Chinmayananda swami
-
నిందితుడు ఆస్పత్రిలో బాధితురాలు జైల్లో!
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ 2017లో ఓ టీనేజర్‌ను రేప్ చేశారన్న కేసును ఎలా మసి పూసి మారేడు కాయ చేయాలని రాష్ట్ర అధికార యంత్రాంగం ప్రయత్నించిందో ఇప్పుడు 23 ఏళ్ల అమ్మాయిని రేప్ చేశారన్న కేసులో చిక్కుకున్న కేంద్ర మాజీ సహాయ మంత్రి, మూడు సార్లు బీజేపీగా ఎంపీగా ఉన్న చిన్మయానంద్ విషయంలో అదే చేయడానికి అధికార యంత్రాంగం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయనపై రేప్ అభియోగాలను దాఖలు చేయాల్సిన యూపీ పోలీసులు, ‘సెక్సువల్ అసాల్ట్’ అభియోగాలను దాఖలు చేశారు. రేప్ కేసులో నేరం రుజువైతే దోషికి ఏడేళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష వరకు పడుతుంది. అదే సెక్సువల్ అసాల్ట్ కేసులో అయితే ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. పైగా జైల్లో ఉండాల్సిన చిన్మయానంద్ ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నారు. ఆరోగ్యం అంత సవ్యంగా ఉందని ఆస్పత్రి వర్గాలు స్పష్టంగా చెబుతున్నప్పటికీ పోలీసుల అండదండలతో ఆయన ఆస్పత్రిలోనే విశ్రాంతి తీసుకుంటుండం విడ్డూరం. ఆయన తనను రేప్ చేశారంటూ కేసు పెట్టిన 23 ఏళ్ల లా విద్యార్థినినేమో జైలుకు పంపించారు. తన క్లైంట్ నుంచి డబ్బు గుంజేందుకు ప్రయత్నించిందంటూ చిన్మయానంద్ న్యాయవాది ఆ విద్యార్థినిపె ఎదురు కేసు పెట్టడంతో యూపీ పోలీసులు అతిగా వ్యవహరించారు. ఆమెకు వ్యతిరేకంగా తగిన సాక్ష్యాధారలు కూడా ఉన్నాయంటూ పోలీసులు కోర్టు ముందు చెప్పడంతో ఆ యువతిని 14 రోజులపాటు జుడీషియల్ కస్టడీకి పంపించారు. ఆమెకు బెయిల్ ఇవ్వడానికి కూడా కోర్టు నిరాకరించింది. చిన్మయానంద్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న లా కళాశాలలో చదువుతున్న 23 ఏళ్ల విద్యార్థిని, చిన్మయానంద్ తనను రేప్ చేశారంటూ ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు కేసు నమోదు చేసుకోవడానికి నిరాకరించారు. లా చదువుతున్న విద్యార్థులే తమకు జరుగుతున్న అన్యాయంపై పోరాడకపోతే ఎలా అన్న మనస్తత్వం కలిగిన ఆ లా విద్యార్థిని మీడియా ముందుకు వచ్చి తనకు జరిగిన ఘోరం గురించి చెప్పడం, ఆ నేపథ్యంలో వివిధ వర్గాల నుంచి ఒత్తిడి రావడంతో ఆయనపై పోలీసులు ఫిర్యాదు తీసుకోక తప్పలేదు. చిన్మయానంద్ తన ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న కళాశాలల నుంచి విద్యార్థినులను పిలిపించి వారిని లైంగికంగా లోబర్చుకునే వాడనే ఆరోపణలు కూడా ఆయనపై ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఆ విషయంలో బాధితులెవరూ ముందుకు రాలేదు. మొదటి సారి ఓ లా విద్యార్థిని ముందుకు వస్తే ఆమెపై ఎదురు కేసును పోలీసులు బనాయించారు. చిన్మయానంద్ కేసులో ప్రత్యేక దర్యాప్తు అధికారిని కూడా యోగి ప్రభుత్వం నియమించింది. తన విచారణలో చిన్మయానంద్ నేరం అంగీకరించారని, తాను చేసిన పనికి సిగ్గు పడుతున్నానని, ఇంతకు మించే తానేమీ మాట్లాడలేనంటూ వాంగ్మూలం ఇచ్చారని కేసు ప్రత్యేక దర్యాప్తు అధికారి నవీన్ అరోరా ఇప్పటికే విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అయినప్పటికీ చిన్మయానంద్‌పై రేప్ కేసు కాకుండా భారతీయ శిక్షాస్మృతిలోని 376 సీ సెక్షన్ కింద కేసు పెట్టడం పట్ల సామాజిక కార్యకర్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తనకున్న అధికారాన్ని ఉపయోగించి అమ్మాయిలను లోబర్చుకోవడం ఈ సెక్షన్ అభియోగం. ఈ కేసులో నేరం రుజువైతే ఐదు నుంచి పదేళ్ల వరకు మాత్రమే దోషికి జైలు శిక్ష పడుతుంది. ఇలాంటి కేసుల్లో నేరస్థులు శిక్ష పడకుండా తప్పించుకునే అవకాశం ఎక్కువగా ఉంది. పరస్పర అంగీకారంతోనే సెక్స్‌లో పాల్గొన్నామని నిరూపిస్తే చాలు. అందుకు బాధితురాలిని బెదిరించో, భయపెట్టో ఒప్పిస్తే చాలు. అందుకనే తన క్లైంట్ వద్ద డబ్బులు గుంజేందుకు వల విసిరిందంటూ చిన్మయానంద్ న్యాయవాది ఆ లా విద్యార్థినిపై ఎదురు కేసు పెట్టారు. కేసును ఉపసంహరించుకునేలా చేయడం కోసమో లేదా పరస్పర అంగీకారంతో సెక్స్‌లో పాల్గొన్నామని చెప్పడం ద్వారా కేసు నుంచి తప్పించుకునేందుకు ఇది ఎత్తుగడ అని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. 23 ఏళ్ల లా విద్యార్థిని ఎక్కడైనా 72 ఏళ్ల చిన్మయానంద్తో ఇష్టపూర్వకంగా సెక్స్‌లో పొల్గొందంటే ఎవరు నమ్మగలరు? అందుకే చిన్మయానంద్ న్యాయవాది కేసు మధ్యలోకి డబ్బుల వ్యవహారం తీసుకొచ్చి ఉండవచ్చు! -
చిన్మయానంద కేసులో కొత్త ట్విస్ట్.. విద్యార్థిని అరెస్ట్
లక్నో: కేంద్ర మాజీమంత్రి స్వామి చిన్మయానంద లైంగిక వేదింపుల కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. చిన్మయానంద తనను లైంగికంగా వేదించారంటూ ఆరోపణలు చేసిన ఉత్తరప్రదేశ్ న్యాయ విద్యార్థినిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ నిమిత్తం మంగళవారం ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు బుధవారం ఉదయం అరెస్ట్ చేశారు. కాలేజ్‌లోని హాస్టల్లో తాను స్నానం చేస్తున్న దృశ్యాలను రికార్డు చేసిన చిన్మయానంద్.. పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనతో మసాజ్ చేయించుకున్నాడని న్యాయవిద్యార్థిని పోలీసులకు ఆధారాలతో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సిట్ బృందం రెండురోజుల క్రితం చిన్మయానందను అరెస్టు చేసింది. ఇదిలావుండగా అత్యాచారం కేసులో బాధితురాలైన న్యాయ విద్యార్థిని డబ్బులు గుంజేందుకు బ్లాక్ మెయిల్ చేస్తుందనే ఫిర్యాదు మేర సిట్ ఆమెపై కూడా కేసు నమోదు చేసి బాధితురాలిని అరెస్టు చేసింది. ఆమె ఇంటికి చేరుకున్న పోలీసులు బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్లారంటూ విద్యార్థిని కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. మొత్తం మీద చిన్మయానంద కేసుతో పాటు బాధితురాలు డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసిందనే మరో కేసు నమోదు కావడంతో ఈ కేసు మలుపు తిరిగింది. అత్యాచారం కేసులో బాధితురాలైన తనకు బ్లాక్ మెయిల్ కేసులో అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు ఇవ్వాలని కోరుతూ న్యాయవిద్యార్థిని కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై కోర్టు గురువారం దర్యాప్తు చేయనుండగా బుధవారం సిట్ ఆమెను అరెస్టు చేయడంతో కేసు కీలక మలుపు తిరిగింది. దీంతో ఉత్తర ప్రదేశ్ ప్రత్యేక పోలీసు దర్యాప్తు బృందం న్యాయవిద్యార్థినిని ప్రశ్నించనుంది. కాగా ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం చేత విచారణ ఎదుర్కొన్న చిన్మయానందను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. తాను నిర్వహించే కాలేజీలో న్యాయవాద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఒప్పుకున్నారని ప్రత్యేక దర్యాప్తు బృందం చీఫ్ నవీన్ అరోరా మీడియాకు వెల్లడించారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో శుక్రవారం సిట్ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. కోర్టు ముందు చిన్మయానంద్‌ను హాజరుపరచగా 14 రోజుల పాటు జైలుకు తరలించింది. -
‘సిట్ ఆయనను రక్షించాలని చూస్తోందా?’
లక్నో: తనపై లైంగికదాడి చేసిన బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్‌పై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) కేసు నమోదు చేయకుండా ఎందుకు జాప్యం చేస్తోందని బాధిత న్యాయ విద్యార్థిని ప్రశ్నించింది. కాగా సెక్షన్ 164 కింద తన వాంగ్మూలాన్ని15రోజుల నుంచి దర్యాప్తు చేస్తున్నప్పటికి చిన్మయానంద్‌ను ఎందుకు అరెస్టు చేయలేదని ఆమె సిట్‌పై మండిపడింది. సిట్ బృందం నిందితుడిని రక్షించాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోందని ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా ఆధారాలు చూపించి కేసును తప్పుదోవ పట్టించాలని సిట్ చూస్తోందన్నారు. కేసు దర్యాప్తు పురోగతిపై నిరాశ వ్యక్తం చేస్తూ.. నిందితుడిపై చర్యలు ప్రారంభించడానికి తన జీవితాన్ని ముగిసే వరకు సంబంధిత అధికారులు ఎదురుచూస్తున్నారా? అని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘నేను ఆత్మహత్య చేసుకుంటానంటే అధికారులు నమ్ముతారా? ప్రభుత్వం నా జీవితాన్ని ముగించే వరకు నిందితుడిపై చర్యలు తీసుకోదా? ఢిల్లీ మెజిస్ట్రేట్‌కు అత్యాచారంపై ఫిర్యాదు చేశాను. పోలీసులకు చిన్మయానంద్ గదిలో ఉన్న మద్యం సీసాల సమాచారం అందించాను. కేసుకు సంబంధించిన ఓ పెన్‌డ్రైవ్‌ను సిట్‌కు అప్పగించాను. కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను పోలీసులకు అందజేశాను. కానీ ఇప్పటివరకు కేసులో పురోగతి లేదు. సిట్ పూర్తిగా చిన్మయానంద్‌కు సహకరిస్తోందని నా అనుమానం. నాకు న్యాయం జరిగే వరకు పోరాడతా‘ అని బాధితురాలు పేర్కొన్నారు. అయితే చిన్మయానంద్ అస్వస్థతకు లోనుకావడంతో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా సిట్ బృందం దర్యాప్తులో భాగంగా పలు ఆధారాల సేకరణ కోసం బాధిత విద్యార్థిని శుక్రవారం చిన్మయానంద్ గదికి తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. -
మూడు కోరికలు
పిల్లల కథ: చిన్మయానందస్వామి తన ఆశ్రమంలోని శిష్యుడైన సారంగను పిలిచి అడవికెళ్ళి సాయంత్రం కాళీమాత పూజకు కావలసిన పువ్వులు, ఫలాలు, పత్రాలు తీసుకురమ్మన్నాడు. సారంగ వెంటనే అడవికి బయలుదేరాడు. ఫలాలు, పత్రాలు తెంపి పువ్వులు సేకరిస్తుండగా ఒక వైపు నుండి మూలుగులు వినిపించాయి. సారంగ ఆ దిశగా వెళ్ళి చూశాడు. ఒక ముని దిక్కులేని స్థితిలో పడి ఉన్నాడు. సారంగ తాపసి తలను తన తొడ మీద పెట్టుకుని ‘‘మునీశ్వరా, ఎవరు మీరు? ఎందుకిలా పడి ఉన్నారు?’’ అని ఆరా తీశాడు. ‘‘నాయనా, నన్ను శివశంకరముని అంటారు. నేను కాశీ వెళుతూ నడచి నడచి నిస్సత్తువతో నీరసించి ఇలా పడిపోయాను. నాకు అంతిమ ఘడియలు ఆసన్నమయ్యాయి. నాకొక సహాయం చేస్తావా?’’ అడిగాడు ముని. ‘‘చెప్పండి స్వామీ, తప్పకుండా చేస్తాను’ అన్నాడు సారంగ. ‘‘నేను కాసేపట్లో తుది శ్వాస విడుస్తాను. ఒక్కసారి సర్వేశ్వరుణ్ణి స్మరించి నా శవాన్ని దహనం చెయ్యి. నీకు మూడు కోరికలు తలచిన వెంటనే నెరవేరేలా అనుగ్రహిస్తున్నాను’’ అని కన్నుమూశాడు. సారంగ కట్టెలు ఏరుకొచ్చి, చితిపేర్చి దహనకాండ ముగించే సరికి చీకటి పడింది. పూజకు ఆలస్యమైతే గురువు అగ్గిమీద గుగ్గిలంలా భగ్గుమంటారని భయపడ్డాడు సారంగ. ఇంతలో వర్షం మొదలైంది. సేకరించిన పువ్వులు, ఫలాలు, పత్రాలను మూటకట్టి తడవకుండా ఒక చెట్టుతొర్రలో పెట్టాడు. ఏం చేయాలో తోచలేదు. హఠాత్తుగా అనుకోగానే నెరవేరేలా ముని ఇచ్చిన మూడు కోరికల మాట గుర్తుకొచ్చింది. వెంటనే వర్షం ఆగాలనుకున్నాడు. మరుక్షణమే వాన వెలసింది. తొర్రలోని మూట తీసుకుని ముందుకు అడుగేశాడు. కన్ను పొడుచుకున్నా ఏమీ కానరాని కటిక చీకటే కాక, ఎక్కడ పడితే అక్కడ ముళ్ళు, రాళ్ళు! వెంటనే ‘‘ఆశ్రమం వరకు పూలబాట, వెలుతురు కావాలి’’ అనుకున్నాడు. అంతే, కళ్ళు జిగేలు మనిపించే వెలుగు, మెత్తని పూలబాట ప్రత్యక్షమయ్యాయి. ఆనందంగా ఆశ్రమం చేరుకొని, అరుగుమీద కూర్చున్న గురువుతో జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. ‘‘అయితే ఆ మూడో కోరిక ఏం కోరుకుంటావు?’’ ప్రశ్నించాడు గురువు. ‘‘పదేపదే అడవికి నడచి వెళ్ళే పని లేకుండా ఆశ్రమం చుట్టూ ఫల, పుష్ప, పత్ర భరితమైన ఒక వనం ఉండాలని కోరాలనుకుంటున్నా’’ అని జవాబిచ్చాడు శిష్యుడు. ‘‘సారంగా, ఇప్పటికే రెండు కోరికలు వృథా చేశావు. వాన మొదలవగానే ఆ మూటతో నేను ఆశ్రమం వద్ద ఉండాలి, అనుంటే రెండు కోరికలు మిగిలేవి. నువ్వు ఇంత మూర్ఖుడవనుకోలేదు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి. మనం ఆశ్రమంలోని పాతికమంది విద్యార్థులకు ఒక అపురూపమైన భవనం, వజ్రవైఢూర్యాలు, బంగారం, ధనరాసులు కోరు. నిత్యం షడ్రసోపేత భోజనాలు ఆరగించి, హంసతూలికా తల్పాలమీద పవళిద్దాం’’ అన్నాడు గురువు. ‘‘తమ ఆజ్ఞ’’ అని సారంగ చివరి కోరిక కోరగానే ఆశ్రమం అదృశ్యమై అక్కడొక అందమైన పాలరాతి భవనం, శిల్పాలు, తల్పాలు, వజ్రాలు, వైఢూర్యాలు, బంగారు నాణేలు ప్రత్యక్షమయ్యాయి. మరుసటిరోజే ఈ విషయం రాజు ఉగ్రసేనునికి తెలిసింది. భూపాలుడు వెంటనే కొందరు భటులను వెంటపెట్టుకుని వచ్చి ‘‘ఈ సుందర భవనం ఇకపై నా అతిథులు బస చేయడానికి విడిదిగా ఉంటుంది. సిరిసంపదలు నా ధనాగారం లోటును భర్తీ చేస్తాయి. ద్రవ్యరాశులను కరువుతో విలవిలలాడుతున్న నా ప్రజల ప్రాణాలు కాపాడడానికి వినియోగిస్తాను’’ అని, గురువును మరో ఆశ్రమం నిర్మించుకోమని ఆదేశించి వెళ్ళిపోయాడు. చిన్మయానంద స్వామి చింతాక్రాంతుడయ్యాడు. తమ విషయంలో విధిరాత వక్రించిందని వాపోయాడు. - నరిశేపల్లి లక్ష్మీనారాయణ