సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ 2017లో ఓ టీనేజర్‌ను రేప్ చేశారన్న కేసును ఎలా మసి పూసి మారేడు కాయ చేయాలని రాష్ట్ర అధికార యంత్రాంగం ప్రయత్నించిందో ఇప్పుడు 23 ఏళ్ల అమ్మాయిని రేప్ చేశారన్న కేసులో చిక్కుకున్న కేంద్ర మాజీ సహాయ మంత్రి, మూడు సార్లు బీజేపీగా ఎంపీగా ఉన్న చిన్మయానంద్ విషయంలో అదే చేయడానికి అధికార యంత్రాంగం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయనపై రేప్ అభియోగాలను దాఖలు చేయాల్సిన యూపీ పోలీసులు, ‘సెక్సువల్ అసాల్ట్’ అభియోగాలను దాఖలు చేశారు. రేప్ కేసులో నేరం రుజువైతే దోషికి ఏడేళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష వరకు పడుతుంది. అదే సెక్సువల్ అసాల్ట్ కేసులో అయితే ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది.
పైగా జైల్లో ఉండాల్సిన చిన్మయానంద్ ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నారు. ఆరోగ్యం అంత సవ్యంగా ఉందని ఆస్పత్రి వర్గాలు స్పష్టంగా చెబుతున్నప్పటికీ పోలీసుల అండదండలతో ఆయన ఆస్పత్రిలోనే విశ్రాంతి తీసుకుంటుండం విడ్డూరం. ఆయన తనను రేప్ చేశారంటూ కేసు పెట్టిన 23 ఏళ్ల లా విద్యార్థినినేమో జైలుకు పంపించారు. తన క్లైంట్ నుంచి డబ్బు గుంజేందుకు ప్రయత్నించిందంటూ చిన్మయానంద్ న్యాయవాది ఆ విద్యార్థినిపె ఎదురు కేసు పెట్టడంతో యూపీ పోలీసులు అతిగా వ్యవహరించారు. ఆమెకు వ్యతిరేకంగా తగిన సాక్ష్యాధారలు కూడా ఉన్నాయంటూ పోలీసులు కోర్టు ముందు చెప్పడంతో ఆ యువతిని 14 రోజులపాటు జుడీషియల్ కస్టడీకి పంపించారు. ఆమెకు బెయిల్ ఇవ్వడానికి కూడా కోర్టు నిరాకరించింది.
చిన్మయానంద్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న లా కళాశాలలో చదువుతున్న 23 ఏళ్ల విద్యార్థిని, చిన్మయానంద్ తనను రేప్ చేశారంటూ ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు కేసు నమోదు చేసుకోవడానికి నిరాకరించారు. లా చదువుతున్న విద్యార్థులే తమకు జరుగుతున్న అన్యాయంపై పోరాడకపోతే ఎలా అన్న మనస్తత్వం కలిగిన ఆ లా విద్యార్థిని మీడియా ముందుకు వచ్చి తనకు జరిగిన ఘోరం గురించి చెప్పడం, ఆ నేపథ్యంలో వివిధ వర్గాల నుంచి ఒత్తిడి రావడంతో ఆయనపై పోలీసులు ఫిర్యాదు తీసుకోక తప్పలేదు. చిన్మయానంద్ తన ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న కళాశాలల నుంచి విద్యార్థినులను పిలిపించి వారిని లైంగికంగా లోబర్చుకునే వాడనే ఆరోపణలు కూడా ఆయనపై ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఆ విషయంలో బాధితులెవరూ ముందుకు రాలేదు. మొదటి సారి ఓ లా విద్యార్థిని ముందుకు వస్తే ఆమెపై ఎదురు కేసును పోలీసులు బనాయించారు.
చిన్మయానంద్ కేసులో ప్రత్యేక దర్యాప్తు అధికారిని కూడా యోగి ప్రభుత్వం నియమించింది. తన విచారణలో చిన్మయానంద్ నేరం అంగీకరించారని, తాను చేసిన పనికి సిగ్గు పడుతున్నానని, ఇంతకు మించే తానేమీ మాట్లాడలేనంటూ వాంగ్మూలం ఇచ్చారని కేసు ప్రత్యేక దర్యాప్తు అధికారి నవీన్ అరోరా ఇప్పటికే విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అయినప్పటికీ చిన్మయానంద్‌పై రేప్ కేసు కాకుండా భారతీయ శిక్షాస్మృతిలోని 376 సీ సెక్షన్ కింద కేసు పెట్టడం పట్ల సామాజిక కార్యకర్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తనకున్న అధికారాన్ని ఉపయోగించి అమ్మాయిలను లోబర్చుకోవడం ఈ సెక్షన్ అభియోగం. ఈ కేసులో నేరం రుజువైతే ఐదు నుంచి పదేళ్ల వరకు మాత్రమే దోషికి జైలు శిక్ష పడుతుంది.
ఇలాంటి కేసుల్లో నేరస్థులు శిక్ష పడకుండా తప్పించుకునే అవకాశం ఎక్కువగా ఉంది. పరస్పర అంగీకారంతోనే సెక్స్‌లో పాల్గొన్నామని నిరూపిస్తే చాలు. అందుకు బాధితురాలిని బెదిరించో, భయపెట్టో ఒప్పిస్తే చాలు. అందుకనే తన క్లైంట్ వద్ద డబ్బులు గుంజేందుకు వల విసిరిందంటూ చిన్మయానంద్ న్యాయవాది ఆ లా విద్యార్థినిపై ఎదురు కేసు పెట్టారు. కేసును ఉపసంహరించుకునేలా చేయడం కోసమో లేదా పరస్పర అంగీకారంతో సెక్స్‌లో పాల్గొన్నామని చెప్పడం ద్వారా కేసు నుంచి తప్పించుకునేందుకు ఇది ఎత్తుగడ అని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. 23 ఏళ్ల లా విద్యార్థిని ఎక్కడైనా 72 ఏళ్ల చిన్మయానంద్‌తో ఇష్టపూర్వకంగా సెక్స్‌లో పొల్గొందంటే ఎవరు నమ్మగలరు? అందుకే చిన్మయానంద్ న్యాయవాది కేసు మధ్యలోకి డబ్బుల వ్యవహారం తీసుకొచ్చి ఉండవచ్చు!
Comments
Please login to add a commentAdd a comment