
ఒకరోజు మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి ఇంటికి ఒక వ్యక్తి వచ్చారు. ఆయనకు మర్యాదలు చేసి కూర్చోబెట్టారు ఇంట్లో వారు.
కాసేపటికి శాస్త్రిగారు వచ్చారు. వచ్చినాయన సంభాషణ మొదలెట్టారు. 1940 నుంచీ తేదీలతో సహా తన సాహిత్య కార్యక్రమాలు, అల్పమైన విషయాల్ని సైతం విడిచిపెట్టకుండా చెప్పుకుపో...తు... న్నారు. 1945, 50, 60 ...
మధునాపంతుల వారిలో అసహనం పెరిగిపోతోంది. అక్కడకు కొంచెం దూరంలో ఉన్న తమ్ముడి కుమారుడితో, ‘‘ఒరేయ్ చంటీ, ఒకసారిలా వచ్చి 1991 వచ్చాక చెప్పు, అప్పుడొస్తాను ’’ అని తన గదిలోకి వెళ్లిపోయారు. వచ్చినాయన బిత్తరపోయాడు.
ఉబలాటం అనండి, లౌల్యం అనండి స్వవిషయాలు ఊకదంపుడుగా చెప్పేసుకుంటే వినేవాళ్ళకు విసుగు పుట్టిస్తాయి. ఇక ఇపుడు విచారించి ప్రయోజనం లేదు. మితంగా పరిచయం చేసుకోవాలనే జ్ఞానం ఆలస్యంగా కలిగిందాయనకు.
-దాట్ల దేవదానం రాజు