
స్వర్గమంటే ఇదే..
పిల్లల కథ
‘పాఠశాల వార్షికోత్సవం జరుగుతోంది. విద్యుద్దీపాల కాంతిలో పట్టపగలల్లే ఉంది ప్రాంగణమంతా. ఉన్నట్టుండి పెద్ద ఎత్తున నేపథ్య సంగీతం వినిపించనారంభించింది. అందరి దృష్టి వేదికవైపు మళ్ళింది. తెర నెమ్మదిగా తొలగింది. వేదికపై రంగస్థలం పెద్ద భోజనశాలలాగా అమర్చబడి ఉంది. నాలుగు కుర్చీలు ఒక బల్లకు అటు ఇటూ ఏర్పాటు చేశారు. అంటే ఇద్దరటు, ఇద్దరిటూ కూర్చుని భోంచేసేలాగా ఏర్పాటు చేశారు.అలాంటి బల్లలు నాలుగు ఉన్నాయి. ‘‘నరకం అంటే ఇదే ఇదే’’ అన్న అక్షరాలపై నిలిచి అందరి దృష్టిని ఆకట్టుకొంటోంది.
‘‘నరకంలో ఇప్పుడు భోజన విరామం’’ అని చిన్న ప్రకటన వినపడింది. తెరల మాటు నుండి బిలబిలమని వచ్చిన పిల్లలతో కుర్చీలన్నీ నిండిపోయాయి. ఆ పిల్లలందరూ తైల సంస్కారం లేని జుట్టుతో చింపిరి క్రాఫులతో ఉన్నారు. వారి దుస్తులు కూడా చిరిగిపోయి, దీనంగా ఉన్నారు వారంతా.నేపథ్య సంగీతం కూడా విషాద రాగాలు పలికిస్తోంది. వారి కంచాలలో వేడివేడి ఆహారపదార్థాలు ఉన్నాయి. మిఠాయిలూ, పళ్ళరసాలు, గారెలు, వడియాలు, అప్పడాలు ఇలా ఒకటేమిటి, రకరకాల తినుబండారాలతో విందుభోజనం వారి ముందు సిద్ధమయిపోయింది. చిత్రంగా ఆ పిల్లలేమీ తినలేకపోతున్నారు. కనీసం తమ చేతుల్ని కంచం దాకా తీసుకువెళ్ళలేకపోతున్నారు. మైకులో వ్యాఖ్యానం వినిపిస్తోంది.
‘‘శ్రద్ధగా గమనించండి. ఈ పిల్లలెవరూ కూడా తమ మోచేతులని మడవలేకపోతున్నారు. ఎందుకంటే వెదురు బద్దల్ని పెట్టి, వారి మణికట్టు నుండి భుజాల దాకా వారి రెండుచేతుల్ని వంచడానికి వీలులేకుండా కట్టేయడం జరిగింది తాళ్ళతో. గమనించారా! చూద్దాం ఇప్పుడీ పిల్లలు ఏం చేస్తారో’’ వ్యాఖ్యానం ఆగిపోయింది.
పాపం ఆ పిల్లలు ఎన్నో రకాలుగా అవస్థపడ్డారు తమ కంచంలోని ఆహార పదార్థాలను అందుకోవడానికి. మోచేయి వంచడానికి చాలా అవస్థపడ్డారు. చివరకు ముందుకు వంగి నేరుగా నోటితోనే తినబోయి కంచాల్ని నేలపాలు చేసుకున్నారు కొందరు, మూతికి పూసుకున్నారు. ఆ పిల్లల దురవస్థ చూసి ప్రేక్షకులందరికీ జాలిగలిగింది. నాటకానికి దర్శకత్వం నిర్వహించిన మేష్టారు కేశవుడు. అతడు చురుకుగా కదుల్తూ తెరవెనుక ఏర్పాట్లు చేస్తున్నాడు.
విషాద రాగాలు పలుకుతూ ఉండగా, వేదికపై క్రమంగా దీపాల కాంతి నెమ్మదించింది, తెర దిగింది క్రమక్రమంగా. ‘ఇంకకొద్ది క్షణాలలో స్వర్గంలో భోజన విరామం చూద్దాం’ స్పీకర్లలోంచి ప్రకటన వినిపించింది.
తెర తొలగింది. ‘‘స్వర్గం అంటే ఇదే ఇదే’’ అన్న అక్షరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి వేదిక మీద గోడపై. మిగతా ఏర్పాట్లన్నీ ఇందాకటి లాగానే ఉన్నాయి. నాలుగు బల్లలు, ప్రతి బల్లకి అటు-ఇటూ రెండేసి కుర్చీలు, సరిగ్గా ఇందాకటి భోజనశాల లాగానే ఉంది. ‘ఠంగ్‌ఠంగ్’మని గంట మోగింది. పిల్లలు ఉల్లాసంగా వచ్చి ఆనందంగా కుర్చీలను ఆక్రమించేశారు.
పిల్లలందరూ మల్లెపువ్వులాంటి తెల్లటి దుస్తులు వేసుకుని స్వచ్ఛతకు మారుపేరులా ఉన్నారు. అందరి వదనాలు వెన్నెలలాంటి నవ్వులతో చూడముచ్చటగా ఉన్నాయి. చక్కగా నూనెపెట్టి తలలు దువ్వుకుని బుద్ధిగా ఉన్నారు.వ్యాఖ్యానం వినిపిస్తోంది స్పీకర్లో...‘‘గమనించారా ఈ పిల్లలు కూడా మోచేతుల్ని వంచలేరు. సరిగ్గా ఇందాకట్లాగానే వీరి చేతులు కూడా బంధింపబడి ఉన్నాయి. చూద్దాం ఈ పిల్లలు ఎలా భోంచేస్తారో’’ వ్యాఖ్యానం ముగిసింది. ఆశ్చర్యపోవడం ఈసారి ప్రేక్షకుల వంతయింది.
స్వర్గానికి నరకానికి ఏంటి తేడా? అందరి మనసుల్లో ఇదే ప్రశ్న. అందరూ ఆసక్తిగా చూడసాగారు. యథావిధిగా వడ్డన జరిగిపోయింది. ఇప్పుడు అందరి దృష్టి ‘స్వర్గం’లో ఎలా తింటారో అన్నదాని మీదే ఉంది.
ఉన్నట్టుండి నేపధ్య సంగీతం కూడా ఆగిపోయింది. అంతటా నిశ్శబ్దం. పిల్లలు ఏమాత్రం తొట్రుపాటు పడకుండా, నింపాదిగా భోజనం చేశారు. ప్రేక్షకులు అవాక్కయ్యారు.
ఆ పిల్లలేం చేశారంటే, తమ కంచాల్ని వదిలేసి, చేతులు ముందుకు సాచి, వంచే అవసరమే లేకుండా, ఎదుటి కుర్రాడి కంచంలోని అన్నాన్ని చక్కగా కలిపి ముద్దలు చేసి ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు కలబోసి, గోరుముద్దల్లా తినిపించడం ప్రారంభించారు.
చక్కటి ఆహ్లాదకరమైన నేపధ్య సంగీతం ఎప్పుడు ప్రారంభమయిందో ఎవరూ గమనించనేలేదు. చిన్నగా వ్యాఖ్యానం ప్రారంభమయింది. ‘‘నేను నాది అనుకుంటూ మన స్వార్థాన్నే చూసుకుంటూ బ్రతికేయడం నరకానికి సమానం. మన సమస్యలే మనల్ని పెద్ద పెనుభూతాల లాగా పీడిస్తాయి నరకంలో. ఎవరి స్వార్థం వారు చూసుకోవడమే నరకం. ఎదుటి వారికి సాయం చేయడం స్వర్గంతో సమానమయిన వాతావరణాన్ని సృష్టిస్తుంది. తమ కష్టాల్ని, తమ ఇబ్బందుల్ని సయితం మర్చిపోయి ఎదుటివారి కష్టాల్ని చూసి స్పందించి సాయం చేయడానికి ముందుకు వచ్చారు స్వర్గంలో పిల్లలు. అప్పుడు వారు ఆశించకనే వారికీ సాయం అందింది. నీకు నేను రక్ష, నాకు నీవు రక్ష, మనిద్దం సంఘానికి రక్ష. ఇదే వసుదైక కుటుంబ భావన. భూమిపై స్వర్గం ఇదే ఇదే’’ సమ్మోహితులైన ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు.
- రాయపెద్ది వివేకానంద్