంగ వెంటనే అడవికి బయలుదేరాడు. ఫలాలు, పత్రాలు తెంపి పువ్వులు సేకరిస్తుండగా ఒక వైపు నుండి మూలుగులు వినిపించాయి. సారంగ ఆ దిశగా వెళ్ళి చూశాడు. ఒక ముని దిక్కులేని స్థితిలో పడి ఉన్నాడు. సారంగ తాపసి తలను తన తొడ మీద పెట్టుకుని ‘‘మునీశ్వరా, ఎవరు మీరు? ఎందుకిలా పడి ఉన్నారు?’’ అని ఆరా తీశాడు.
‘‘నాయనా, నన్ను శివశంకరముని అంటారు. నేను కాశీ వెళుతూ నడచి నడచి నిస్సత్తువతో నీరసించి ఇలా పడిపోయాను. నాకు అంతిమ ఘడియలు ఆసన్నమయ్యాయి. నాకొక సహాయం చేస్తావా?’’ అడిగాడు ముని.
‘‘చెప్పండి స్వామీ, తప్పకుండా చేస్తాను’ అన్నాడు సారంగ. ‘‘నేను కాసేపట్లో తుది శ్వాస విడుస్తాను. ఒక్కసారి సర్వేశ్వరుణ్ణి స్మరించి నా శవాన్ని దహనం చెయ్యి. నీకు మూడు కోరికలు తలచిన వెంటనే నెరవేరేలా అనుగ్రహిస్తున్నాను’’ అని కన్నుమూశాడు. సారంగ కట్టెలు ఏరుకొచ్చి, చితిపేర్చి దహనకాండ ముగించే సరికి చీకటి పడింది.
పూజకు ఆలస్యమైతే గురువు అగ్గిమీద గుగ్గిలంలా భగ్గుమంటారని భయపడ్డాడు సారంగ. ఇంతలో వర్షం మొదలైంది. సేకరించిన పువ్వులు, ఫలాలు, పత్రాలను మూటకట్టి తడవకుండా ఒక చెట్టుతొర్రలో పెట్టాడు. ఏం చేయాలో తోచలేదు.
హఠాత్తుగా అనుకోగానే నెరవేరేలా ముని ఇచ్చిన మూడు కోరికల మాట గుర్తుకొచ్చింది. వెంటనే వర్షం ఆగాలనుకున్నాడు. మరుక్షణమే వాన వెలసింది. తొర్రలోని మూట తీసుకుని ముందుకు అడుగేశాడు. కన్ను పొడుచుకున్నా ఏమీ కానరాని కటిక చీకటే కాక, ఎక్కడ పడితే అక్కడ ముళ్ళు, రాళ్ళు! వెంటనే ‘‘ఆశ్రమం వరకు పూలబాట, వెలుతురు కావాలి’’ అనుకున్నాడు. అంతే, కళ్ళు జిగేలు మనిపించే వెలుగు, మెత్తని పూలబాట ప్రత్యక్షమయ్యాయి. ఆనందంగా ఆశ్రమం చేరుకొని, అరుగుమీద కూర్చున్న గురువుతో జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. ‘‘అయితే ఆ మూడో కోరిక ఏం కోరుకుంటావు?’’ ప్రశ్నించాడు గురువు. ‘‘పదేపదే అడవికి నడచి వెళ్ళే పని లేకుండా ఆశ్రమం చుట్టూ ఫల, పుష్ప, పత్ర భరితమైన ఒక వనం ఉండాలని కోరాలనుకుంటున్నా’’ అని జవాబిచ్చాడు శిష్యుడు.
‘‘సారంగా, ఇప్పటికే రెండు కోరికలు వృథా చేశావు. వాన మొదలవగానే ఆ మూటతో నేను ఆశ్రమం వద్ద ఉండాలి, అనుంటే రెండు కోరికలు మిగిలేవి. నువ్వు ఇంత మూర్ఖుడవనుకోలేదు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి. మనం ఆశ్రమంలోని పాతికమంది విద్యార్థులకు ఒక అపురూపమైన భవనం, వజ్రవైఢూర్యాలు, బంగారం, ధనరాసులు కోరు. నిత్యం షడ్రసోపేత భోజనాలు ఆరగించి, హంసతూలికా తల్పాలమీద పవళిద్దాం’’ అన్నాడు గురువు.
‘‘తమ ఆజ్ఞ’’ అని సారంగ చివరి కోరిక కోరగానే ఆశ్రమం అదృశ్యమై అక్కడొక అందమైన పాలరాతి భవనం, శిల్పాలు, తల్పాలు, వజ్రాలు, వైఢూర్యాలు, బంగారు నాణేలు ప్రత్యక్షమయ్యాయి. మరుసటిరోజే ఈ విషయం రాజు ఉగ్రసేనునికి తెలిసింది. భూపాలుడు వెంటనే కొందరు భటులను వెంటపెట్టుకుని వచ్చి ‘‘ఈ సుందర భవనం ఇకపై నా అతిథులు బస చేయడానికి విడిదిగా ఉంటుంది. సిరిసంపదలు నా ధనాగారం లోటును భర్తీ చేస్తాయి. ద్రవ్యరాశులను కరువుతో విలవిలలాడుతున్న నా ప్రజల ప్రాణాలు కాపాడడానికి వినియోగిస్తాను’’ అని, గురువును మరో ఆశ్రమం నిర్మించుకోమని ఆదేశించి వెళ్ళిపోయాడు. చిన్మయానంద స్వామి చింతాక్రాంతుడయ్యాడు. తమ విషయంలో విధిరాత వక్రించిందని వాపోయాడు.
- నరిశేపల్లి లక్ష్మీనారాయణ