పోయిన తోక వచ్చె... | Children's story, Cat, monkey | Sakshi
Sakshi News home page

పోయిన తోక వచ్చె...

Published Sun, May 17 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 2:10 AM

పోయిన తోక వచ్చె...

పోయిన తోక వచ్చె...

పిల్లల కథ
పిల్లి, కోతి మంచి మిత్రులు. అవి ఆడుకుంటూ, పాడుకుంటూ ఆనందంగా ఉండేవి. ఒకసారి కోతికి ఒక చిలిపి ఆలోచన వచ్చి, పిల్లి చూడకుండా దాని వెనుక నుంచి వెళ్లి, దాని రెండు చెవులు పట్టిలాగి, గబుక్కున చెట్ల చాటున దాచుకుంది.
 పిల్లికి కోపం వచ్చి, ‘‘ఏయ్, నా చెవులు పీకింది ఎవరు? మర్యాదగా నా ముందుకు రావాలి’’ అని అరిచింది.
 
కోతి తాను దాక్కున్న చోటి నుంచి బయటికి వచ్చింది.
 ‘‘ఛీ! నువ్వింత అల్లరి కోతివి అనుకోలేదు’’ అంది పిల్లి నిరసనగా.
 ‘‘ఓ! నీ చెవులు సీతాకోకచిలుకల్లాగ అందంగా ఉన్నాయి. వాటిని గుంజి తప్పుచేశాను. మన్నించు’’ అంది కోతి. పిల్లి కోపంగా ‘కోతికి ఎలాగైనా గుణపాఠం నేర్పాలి’ అనుకుంటూ వెళ్లిపోయింది.
 
కొద్దిరోజుల తర్వాత కోతి బాగా తక్కువ ఎత్తున్న చెట్టుకొమ్మ మీద పడుకుని ఉండటం కనిపించింది పిల్లికి. ‘ఇదే సమయం’ అనుకుని, కోతి తోకను ఆ చెట్టు కొమ్మకు ముడివేసింది. కోతి నిద్ర లేచి అలవాటుగా మరో కొమ్మ మీదకి దూకబోయింది. అంతే! దాని తోక పుటుక్కున తెగిపోయింది. అక్కడే ఉన్న పిల్లి చటుక్కున ఆ తోకను నోట కరచుకుని పరిగెత్తింది. కోతికి చాలా బాధ కలిగింది. ఇంక తాను ఏ చెట్టు కొమ్మకు కూడా తోకను చుట్టి వేళ్లాడలేదు కదా! ఎలాగైనా తోక మళ్లీ సంపాదించాలని వెతికి వెతికి ఆఖరికి ఒకచోట పిల్లిని పట్టుకుంది కోతి.
 ‘‘పిల్లీ, పిల్లీ! దయచేసి నా తోక నాకివ్వవా?’’ అంటూ బతిమిలాడింది.
 ‘‘అలాగైతే ముందు నాకు కొన్ని పాలు తీసుకురా’’ అంది పిల్లి.
 ‘‘పాలు ఎక్కడ దొరుకుతాయి?’’
 
‘‘వెళ్లి ఆవును అడుగు. ఇస్తుంది’’ అంది పిల్లి.
 కోతి, ఆవు దగ్గరికి వెళ్లి, ‘‘ఆవూ, ఆవూ! నాకు కొన్ని పాలు ఇవ్వవా? నా తోక నాకు తిరిగి ఇవ్వటానికి పిల్లికి పాలు కావాలట’’ అని అడిగింది.
 ‘‘అలాగే ఇస్తా కాని, నాక్కొంచెం గడ్డి తెచ్చిపెట్టు’’ అంది ఆవు.
 ‘‘గడ్డి ఎక్కడ దొరుకుతుంది?’’
 ‘‘వెళ్లి రైతును అడుగు’’ అంది ఆవు.
 
కోతి, రైతు దగ్గరికి వెళ్లి, ‘‘రైతూ రైతూ! నాకు కొంచెం గడ్డి ఇవ్వవా? పాలు ఇవ్వటానికి ఆవుకు గడ్డి కావాలట. పిల్లికి నా తోక నాకు ఇవ్వటానికి పాలు కావాలట’’ అని అడిగింది.
 ‘‘అలాగే ఇస్తా కాని నాకు వాన కావాలి’’ అన్నాడు రైతు. ‘‘వాన... ఎక్కడ దొరుకుతుంది?’’ అంది కోతి. ‘‘వెళ్లి మబ్బును అడుగు’’ అన్నాడు రైతు.
 కోతి, మబ్బు దగ్గరికి వెళ్లి, ‘‘మబ్బూ! మబ్బూ! నాకు కొంచెం వాన ఇవ్వవా?’’ అంటూ తన కథంతా చెప్పింది కోతి.
 
మబ్బు కొంచెం ఆలోచించి, ‘‘సరే, కొంచెం వాన తీసుకెళ్లి రైతుకు ఇవ్వు’’ అంది. కోతి మబ్బుకు కృతజ్ఞతలు చెప్పి, వానను తీసుకెళ్లి రైతుకు ఇచ్చింది. రైతు గడ్డి ఇచ్చాడు. గడ్డి తీసుకెళ్లి ఆవుకు ఇచ్చింది. ఆవు పాలు ఇచ్చింది. పాలు తీసుకెళ్లి పిల్లికి ఇచ్చింది. పిల్లి తోక ఇచ్చింది.
 తన తోక తనకు తిరిగి రాగానే, కోతి దానిని అతికించుకుని ఆనందంగా గెంతులు వేసింది. పిల్లి, కోతి మునపట్లా మళ్లీ స్నేహితులయ్యాయి.
- ఎం. మదన్‌మోహన్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement