Datla devadanam raju
-
మెదడు.. మోకాల్లోకి..
కలో.. భ్రమో.. రాత్రి తోకచుక్క కనపడింది. తోకచుక్క సంఘ సంస్కరణ ప్రయాణ పతాక కదా. ఏం జరుగుతుందో ఏం జరగదో.. మెలకువను స్వప్నించి నిద్రలోనే లేచినట్టు.. తిరిగినట్టు.. మాట్లాడినట్టు.. చీకటి తెరలు పూర్తిగా తొలగిపోలేదు. తెల్లవారిన సందడి ఇపుడిపుడే మేల్కొంటోంది. పలుచని మంచు పొగలా చుట్టుకుంటోంది.లేచాను. రోజూ లేచే ఉదయపు నడకల సమయమే. అడుగు ముందుకేశాను. ఒకరకమైన తూలింపు. పట్టించుకోలేదు. లుంగీ మడిచి బాత్రూమ్కు వెళ్ళాను. అపుడు చూశాను, మోకాలు కొద్దిగా వాచినట్లుంది. నొప్పి లేదు. ఎత్తుగా ఉబ్బిన చోట చేతితో నొక్కాను. మెత్తగా నునుపుదేరి ఉంది, రబ్బరు బంతిలా. ఏమైందీ? ఎక్కడైనా తగిలిందా? ఏదైనా కుట్టిందా? గిల్లి మాత్రం చూడలేదు. నడక దుస్తుల్లోకి మారాను. నడుస్తుంటే ఇబ్బందేమీ లేదు. సలుపు కూడా లేదు. ఆటల మైదానంలో పదిసార్లు వలయంగా తిరిగాను. రెండు కిలోమీటర్లు తిరిగినట్టు లెక్క. ‘అలా నడుస్తున్నారేంటీ? కాలు ఈడుస్తున్నట్టు..’ ఇంటికొస్తుంటే సుబ్బారాయుడు పలకరించాడు.‘ఏమీ.. లేదే..’ అన్నాను జాగ్రత్తగా అడుగులేస్తూ. ప్రతిక్షణం నడక దగ్గర్నుంచి మాట దగ్గర్నుంచి అందరికీ కావాలి. రోజువారీకి భిన్నంగా ఎవరూ ఉండకూడదు. ఉంటే ఒకటే ప్రశ్నలు.. ఎందుకు, ఏమిటి, ఎలా.. ఆరా! అరే.. ఎదురైన చాలామంది నడకల్లో ఏదో తేడా స్పష్టంగా కనబడుతోంది. కుంటి నడక కాదు గానీ నేలకు పాదం ఈడుస్తూ.. ఎవర్నీ అడగలేదు. తీరా ఇంట్లోకి చేరగానే ఉమ ఎదురొచ్చింది. ఆమె నడక తీరూ అలాగే ఉంది. ఉన్నట్టుండి నన్ను ఆట పట్టించడానికన్నట్టు గాలిలోకి ఎగిరింది. పైగా నవ్వుతోంది. ఆశ్చర్యంగా చూశాను. ‘ఏమీ లేదండి. నొప్పేం లేదు. అయితే నేలకు తాకించి నడుస్తుంటే బావుంది’ ఇంకేం ప్రశ్నలు వేయలేదు. మొత్తమ్మీద లోకమంతా తెలియని రాగమేదో ఆలపిస్తోంది. ఒకరి నుంచి మరొకరికి అంటుకునేదా? కాదేమో. స్నానానికి వెళ్ళినపుడు తేరిపారి పరిశీలనగా చూశాను. మోకాలు చిప్ప ఉబ్బి నల్లగా తాటికాయలా ఒకవిధమైన గరుకుగా మారింది. రెండో కాలు మామూలుగానే ఉంది. కూరగాయలు కొనడానికి మార్కెట్టుకెళ్ళాను. అందరూ తెలిసినవారే. కొంచెం పట్టుబట్టి జాగ్రత్తగా అడుగులేస్తూ తిరుగుతున్నాను. చాలామంది ముఖాలు నీరసంగా కనిపిస్తున్నాయి. ఏదో పోగొట్టుకుని దాచినా దాగని సత్యాన్ని మోస్తున్నట్టుగా భారంగా అడుగులేస్తున్నారు. లోకం వింతగా కనిపిస్తోంది.రెండురోజుల క్రితం రామంగాడి గృహప్రవేశం సందర్భంగా సత్యనారాయణ ప్రతం చేయించిన పురోహితుడు కనిపించాడు. ఆయన పంచె ఎగదోసి మోకాలు చిప్ప కనిపించేలా ఎత్తి ఎత్తి అడుగులేస్తూ నడిచి వస్తున్నాడు. అసింటా అన్నట్టు దూరంగా జరుగుతూ అడుగులేస్తున్నాడు. ఆయనకు కూడా అదే చోటులో నల్లగా చర్మం చిట్లినట్లుగా ఉంది. మొన్నటి దృశ్యం కళ్ళ ముందు కనిపించింది. వ్రతం అయిపోయింది. ఇక కథ చెప్పాలి. చెప్పడం మొదలెట్టగానే అది ఎప్పుడూ చెప్పే పాతకథ అని తెలిసిపోయింది. ఆగమని సైగ చేశాను.‘అయ్యా.. పురోహితులు గారూ.. మన్నించండి. ఎపుడూ అదే కథా? మీరు కథలో చెబుతున్న సముద్ర వ్యాపారాలు గట్రా ఇపుడు లేవు కదా. వ్రతం చేయకపోతే వచ్చే నష్టం మా రామం గాడికి వర్తించదు. వాడిది రియలెస్టేటు బిజినెస్. దానికి సంబంధించిన కథ అల్లి చెబితే సబబుగా అర్థవంతంగా ఉంటుంది. వాడు జాగ్రత్తలేవో పడతాడు. అలాగే సాఫ్టువేర్ ఇంజనీరు.. గవర్నమెంటు ఉద్యోగం.. సారా వ్యాపారం.. ఎగుమతులు దిగుమతులు, వాణిజ్యం.. వగైరాల కథలు రెడీమేడ్‌గా తయారుచేసుకుని ఉంచుకుని చెప్పొచ్చు కదా! ఎపుడూ పాత పురాణమేనా.. ఎవరు మెచ్చుకుంటారు?’ అన్నాను సూటిగా చూస్తూ.పురోహితుడు ఒక్కక్షణం మాట్లాడలేదు. ఎదుట వ్యక్తి చెప్పేవి కొందరికి సహించవు. అహం దెబ్బతింటుంది కాబోలు. రామాన్నీ నన్నూ చూస్తూ ఉండిపోయాడు. ఆలోచిస్తున్నట్టుగా ఆగాడు. కాసేపటికి తేరుకున్నాడు. ఆ తర్వాత తనకు సహజసిద్ధమైన లౌక్యం ప్రదర్శించాడు.‘నిజమే సుమండీ.. మహ బాగా చెప్పారు. మీరన్నట్టుగా మహ బేషుగ్గా ఉంటుంది. మీరు చెప్పింది చక్కగా ఉంది. కానీ కథలెక్కడ్నుంచి వస్తాయండీ’ అంటూ దీర్ఘం తీస్తూ అన్నాడు. ఇందాక మొదలెట్టిన కథను తిరిగి చెప్పడం ప్రారంభించాడు. అంతేకాదు వెళుతూ వెళుతూ నా ముఖం కేసి చూసి నాలో ఏ దైన్యం సూచిక కనిపించిందో ఏమో ఒక ఉచిత సలహా విసిరాడు.‘ఏడు ఏలకులను పసువు గుడ్డలో చుట్టి దిండు కింద పెట్టుకుని పడుకోండి. మీ అప్పులన్నీ తీరిపోతాయి. మీరూ బ్రహ్మాండమైన ఇంతకుమించిన గృహం కట్టుకుంటారు’ అన్నాడు. ఆయన వృత్తికి నేనేమైనా ఆటంకం కలిగించానా? ఏమో మరి. ఇది జరిగి మూడురోజులైంది. ఇంతలో ఇట్లాంటి మోకాలుతో కనిపించాడు. తిరిగొస్తుంటే కామేశ్వరరావు కనిపించాడు. వాళ్ళ అమ్మాయికి ఇంకా పెళ్ళి ఘడియలు రాలేదనుకుంటాడు. వయసొచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉంది. భారం దేవుడి మీద వేసేశాడు. అసలు జరిగిందేమిటంటే కళ్యాణ యోగం గురించి ఒక జ్యోతిష్యుడ్ని సంప్రదించాడు. అతగాడేమో ‘రెండు సంవత్సరాలు ఆగాలి. ఈలోపు ఎంత ప్రయత్నించినా మీ అమ్మాయికి పెండ్లి చేయలేవు’ అని చెప్పాడట.అంతే ఇక మౌనంగా ఉండిపోయాడు. సరిగ్గా అదే సమయంలో మంచి సంబంధాలు కోరి వచ్చినా ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోయాడు. ఆ తర్వాత కుజదోషమనీ వరనిరూపణ కుదరలేదనీ.. అదనీ ఇదనీ జాతకాల పిచ్చిలోపడి కాలయాపన చేసేశాడు. పోనీ ఆ జ్యోతిష్యుడు చెప్పిన ఆ రెండేళ్ళు ఊరుకుని తర్వాత కాలంలో గట్టి ప్రయత్నం చేస్తే ఈపాటికి కూతురుకు పెళ్ళి జరిగిపోయేదేమో. కార్యసాధనకు ప్రయత్నం తోడుగా ఉండాలి. గీచి గీచి జాతకాలు పట్టించుకుని చెడగొట్టుకుంటున్నాడు. పలకరించాను. చేతితో మోకాలు దగ్గర తడుముకున్నాడు. ఎత్తుగా గాలి బుడగలా కనిపిస్తోంది. అతని పరిస్థితి అర్థమైపోయింది.ఇంటికెదురుగా శంకరయ్య ఉన్నాడు. భార్య పేరు భారతమ్మ. బయటికెళితే చాలు ప్రతిరోజూ పెళ్ళాం ఎదురు రావాలి. వీధిలోంచి గట్టిగా రమ్మని అరుస్తాడు. ఇంటి లోపల ఎక్కడున్నా ముసిముసి నవ్వులు నవ్వుతూ చీర చెంగుతో ముఖం తుడుచుకుంటూ వచ్చేస్తుంది భారతమ్మ. ఎదురురావడాన్ని మొగుడు ప్రసాదిస్తున్న అరుదైన గౌరవంగా భావిస్తుంది. ఆ అవకాశం ఇచ్చి అర్ధాంగి దగ్గర మంచి మార్కులు కొట్టి బంధం గట్టిగా ముడిపెట్టే చిట్కాను శంకరయ్య పాటిస్తున్నాడేమో. ఆవేళ చూద్దును కదా శంకరం కుంటుకుంటూ నడుస్తున్నాడు. ఓహో .. అనుకున్నాను.జబ్బకూ మెడలోనూ తాయెత్తులు కట్టుకునే వీరయ్య, మెడనిండా ఏవో పసుపు, ఎరుపు రంగుల తాళ్ళూ, ఒంటి మీద కాషాయం దుస్తులూ ముఖం నిండా ఎర్రటి పెద్ద బొట్టూ నుదుటన విభూది పూసుకునే నారాయణ, రాహు కాలం, వర్జ్యం, ముహూర్తం చూసుకుంటే గానీ ఇల్లు కదలని వీరబాబు, ప్రతిరోజూ టెంకాయ కొట్టి దేవుని దర్శనం చేసుకునే సూరిబాబు, నలుపు ఎరుపు దుస్తుల్లో కనిపిస్తున్న సీజనల్ భక్తులు, నిత్యం నదీ స్నానం చేసే వీరభద్రాచార్యులు, దూరపు బంధువెవరో చనిపోతే నిష్ఠగా ఎండుగడ్డితో తలగడ చేసుకుని నేల మీద పడుకుంటూ మైల పడుతున్న రామచంద్రం.. వీళ్ళందరూ అదేరోజు తారసపడ్డారు. అందరూ మోకాలు వాచినవాళ్ళే.ఈవేళే ఎందుకు అకస్మాత్తుగా పాదాలు ఎగేస్తూ కనిపిస్తున్నారు? అసలు నేనెందుకు ఇదే బాధ అనుభవిస్తున్నాను? మనిషి నాగరీకం అయ్యే కొలదీ కొత్త కొత్త బలహీనతల్ని ఎందుకు మోస్తున్నాడు? తాతగారి నాన్నగారి బామ్మగారి భావాలతో కునారిల్లి సొంత ఆలోచనల్ని చంపుకుని బతకడం సరైనదేనా? ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఏ పని అయినా విజయం సాధిస్తుందనీ మూఢనమ్మకాలతో కాలాన్ని వృథా చేసుకోవడం తగదనీ ఎంతమందికి చెప్పగలం? ఉపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నాకు తత్వం బోధపడింది. నడవడికలో అమలు చేయాలి.ఉదయం తొమ్మిది గంటలు. బైకు తీసుకుని రోడ్డు మీదకు రాగానే తెల్లని బట్టలతో అచ్చమ్మ ఎదురు పడింది. నన్ను చూసింది. అశుభం అని తలచి వెనక్కి తిరిగి నిలబడింది. తన వల్ల ఎవరికీ మనసులో కూడా ఏ బాధా ఇబ్బంది కలగకూడదనే తలంపుతో చేసిన పని అది. ఆవిడెందుకలా చేసిందో తెలుసు. నేను ఊరుకుంటానా? నేనూ ఆగాను. వారగా తల తిప్పి చూసింది. ఆమె వంకే చూస్తున్నాను. ‘నాకు చాలా ముఖ్యమైన పని ఉంది. మీరు ఎదురొస్తేనే ముందుకు వెళతాను. లేకపోతే ఇక్కడ్నుంచి కదలను’ అన్నాను. ఆమె కళ్ళు మెరిశాయి. ముఖంలో కాంతులు. గబగబా నా దగ్గరకొచ్చి నిలబడింది.‘నా బాబే.. నా నాయనే.. నా ఆయుస్సు కూడా పోసుకుని నిండు నూరేళ్ళూ సుఖసంతోషాలతో బతుకు తండ్రీ..’ అని తటాలున తన తలలోంచి తెల్ల వెంట్రుకను పీకి నా తలలో వేసి తెల్లని స్వచ్ఛమైన నవ్వుతో అనేక రకాలుగా దీవించింది. మనస్ఫూర్తిగా ఎదురొచ్చి ‘అంతా శుభమే జరుగుతుంది’ అంది. వెనక్కి చూడకుండా వెళ్ళిపోయింది. ఎన్నాళ్ళ నుండో గుట్టగా దాచిన శుభాశీస్సుల బలం.. నాకొక్కడికే చెందుతుందనుకోడం ఎందుకు? దీవెనలు, ఆశీస్సులను ఒక సానుకూల దృక్పథ సంకేతంగానే చూడాలి. పాఠశాల చేరాను. మనసు ఎంతో ఎపుడూ లేనంత ఉల్లాసంగా ఉంది. రోజంతా నెగటివ్ భావనలు రానీయకుండా మసలుకున్నాను. నా వైపు నుండి కాకుండా ప్రతి వ్యక్తినీ అతని దృష్టి కోణంలోంచి పరిశీలిస్తున్నాను. నాలోని మార్పుకు నాకే ఆనందం అనిపించింది. హాయిగా ఉంది.మోకాలు వాపు విచిత్రంగా కొద్దిగా తగ్గింది. ఫలితం అపుడే కనిపించిందా? మనిషి నడవడికను బట్టే రోగాలొస్తాయి. ప్రవర్తనలు ఆలోచనలు దేహానికీ మససుకూ చెందినవేనా? ఖాళీ పీరియడ్‌లో మళ్ళీ ఆలోచనలు చుట్టుముట్టాయి. ఇంతకీ నాకెందుకు మోకాలు వాచింది? తటాలున బుర్రలో ఒక వెలుగు.. మిత్రుడి బలవంతం మీద శంకుస్థాపన జరిగినరోజున కొబ్బరికాయ కొట్టడం గుర్తుకొచ్చింది. అంతేనా? ఇంకా ఏమైనా ఉందా? ఆలోచనలు సాగుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఏమీ గుర్తుకు రావడంలేదు.ఏదో అపసవ్యంగా ఉండే ఒక చెడు నమ్మకాన్ని మనసులో దూర్చే ఉంటాను. లేకపోతే ఎంతో కొంత శాస్త్రీయంగా ఆలోచించే నాకీ తిప్పలు ఎందుకొచ్చాయి? స్కూలు అయ్యింతర్వాత అట్నుంచి అటే జిల్లా పరిషత్‌కు వెళ్ళాల్సి వచ్చింది. కార్యాలయం హడావుడిగా ఉంది. క్యాంటీను నిండుగా ఉంది. ఉద్యోగుల్లో చాలామంది ఒక కాలు కుంటుకుంటూనో ఈడ్చుకుంటూనో మోకాలు నిమురుకుంటూనో నడుస్తున్నవారే. ఇంటికి చేరేటప్పటికి రాత్రి ఎనిమిది అయ్యింది. వాకిట్లోనే చిన్నాన్న ఎదురయ్యాడు. ఆందోళనగా ఉన్నాడు. నలిగిన ముఖం. నుదుటన చెరిగిన ఎర్రని నిలువు బొట్టు. చెదిరిన జుట్టు. కొద్దిగా కుంటుతూ దగ్గుతూ దగ్గరకొచ్చాడు.‘నీ కోసమే ఎదురు చూస్తున్నాను. నీవేం కంగారుపడకు. పద.. పద.. లోపలికి..’చిన్నాన్న ఎప్పుడూ అంతే. ఏదీ సరిగ్గా చెప్పడు. విషయం కొస అందిస్తాడు. సాగదీసి గానీ అసలు సంగతి చెప్పడు. మా ఇద్దరిదీ ఒకే ఇల్లు. అన్నదమ్ముల పంపకం. ఇంట్లో వెనుక వైపు వాటాలో ఉంటాడు. భక్తిపరుడు. సకల సెంటిమెంట్లనూ గౌరవిస్తాడు. పాటిస్తాడు. రోజూ పంచాంగం చూస్తాడు. అడిగినవాళ్ళకు అడగనివాళ్ళకు మంచిచెడ్డలు చెప్పడమే పనిగా పెట్టుకుంటాడు. ఎవరింటికైనా వెళితే దిక్కుల్ని చూసి వాస్తు గురించి ఉచిత సలహాలిస్తాడు.‘ఏమైంది?’ గాభరాగా లోపలికెళ్ళాను. గుండెల మీద చేతులేసుకుని సీలింగు చూస్తున్నాడు నాన్న. నన్ను చూసి తల పక్కకు తిప్పి నీరసంగా నవ్వాడు. నోరు విప్పి నెమ్మదిగా గుసగుసగా మాట్లాడుతున్నాడు. మాట స్పష్టంగా లేదు. దగ్గరగా ముఖం పెట్టి వినడానికి ప్రయత్నం చేశాను. ఏదో చెప్పాలనుకుంటున్నాడు. చెప్పలేకపోతున్నాడు. కాసేపటికి చూపు నిలబడిపోయింది. చిన్నాన్నకు అర్థమైంది. ‘ఒరేయ్.. రండి.. వాకిట్లో పడుకో పెడదాం..’ చిన్నాన్న ఉద్దేశం తెలిసింది. ఆయనకేసి కోపంగా చూశాను. చేయి అడ్డంగా పెట్టి వారించాను. ‘మీరాగండి, చిన్నాన్నా.. ఇక్కడ్నుంచి ఆయన్ని కదల్చడానికి వీల్లేదు. ఏమొచ్చింది మీకు? ఇప్పటి దాకా బాగానే ఉన్న వ్యక్తి.. ఇంతట్లోనే ఇంటికి చెడ్డ అయిపోయాడా?’ అన్నాను.‘ఏమంటున్నావు? నీకేమైనా తెలుస్తుందా? ఇంట్లో పోతే ఇల్లు పాడు పెట్టాల్సి వస్తుంది. నా మాట విను..’ బాబాయి హోదా, వయసు తెచ్చిన అధికారంతో నన్ను గదమాయించాడు. ఆయనను దూరంగా గది మూలకు తీసుకెళ్ళి చెప్పడం మొదలెట్టాను. ‘ఆయన ఇన్నాళ్ళూ ఉన్న ఇల్లు ఇది. ఈ ఇంట్లో ఈ గదిలో ఆఖరి ఊపిరి తీసుకునే హక్కు ఆయనకు ఉంది. ఎక్కడికెళ్ళినా ఎంత రాత్రయినా చేరుకునే చోటు ఇది. నా ఊరూ నా ఇల్లూ అంటూ నిత్యం పలవరించేవాడు. మరోచోట నిద్ర పట్టదనేవాడు. మీరెన్నైనా చెప్పండి.. ఇక్కడ్నుంచి కదపడానికి ఒప్పుకోను. పొద్దుట దాక ఇక్కడే ఉంటారు’ స్థిర స్వరంతో చెప్పాను.‘ఈ సమస్య నీ ఒక్కడిదే కాదు. మాది కూడా. ఇదే ఇంట్లో నేనూ కాపురం ఉంటున్నానని గుర్తు పెట్టుకో. మంచి ఘడియలు కావు ఇవి. ఆరుమాసాలో సంవత్సరమో ఇల్లు మైల పడితే ఎక్కడికెళ్ళాలి? ఇంటి పెద్దగా చెబుతున్నాను. చెప్పింది చేయి’ అంటూ వంగి మోకాలు చిప్ప దగ్గర పాముకుంటూ నొక్కుకుంటూ అన్నాడు చిన్నాన్న.నేను రాజీ పడలేదు. పట్టుదలను వీడలేదు. ‘రోజులకు పేర్లు, తిథులు మనం కల్పించుకున్నవే. ఇందులో మంచి చెడ్డలంటూ ఉండవు. అన్ని రోజులూ ఒకలాంటివే. ఆయన ఇంట్లో ఆయన బతకడానికి ఎంత హక్కు ఉందో చావడానికీ అంతే హక్కు ఉంది. ఆ హక్కును కాపాడటానికి కొడుకుగా ఎంతకైనా తెగిస్తాను’ చివర మాట గట్టిగా అన్నాను. ఈ మాటలు పలికానో లేదో మోకాలు చిప్ప వాపు పూర్తిగా తగ్గిపోయింది. ఆయన మాటను విననని అర్థమైపోయింది. నసుక్కుంటూ వెళ్ళిపోయాడు.‘పెద్దాళ్ళు సరే కుర్రాళ్ళు పుట్టుకతో వృద్ధులైపోతున్నారు. మనుషులు చేసిన దేవుళ్ళారా.. మీరెక్కడ? మిమ్మల్ని పోగుచేసి వ్యాపారం చేసే వాళ్ళనీ అసలు మూఢవిశ్వాసాల్ని ఎగదోసేవాళ్ళనీ వినియోగదారుల చట్ట పరిధిలోకి తీసుకు రావాలి. భవిష్యత్తు చెప్పేవాళ్ళకు చెప్పింది జరగనపుడు కఠినశిక్ష విధించి తీరాలి. కనీసం వందేళ్ళ తర్వాత కాలం వీటన్నింటినీ మాన్పుతుందనే నమ్మకం నాది’ అనుకుంటూ సన్నగా లోలోపల మూలిగాను. మామూలు స్థితికి వచ్చిన మోకాలును ప్రేమగా నిమిరాను. ఇంతట్లో మెలకువ తట్టి లేపింది. – దాట్ల దేవదానం రాజుఈ కథను వినడానికి ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయండి. ఇకపై ప్రతివారం ‘ఈవారం కథ’కు క్యూఆర్ కోడ్ ఇక్కడ ఉంటుంది.ఇవి చదవండి: సింగరేణి తంగలాన్..! -
సాహిత్య మరమరాలు : వచ్చాక చెప్పు
ఒకరోజు మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి ఇంటికి ఒక వ్యక్తి వచ్చారు. ఆయనకు మర్యాదలు చేసి కూర్చోబెట్టారు ఇంట్లో వారు. కాసేపటికి శాస్త్రిగారు వచ్చారు. వచ్చినాయన సంభాషణ మొదలెట్టారు. 1940 నుంచీ తేదీలతో సహా తన సాహిత్య కార్యక్రమాలు, అల్పమైన విషయాల్ని సైతం విడిచిపెట్టకుండా చెప్పుకుపో...తు... న్నారు. 1945, 50, 60 ... మధునాపంతుల వారిలో అసహనం పెరిగిపోతోంది. అక్కడకు కొంచెం దూరంలో ఉన్న తమ్ముడి కుమారుడితో, ‘‘ఒరేయ్ చంటీ, ఒకసారిలా వచ్చి 1991 వచ్చాక చెప్పు, అప్పుడొస్తాను ’’ అని తన గదిలోకి వెళ్లిపోయారు. వచ్చినాయన బిత్తరపోయాడు. ఉబలాటం అనండి, లౌల్యం అనండి స్వవిషయాలు ఊకదంపుడుగా చెప్పేసుకుంటే వినేవాళ్ళకు విసుగు పుట్టిస్తాయి. ఇక ఇపుడు విచారించి ప్రయోజనం లేదు. మితంగా పరిచయం చేసుకోవాలనే జ్ఞానం ఆలస్యంగా కలిగిందాయనకు. -దాట్ల దేవదానం రాజు -
పుస్తక సమీక్ష: కొత్త పుస్తకాలు
1. సి.పి.బ్రౌన్ (సి.పి.బ్రౌన్పై విమర్శ వ్యాసాలు) పేజీలు: 272; వెల: 300 2. వేమన-2 (వేమనపై విమర్శ వ్యాసాలు) పేజీలు: 232; వెల: 250 ప్రధాన సంపాదకులు: ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి ప్రతులకు: సభ్య కార్యదర్శి, సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం, 1-1254, సి.పి.బ్రౌన్ రోడ్, ఎర్రముక్కపల్లి, కడప-516004. ఫోన్: 08562-255517 ఉదయిని (దాట్ల దేవదానం రాజు 60వ జన్మదినోత్సవ ప్రత్యేక సంచిక) సంపాదకుడు: డా. శిఖామణి పేజీలు: 254; వెల: 100 ప్రతులకు: దాట్ల దేవదానం రాజు, 8-1-048, ఉదయిని, జక్రియా నగర్, యానాం-533464. ఫోన్: 9440105987 గోరు ముద్దలు (పిల్లల కథలు) రచన: గీతా సుబ్బారావు పేజీలు: 128; వెల: 125 ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లో. శాంతివనం (పిల్లలు అనుభవాలు ప్రయోగాలు) రచన: మంచికంటి పేజీలు: 244; వెల: 200 ప్రతులకు: నవోదయా, విశాలాంధ్ర పుస్తక కేంద్రాలు. శిథిల స్వర్గం (నవల) రచన: కె.వి.నరేందర్ పేజీలు: 128; వెల: 100 ప్రతులకు: కె.వి.శ్రీదేవి, 7-4-264/బి, బైపాస్ రోడ్ దగ్గర, విద్యానగర్, జగిత్యాల, కరీంనగర్ జిల్లా-505327. ఫోన్: 9440402871 శాంతికపోతం (కవిత్వం) రచన: బి.భూపతిరావు పేజీలు: 44; వెల: 25 ప్రతులకు: బొడ్డేపల్లి అరుణకుమారి, అచ్చిపోలవలస గ్రామం, పొందూరు మం., శ్రీకాకుళం-532402 -
సృజనం: మళ్లీ బాల్యం
తండ్రి అనేవాడు ఒకడున్నాడు, వాడికో గది ఉండాలని ఎప్పుడైనా అనిపించిందా? ఇది మా బెడ్రూమ్, ఇది మా పిల్లల గది అంటూ తెగ మురిసిపోతారు. మరి తండ్రి ఎక్కడుంటాడు? ఈ ఆలోచన మీకు రాలేదు. కాలం పంపే సంకేతాలు అందుతున్నాయి. ఎట్లాగో శిఖరం ఎక్కి అక్కణ్నుంచి నెమ్మదిగా జారుతున్నాను. రోజులు ముడతలు ముడతలుగా సాగుతున్నాయి. నాకే అర్థం కాని మాటలు అసంకల్పితంగా వచ్చేస్తున్నాయి. నా మాటలు నాకే పెద్ద ధ్వనితో వినపడుతున్నాయి. కాసింత సంయమనం అవసరమని తెలుస్తూనే ఉంది. నా చేతిలో ఏముంది గనుక? అలా దూరంగా చెవులు కొరుక్కుంటారెందుకు? ఎవరి మీదా నింద వేయలేను. కాల మహిమకు వయసు ఊడిగం చేస్తూంది. మరో పదిహేనేళ్లలో శత వసంతాల నిండు జీవితం పూర్తవుతుంది నాకు. వీళ్లు నా పిల్లలే కదా... ఇది నా ఇల్లే కదా... ఈ ఇంటి గోడలు నా జ్ఞాపకాలెన్నింటినో దాచుకున్నాయి. పదేళ్ల క్రితం జీవన సహచరిని కోల్పోయాను. గతాన్ని తవ్వుకుని జ్ఞాపకాల్ని నెమరేసుకోవడమే పని. సావధానంగా కూర్చుని ఒక్కడంటే ఒక్కడు వినడు. ముసలితనం కంపు కొడుతుంది కాబోలు. క్రమేపీ ఎవరికీ అక్కర్లేని వాడిగా మారుతున్నాను. భవిష్యత్ మరీ హీనం కాకుండా నా స్థానం పదిలపరుచుకోవాలి. లేకపోతే దబ్బున పడేసి మీద నుంచి వెళ్లిపోతారు. డక్కా ముక్కీలు తిన్న మొండిఘటాన్ని. అయినా ఈవేళ జరిగిందేమిటి? పార్వతి తద్దినం. భానుమూర్తి, సీతారాం వచ్చారు. శాస్త్రోక్తంగా జరిగింది. భోజనాలయ్యాక తీరిగ్గా కబుర్లలో పడ్డారు కొడుకులు, కోడళ్లు, మనుమలు. ఇల్లంతా కోలాహలం. ఆరోగ్యవంతమైన కుటుంబ సాన్నిహిత్యం. అరవైకు చేరువౌతున్న నా పెద్దకొడుకు భానుమూర్తి నా దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. చిన్నకొడుకు సీతారాం పేపరు చదువుతున్నాడు. యానాంలో ఉంటున్న వారు సంబంధం లేని పరిపాలనా వ్యవస్థలో ఉన్నప్పటికీ, ఆంధ్ర వార్తలు చదువుతారు. రాజకీయాలు వినోదంగానే కాకుండా ఉత్సుకత పెంచేవిగా కూడా ఉంటున్నాయి. సీతారాంను దగ్గరకు రమ్మని సైగ చేసి పిలిచాడు భానుమూర్తి. భానుమూర్తి, సీతారాం ఇద్దరూ పుదుచ్చేరిలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు. పుదుచ్చేరి ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఉంది. యానాం విడిచి వాళ్లతో వెళ్లలేను. పాపం వాళ్లు బతిమాలుతూనే ఉన్నారు. ఇక్కడ వెలగబెట్టే రాచకార్యాలు లేవు. అజమాయిషీ చేసే ఆస్తులు లేవు. కష్టసుఖాలు కలబోసుకునే నా ఈడు చిన్న సమూహం ఉంది. నా బలహీనతలు నాకున్నాయి. తమాయించుకోలేని కోపం. కోపం వస్తే నేనెవరో నీవెవరో. భానుమూర్తి వాలకం అనుమానాస్పదంగా ఉంది. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. తను కూడా పుదుచ్చేరి రావాలని గట్టిగా పట్టుపడతాడేమో. అన్నదమ్ములిద్దరూ కూడబలుక్కున్నారేమో. వీలుపడదని చెప్పాలి. ఇక్కడ పుట్టి ఇక్కడ మట్టిలో కలిసిపోయే జన్మభూమి మంత్రం జపించాలి. పరభాషా రణగొణ ధ్వనుల మధ్య దిక్కులేని అనాథగా, మూగిగా కాలం గడపలేనని చెప్పాలి. భానుమూర్తి గొంతు సవరించుకున్నాడు. ఆప్యాయంగా, అభిమానంగా, వినమ్రంగా తమ నిర్ణయాన్ని కొంచెం భయంగానే నాముందుంచాడు. నా ముఖం కందగడ్డయ్యింది. లేదు... అలా మార్చుకున్నాను. అణచుకోలేని ఆవేశం వచ్చింది. లేదు... తెచ్చుకున్నాను. జాగ్రత్త పడకపోతే తర్వాత బాధపడి ప్రయోజనం లేదు. కుండబద్దలు కొట్టాలి. ‘‘ఎంత మాటన్నావు? మనిషిని పెట్టి సేవలు చేయిస్తావా? వంటదానికి మూడువేలు, పనిమనిషికి వెయ్యి రూపాయలు చొప్పున కుదిర్చేశావా? అక్కడితో మీ బాధ్యత తీరిపోయిందా? కుదరదు. ఒప్పుకోను. రత్నాల్లాంటి పిల్లలుండగా నాకలాంటి కర్మ వద్దు. నేను అప్పుడే పోను. మరో పదిహేనేళ్లు బతుకుతాను. అన్నదమ్ములిద్దరూ వంతులే వేసుకుంటారో వాటాలే పంచుకుంటారో నాకు తెలియదు. కుటుంబంతో సహా ఎవరో ఒకరు నా కళ్లముందుండాల్సిందే. మీ శషభిషలు నా దగ్గర పనిచేయవు’’ విరుచుకుపడ్డాను. నా కొడుకులు మంచివాళ్లు. నాకెక్కడా నొప్పి తగలనీయరు. సందేహం లేదు. కాని... కాని... అది అంతే! భానుమూర్తి బిత్తరపోలేదు. ఎప్పుడూ అదే నిదానం. ఒప్పించాలనుకుంటాడు. బలవంతం చేయడు. సీతారాం అలా కాదు. తన వాదన వినిపించడానికి చూస్తాడు. ‘‘నాన్నా! మా ఇబ్బందుల్నీ గమనించాలి. ఉద్యోగాలు చేస్తున్నవాళ్లం. అన్నన్ని రోజులు కుటుంబాలతో ఇక్కడుండటం సాధ్యమయ్యే పనా? మాతో పాటు మీరు రారని ఈ ఏర్పాటు చేశాం. మీకన్నీ తెలుసు’’ సీతారాం అన్నాడు. పుదుచ్చేరి రానని తెలుసు. వాళ్లకున్న ప్రత్యామ్నాయం ఒకటే. ఇక్కడే ఏదో ఏర్పాటు చేయాలి. కరెంటు పోయింది. ఫ్యాన్ తిరగడం ఆగింది. యానాంలో కరెంటు కోతలుండవు. ఏదో తాత్కాలిక సమస్య వచ్చుంటుంది. అక్కడున్న అట్ట తీసుకుని విసరసాగాడు భానుమూర్తి. రాజీపడలేని అలవాట్లు కొన్ని ఉన్నాయి నాకు. స్నానానికి వేడినీళ్లుండాలి. రాత్రిళ్లు ఎవరో ఒకరు కాళ్లు పట్టాలి. లేకపోతే నిద్ర రాదు. తెల్లవారుజామున అయిదు గంటలకే గ్లాసుడు కాఫీ తయారుచేసి ముందుంచాలి. ఆలస్యం అయితే చిందులేస్తాను. పొరుగింటి వాళ్లతో కలవను. పలకరింపుగా కూడా నవ్వను. సీరియస్‌గా ఉంటాను. చిన్నపిల్లలు ఎక్కడున్నా వాళ్లతో కలిసిపోతాను. ఆనందంగా శేష జీవితం గడపడానికి నావాళ్లు నా దగ్గరే ఉండాలి. ఈ విషయంలో రాజీ లేదు. మెట్టు దిగకూడదు. కోపం పూనాలి. ముఖం కవళికల్ని ఆ విధంగా మార్చుకోవాలి. ఉద్వేగంగా మాట్లాడి, ఇందులో సొంత లాభం తప్ప మరేం లేనట్టు పెద్దరికానికి లోటు రాకుండా స్థిరంగా నిలబడాలి. గభాలున లేచి, నాలుగడుగులేసి, మళ్లా వెనక్కి వచ్చి మంచం మీద కూర్చున్నాను. నా నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. అయిదు నిమిషాల పాటు నిశ్శబ్దం. ఈలోపులో కరెంటు వచ్చింది. ఫ్యాన్ తిరగడం మొదలెట్టింది. ‘‘అక్కడికే వచ్చి చద్దామంటే, మీరు ఇళ్ళెలా కట్టుకున్నారు? రెండేసి గదుల ఇళ్ళు. మీకూ మీ పిల్లలకే సరిపోతుంది. తండ్రి అనేవాడు ఒకడున్నాడు, వాడికో గది ఉండాలని ఎప్పుడైనా అనిపించిందా? ఇది మా బెడ్రూమ్, ఇది మా పిల్లల గది అంటూ తెగ మురిసిపోతారు. మరి తండ్రి ఎక్కడుంటాడు? ఈ ఆలోచన మీకు రాలేదు. ఎందుకంటే మేం కాటికి కాళ్లు కాచుకునేవాళ్లం. మీరేమో కలకాలం ఉండేవారు. అంతేనా? కుటుంబం అంటే మీరూ మీ పిల్లలూ. అంతే కదా!’’ ‘‘అది కాదు నాన్నా. ఇప్పుడూ...’’‘‘పనిమనుషులు సొంతవాళ్లు ఎలా అవుతారు? మీరుండగా వాళ్ల అవసరం దేనికి? తండ్రిని చూసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? ఓహో! మొన్న జరిగిన సంఘటన గురించా?’’ భానుమూర్తి, సీతారాం ముఖముఖాలు చూసుకున్నారు. వాళ్లకేమీ గుర్తుకు రావడం లేదు. పొగాకు కాడ అందుకున్నాను. చుట్ట చుట్టుకున్నాను. నోట్లో పెట్టుకుని అగ్గిపుల్లతో అంటించుకున్నాను. ‘‘నిజంగా మాకేమీ తెలియదు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పుంటే లెంపలేసుకుంటాం’’ భానుమూర్తి అన్నాడు. ‘‘కొన్ని కూరలు కొంతమందికి నచ్చవు. పొట్లకాయ, కాకరకాయ నాకు నచ్చదు. అదే వండారు. ఒళ్లు మండింది. పళ్లెం గిరాటేశాను. గదంతా చిందింది. కోపంతో వీధిలోకి పోయాను. గుమ్మంలో బిచ్చగాడున్నాడు. నా కోపం వాడి మీద చూపించాను. ఆవకాయ బద్దకే ఈ ఇంట్లో దిక్కులేదు. నీకు బిచ్చమెక్కడేస్తార్రా. పో పో అని గదిమాను కోడళ్లకు వినిపించేలా. కాకపోతే వాళ్లు ఉన్నవీ లేనివీ కల్పించి, మీ చెవులకు చేరవేసేవారు కాదు కాబట్టి మీకు తెలియలేదు.’’ అసలు సంగతి వేరు. చాపల్యం కొలదీ ఇంతింత ఆవకాయ ఎర్రగా కలుపుకుని తింటుంటాను. ఒంటికి తేడా వస్తుందేమోనని ఒక్క బద్ద మాత్రమే పెడతారని తెలుసు. అసహనంతో ముష్టోడి ముందు నా కోపాన్ని ప్రదర్శించాను. నెపాన్ని ఇతరుల మీదకు నెట్టడం వయసు తెచ్చే జబ్బేమో. కోడళ్లు మాట్లాడలేదు. జరుగుతున్న తంతు చూస్తున్నారు. ‘‘మీరందరూ ఇక్కడున్నారు. ఒక విషయం చెబుతాను. ప్రస్తుతం నా పనులు నేనే చేసుకుంటూ బాగానే తిరుగుతున్నాను. నాకూ ఒకరోజు వస్తుంది. ఆ వేళ అన్నం మీరే తినిపించాలి. చేయి కడగాలి. మూతి తుడవాలి. కదల్లేక మంచం మీదుంటే ఇక చెప్పేదేముంది? అలాగే వదిలేయరు కదా, మూలన పడేసి. ఈ కుటుంబం కోసం నేను పడ్డ పాట్లు మీకు తెలుసు కదా’’ ఊపిరి తీసుకుని తిరిగి మాట్లాడబోతుండగా భానుమూర్తి, సీతారాం అడ్డు చెప్పారు. చేతులు పట్టుకున్నారు. గద్గద స్వరంతో అనునయించారు. ఒకానొక ఉద్వేగ క్షణం అది. బహుశా నా మాటలు వారికెంతో బాధ కలిగించే ఉంటాయి. అయిదేళ్ల మనుమడు రైలుబండి కూత పెట్టుకుంటూ అక్కడికొచ్చాడు. మౌనం రాజ్యమేలుతున్న సమయం. వాడికిదేమీ పట్టలేదు. కిటికీ వార కింద ఉన్న బెలూన్ అందుకున్నాడు. గోడకు అణచిపెట్టి టప్మని పేల్చాడు. ఎక్కడిదో ప్లాస్టిక్ బొమ్మ దొరికింది. దాన్ని పీకి పారేస్తున్నాడు. సోఫాలపైనున్న రంగురంగుల అల్లికల గుడ్డను తీసుకుని కాళ్లతో తొక్కుతూ విసిరేస్తున్నాడు. ఎవరూ వారించడం లేదు. తప్పు అని చెప్పడం లేదు. మెల్లగా అడుగులేసుకుంటూ వాడి మమ్మీ దగ్గరికెళ్లింది. ఏం చేస్తుందో అందరూ ఆతృతగా చూస్తున్నాం. మురిపెంగా చూస్తూ ముద్దు పెట్టుకుంది. వాడి ఆగడాల్ని తగ్గించే మార్గం అదే అన్నమాట. అల్లరిని ఆమె ఆనందంగా స్వీకరిస్తోందా? ‘‘వాడికీ నాకూ తేడా ఏమిటిరా? వాడు ఎదిగేవాడు. నేను నేల జారేవాడిని. నన్నూ అలాగే భరించలేరా? నాలో వాడిని చూసుకోండి’’ అని కళ్లు మూసుకున్నాను. నుదుటి మీద తడి స్పర్శ. మెత్తని ఆలింగనం. భానుమూర్తి, సీతారాం ఒకళ్ల తర్వాత మరొకరు తమ పెదాల్ని నా నుదురుకు తాకిస్తున్నారు. మురిపెంగా చూస్తూ ముద్దు పెట్టుకుంటున్న తల్లుల్లాగే ఉన్నారు వాళ్లిద్దరూ. నా కళ్లూ వర్షిస్తున్నాయి, అనుకున్నది సాధించినందుకు. - దాట్ల దేవదానం రాజు