హెగినేక్కల్ జలపాతం
కారును ఆపమన్నట్టుగా సంజ్ఞ చేస్తున్నారు. వారి రూపురేఖలు స్పష్టంగా తెలియడంలేదు. ఆ రాత్రి కాళరాత్రవుతుందని, ఆ జంట నా జీవితంలో మరచిపోలేని భయంకరమైన జ్ఞాపకాలని మిగిలిస్తారని, నాకాక్షణంలో ఏమాత్రం తెలియదు.
‘‘ఆత్మలని నీవెపుడయినా చూశావా?’’ ‘‘ఆత్మలు, దెయ్యాలు... నేనిలాంటి మాటల్ని అస్సలు నమ్మను’’. ఓ ఫైవ్‌స్టార్ హోటల్ విందు గదిలో మా అమ్మాయి సహోద్యోగులు ఇద్దరి మధ్య జరుగుతోంది పై సంభాషణ. మైక్రోసాఫ్ట్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇరవై మంది హాజరైన పార్టీ అది. అందరూ ఫ్రెషర్సే. వారి అపాయింట్మెంట్ ఖరారైన సందర్భంగా సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు. వారిలో మా అమ్మాయి రిషిక మొదటి ప్రయత్నంలో ఎన్నిక కావటమే కాదు, బెస్ట్ క్యాండిడేట్ అని పేరు తెచ్చుకుంది. ఆత్మలకు సంబంధించిన టాపిక్ కాస్తా జోరందుకుంది. దాదాపుగా సభ్యులంతా సగానికి చీలిపోయి, వేడివేడిగా వాదోపవాదాలు చేసుకుంటున్నారు. నా శ్రీమతి ప్రియ వంక చూశాను. తను కూడా నా వంకే చూస్తోంది. అర్థవంతంగా నవ్వుకున్నాం ఇద్దరం. సెంట్రల్లీ ఎయిర్కండిషన్డ్ బ్యాంకెట్ హాల్లో ‘‘మా అమ్మానాన్నలు ఆత్మలని ప్రత్యక్షంగా చూశారు’’ రిషిక కంఠం ఖంగుమంది. ‘‘ఎస్. ఇట్స్ ట్రూ. మా అమ్మానాన్నలు ఆత్మల్ని చూశారు’’ దీపాల కాంతిలో రిషిక చెవి దుద్దులు ‘ఛమక్’మంటున్నాయి. ‘‘అంతేకాదు వాటితో మాట్లాడారు. అవి అప్పజెప్పిన ఓ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించారు’’. అందరూ నమ్మలేనట్టు చూస్తుండిపోయారు. నిశ్శబ్దం, చర్చలన్నీ ఆగిపోయాయి.
‘‘చెప్పండి నాన్నగారూ! అందరూ వింటారు’’ రిషిక అడిగింది నన్ను బ్రతిమలాడుతున్న ధోరణిలో.
‘‘ఎప్పటిదో దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం సంగతి. ఎందుకులేమ్మా ఇప్పుడు’’ అన్నాను.
‘‘మర్చిపోయారా అంకుల్?’’ రిషిక ఫ్రెండ్స్ కొంటెగా అడిగారు.
మరపు వచ్చే సంఘటనలా అవి?
ఈ జీవితకాలంలో ఆ సంఘటనల సమాహారాన్ని మర్చిపోగలనా? ... చిరుజల్లు, చలి, చీకటి రాత్రి, రోడ్డు ప్రమాదాల తాలూకు వార్తలు ఇలా ఎన్నో అంశాలు నాకా భయంకరమైన జ్ఞాపకాల్ని తట్టిలేపుతుంటాయి.
ఓ మంచుగాలి ఇప్పుడే చల్లగా చెంపల్ని తాకినట్టు, ఓ వెచ్చటి కన్నీటి బిందువు చెంపల్ని స్పృశించినట్టు, ఆ జ్ఞాపకాలు ఎప్పటికప్పుడు తాజాగా నన్ను పలకరిస్తాయి. ఏదో మానవాతీత శక్తి గుండెల్ని పిండేస్తున్న భావన. గొంతులో ఏదో భారం అడ్డుపడుతోంది.
‘‘నాన్నా ప్లీజ్! కంట్రోల్ యువర్ సెల్ఫ్. చెప్పద్దులెండి’’ నా ముందర కార్పెట్‌పై కూర్చుని, నా మోకాళ్ళపై తలపెట్టి నన్నే చూస్తూ కూర్చుంది నా చిట్టితల్లి.
‘‘పర్లేదులే బంగారు. చెబుతాను’’ తన జుత్తును వేళ్ళతో సవరిస్తూ చెప్పడం ప్రారంభించాను.
ఠి ఠి ఠి
అప్పుడు నా వయసు పాతిక సంవత్సరాలు. తమిళనాడు హోసూర్‌లో మొదటి ఉద్యోగం వచ్చింది ఆటోమొబైల్ ఇంజనీర్‌గా ఓ పెద్ద ట్రక్కుల కంపెనీలో. మంచి జీతం. కంపెనీ క్వార్టర్స్, అందమైన భార్య. జీవితం హాయిగా సాగిపోతుండేది. నాకింకా పిల్లలు పుట్టలేదు అప్పటికి.
నేను, ప్రియ ఓ ఆదివారం ఉదయాన్నే ఎప్పటినుంచో చూడాలనుకుంటున్న హోగినేక్కల్ జలపాతం ప్రాంతానికి బయలుదేరాం.
దాన్ని ఇండియన్ నయాగరా అంటారు. కర్ణాటక నుంచి, తమిళనాడులోకి కావేరి నది జలపాతాల రూపంలో మహోగ్రంగా ప్రవేశిస్తుంది అక్కడ. ‘రొదపెట్టే రాళ్ళు’ అని పిల్చుకుంటారు స్థానికులు ఆ ప్రాంతాన్ని. చాలా సినిమాల్లో చూట్టమే అది వరకు. ప్రత్యక్షంగా మొదటిసారి చూసి మైమరచిపోయాం. బాగా ఎంజాయ్ చేశాం. ఆ రాత్రి కాళరాత్రి అవుతుందని మాకు చూచాయగా కూడా తెలియదు అప్పటికి. అక్కడే రాజు, మందాకిని అనే చక్కటి జంట పరిచయం అయ్యింది. వారికో చిన్నపాప. చాలా ముద్దుగా ఉంది. ప్రియ ఆ పాపాయిని చాలా ముద్దాడింది. ఇలాంటి పాపాయి మనక్కూడా ఉంటే బావుణ్ణన్నది. నాకూ అలాంటి భావనే కలిగింది అసంకల్పితంగా.
వాళ్లిద్దరూ ప్రవాస భారతీయులట. అతనేదో పెద్ద కంపెనీలో ఎండీగా చేస్తున్నాడు. అతడు చాలా అందగాడు. మంచి సంస్కారవంతుడు. చదువుకుంది అంతా యూ.ఎస్‌లోనే అట. ఇటీవలే ఉద్యోగం గురించి ఇండియా వచ్చాడు. ఆమె కూడా చాలా అందగత్తె. మేడ్ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు. కోయంబత్తూర్ నుండి బెంగళూరు వెళ్తూ దార్లో ఈ జలపాతాన్ని ప్లాన్ చేశారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వారి కారు గురించి. నా వృత్తే అది కద! బి.ఎం.డబ్ల్యూ కారది.
లంచ్ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో రావడంతో వాళ్ళు ఏదో పార్కుకు వెళ్ళారు. మేము ఇంకోవైపు వెళ్ళిపోయాము. సాయంత్రం ఫలహారాలు ముగించి టీ తాగి కాటేజ్ ఖాళీ చేసి ఏడింటికి బయలుదేరాం. కనీసం పదింటికయినా హోసూర్ చేరుకోవచ్చని నా అంచనా. జీవితంలోనే అత్యంత భయంకరమైన అనుభవాన్ని మేము ఎదుర్కొనవలసి వస్తుందని మాకు చూచాయగా కూడా ఆ క్షణంలో తెలియదు.
‘నీకు తారసపడే ప్రతి జీవి, నీతో బలమైన ఋణానుబంధం కలిగివుంటుందని మరువకు సోదరా’ అన్న అర్థం వచ్చే తమిళపాట ఎక్కడినుంచో వినిపిస్తోంది!
అమావాస్య దగ్గర అవుతూ ఉండడం వల్ల ఆకాశం కాటుక పులుముకున్నట్టు చీకటిగా ఉంది. బాగా మబ్బులు కమ్ముకోవడం వల్ల నక్షత్రాలు మొహం చాటేశాయి. ఉండుండి మెరుపులు ఆకాశాన్ని నిలువునా కోస్తున్నట్టు కనిపిస్తున్నాయి. ఉన్నట్టుండి కుండపోతగా వర్షం ఆరంభమయింది. వైపర్స్ నిరంతరం పని చేసినా దారి సరిగా కనిపించడం లేదు. కారు దీపాలు పడినంత మేరా కొద్దోగొప్పో దారి కనిపిస్తోంది. నిజం చెప్పాలంటే, దీపాల కాంతిలో గాజుముక్కలో, మంచు ముక్కలో పడుతున్నట్టు కనిపిస్తున్నాయి, చినుకులు. దారి పల్చగా కనిపిస్తోంది. చూస్తుండగానే వర్షం మరింత తీవ్రతరమయింది. కుండపోతగా కురుస్తున్న ఆ వర్షంలో ముందు ఏమున్నదీ కనిపించడం లేదు. ఇక లాభం లేదని కారుని రోడ్డుప్రక్కకు తీసి ఆపి ఉంచాను. అలా కనీసం ఓ గంట సేపు వర్షం తన విశ్వరూపం చూపించింది. మేమిద్దరమే కార్లో ఉండిపోయాం. వర్షం తగ్గడం కోసం ఎదురు చూడ్డం మినహా చేయగలిగిందేమీ లేదు.
దాదాపు గంట అనంతరం వాతావరణం తెరిపినిచ్చింది. చిన్నపాటి జల్లు నిరంతరాయంగా కురుస్తోంది, అంతే.
మెల్లిగా కారు స్టార్ట్ చేశాను.
‘‘నన్రి. మీండుం వారుగ’’ (కృతజ్ఞతలు, తిరిగి మరోసారి సందర్శించండి) అనే తమిళనాడు టూరిజం డిపార్ట్మెంట్ బోర్డ్డ్ కూడా దాటేశాం. హోగినేక్కల్ గ్రామ శివార్లు దాటుతున్నాం. చుట్టూ చిమ్మచీకటి. ఆ బోర్డు దాటి ఓ వంద అడుగులు వచ్చామో లేదో, దూరంగా రోడ్డుప్రక్కన నిలబడ్డ ఓ జంట కనిపించింది.
కారును ఆపమన్నట్టుగా సంజ్ఞ చేస్తున్నారు. దూరం నుంచి వారి రూపురేఖలు స్పష్టంగా తెలియడంలేదు.
ఆ రాత్రి కాళరాత్రవుతుందని, ఆ జంట నా జీవితంలో మరచిపోలేని భయంకరమైన జ్ఞాపకాలని మిగిలిస్తారని, నాకాక్షణంలో ఏమాత్రం తెలియదు.
‘‘ఎవరయ్యుంటారబ్బా’’ అనుకుంటూ ఎడంవైపుకి తిప్పుతూ వేగం బాగా తగ్గించాను.
కాస్త దగ్గరయ్యాం వారికి. ఎవరయింది తెలియడం లేదు. కానీ ప్రత్యేకించి వారిలో కొట్టవచ్చినట్టు కనిపిస్తున్న అంశం వారి సభ్యత, సంస్కారాలు, అతను కారు ఆపిన విధానం, చేయి సాచి సంజ్ఞ చేసిన పద్ధతి, వారు బాగా సాఫిస్టికేటెడ్ అని తెలుపుతున్నాయి.
కారు ఆగింది.
వారెవరో కాదు మాకు మధ్యాహ్నం పరిచయమయిన జంట. రాజు-మందాకినీలే వారు! వారి చేతిలో పాప లేదు. అయినా వీళ్ళిలా రోడ్డుప్రక్కన ఉన్నారేంటి? రాజు వచ్చి నా కిటికి ప్రక్కన నిలబడ్డాడు, నేను అద్దం దించాను.
‘‘మన్నించాలి. మా కారు ముందే వెళ్ళిపోయింది. మమ్మల్ని ధర్మపురి దగ్గర దింపేయండి మా కారుని అక్కడ అందుకోవచ్చు. ప్లీజ్’’ సంస్కారం ఉట్టిపడేలా అతడు అడిగిన విధానానికి మంత్ర ముగ్ధుడినయ్యాను.
అభ్యంతర పెట్టడానికీ ఏమీ లేదు నాకు. ‘‘భలే వారే, దానికి ఇంతగా చెప్పాలా? వచ్చేయండి’’ అంటూ ఆహ్వానించాను. ప్రియ కారు దిగి, మందాకినితో పాటు వెనుక సీట్లో కూర్చుంది. రాజు నా పక్కన కూర్చున్నాడు, కారు బయలుదేరింది.
‘‘ధర్మపురి దాటాక ఏదో నెంబర్ రాయి దగ్గర దింపేయండి’’ అన్నాడు రాజు.
‘‘ఈ రాత్రి సమయంలో అక్కడేం పని? అక్కడ హైవే నిర్మాణం జరుగుతోంది. బాగా లోతయిన గుంతలు తవ్విపెట్టారు’’ అన్నాను నేను.
‘‘మా కారక్కడ వెయిట్ చేస్తూ ఉంది’’ అతను ముక్తసరిగా సమాధానం ఇయ్యడంతో ఇక నేను కూడా రెట్టించలేదు.
‘‘మేము రెండుగంటల క్రితమే బయల్దేరాం. కాస్త పనుండడం వల్ల మేమిద్దరం తిరిగి వెనక్కి వచ్చేశాం’’ క్షమాపణ చెబుతున్నట్టు అతడే చిన్నగా చెప్పాడు.
అంతకు మించి ఆ విషయం అడగటం అతనికి ఇష్టంలేదని అర్థమయింది. ఇంకా రెట్టించడం సభ్యత కాదని నేనూ నిశ్శబ్దంగా కారు నడపటంపై ఏకాగ్రత చూపాను.
వాతావరణం బాగా నెమ్మదించింది. వర్షం ఓ చిరుజల్లుగా మాత్రమే ఉంది.
రోడ్డు కూడా స్మూత్‌గా ఉంది.
కారంతా ఓ విధమైన పరిమళం వ్యాపించింది. బహుశా మందాకిని వాడిన అత్తరు వల్ల కాబోలు. ప్రియకి ఇష్టం ఉండదని ఎప్పుడూ ఏసీ ఆన్ చేయను కార్లో. బహుశా బయటి వాతావరణం వల్ల కాబోలు, కారంతటా ఓ విధమయిన హాయి గొలిపే చల్లదనం వ్యాపించింది.
ఇదీ కారణం అని చెప్పలేను గానీ, ఆ క్షణంలో ఏదో దేవలోకంలో విహరిస్తున్న అనుభూతి కలుగుతోంది.
నాకు ధ్యానం చేసే అలవాటుంది. ధ్యాన స్థితి నాకు ఎరుకే. ఈ క్షణంలో ఎందుకోగానీ అయాచితంగా ధ్యాన స్థితి సిద్ధిస్తోంది, మనస్సంతా ఎంతో ఆహ్లాదంగా, యోగులు కోరుకునే లాంటి ఒక విధమైన భావాతీత స్థితికి అనాయాసంగా చేరుకొంటోంది. ‘‘మీ డ్రయివింగ్ బాగుంది’’ రాజా మెచ్చుకోలుగా అన్నాడు.
‘‘థాంక్స్’’
సుమారు నలభై అయిదు కిలోమీటర్ల ప్రయాణం ఆహ్లాదంగా సాగిపోయింది. మాకిద్దరికీ ఇష్టమైన కార్ల టాపిక్ మాట్లాడుకున్నాం. వెనుకసీట్లో ఆడవాళ్ళిద్దరూ చీరల గురించి ఫ్యాషన్స్ గురించి కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆ జంట అమెరికా నుంచి వచ్చి ఇక్కడ సెటిలై పట్టుమని ఆర్నెల్లు కూడా అవలేదట. ఇండియన్ రోడ్స్, ట్రాఫిక్ కండిషన్స్ గురించి వాళ్లు దిగ్భ్రమ వ్యక్తం చేశారు, మాటల్లో.
‘‘ఎంత సాఫిస్టికేటెడ్ ఫీచర్స్ ఉన్నా, మన టైం బాలేకుంటే మనల్ని ఏ కారూ కాపాడలేదు. మృత్యువు కబళించాలని నిర్ణయించుకున్నప్పుడు మానవుడిని ఏ కారు సేఫ్టీఫీచర్ కూడా కాపాడలేదు’’ విరక్తిగా నవ్వాడు రాజు. నాకా సంభాషణ నచ్చలేదు.
ఇంతలో ‘మీకు పిల్లలెందరు?’ అని మందాకిని అడిగిన ప్రశ్నకి మా ఆవిడ సిగ్గుపడుతూ ‘మాకు ఇటీవలే పెళ్ళయింది’ అని చెప్తోంది.
ఇంతలోగా ఇతనందుకున్నాడు. నాటకీయంగా భంగిమపెట్టి ‘‘చెల్లెమ్మా, నాకు ఫేస్ రీడింగ్ వచ్చు. మీకు ఓ చక్కటి పాపకు తల్లిదండ్రులయ్యే యోగం ఉంది. మీరు తనను రిషిక అని పిల్చుకుంటారు. ఆమె మంచి పొజిషన్లో ‘మైక్రోసాఫ్ట్’లో సెటిల్ అవుతుంది. నా మాట నమ్మండి’’
అతని అభినయానికి, ఆ హాస్య సంభాషణకి కారంతా నవ్వులతో నిండిపోయింది.
మందాకిని ముభావంగా ఉండడం గమనించాను. ఈలోగా ‘ధర్మపురి’ వచ్చింది. ఆ ఊర్లో ‘శ్రీరామ హోటల్’ లో టీ ఫేమస్. ఆగి త్రాగి వెళదామన్న నా ప్రపోజల్‌ని ఆ దంపతులు ఖండించారు. ‘‘ప్లీజ్, త్వరగా వెళదాం. ఎక్కువ సమయం లేదిక. పాప ఒక్కతే కార్లో ఏడుస్తూ ఎదురుచూస్తోంది’’ రాజా అన్నాడు.
‘‘పాపతో ఎవరున్నారు?’’ మధ్యాహ్నం వారిని కలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండుంటారనుకున్నాను ఈ క్షణం దాకా.
‘‘ఎవ్వరూ లేరు, తనొక్కతే ఉంది’’ భావరహితంగా చెప్పాడు.
‘‘తన వయస్సెంత?’’ కొద్దిగా అయోమయంగా అడిగాను. అడిగానా, కాదు కాదు కీచుగా అరిచాను.
‘‘పది నెలలు’’
‘‘వ్వాట్’’
ఇంత చీకట్లో, తుఫాను రాత్రిలో నిర్మానుష్యమయిన ప్రదేశంలో, ఒంటరిగా కార్లో పసికందును వదిలి షికారుకు బయల్దేరారా! నాకు పిచ్చెక్కిపోతోంది. పదో నెంబరు మైలురాయి రానే వచ్చింది. ‘‘కారిక్కడే ఆపండి. ట్రాఫిక్ తక్కువగా ఉంది. ఒకటో అరో లారీ వెళుతోంది. కారాపాను. కిటికీ అద్దం దింపాను. చిమ్మ చీకటి. నీరవ నిశీథి? ఎక్కడో ఒక ఒంటరి నక్షత్రం, చెదిరిపోతున్న మబ్బుల్లోంచి తొంగి చూస్తోంది. దూరంగా నక్కల ఊళలు వినిపిస్తున్నాయి. నాకు వాళ్ళ కారెక్కడా కనిపించలేదు. అదే అడిగాను.
‘‘అక్కడుంది రండి చూపిస్తాను’’ అతడు దిగాడు.
‘‘ఇదిగో ఇటు చూడండి’’
అతడు చూపిన దిశగా చూశాను. పెద్ద బ్రిడ్జి నిర్మాణానికై హైవేపై రిపేరింగ్ పనులు జరుగుతున్నాయి. పగటి పూట పనులు జరుగుతున్నాయి. ఆయన చూపిన ప్రదేశం నుంచి ‘‘టేక్ డైవర్షన్’’ అన్న బోర్డు లీలగా కన్పిస్తోంది.
అక్కడ నుంచి డైవర్షన్ తీసుకుని హైవేకి సమాంతరంగా మట్టిరోడ్డుపై వెళ్ళాలి ఓ రెండు మూడు ఫర్లాంగులు. ‘టేక్డైవర్షన్’ బోర్డు గానీ, రహదారి సిగ్నల్స్ గానీ స్పష్టంగా లేవు. చూసుకోకుండా నేరుగా ముందుకి వెళితే పిల్లర్స్కై రహదారి మధ్యలో తీసిన బాగా లోతైన లోయల్లాంటి గుంతల్లో పడడం ఖాయం.
‘‘ఇంతకీ మీ కారేది?’’
‘‘లారీ కింద పడి నలిగిపోయింది’’
నాకు పిచ్చెక్కినట్లవుతోంది.
‘‘ఓ జరగరాని ఘోరం జరిగిపోయింది. హోగెనెక్కల్ జలపాతం చూసుకుని సాయంత్రం బయలుదేరాం. ఇక్కడి దాకా వచ్చేటప్పటికి చీకటి పడిపోయింది. అంతలో భయంకరమైన వర్షం. నేనాపకుండా అలాగే నడపటం తప్పయింది. ఎదుటి వాహనాల తాలూకు మిరుమిట్లు గొలిపే కాంతిలో ఈ డైవర్షన్‌ని పోల్చుకోలేకపోయా అంతే నేరుగా వెళ్ళి ఆ పెద్ద బిలంలాంటి గోతిలోకి దూకేసింది కారు.’’
‘‘సీట్ బెల్ట్స్ ఉండిపోయాయి, సరైన టైంకి ఎయిర్ బ్యాగ్స్ రిలీజ్ అవడంతో మాకెవ్వరికీ చిన్నపాటి గాయం కూడా అవలేదు. డోర్స్ మాత్రం స్టక్ అయిపోయాయి. ఎంత తీసినా రావడం లేదు. వాటిని ఓపెన్ చేసే ప్రయత్నంలో నేనుండిపోయాను.
ఇంకోటేంటంటే, ఆ భయంకరమైన కుదుపుకు మా ఆవిడ ఒడిలో ఉన్న పసికందు జారి తన పాదాల దగ్గరికి దొర్లుకుంటూ పోయింది. తనను అందుకునే ప్రయత్నంలో మా ఆవిడ ముందుకు వంగింది.’’
‘‘అప్పుడు జరిగింది ఆ సంఘటన’’
చెప్పుకుంటూ పోతున్నాడు రాజు.
‘‘ఓ ఇరవై కార్లని ట్రాన్స్పోర్ట్ చేస్తున్న ఓ పెద్ద వంద టన్నుల కంటెయినర్ లారీ, మాలాగానే దారి తప్పి నేరుగా ముందుకు వచ్చేసింది. సరిగ్గా మా కారుపై పడిపోయింది.
ఒక పెద్ద పహిల్వాను మీద పడంగానే నలిగిపోయిన ఓ బొమ్మకారులా మా కారు నలిగిపోయింది ఆ కంటెయినర్ లారీ క్రింద.
లెగ్ రూం విశాలంగా ఉండడం, పై నుంచి వంగిన మా ఆవిడ ‘పై కప్పు’లాగా ఉండడం వల్ల, గూడులాగా ఏర్పడిన ఆ కాస్త స్థలంలో మా పాప హాయిగా ఉండిపోయింది. తను బ్రతికే ఉంది. కానీ మేమే....’’ అంటూ ఆగిపోయాడు.
‘‘కానీ మీరే? చెప్పండి మీకేమయింది?’’
నా అయోమయం పతాక స్థాయికి చేరుకుంది.
‘‘నేను, మా ఆవిడ అక్కడికక్కడే చనిపోయాం మల్టిపుల్ ఫ్రాక్చర్స్‌తో. లారీ డ్రైవర్, క్లీనర్‌కి ఏం అవలేదు. అదిగో అక్కడ కూర్చుని సిగరెట్స్ తాగుతున్నది వారే.’’
‘‘మా పాప రిషికని రక్షించండి. దయచేసి వెంటనే చర్యలు తీసుకోండి. దాదాపు గంట నుండి గుక్కపట్టి ఏడుస్తోంది తను ప్లీజ్.’’
‘‘వ్వాట్ మీరేం మాట్లాడుతున్నారు?’’
‘‘అవును మేం చనిపోయాం. ఆ చివరి క్షణాల్లో మా ఆలోచనలన్నీ మా పాప క్షేమం గురించే. తనని కాపాడుకోవాలని మేము ఎంత బలీయంగా కోరుకున్నామంటే మాకు రెక్కలు మొలిచి, తనతో ఎగిరిపోగలిగితే ఎంత బావుంటుంది అనిపించింది. తననెలాగయినా కాపాడుకోవాలి. అంతేకాదు, మాకు అయిన వాళ్ళెవరూ లేరు. తను బ్రతికి బయటపడ్డా అనాథగా మారకూడదు. దయచేసి తనను కాపాడండి. టైం ఎక్కువ లేదు ప్లీజ్. తనని పెంచి పెద్ద చేయండి. ఇదే మా బలీయమైన కోరిక. మేం కచ్చితంగా విగతజీవులం. మనుషులంకాదు. మేము ఆత్మలమా? దెయ్యాలమా? మేము వర్చువల్ బీయింగ్స్ మాత్రమేనా?
ఇవేవీ కావేమో! మాలోని బలమైన కోరికలే ప్రార్థన రూపంలో దేవుడిని చేరాయనుకుంటా. మంచి కోరిక కావడం వల్ల, మా కోరికకే రూపం వచ్చి, మీ ముందు వాలేలాగా, మీతో మాట్లాడేలాగా చేశాడనుకుంటా ఆ భగవంతుడు. మేమొచ్చిన కార్యం నెరవేరింది. మాకిప్పుడు తృప్తిగా ఉంది. తనని కాపాడండి. ప్లీజ్ తనని కాపాడండి.
తనని పెంచుకోండి. ప్లీ...జ్....ప్లీ.....జ్’’ అలా చెబుతూ క్రమక్రమంగా రాజు, మందాకినులు క్రమక్రమంగా పలుచటి మంచు తెరలాగా కరిగిపోయారు. శూన్యం మిగిలింది నా కళ్ళముందు.
అంతటా చీకటి. దిగ్భ్రమలో ఉండిపోయాను. ఓ రెణ్ణిమిషాలు. త్వరగానే తెప్పరిల్లి ప్రియకి మొత్తం విషయం చెప్పాను కారు వద్దకు పరుగున వెళ్ళి. వెంటనే మేం ఇద్దరం పరుగున వెళ్ళి ఆ పంజాబీ లారీ డ్రైవర్స్‌కి విషయం చెప్పాం.
కాసేపు మమ్మల్ని పిచ్చివాళ్ళలాగా చూశారు వారు. వారిద్దరికి తెలియదు తమ లారీ క్రింద కారు ఉందని.
ఆ రోజుల్లో సెల్‌ఫోన్స్ ఇంత విరివిగా లేవు. కార్లో తిరిగి ధర్మపురి వెళ్లి క్రేన్స్ తెప్పించడం, పోలీసుల్ని, ఫైర్ డిపార్ట్మెంట్ వారిని పిలిపించడం, పాపని కాపాడుకోవడం ఇవన్నీ సినిమా రీల్ లాగా నడిచిపోయాయి.
క్రేన్‌తో పైకి తీయబడిన కార్లో నుంచి మందాకిని, రాజుల మృతదేహాలు చూసి విచలితుడయిపోయాను. దుఃఖం ఆగలేదు. అదే జంట. అదే దుస్తులు. నా ముందు నిలబడ్డట్టే ఉంది ఇందాకటి దాకా, ఇప్పుడు విగతజీవులలాగా మారిపోయారు.
‘‘ఇదిగో ఇటు చూడండి’’
అతడు చూపిన దిశగా
చూశాను. పెద్ద బ్రిడ్జి నిర్మాణానికై హైవేపై రిపేరింగ్ పనులు
జరుగుతున్నాయి. పగటి పూట పనులు జరుగుతున్నాయి. ఆయన చూపిన ప్రదేశం నుంచి
‘‘టేక్ డైవర్షన్’’ అన్న బోర్డు లీలగా కన్పిస్తోంది. అక్కడ డైవర్షన్
తీసుకుని హైవేకి సమాంతరంగా మట్టిరోడ్డుపై వెళ్ళాలి ఓ రెండు మూడు ఫర్లాంగులు.
ఠి ఠి ఠి
అదీ విషయం.
‘పౌలో కుయిలో’ రాసిన ‘ఆల్కెమిస్ట్’ లో చెప్పినట్టు, నీవు ఏదైనా విషయం బలంగా కాంక్షిస్తే, అది ధర్మబద్దమయినది, సహేతుకమైనది అయినట్టయితే, ఈ విశ్వంలోని శక్తులన్నీ కూడబలుక్కుని అయినా సరే నీ కోరికని తీరేలాగా నిన్ను నడిపిస్తాయి.
బహుశా ఆ జంట విషయంలో ఇదే జరిగింది. నేను దిగ్భ్రమతో కన్నీరు కారుస్తూ ‘కథ’ చెప్పడం ముగించాను.
ముమ్మూర్తులా తల్లినే పోలిన రిషిక నా కన్నీరు తుడిచింది.
‘‘నాన్నగారు ప్లీజ్ కూల్‌డౌన్’’
అతిథులంతా ఆశ్చర్యంతో చూస్తుండిపోయారు.
- రాయపెద్ది వివేకానంద్