సృజనం: మళ్లీ బాల్యం | Every father become a child, when he gets Old age | Sakshi
Sakshi News home page

సృజనం: మళ్లీ బాల్యం

Published Sun, Dec 8 2013 3:44 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 AM

సృజనం: మళ్లీ బాల్యం

సృజనం: మళ్లీ బాల్యం

తండ్రి అనేవాడు ఒకడున్నాడు, వాడికో గది ఉండాలని ఎప్పుడైనా అనిపించిందా? ఇది మా బెడ్‌రూమ్, ఇది మా పిల్లల గది అంటూ తెగ మురిసిపోతారు. మరి తండ్రి ఎక్కడుంటాడు? ఈ ఆలోచన మీకు రాలేదు.
 
 కాలం పంపే సంకేతాలు అందుతున్నాయి. ఎట్లాగో శిఖరం ఎక్కి అక్కణ్నుంచి నెమ్మదిగా జారుతున్నాను. రోజులు ముడతలు ముడతలుగా సాగుతున్నాయి. నాకే అర్థం కాని మాటలు అసంకల్పితంగా వచ్చేస్తున్నాయి. నా మాటలు నాకే పెద్ద ధ్వనితో వినపడుతున్నాయి. కాసింత సంయమనం అవసరమని తెలుస్తూనే ఉంది. నా చేతిలో ఏముంది గనుక? అలా దూరంగా చెవులు కొరుక్కుంటారెందుకు? ఎవరి మీదా నింద వేయలేను. కాల మహిమకు వయసు ఊడిగం చేస్తూంది. మరో పదిహేనేళ్లలో శత వసంతాల నిండు జీవితం పూర్తవుతుంది నాకు. వీళ్లు నా పిల్లలే కదా... ఇది నా ఇల్లే కదా... ఈ ఇంటి గోడలు నా జ్ఞాపకాలెన్నింటినో దాచుకున్నాయి. పదేళ్ల క్రితం జీవన సహచరిని కోల్పోయాను. గతాన్ని తవ్వుకుని జ్ఞాపకాల్ని నెమరేసుకోవడమే పని. సావధానంగా కూర్చుని ఒక్కడంటే ఒక్కడు వినడు. ముసలితనం కంపు కొడుతుంది కాబోలు. క్రమేపీ ఎవరికీ అక్కర్లేని వాడిగా మారుతున్నాను. భవిష్యత్ మరీ హీనం కాకుండా నా స్థానం పదిలపరుచుకోవాలి. లేకపోతే దబ్బున పడేసి మీద నుంచి వెళ్లిపోతారు. డక్కా ముక్కీలు తిన్న మొండిఘటాన్ని. అయినా ఈవేళ జరిగిందేమిటి?
 
 పార్వతి తద్దినం. భానుమూర్తి, సీతారాం వచ్చారు. శాస్త్రోక్తంగా జరిగింది. భోజనాలయ్యాక తీరిగ్గా కబుర్లలో పడ్డారు కొడుకులు, కోడళ్లు, మనుమలు. ఇల్లంతా కోలాహలం. ఆరోగ్యవంతమైన కుటుంబ సాన్నిహిత్యం.  అరవైకు చేరువౌతున్న నా పెద్దకొడుకు భానుమూర్తి నా దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. చిన్నకొడుకు సీతారాం పేపరు చదువుతున్నాడు. యానాంలో ఉంటున్న వారు సంబంధం లేని పరిపాలనా వ్యవస్థలో ఉన్నప్పటికీ, ఆంధ్ర వార్తలు చదువుతారు. రాజకీయాలు వినోదంగానే కాకుండా ఉత్సుకత పెంచేవిగా కూడా ఉంటున్నాయి.
 
 సీతారాంను దగ్గరకు రమ్మని సైగ చేసి పిలిచాడు భానుమూర్తి. భానుమూర్తి, సీతారాం ఇద్దరూ పుదుచ్చేరిలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు. పుదుచ్చేరి ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఉంది. యానాం విడిచి వాళ్లతో వెళ్లలేను. పాపం వాళ్లు బతిమాలుతూనే ఉన్నారు. ఇక్కడ వెలగబెట్టే రాచకార్యాలు లేవు. అజమాయిషీ చేసే ఆస్తులు లేవు. కష్టసుఖాలు కలబోసుకునే నా ఈడు చిన్న సమూహం ఉంది. నా బలహీనతలు నాకున్నాయి. తమాయించుకోలేని కోపం. కోపం వస్తే నేనెవరో నీవెవరో. భానుమూర్తి వాలకం అనుమానాస్పదంగా ఉంది. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. తను కూడా పుదుచ్చేరి రావాలని గట్టిగా పట్టుపడతాడేమో. అన్నదమ్ములిద్దరూ కూడబలుక్కున్నారేమో. వీలుపడదని చెప్పాలి. ఇక్కడ పుట్టి ఇక్కడ మట్టిలో కలిసిపోయే జన్మభూమి మంత్రం జపించాలి. పరభాషా రణగొణ ధ్వనుల మధ్య దిక్కులేని అనాథగా, మూగిగా కాలం గడపలేనని చెప్పాలి.
 
 భానుమూర్తి గొంతు సవరించుకున్నాడు. ఆప్యాయంగా, అభిమానంగా, వినమ్రంగా తమ నిర్ణయాన్ని కొంచెం భయంగానే నాముందుంచాడు. నా ముఖం కందగడ్డయ్యింది. లేదు... అలా మార్చుకున్నాను. అణచుకోలేని ఆవేశం వచ్చింది. లేదు... తెచ్చుకున్నాను. జాగ్రత్త పడకపోతే తర్వాత బాధపడి ప్రయోజనం లేదు. కుండబద్దలు కొట్టాలి. ‘‘ఎంత మాటన్నావు? మనిషిని పెట్టి సేవలు చేయిస్తావా? వంటదానికి మూడువేలు, పనిమనిషికి వెయ్యి రూపాయలు చొప్పున కుదిర్చేశావా? అక్కడితో మీ బాధ్యత తీరిపోయిందా? కుదరదు. ఒప్పుకోను. రత్నాల్లాంటి పిల్లలుండగా నాకలాంటి కర్మ వద్దు. నేను అప్పుడే పోను. మరో పదిహేనేళ్లు బతుకుతాను. అన్నదమ్ములిద్దరూ వంతులే వేసుకుంటారో వాటాలే పంచుకుంటారో నాకు తెలియదు. కుటుంబంతో సహా ఎవరో ఒకరు నా కళ్లముందుండాల్సిందే. మీ శషభిషలు నా దగ్గర పనిచేయవు’’ విరుచుకుపడ్డాను.
 
 నా కొడుకులు మంచివాళ్లు. నాకెక్కడా నొప్పి తగలనీయరు. సందేహం లేదు. కాని... కాని... అది అంతే!
 భానుమూర్తి బిత్తరపోలేదు. ఎప్పుడూ అదే నిదానం. ఒప్పించాలనుకుంటాడు. బలవంతం చేయడు. సీతారాం అలా కాదు. తన వాదన వినిపించడానికి చూస్తాడు. ‘‘నాన్నా! మా ఇబ్బందుల్నీ గమనించాలి. ఉద్యోగాలు చేస్తున్నవాళ్లం. అన్నన్ని రోజులు కుటుంబాలతో ఇక్కడుండటం సాధ్యమయ్యే పనా? మాతో పాటు మీరు రారని ఈ ఏర్పాటు చేశాం. మీకన్నీ తెలుసు’’ సీతారాం అన్నాడు. పుదుచ్చేరి రానని తెలుసు. వాళ్లకున్న ప్రత్యామ్నాయం ఒకటే. ఇక్కడే ఏదో ఏర్పాటు చేయాలి. కరెంటు పోయింది. ఫ్యాన్ తిరగడం ఆగింది. యానాంలో కరెంటు కోతలుండవు. ఏదో తాత్కాలిక సమస్య వచ్చుంటుంది. అక్కడున్న అట్ట తీసుకుని విసరసాగాడు భానుమూర్తి. రాజీపడలేని అలవాట్లు కొన్ని ఉన్నాయి నాకు. స్నానానికి వేడినీళ్లుండాలి. రాత్రిళ్లు ఎవరో ఒకరు కాళ్లు పట్టాలి.
 
 లేకపోతే నిద్ర రాదు. తెల్లవారుజామున అయిదు గంటలకే గ్లాసుడు కాఫీ తయారుచేసి ముందుంచాలి. ఆలస్యం అయితే చిందులేస్తాను. పొరుగింటి వాళ్లతో కలవను. పలకరింపుగా కూడా నవ్వను. సీరియస్‌గా ఉంటాను. చిన్నపిల్లలు ఎక్కడున్నా వాళ్లతో కలిసిపోతాను. ఆనందంగా శేష జీవితం గడపడానికి నావాళ్లు నా దగ్గరే ఉండాలి. ఈ విషయంలో రాజీ లేదు. మెట్టు దిగకూడదు. కోపం పూనాలి. ముఖం కవళికల్ని ఆ విధంగా మార్చుకోవాలి. ఉద్వేగంగా మాట్లాడి, ఇందులో సొంత లాభం తప్ప మరేం లేనట్టు పెద్దరికానికి లోటు రాకుండా స్థిరంగా నిలబడాలి. గభాలున లేచి, నాలుగడుగులేసి, మళ్లా వెనక్కి వచ్చి మంచం మీద కూర్చున్నాను.
 
 నా నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. అయిదు నిమిషాల పాటు నిశ్శబ్దం. ఈలోపులో కరెంటు వచ్చింది. ఫ్యాన్ తిరగడం మొదలెట్టింది. ‘‘అక్కడికే వచ్చి చద్దామంటే, మీరు ఇళ్ళెలా కట్టుకున్నారు? రెండేసి గదుల ఇళ్ళు. మీకూ మీ పిల్లలకే సరిపోతుంది. తండ్రి అనేవాడు ఒకడున్నాడు, వాడికో గది ఉండాలని ఎప్పుడైనా అనిపించిందా? ఇది మా బెడ్‌రూమ్, ఇది మా పిల్లల గది అంటూ తెగ మురిసిపోతారు. మరి తండ్రి ఎక్కడుంటాడు? ఈ ఆలోచన మీకు రాలేదు. ఎందుకంటే మేం కాటికి కాళ్లు కాచుకునేవాళ్లం. మీరేమో కలకాలం ఉండేవారు. అంతేనా? కుటుంబం అంటే మీరూ మీ పిల్లలూ. అంతే కదా!’’
 
 ‘‘అది కాదు నాన్నా. ఇప్పుడూ...’’‘‘పనిమనుషులు సొంతవాళ్లు ఎలా అవుతారు? మీరుండగా వాళ్ల అవసరం దేనికి? తండ్రిని చూసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? ఓహో! మొన్న జరిగిన సంఘటన గురించా?’’ భానుమూర్తి, సీతారాం ముఖముఖాలు చూసుకున్నారు. వాళ్లకేమీ గుర్తుకు రావడం లేదు. పొగాకు కాడ అందుకున్నాను. చుట్ట చుట్టుకున్నాను. నోట్లో పెట్టుకుని అగ్గిపుల్లతో అంటించుకున్నాను.  ‘‘నిజంగా మాకేమీ తెలియదు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పుంటే లెంపలేసుకుంటాం’’ భానుమూర్తి అన్నాడు.
 
 ‘‘కొన్ని కూరలు కొంతమందికి నచ్చవు. పొట్లకాయ, కాకరకాయ నాకు నచ్చదు. అదే వండారు. ఒళ్లు మండింది. పళ్లెం గిరాటేశాను. గదంతా చిందింది. కోపంతో వీధిలోకి పోయాను. గుమ్మంలో బిచ్చగాడున్నాడు. నా కోపం వాడి మీద చూపించాను. ఆవకాయ బద్దకే ఈ ఇంట్లో దిక్కులేదు. నీకు బిచ్చమెక్కడేస్తార్రా. పో పో అని గదిమాను కోడళ్లకు వినిపించేలా. కాకపోతే వాళ్లు ఉన్నవీ లేనివీ కల్పించి, మీ చెవులకు చేరవేసేవారు కాదు కాబట్టి మీకు తెలియలేదు.’’ అసలు సంగతి వేరు. చాపల్యం కొలదీ ఇంతింత ఆవకాయ ఎర్రగా కలుపుకుని తింటుంటాను. ఒంటికి తేడా వస్తుందేమోనని ఒక్క బద్ద మాత్రమే పెడతారని తెలుసు. అసహనంతో ముష్టోడి ముందు నా కోపాన్ని ప్రదర్శించాను. నెపాన్ని ఇతరుల మీదకు నెట్టడం వయసు తెచ్చే జబ్బేమో.
 
 కోడళ్లు మాట్లాడలేదు. జరుగుతున్న తంతు చూస్తున్నారు. ‘‘మీరందరూ ఇక్కడున్నారు. ఒక విషయం చెబుతాను. ప్రస్తుతం నా పనులు నేనే చేసుకుంటూ బాగానే తిరుగుతున్నాను. నాకూ ఒకరోజు వస్తుంది. ఆ వేళ అన్నం మీరే తినిపించాలి. చేయి కడగాలి. మూతి తుడవాలి. కదల్లేక మంచం మీదుంటే ఇక చెప్పేదేముంది? అలాగే వదిలేయరు కదా, మూలన పడేసి. ఈ కుటుంబం కోసం నేను పడ్డ పాట్లు మీకు తెలుసు కదా’’ ఊపిరి తీసుకుని తిరిగి మాట్లాడబోతుండగా భానుమూర్తి, సీతారాం అడ్డు చెప్పారు. చేతులు పట్టుకున్నారు. గద్గద స్వరంతో అనునయించారు. ఒకానొక ఉద్వేగ క్షణం అది. బహుశా నా మాటలు వారికెంతో బాధ కలిగించే ఉంటాయి.
 
 అయిదేళ్ల మనుమడు రైలుబండి కూత పెట్టుకుంటూ అక్కడికొచ్చాడు. మౌనం రాజ్యమేలుతున్న సమయం.
 వాడికిదేమీ పట్టలేదు. కిటికీ వార కింద ఉన్న బెలూన్ అందుకున్నాడు. గోడకు అణచిపెట్టి టప్‌మని పేల్చాడు. ఎక్కడిదో ప్లాస్టిక్ బొమ్మ దొరికింది. దాన్ని పీకి పారేస్తున్నాడు.  సోఫాలపైనున్న రంగురంగుల అల్లికల గుడ్డను తీసుకుని కాళ్లతో తొక్కుతూ విసిరేస్తున్నాడు. ఎవరూ వారించడం లేదు. తప్పు అని చెప్పడం లేదు. మెల్లగా అడుగులేసుకుంటూ వాడి మమ్మీ దగ్గరికెళ్లింది. ఏం చేస్తుందో అందరూ ఆతృతగా చూస్తున్నాం. మురిపెంగా చూస్తూ ముద్దు పెట్టుకుంది. వాడి ఆగడాల్ని తగ్గించే మార్గం అదే అన్నమాట. అల్లరిని ఆమె ఆనందంగా స్వీకరిస్తోందా?
 
 ‘‘వాడికీ నాకూ తేడా ఏమిటిరా? వాడు ఎదిగేవాడు. నేను నేల జారేవాడిని. నన్నూ అలాగే భరించలేరా? నాలో వాడిని చూసుకోండి’’ అని కళ్లు మూసుకున్నాను. నుదుటి మీద తడి స్పర్శ. మెత్తని ఆలింగనం. భానుమూర్తి, సీతారాం ఒకళ్ల తర్వాత మరొకరు తమ పెదాల్ని నా నుదురుకు తాకిస్తున్నారు. మురిపెంగా చూస్తూ ముద్దు పెట్టుకుంటున్న తల్లుల్లాగే ఉన్నారు వాళ్లిద్దరూ. నా కళ్లూ వర్షిస్తున్నాయి, అనుకున్నది సాధించినందుకు.
 - దాట్ల దేవదానం రాజు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement