నందనవనంలో పెద్ద మర్రిచెట్టు ఉంది. నెమలి, చిలుక, మైనా, కోకిల, పావురం, కాకి వంటి పక్షులన్నీ ఆ చెట్టు మీద గూళ్లు పెట్టుకుని నివసిస్తున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం అయ్యేసరికి పక్షులన్నీ చెట్టు మీదకు చేరుకుని కబుర్లు చెప్పుకుంటూ కష్టసుఖాలు పంచుకునేవి.
ఒకరోజు అవి కబుర్లలోంచి వాదనలోకి దిగాయి.
‘‘నేనెంత అందమైన దాన్నో తెలుసా? నేను జాతీయ పక్షిని. నా ఈకలను అలంకరణ వస్తువులుగా అందరూ ఇళ్లలో అలంకరించుకుంటారు. చిత్రకారులు నా అందమైన రూపాన్ని చిత్రిస్తారు. నాట్య కళాకారుల్లో మేటి వారిని నాట్యమయూరి బిరుదుతో గౌరవిస్తారు’’ అంటూ నెమలి వయ్యారాలు పోయింది.
ఈ మాటలతో రామచిలుకకు చిర్రెత్తింది. ‘‘ఏంటేంటీ... నువ్వొక్కదానివే అందగత్తెవా? నేను కానా? ఏ అమ్మాయి అందాన్నయినా నాతోనే పోలుస్తారు. ఎవరు ఏ మాట మాట్లాడినా తిరిగి అంటాను. చాలామంది నన్ను పంజరంలో ఉంచి ముద్దుగా పెంచుకుంటారు తెలుసా?’’ అంది.
చిలుక మాటలు విన్న పావురం తానేమీ తక్కువ తినలేదంటూ... ‘‘నన్ను అందరూ శాంతికి గుర్తుగా భావిస్తారు. జాతీయ పండుగ రోజుల్లో నన్ను ఎగురవేస్తారు. పర్యాటక ప్రదేశాల్లో నేను కనిపిస్తే గింజలు చల్లి ఆనందిస్తారు’’ అంది.
అప్పటి వరకు మౌనంగా ఉన్న కోకిల కూడా గొంతు విప్పింది. ‘‘నా పాటకు సాటి ఎవరు? ప్రకృతిలోని అందమంతా నా పాటలోనే ఉంది. కవులకు కవితా వస్తువును నేను’’ అంది.
ఇలా పక్షులన్నీ నేను గొప్పంటే నేను గొప్పని తెగ వాదించుకున్నాయి. చివరకు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్న కాకి మీద పడ్డాయి.
‘‘అసలు ఏ విషయంలో నువ్వు గొప్పదానివి? నిన్ను చూస్తేనే అందరికీ చీదర. నిన్ను చూస్తేనే హుష్ కాకి అని తరిమేస్తారు’’ అని హేళన చేశాయి.
కాకి ఏమీ బదులివ్వకుండా తన గూటికి వెళ్లిపోయింది.
మర్నాడు మళ్లీ అన్నీ కలిసి ‘‘నిన్న ఏమీ మాట్లాడకుండా అలా వెళ్లిపోయావేం?’’ అంటూ రెచ్చగొట్టాయి.
అప్పుడు కాకి గొంతు సవరించుకుని, ‘‘మీరందరూ నాకంటే గొప్పవారే. కాదనను. కానీ మీకూ కష్టాలున్నాయే! వాటిని మరచిపోయారు. నెమలి ఎంత అందమైనదైనా స్వేచ్ఛగా ఎగరలేదు. కనిపిస్తే మనుషులు బంధిస్తారు. మరి చిలుకనూ పంజరంలో బంధిస్తారు. పావురాన్నీ, కోకిలనూ రుచికరమైన మాంసం కోసం మట్టుపెట్టేస్తారు. నేను అందంగా లేకపోయినా, నాకు ఏ విద్యలూ రాకపోయినా మనుషులకు పుణ్యలోకాలు ప్రాప్తించేందుకు సాయం చేస్తుంటాను. ఎవరు ఎంత ఘనత కలిగి ఉన్నా, ఒదిగి ఉంటేనే వారి గొప్పతనానికి అందం’’ అంటూ ముగించింది. కాకి సమాధానంతో మిగిలిన పక్షులన్నీ అక్కడి నుంచి చల్లగా జారుకున్నాయి.
- ఉలాపు బాలకేశవులు
Comments
Please login to add a commentAdd a comment