చిన్మయానంద కేసులో కొత్త ట్విస్ట్‌.. విద్యార్థిని అరెస్ట్‌ | Accused In Chinmayanand Rape Case Arrested In Extortion Case | Sakshi
Sakshi News home page

చిన్మయానంద కేసులో కొత్త ట్విస్ట్‌.. విద్యార్థిని అరెస్ట్‌

Published Wed, Sep 25 2019 11:03 AM | Last Updated on Wed, Sep 25 2019 12:46 PM

Accused In Chinmayanand Rape Case Arrested In Extortion Case - Sakshi

లక్నో: కేంద్ర మాజీమంత్రి స్వామి చిన్మయానంద లైంగిక వేదింపుల కేసులో కొత్త ట్విస్ట్‌ తెరపైకి వచ్చింది. చిన్మయానంద తనను లైంగికంగా వేదించారంటూ ఆరోపణలు చేసిన ఉత్తరప్రదేశ్‌ న్యాయ విద్యార్థినిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. విచారణ నిమిత్తం మంగళవారం ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు బుధవారం ఉదయం అరెస్ట్‌ చేశారు. కాలేజ్‌లోని హాస్టల్‌లో తాను స్నానం చేస్తున్న దృశ్యాలను రికార్డు చేసిన చిన్మయానంద్‌.. పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనతో మసాజ్ చేయించుకున్నాడని న్యాయవిద్యార్థిని పోలీసులకు ఆధారాలతో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సిట్ బృందం రెండురోజుల క్రితం చిన్మయానందను అరెస్టు చేసింది. ఇదిలావుండగా అత్యాచారం కేసులో బాధితురాలైన న్యాయ విద్యార్థిని డబ్బులు గుంజేందుకు బ్లాక్ మెయిల్ చేస్తుందనే ఫిర్యాదు మేర సిట్ ఆమెపై కూడా కేసు నమోదు చేసి బాధితురాలిని అరెస్టు చేసింది. ఆమె ఇంటికి చేరుకున్న పోలీసులు బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్లారంటూ విద్యార్థిని కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. మొత్తం మీద చిన్మయానంద కేసుతో పాటు  బాధితురాలు డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసిందనే మరో కేసు నమోదు కావడంతో ఈ కేసు మలుపు తిరిగింది.

అత్యాచారం కేసులో బాధితురాలైన తనకు బ్లాక్ మెయిల్ కేసులో అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు ఇవ్వాలని కోరుతూ న్యాయవిద్యార్థిని కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై కోర్టు గురువారం దర్యాప్తు చేయనుండగా బుధవారం సిట్ ఆమెను అరెస్టు చేయడంతో కేసు కీలక మలుపు తిరిగింది. దీంతో ఉత్తర ప్రదేశ్ ప్రత్యేక పోలీసు దర్యాప్తు బృందం న్యాయవిద్యార్థినిని ప్రశ్నించనుంది. కాగా ఇప్పటికే  ప్రత్యేక దర్యాప్తు బృందం చేత విచారణ ఎదుర్కొన్న చిన్మయానందను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. తాను నిర్వహించే కాలేజీలో న్యాయవాద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఒప్పుకున్నారని ప్రత్యేక దర్యాప్తు బృందం చీఫ్‌ నవీన్ అరోరా మీడియాకు వెల్లడించారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో శుక్రవారం సిట్‌ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. కోర్టు ముందు చిన్మయానంద్‌ను హాజరుపరచగా 14 రోజుల పాటు జైలుకు తరలించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement